తాలిబన్‌ పాలన... భారత్‌కు సరికొత్త సవాళ్లు | Chenna Basavayya Guest Column Over Taliban Ruling And Challenges For India | Sakshi
Sakshi News home page

తాలిబన్‌ పాలన... భారత్‌కు సరికొత్త సవాళ్లు

Published Fri, Oct 8 2021 1:06 AM | Last Updated on Fri, Oct 8 2021 1:06 AM

Chenna Basavayya Guest Column Over Taliban Ruling And Challenges For India - Sakshi

అఫ్గానిస్తాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆవిర్భావం నేటి వాస్తవం. ప్రపంచ దేశాలు ఈ వాస్తవాన్ని ఇప్పుడే కాకపోయినా, తరువాత అయినా గుర్తించాల్సి  ఉంటుంది. ఇప్పటికే, ఈ ప్రాంతంలోని ముఖ్య శక్తులైన రష్యా, చైనాలు తాలిబన్‌ పాలనకు తమ మద్దతును ప్రకటిం చాయి. పాకిస్తాన్‌ తన మద్దతును ఇవ్వడమే కాకుండా, నూతన ప్రభుత్వంలో తన అనుకూల హక్కాని నెట్‌వర్క్‌ నాయకులను కీలకమైన పదవులలో చొప్పించడంలో కూడా సఫలమైంది. ప్రపంచ దేశాలు తాలిబన్లను బహిష్కరిస్తే అది ప్రతిచర్యలకు మాత్రమే దారితీయగలదని, సంభాషణలు సానుకూల ఫలితాలను ఇవ్వగలవని, అందువల్ల అఫ్గాన్‌ నూతన ప్రభుత్వంతో చర్చలు కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి వేదికగా ఖతార్‌ ప్రకటించింది. దాని వ్యూహాత్మక, భద్రతా అవస రాలను దృష్టిలో ఉంచుకొని, ఇరాన్‌ కూడా తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

అఫ్గానిస్తాన్‌ అంతర్గత రాజకీయ పరిణామాలలో భారతదేశం ఎప్పుడూ ముఖ్యమైన పాత్ర వహించలేదు, కానీ భారత్‌కి అఫ్గానిస్తాన్‌తో ముడిపడిన వ్యూహాత్మక, భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయి. చరిత్రాత్మకంగా,  1996 నుంచి 2001 వరకు తాలిబన్‌ పాలన కాలంలో ఉండిన వైరుధ్యపరమైన సంబంధాలు మినహాయించి, భారతదేశం అఫ్గానిస్తాన్‌తో సుహృద్భావ సంబంధాలను కొనసాగించింది. దేశ భద్రతా, వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా, భారత్‌ త్వరలోనే తాలిబన్‌ ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ఈ కోణంలో మన ముందున్న సవాళ్లు ఏమిటి? మొదటిరకం సవాళ్లు ప్రాంతీయ, అంతర్జాతీయ ఉగ్రవాదం ముప్పులు. అవి ముఖ్యంగా కశ్మీర్‌ సమస్యను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. 

అయితే, ఈ మతఛాందస, జిహాదీ ఉగ్రవాద సమ స్యలు భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. రష్యా, చైనాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. రష్యా తాలి బాన్ల నుండి ఇస్లామిక్‌ ఛాందసవాద భావజాలం వ్యాప్తి గురించి ఆందోళన చెందుతోంది, చైనా ఆందోళనలు అన్నీ అఫ్గానిస్తాన్‌ సరిహద్దులోని ముస్లింలు అధికంగా ఉన్న జింజియాంగ్‌ రాష్ట్రం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వారి వారి ఆసక్తుల దృష్ట్యా రష్యా, చైనాలు, అఫ్గాన్‌ నుంచి అమె రికా సైన్యాల ఉపసంహర ణకు ముందే, తాలిబాన్లతో చర్చలు జరిపి వారికి మద్దతు ప్రకటించాయి. ఇదే రకం ప్రక్రియలను భారతదేశం చేపట్టలేదు.

భారత్‌కి రెండవరకం సవాళ్లు అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ప్రమేయంతో ఎదురవుతున్నాయి. ప్రస్తుత తాలిబన్‌ నాయకత్వం ఎంతవరకు పాకిస్తాన్‌తో అను కూలంగా ఉండగలదు? అఫ్గానిస్తాన్‌–పాకిస్తాన్‌ సరిహద్దు ‘డ్యూరాండ్‌ లైన్‌’ను గతంలో ఏ అఫ్గాన్‌ ప్రభుత్వం కానీ, చివరికి తాలిబన్లు సహితం గుర్తించలేదనేది వాస్తవం. అయితే, తాలిబన్లను ఐఎస్‌ఐ తప్పక ప్రభావితం చేయ గలదనేది కూడా వాస్తవం. అందువల్ల, అఫ్గానిస్తాన్‌లో ఐఎస్‌ఐ ప్రభావాన్ని భారత్‌ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక చివరి రకం సవాళ్లు భారత దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించినవి. ఇవి మునుముందు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ స్థిరత్వం ఏ విధంగా ఉండగలదు అనే సమస్యతో ముడిపడి ఉన్నాయి. 

గత ఇరవై ఏళ్లుగా అఫ్గానిస్తాన్‌పై భారత విదేశాంగ విధానం,  ప్రాథమికంగా సైనిక విధానాన్ని అనుసరించిన అమెరికా వలె కాకుండా, భిన్నంగా ఉంటూ వచ్చింది. అప్గానిస్తాన్‌లో చేపట్టిన తన సహాయ కార్యక్రమాలలో స్థానిక ప్రజలను భాగస్వామ్యంచేసే నిర్మాణాత్మక ప్రక్రియను భారత్‌ అనుసరించింది. ఫలితంగా, 2006 నుంచి 300కి పైగా అనేక చిన్నతరహా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటిలో హైవే రోడ్డు నెట్‌వర్క్‌లను నిర్మించడం ఒకటి. ఉదాహరణకు, జరాంజ్‌–డేలరాం హైవే, కాబుల్‌లోని కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం, చిన్న నీటిపారుదల కాలువలు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు నెలకొల్పడం, ఆ దేశ విద్యార్థులు భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రతి ఏటా వేలాది స్కాలర్‌షిప్‌లను అందించడం, కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో గోధుమలు, అవసరమైన మందు లను పంపడం వంటివి ఉన్నాయి. ఐపీఎల్‌లో అఫ్గాన్‌ క్రికెట్‌ క్రీడాకారులు కూడా ఉన్నారు. ఈ విధంగా అక్కడి ప్రజల దృష్టిలో, ముఖ్యంగా యువతలో భారత్‌పై చక్కటి సుహృ ద్భావం ఉంది. దేశ జనాభాలో 30 శాతంగా ఉన్న ఈ పట్టణ ప్రాంత యువతతో తాలిబాన్లు అనుసంధానం కావాల్సి ఉంటుంది.

హెన్రీ కిసింజర్‌ ఇలా అంటాడు, ‘దేశాధినేతలు విధానాలను రూపొందించే సమయంలో, ముందే నిరూ పించలేని అంచనాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’. ఇదే దిశలో భారత్‌ తాలిబన్ల అఫ్గానిస్తాన్‌పట్ల తన విధానా లను అన్వేషించాల్సి ఉంది. భారత్‌ ముందుగల అవకాశాలు: ఒకటి, తాలిబన్లతో చర్చలు జరపడానికి ఒక ప్రత్యేక రాయబారిని నియమించడం; రెండు, రష్యాతో కలిసి కదలడం. భారత్‌ ఇప్పటికే  అఫ్గాన్‌ భవితవ్యంపై  రష్యా నేతృత్వంలోని చర్చలలో 2017 నుండి భాగంగా ఉన్నది. దీనిని ముందుకు సాగించడం; మూడు, షాంఘై సహకార సంస్థ ఆఫ్గాన్‌ కాంటాక్ట్‌ గ్రూప్‌ ద్వారా దారులు వెతకడం.

ఈ సంస్థలో భారత్‌ ఇప్పటికే ఒక సభ్యదేశంగా ఉంది. ఈ వేదిక చైనాతో భారత్‌ సహకరించడానికి అవకాశాన్ని ఇస్తుంది; నాలుగు, అఫ్గాన్‌లో  ఇంటెలిజెన్స్‌ సేకరణ కోసం ఇరాన్‌ గతంలో భారత్‌కు సహాయపడింది. తాలిబన్లతో ఇరాన్‌కు చేదు అనుభవం ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో వారికి ఇరాన్‌ మద్దతునిచ్చింది. అందువల్ల, తాలిబన్లతో వ్యవహరించడానికి భారత్‌ ఇరాన్‌ సాయాన్ని కోరవచ్చు; ఈ ఐదింటిలో భారత్‌ ఏ దిశను ఎంచుకున్నా, ప్రతి కార్యా చరణ వ్యూహంలో సమస్యలు ఉండగలవని గుర్తుంచుకో వాలి. అట్లాగే, భారతదేశం తన భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా పాక్‌ ఇష్టానికే వదిలివేయడం అత్యంత ప్రమాదకరం అని గుర్తించాలి. 


చెన్న బసవయ్య మడపతి 
వ్యాసకర్త విశ్రాంత రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా విశ్వ విద్యాలయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement