న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏకీకృత ప్రతిస్పందన అవసరమని ప్రధాని మోదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉగ్రవాద, తీవ్రవాద శక్తులకు అఫ్గాన్ గడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థావరంగా మారరాదని అన్నారు. మంగళవారం ప్రధాని మోదీ జి–20 అసాధారణ భేటీనుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ఆకలి, పోషకాహార సమస్యతో అల్లాడుతున్న అఫ్గాన్ పౌరులకు తక్షణమే బేషరతుగా మానవతా సాయం అందించాలని కోరారు. 20 ఏళ్లుగా అఫ్గాన్ సమాజం సాధించిన అభివృద్ధిని కొనసాగించేందుకు తాలిబన్ల పాలనలో మహిళలు, మైనారిటీలకు తగు చోటు కల్పించాలని ఆయన అన్నారు.
భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగస్ట్ 30వ తేదీన ఆమోదించిన తీర్మానం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రతిస్పందన అవసరమని ప్రధాని అన్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధ అక్రమ రవాణావంటి వాటిని గట్టిగా అడ్డుకునేందుకు ఉమ్మడి పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారని విదేశాంగ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. జి–20 అధ్యక్ష హోదాలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment