నయా కోల్డ్‌వార్ కొలిమి ఉక్రెయిన్
అమెరికా, యూరోపియన్ శక్తులు 2004లో ‘ఆరెంజ్ విప్లవం’ పేరిట ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోశాయి. నేటి ఘటనల వెనుక కూడా అవే శక్తులున్నాయి. రష్యా, అమెరికాల అధిపత్య పోటీ ఉక్రెయిన్‌ను అంతర్యుద్ధంలోకి ఈడ్చే ప్రమాదం ఉంది.
‘చరిత్రలో పునరావృతమవుతున్నట్టు కనిపించే ప్రతి ఘటనా ముందటి ఘటన నుంచి నేర్చుకున్నామనుకున్న గుణపాఠాలను తప్పని నిరూపిస్తుంది.’ ఇలాంటి మాటలను నిరాశావాదమని కొట్టిపారేసేవాళ్లకు దుర్వార్త. ఉక్రెయిన్‌లో సరిగ్గా అదే జరుగుతోంది. రష్యా పశ్చిమ సరిహద్దుల్లోని తూర్పు యూరోపియన్ దేశం ఉక్రెయిన్ గత కొద్ది రోజు లుగా ఈజిప్ట్ విప్లవ ఘటనలను గుర్తుకు తెచ్చింది. ఈజిప్ట్ విప్లవంలో ‘తెహ్రీర్’లో బైఠాయించిన నిరసనకారులను చెదరగొట్టక నాడు హోస్నీ ముబారక్ చేసిన ‘తప్పు’ తాను చేయకూడదని పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యానుకోవిచ్ ‘గుణపాఠం’ తీసి, తుపాకులకు పనిచెప్పారు. ఈజిప్ట్ ‘పాఠం’ తప్పని తేలింది. ప్రస్తుత ఘటనలను ఒక విప్లవమని, ప్రజాస్వామ్య విజయమని విశ్లేషణలు చేస్తున్న వాళ్లు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షునిగా యానుకోవిచ్‌కు యూరోపియన్ యూనియన్‌లో చేరడానికైనా, మానడానికైనా సకల అధికారాలు ఉన్నాయి. తాత్కాలిక అధ్యక్షుడైన అలెక్సాండర్ తుర్చియనేవ్... తక్షణం 13,000 కోట్ల డాలర్ల సహాయం అందించకపోతే విదేశీ చెల్లింపులకు దిక్కులేక ప్రభుత్వం దివాలా తీస్తుందని అర్థించారు. దివాలా తీస్తున్న ఈయూలో చేరకపోవడమే అపరాధమన్నట్టు మాట్లాడుతున్న అమెరికా, ఈయూలు ‘విప్లవానికి’ అభయం ఇస్తాయనడంలో సందేహం లేదు. కాకపోతే మనబోటివాళ్లకు అర్థం కాని అతి సరళమైన ప్రశ్న ఒక్కటే... అదేదో గత ఏడాదే చేసి ఉంటే ఇప్పుడీ ‘విప్లవం’ జరిగేదే కాదు గదా?
ఉక్రెయిన్‌ను తన ఉపగ్రహంగా భావించే రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను ధిక్కరించి మరీ నేటి విలన్ యానుకోవిచ్ గత ఏడాది ఈయూలో చేరడానికి స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఇక ఉక్రెయిన్‌లో వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను కుమ్మరించి ఆర్థిక సంక్షోభం నుంచి వెసులుబాటు సంపాదించవచ్చని అమెరికా, ఈయూలు ఆశలు పెట్టుకున్నాయి. అంతేగానీ పుట్టి మునిగినా చిల్లి గవ్వ విదిల్చేదని యూనుకోవిచ్‌కు మొండి చెయ్యి చూపాయి.
గత్యంతరం లేక వద్దనుకున్న పుతిన్‌నే ఆయన ఆశ్రయించాల్సి వచ్చింది. గత ఏడాది చివర్లో పుతిన్ ఉక్రెయిన్‌కు 15,000 కోట్ల డాలర్ల సహాయంతో పాటూ, సహజ వాయువు ధరను మూడో వంతు మేరకు తగ్గించారు. దీంతో యూనుకోవిచ్ ఈయూకు మొహం చాటేశారు. అమ్మ పెట్టనూ పెట్టదు, అడుక్కు తినా నివ్వదు అన్నట్టున్న ఈ వ్యవహారం లోగుట్టును అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి విక్టోరియా న్యూలాండ్ ఈ నెల 6న జరిపిన టెలిఫోన్ సంభాషణ బయటపెట్టింది. అప్పటికే జోరుగా సాగుతున్న ఉక్రెయిన్ విప్లవం గురించి ఆమె... ‘గత రెండు దశాబ్దాలుగా మనం ఉక్రెయిన్ ప్రజాస్వామ్యీకరణ కోసం 5 వందల కోట్ల డాలర్లను కుమ్మరించాం. అవును. ఇది మనం ఆడుతున్న ఆట. ఈయూ ఒక న్యూసెన్స్ మాత్రమే. మన ఆటను చెడగొట్టే శక్తి’ రష్యా.
రాజధాని కీవ్‌లోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌ను ఆక్రమిం చిన నిరసనకారుల ప్రధాన నేత ఎవరు? విటాలీ కిలిష్కో. జాతీయోన్మాదం తలకెక్కిన నియోనాజీ శక్తులకు కేంద్రమైన ఆప్రావీ సెక్టార్(మితవాదపక్షం)కు అధినేత. ఆయన తాత్కాలిక అధ్యక్షుడు కాకపోవడమే న్యూలాండ్ చెప్పిన ‘ఈయూ న్యూసెన్స్.’ కాగా మాజీ ప్రధాని, 2004లో ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూడదోయడానికి జరిగిన సీఐఏ ‘ఆరెంజ్ విప్లవ’ నేత్రి. తాత్కాలిక అధ్యక్షుడు తుర్చియనేవ్ ఆమెకు నమ్మినబంటు. నేటి ఈయూ కీలుబొమ్మ స్థానంలో ‘సుస్థిరమైన’ అమెరికా కీలుబొమ్మ రావడంతో విప్లవం ముగుస్తుంది! మార్కెట్ సూత్రాలను గుడ్డిగా నమ్మిన యానుకోవిచ్ ఎక్కువ ధర పలికే వారికే తన విధేయత అంటూ బొర్లాపడ్డారు. పుతిన్ చేతిలోని రొట్టె ముక్కను వదిలేసుకోడానికి సిద్ధపడే బాపతు కాదు. ఇక ఆయన ‘ఆట’ మొదలవుతుంది. నేటి ప్రశాంతత తుపాను ముందటి ప్రశాంతతలాగా అంతర్యుద్ధానికి సంకేతం కావచ్చు. జనాభాలో సగానికిపైగా రష్యా జాతీయులు, రష్యాతో అనుబంధాన్ని కోరుకుంటున్నవారు. ఉక్రెయిన్ దేశం అమెరికా, రష్యాల్లో ఎవరికి కీలుబొమ్మ కావాలో తేల్చడం కోసం సాగుతున్న ఈ పోరు ప్రచ్ఛన్న యుద్ధం రోజులను గుర్తుకు తేవడంలో తప్పులేదు. 2004 ఆరెంజ్ విప్లవం పేరిట జరిగిన ప్రహసనంలో దగాపడ్డ ఉక్రేనియన్లు మరోసారి మోసపోయారు. గతం నుంచి నేర్చుకోగలగేది తప్పుడు గుణపాఠాలను మాత్రమేనని నమ్మక తప్పదా?
- పిళ్లా వెంకటేశ్వరరావు