పుతిన్ మెడకు ‘ఉక్రెయిన్’ ఉరి! | Bolton on Ukraine: Putin 'Playing for the Whole Thing' | Sakshi
Sakshi News home page

పుతిన్ మెడకు ‘ఉక్రెయిన్’ ఉరి!

Published Fri, Mar 14 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

Bolton on Ukraine: Putin 'Playing for the Whole Thing'

సిరియాలో ఆశించినట్టుగా, వెనిజులాలో చేద్దామనుకుంటున్నట్టుగా, ఉక్రెయిన్‌లో చేసి చూపినట్టుగా... రష్యాలో కూడా విప్లవం పేరిట పుతిన్ ప్రభుత్వాన్ని కూల్చడమే ఉక్రెయిన్ సంక్షోభం లోగుట్టు. నేడు యానుకోవిచ్ మెడకు వేసిన ఉచ్చు రేపు పుతిన్‌కు ఉరితాడు కాగలదని అమెరికా ఆకాంక్ష, దీర్ఘకాలిక లక్ష్యం.  ‘ఏది సత్యం ఏదసత్యం’ అని సదసత్సంశయంలో పడ్డ మహాకవికి సత్యం బోధపడిందో లేదో తెలియదు. ఉక్రెయిన్ సంక్షోభంపై అంతర్జాతీయ మీడియా వినిపిస్తున్న కథనాల తీరును చూస్తే ఎవరికైనా అలాంటి విచికిత్స తప్పదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనే ఉక్రెయిన్‌ను చెరపడితే ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకుడైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దాన్ని ఉద్దరిస్తున్నారనేది బహుళ ప్రచారంలో ఉన్న కథనాల సారాంశం. ఇక రష్యావైపు నుంచి వినవస్తున్న కథనాల సారం... ఉక్రెయిన్ ప్రజాస్వామ్య కన్యను అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు చెరచి, ఛిద్రం చేస్తుంటే పుతిన్ క్రిమియాలోకి సైన్యాన్ని దింపారు.
 
 ఈ జానపద, పౌరాణిక కథల నడుమనుంచి కూడా కనిపిస్తున్న కొన్ని వాస్తవాలు కాదనలేనివి. పాశ్చాత్య ప్రపంచం హఠాత్తుగా కనిపెట్టిన నియంత విక్టర్ యాను కోవిచ్ 2010 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యారు. ఆ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జరిగాయని ఈయూ పర్యవేక్షకులే కితాబులిచ్చారు. అమెరికా అండదండలతో నేడు తాత్కాలిక అధ్యక్షగిరి వెలగబెడుతున్న అలెగ్జాండర్ తుర్చియనేవ్ మాజీ ప్రధాని ట్యామెషెంకోకు నమ్మినబంటు. ఆమె 2010 ఎన్నికల్లో యానుకోవిచ్ చేతిలో చిత్తుగా ఓడారు.  ఆమె 2003లో అమెరికా అండతో సాగిన ఆరెంజ్ విప్లవ నేత్రి కూడా! అదే రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడైన యానుకోవిచ్ ఈయూలో చేరాలని ఉవ్విళ్లూరారు. చేరనని పిల్లిమొగ్గలూ వేశారు. ఈయూలో చేరుతానంటే ప్రజాస్వామ్యం, చేరనంటే నియంతృత్వం!
 
 హిట్లర్ మార్కు ప్రజాస్వామ్యం
 మొహం చూసి మనిషిని అంచనా వేయొచ్చంటారు. అదేమోగానీ ఇప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మొహం చూస్తే ‘విప్లవం’ విజయవంతమయ్యాక నెలకొనబోయే ‘ప్రజాస్వామ్యం’ తీరు మొత్తం తెలుస్తుంది. ప్రధాని యాట్సెన్‌యుక్ ‘ఫాదర్‌లాండ్’ పార్టీకి గత ఎన్నికల్లో లభించినవి 7 శాతం ఓట్లు. ఉక్రెయిన్ వ్యవహారమంతా అమెరికా ఆడుతున్న ఆటేనని చెబుతూ అందులో ఈయూ పాత్ర పానకంలో పుడకలాంటిదేనని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా న్యూలాండ్ అన్నారు. యాట్సెన్‌యుక్‌కు ‘ఆర్థిక, పరిపాలనాపరమైన అనుభవం ఉన్నదని’ కూడా కితాబునిచ్చారు. భావి అధ్య క్షునిగా భావిస్తున్న త్యహ్నీబాక్ నేతృత్వంలోని స్వోబోదా పార్టీ గత ఎన్నికల్లో 10 శాతం ఓట్లు సంపాదించింది. ప్రధాని, హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ విధానాలు సహా 8 కీలక శాఖలలో ఈ రెండు పార్టీల నేతలే ఉన్నారు. ఈ రెండు పార్టీలను జాతీయోన్మాద పార్టీలుగా గత ఏడాది వరకు పాశ్చాత్య మీడియా దుమ్మెత్తి పోసింది. 2012లో స్వోబోదాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఈయూను డిమాండు చేసినది రష్యా కాదు... అమెరికాకు బహిఃప్రాణం ఇజ్రాయెల్! తాత్కా లిక ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయాలలో ఒకటి దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల లోనూ ఉక్రేనియన్ భాషనే వాడాలి. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన నిషిద్ధం. ఉక్రెయిన్ జనాభాలో కనీసం సగం మంది రష్యన్ మాట్లాడేవాళ్లే. ‘ఒకే దేశం ఒకే భాష.  ఒకేజాతి’ ప్రజాస్వామ్య పరిరక్షక విప్లవ ప్రభుత్వ నినాదం. పాశ్చాత్య మీడియాకు ఈ ‘అల్ప’ విషయాలను చెప్పే తీరుబడిలేకపోవడాన్ని అర్థం చేసుకోగలం. నిన్నటిదాకా అది ఈ రెండు పార్టీలను పచ్చి మితవాద పార్టీలుగా  ఎండగట్టింది. యూదులు, రష్యనులు, రోమాలను విదేశీయులుగా భావించి దాడులకు తెగబడే స్వోబోదా పార్టీ గుర్తు కూడా 2006 వరకు హిట్లర్ స్వస్తికే!
 
 కండోలిజా చెప్పిన సత్యం
 ఉక్రెయిన్ సంక్షోభం మూలాలు ఇంధన వనరులపై ఆధిపత్యపు పోరులో ఉన్నా యని వినవస్తున్న మాట నిజమే. నేటి సంఘర్షణ గల్ఫ్ ప్రాంతంలోని చమురు నిక్షేపాల కోసం కాదు. ఉక్రెయిన్‌లోని గ్యాస్ పైపులైన్లపై ఆధిపత్యం కోసం అన డం తక్షణ వాస్తవాన్ని ప్రతిఫలిస్తుంది. రష్యాలోని సైబీరియాలో సహజవాయు నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. అక్కడి నుంచి పశ్చిమ యూరప్‌కు సరఫరా అయ్యే గ్యాస్ పైపులైన్లలో అత్యధికం ఉక్రెయిన్ గుండానే సాగుతాయి. సహజ వాయు క్షేత్రాలు రష్యాలో ఉండగా ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తే ఒరిగేదేముంది? అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌ను అడిగితే సూటిగా చెబు తారు. ‘మనం రష్యా యువతకు ప్రత్యేకించి విద్యార్థులకు, యువ వృత్తి నిపు ణులకు దగ్గరకావాలి. మీ ఆశయాలకు, ఆకాంక్షలకు అమెరికా అండగా ఉన్నదని రష్యాలోని ప్రజాస్వామిక శక్తులకు తెలియజెప్పాలి. రష్యా భవితవ్యం వారే తప్ప పుతిన్ కాదు’.
 
 కండోలిజా మాట్లాడుతున్నది సిరియాలో ఆశించినట్టుగా, వెనిజులాలో చేద్దా మనుకుంటున్నట్టుగా, ఉక్రెయిన్‌లో చేసి చూపినట్టుగా... రష్యాలో కూడా విప్లవం పేరిట పుతిన్ ప్రభుత్వాన్ని కూల్చడం. అప్పుడే ఉక్రెయిన్‌ను చేజిక్కిం చుకోడానికి పెడుతున్న బిలియన్లకొద్దీ డాలర్ల పెట్టుబడికి ఫలితాలు లభిం చేది. నేడు యానుకోవిచ్ మెడకు వేసిన ఉచ్చు రేపు పుతిన్‌కు ఉరి తాడు కాగలదని అమెరికా ఆకాంక్ష, దీర్ఘకాలిక లక్ష్యం.
 
 తలుపులు మూసిన గదిలో పిల్లి

 ఉక్రెయిన్ విషయంలో పుతిన్ తెగేదాకా లాగుతున్నారని, అనవసరంగా అణ్వస్త్ర ప్రమాదపు అంచులకు ప్రపంచాన్ని నెడుతున్నారని తిట్టేవారికి కొదవలేదు. క్రిమియా రష్యాకు అత్యంత కీలకమైన నావికా, సైనిక స్థావరం. అంతకుమించి నల్ల సముద్రం ద్వారా పశ్చిమానికి ఉన్న ఏకైక నావికా మార్గం. గడ్డకట్టిపోకుండా ఏడాది పొడవునా నౌకాయానానికి అను కూలంగా ఉన్న తీరం రష్యాకు అదొక్కటే. పుతిన్ సైనిక దురాక్రణకు పాల్పడ్డాడంటున్న క్రిమియా అసలు ఉక్రెయి న్‌లో భాగమెలా అయింది? పూర్వపు సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ప్రధాని కృశ్చెవ్ 1956లో ఉక్రెయిన్‌కు కానుకగా ఇచ్చారు కాబట్టి. నాడు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న రిపబ్లిక్ కాబట్టి.
 
 ఈ నెల 15న క్రిమియాలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అది రష్యాలో భాగంగా ఉండాలనే తీర్పు వెలువడటం తథ్యం. ప్రజలు ఎన్నుకున్న యానుకోవిచ్‌ను గద్దెదించి, ఎవరూ ఎన్నుకోని ప్రభుత్వంతో ‘ప్రజాస్వామ్యాన్ని’ నిలిపిన ఒబామా ఆ తీర్పు చెల్లదని ముందే తేల్చి చెప్పేశారు. దౌత్యమార్గంతో పరిష్కారం అంటూ గాలి కబుర్లు చెబుతున్నారేకానీ అసలు ఇప్పుడు రష్యాలో అమెరికా రాయబారే లేడు. 1962 క్యూబా మిస్సైళ్ల సంక్షోభం పరిష్కారానికి అమెరికా మాజీ రాయబారి జార్జి ఎఫ్ కెన్నన్ సలహాలు తోడ్పడ్డాయి. ఒబామాకు అలాంటి సలహాదారులూ లేరు, ఆయన జాన్ ఎఫ్ కెన్నడీ కారు. ఉక్రెయిన్ సంక్షోభం సందర్భంగా పాశ్చాత్య మీడియా ‘చరిత్ర పునరావృతమవుతుంది, మొదట విషాదంగా, రెండోసారి ప్రహసనంగా’ అనే మార్క్స్ మాటలను ఎడాపెడా ప్రయోగిస్తోంది.
 
 1853-56నాటి క్రిమియా యుద్ధంలో ఓడినట్టుగానే నేటి ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా రష్యా ఓడిపోవాల్సిందేననే శాపనార్థమే తప్ప అందులోని సందర్భశుద్ధి శూన్యం. మార్క్స్ మాటలు ‘లూయీ నెపోలియన్ 18వ బ్రూమెరీ’ లోనివి. 1851లో లూయి నెపోలియన్ కుట్రతో ఫ్రాన్స్‌లోని ప్రజాస్వామిక రిపబ్లిక్‌ను కూల్చిన కుట్ర గురించి రాశారు. అందులోని 18వ బ్రూమెరీ నెపోలియన్ బోనపార్టీ నవంబర్ 9, 1799లో జరిపిన కుట్రను ఉద్దేశించినది. నేడు ఉక్రెయిన్‌లో ఒబామా లాయీ నెపోలియన్ పాత్రనే నిర్వహి స్తున్నారు.
 
 అంగుష్టమాత్రులైన వ్యక్తులు ఫ్రాన్స్ కీలక పాత్రధారులుగా మారిన  నాటి చారిత్రక  పరిస్థితులను మార్క్స్ వర్ణిస్తూ ఆ వాక్యాలు రాశారు. కాకపోతే నేటి అంగుష్టమాత్రులు విదూషకులే గాక... ప్రపంచాన్ని అణు విధ్వంసం అంచులకు నెట్టగలిగిన మూర్ఖులు. అలాగే, ఒకప్పటి క్రిమియా యుద్ధంలో ‘యూరప్ రోగిష్టి’ అట్టోమన్ సామ్రాజ్యం (నేటి టర్కీ) కాగా నేటి ప్రపంచ రోగిష్టులు ఈయూ, అమెరికాలు కావడమే ఆ విపత్తునుంచి కాపాడగలిగిన అంశం.      
- పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement