ఉక్రెయిన్ యుద్ధం.. 26వరోజుకి చేరింది. రష్యా బలగాల దాడుల్ని మొండిగా ఎదుర్కొంటున్నాయి ఉక్రెయిన్ దళాలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఐదవ సైన్యం కలిగిన ఉన్న రష్యాకి.. ఈ పరిణామాలు మింగుడు పడనివ్వడం లేదు. ఈ తరుణంలో ప్రైవేట్ ఫైటర్ల సాయం కోసం రష్యా ప్రయత్నిస్తోందంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే..
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున తాము పోరాడతామని చెప్తున్నారు సిరియా పారామిలిటరీ బలగాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని.. ఆయన ఆదేశిస్తే ఉక్రెయిన్ గడ్డను విరుచుకుపడతామని చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటిదాకా మిత్రపక్షం రష్యా నుంచి ఎలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని అంటున్నారు వాళ్లు.
సిరియా పట్టణం సుఖ్వేలాబియాలో పారామిలిటరీ జాతీయ భద్రత దళం(ఎన్‌డీఎఫ్) కమాండర్ నబీల్ అబ్దల్లా ఓ అంతర్జాతీయ మీడియా హౌజ్‌తో మాట్లాడుతూ.. సిరియా, రష్యా ప్రభుత్వాల నుంచి సూచనలు రాగానే రంగంలోకి దిగుతామని స్పష్టం చేశాడు. పుతిన్ కోసం మేం ఏం చేయడానికైనా సిద్ధం. ఆయన ఒక్క ఆదేశం ఇస్తే చాలు.. రంగంలోకి దిగేస్తాం. ఉక్రెయిన్‌ను మట్టికరిపిస్తాం అంటూ ప్రకటన ఇచ్చాడు నబీల్. ‘‘ఈ యుద్ధానికి మేం భయపడం. ఇదివరకెప్పుడూ చూడని యుద్ధాన్ని మేం వాళ్లకు(ఉక్రెయిన్ దళాలను ఉద్దేశించి..) రుచి చూపిస్తాం. సిరియాలో ఉగ్రమూకలను ఎలా మట్టికరిపించామో.. వాళ్లకూ అంతకు మించిన అనుభవాన్ని అందిస్తాం’’ అంటూ మరో బెటాలియన్ కమాండర్ Simon Wakeel .
ఇదిలా ఉండగా.. మార్చి 10వ తేదీన జరిగిన రష్యా భద్రతా మండలి సమావేశంలో అధ్యక్షుడు పుతిన్.. మిడిల్ ఈస్ట్ నుంచి 16వేల మంది వాలంటీర్లకు(ఉచితంగా) ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చెచెన్యా ఫైటర్లు రష్యాకు మద్ధతుగా రంగంలోకి దిగగా.. ఇప్పుడు సిరియా సైతం సై అంటోంది.
అయితే ఎన్‌డీఎఫ్ నియామకాలపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, అటు సిరియా సమాచార మంత్రి త్వ శాఖ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. 2015 సిరియా వార్‌లో రష్యా సాయానికి కృతజ్ఞతగా ఉంటోంది. మొత్తం లక్షా 69 వేల సిబ్బంది ఉన్న సిరియా పారా మిలిటరీ సైన్యానికి సమర్థవంతమైందిగా పేరుంది.
ఇదిలా ఉండగా.. రష్యాతో యుద్ధంలో తమ తరపున 16వేల మంది ఫారినర్లు స్వచ్ఛందంగా పాల్గొంటున్నట్లు మార్చి 3వ తేదీన ఉక్రెయిన్ ప్రకటించుకుంది. అంతేకాదు.. సిరియా ఫైటర్లకు తమ జీతం కంటే 30 రెట్లు ఎక్కువ(సుమారు వెయ్యి డాలర్లు) చెల్లించి ఉక్రెయిన్‌పై యుద్ధానికి సాయంగా తెచ్చుకుంటోందని స్వయంగా ఉక్రెయిన్ జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశాడు. తదనంతర చర్యగానే.. మిడిల్ ఈస్ట్ దేశాల ఫైటర్లను స్వచ్ఛందంగా పాల్గొనాలంటూ పుతిన్ పిలుపు ఇచ్చాడు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు సిరియా దళాలు వచ్చినా ఒరిగేది ఏం లేదని అమెరికా అంటోంది. సిరియాలో పారామిలిటరీ ఫైటర్ల సంఖ్యతో పోలిస్తే.. ఉక్రెయిన్‌కు వెళ్లే వాళ్ల సంఖ్య వందల్లో ఉండొచ్చని, ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని యూఎస్ భద్రతాధికారి ఫ్రాంక్ మెకెంజీ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment