కొత్త పొత్తులు... పాత చిచ్చులు | Terrorists occupies crucial part in Iraq | Sakshi
Sakshi News home page

కొత్త పొత్తులు... పాత చిచ్చులు

Published Wed, Jan 22 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

కొత్త పొత్తులు... పాత చిచ్చులు

కొత్త పొత్తులు... పాత చిచ్చులు

ఇరాక్‌లోని అతి పెద్ద రాష్ర్టం అంబర్‌లోని ఫాలూజా, రమాదీ నగరాలు అల్‌కాయిదా మిలిటెంట్ల వశమయ్యాయి. సౌదీ మద్దతుతో అల్‌కాయిదా మిలిటెంటు సంస్థలు ‘ఇస్లామిక్ లెవాంత్’ లక్ష్యంతో ఇరాక్, సిరియా, లెబనాన్‌లలో ఉమ్మడి వ్యూహంతో కదులుతున్నాయి.
 
 సంసారం సరిహద్దులను దాటి పొంగి పొర్లిన ‘ప్రేమ’ కారణంగా అమెరికా ప్రథమ దంపతుల పెళ్లి పెటాకులు కానుండగా... బరాక్ ఒబామాకు ఇరాక్ నుంచి మరో ప్రేమ సందేశం అందింది. అది కూడా 2011లో కాదు పొమ్మని, చెంప పెట్టు పెట్టినంత పని చేసిన ప్రధాని నూరి అల్ మాలికీ నుంచి. అమెరికా అధ్యక్షుని సంసార ఖేదం ఎలా ఉన్నా విదేశాంగ నీతి మాత్రం ‘కొత్త’ ప్రేమ రాగాలను పలుకుతోంది. జనవరి 4న ఇరాక్‌లోని అతి పెద్ద రాష్ట్రం అల్ అంబర్ రాజధాని రమాదీ, మసీదుల నగరం ఫాలూజా ఇరాకీ అల్‌కాయిదా ‘ఇరాక్, లెవాంత్‌ల ఇస్లామిక్ ప్రభుత్వ’ (ఐఎస్‌ఐఎల్) మిలిటెంట్ల వశమయ్యాయి. దీంతో మాలికీ అమెరికా సైనిక సహాయం కోసం అర్థించక తప్పింది కాదు. సున్నీ మిలిటెంట్ల ‘ఇరాక్, సిరియాల ఇస్లామిక్ ప్రభుత్వం’, వారి లెవాంత్‌లు మధ్య ప్రాచ్య రాజకీయాల్లో చాలా కాలమే ప్రముఖ వార్తగా ఉండబోతున్నాయి. ముందుగా పాత ప్రేమికుల మధ్య కొత్త ప్రేమ చిగుళ్లు వేయడం గురించి చూద్దాం. ‘ఉగ్రవాదుల’ నుంచి ఇలాంటి ముప్పు వస్తుందనే ఒబామా ప్రభుత్వం సేనలను నిలిపి ఉంచనివ్వమని మాలికీ కాళ్లా వేళ్లా పడి బతిమలాడింది. ఆయన ససేమిరా అన్నారు. 2003లో సైనిక దురాక్రమణతో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోసిన అమెరికా ‘విభజించి పాలించు’ సూత్రాన్ని పాటించి ప్రధాన ముస్లిం శాఖలైన సున్నీ, షియాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది. సద్దాం సున్నీ మద్దతుదార్లకు విరుగుడుగా షియాల ప్రతినిధి మాలికీకి పట్టంగట్టింది. ఆ ‘కృతజ్ఞతైనా’ లేకుండా గడుపు ముగిసిన వెంటనే అమెరికా సేనలకు ఇంటి తోవ చూపారు. దీంతో 2011 చివర్లో అవమాన భారంతో ఇరాక్ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది.
 
 తిరిగి ఇరాక్‌లో సేనలను దించే ప్రసక్తే లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. నాడు ఇరాక్‌లోనే కాదు నేడు అఫ్ఘానిస్థాన్‌లో సైతం అమెరికా సేనలను నిలిపి ఉంచడానికి  ఎదురవుతున్న అడ్డంకి ఒక్కటే.. ‘సరిహద్దులకు అతీతమైన హక్కులు’. అంటే స్వతంత్రంగా సోదాలు సైనిక చర్యలు చేపట్టే హక్కులతో పాటూ ఆయా దేశాల న్యాయవ్యవస్థకు, చట్టాలకు అతీతమైన పూర్తి రక్షణ. అందుకు మాలికీ సిద్ధపడలేదు. పైగా అమెరికా అభీష్టానికి విరుద్ధంగా ఇరాన్‌తోనూ, సిరియాలోని అసద్ ప్రభుత్వంతోనూ మైత్రి నెరపారు. అదే మాలికీ నేడు తిరిగి అమెరికాతో చెట్టపట్టాలకు సిద్ధం కావడానికి మించి దానికి ఏం కావాలి?
 
 అయితే ఈ కొత్త పొత్తుతో పాటూ ఐఎస్‌ఐఎస్ చిచ్చుకు కూడా మూల కారణం... ఇరాన్‌పై అమెరికా, ఈయూల ఆంక్షల ఎత్తివేత చర్యల్లో కనిపిస్తుంది. అమెరికా దాదాపు నాలుగు దశాబ్దాలపాటూ షియా ఇస్లామిక్ దేశం ఇరాన్‌ను ఆంక్షల దిగ్బంధంతో నరకయాతనకు గురిచేసింది. నేడు దానితో శాంతిని, మైత్రిని కోరుతోంది. దానికి నమ్మకమైన మిత్రునిగా ఉన్న సౌదీ అరేబియా షియా వ్యతిరేక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా, అల్‌కాయిదా లాంటి సంస్థలను ప్రోత్సహించడం ద్వారా సున్నీలపై తిరుగులేని ఆధిపత్య శక్తిగా నిలవాలని ప్రయత్నిస్తూ వచ్చింది. ‘హఠాత్తుగా అమెరికా విదేశాంగ నీతి షియాల కూటమి వేపు మొగ్గింది’ అని సౌదీ అరేబియా నేడు వాపోతోంది. ఈ పరిణామాలను ఇజ్రాయెల్ సైనిక ఇంటిలిజెన్స్ బ్లాగ్ ‘డెబ్కాఫైల్స్’ విస్పష్టంగా విడమరిచింది. ‘సున్నీ శత్రువులు మధ్యప్రాచ్యంలోని విశాల ప్రాంతాలను స్వాధీనం చేసుకునే కృషిలో పెద్ద ఊపుతో కాలూనుకున్నారు. వారి మార్గం బాగ్దాద్, డమాస్కస్‌ల మీదుగా బీరూట్‌కు చేరుతోంది. సౌదీ అరేబియా ఈ అల్‌కాయిదా మిలిటెంట్లకు మద్దతునిస్తోంది. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున చెలరేగనున్న హింస జోర్డాన్, ఇజ్రాయెల్‌లలోకి కూడా వ్యాపించవచ్చు’. డెబ్కాఫైల్స్ పేర్కొన్న ఆ ప్రాంతమే ఐఎస్‌ఐఎల్ మిలిటెంట్లు చెబుతున్న సిరియా, ఇరాక్, లెబనాన్, జోర్డా న్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌లతో కూడిన ఒకప్పటి లెవాంత్.
 
 నిన్నటి వరకు అమెరికా కూడా మద్దతునిచ్చిన సిరియా అల్ కాయిదా ‘అల్ నజ్రా ఫ్రంట్’, ఇరాకీ అల్ కాయిదా ఐఎస్‌ఐఎల్‌లు నేడు ఒకే వ్యూహంతో కదులుతున్నాయి. అమెరికా విదేశాంగ నీతి సిరియాలో పిల్లి మొగ్గ వేసినది మొదలు సౌదీ అరేబియా సూత్రధారిగా... మధ్య ప్రాచ్యంలోని అల్‌కాయిదా బృందాలన్నీ కలసి లెవాంత్ లేదా గ్రేటర్ సిరియా వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. నేడు లెబనాన్‌లో రగులుతున్న చిచ్చు సైతం అందులో భాగమే. ఇరాన్, సిరియాలలోని అమెరికా తాజా ైవె ఖరి అమెరికాకు కొత్త మిత్రులను సంపాదించబోతున్నా చిరకాల మిత్రుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. నేడు మాలికీ అడిగిందే తడవుగా అమెరికా హెల్‌ఫైర్ క్షిపణులు, అపాచీ హెలికాప్టర్లు, ఎఫ్-16 విమానాలను పంపుతున్నది. వాటిని ప్రయోగించబోయేది ఒకప్పుడు అమెరికా సేనాని డేవిడ్ పెట్రాస్ చెలిమి చేసి ప్రోత్సహించిన  వారిపైనే.
 
 పిళ్లా వెంకటేశ్వరరావు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement