క్షణక్షణం..భయం గుప్పిట్లో..
ఇరాక్‌లో ఏవో గొడవలు జరుగుతున్నయట.. ఇది తెలిసినప్పటి నుంచి పాణంల పాణముంటలేదు బిడ్డా.. నువ్వెంబడే రా బిడ్డా.. నీ బాంచెన్.. ఓ తల్లి ఆవేదన.బతికుంటే ఏదైనా చేస్కొని బతకొచ్చు.. నువ్వుంటే మాకు గదే సాలు.. నువ్వు రాయే... భార్య దీనరోదన.నాన్న మాకు భయమైతంది. నీకు ఏమో అయితదట కద. మాకు ఏడు పొస్తుంది. తొందరగా రా నాన్నా... పిల్లల మారాం ఇది. అన్నా ఆ పని, పైసలు లేకుంటే మాయె. నువ్వు మా కాడుంటె ధైర్యంగా ఉంటది. ఆ ధైర్యంతో బతుకుతం... నువ్వెంబడే రావాలన్నా.. ఓ తమ్ముడు, చెల్లీ వేడుకోలు.
ఇరాక్‌లో తలెత్తిన అంతర్యుద్ధం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని కడెం, ఖానాపూర్, జన్నారం ప్రాంతానికి చెందిన పలువురు యువకులు అక్కడికి జీవనోపాధికి వెళ్లారు. ప్రస్తుతం ఇరాక్‌లో తీవ్రవాదులకు, అక్కడ ప్రభుత్వం భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న సంగ్రామం నేపథ్యంలో ఇక్కడున్న జిల్లావారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులదీ అదే దుస్థితి.
రాజీనామా చేసినా అంతే
ఖానాపూర్ : ఇక్కడి కంపెనీలకు చెందిన పనులు చివరి వరకు చేరడంతో పూర్తిస్థాయిలో పనిచేయించుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇండియాకు పంపడం లేదు. ఎవరైనా పోతామన్నా.. వారికి ఫినిష్ ఇచ్చినా.. వేతనం నుంచి టికెట్ డబ్బులు కట్ చేస్తామని మా కంపెనీ ప్రకటించింది. మా సమస్యను ఇండియన్ ఎంబసీలు టోల్‌ఫ్రీలకు తెలియజేసినా స్పందన లేదు. మేం 60 మందిమి రాజీనామా చేసినా కంపెనీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
- కతులాపురం ప్రవీణ్, ఖానాపూర్
కాలయాపన చేస్తున్నారు
ఖానాపూర్ : ప్రమాదం పొంచి ఉన్నందున మమ్మల్ని ఇండియాకు పంపమని కంపెనీని అడిగితే ప్రస్తుతానికి మేముంటున్న ప్రాంతానికి ఎటువంటి ప్రమాదం లేదని నోటీసు మా కంపెనీ ప్రాంతంలో అతికించారు. ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఎటువంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. వెంటనే మమ్మల్ని పంపకుంటే మాకు ఏమవుతుందోనని మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
- బొమ్మెన మధుకర్, రేవోజిపేట, కడెం
క్షేమంగా రప్పించాలె
దండేపల్లి : మా తమ్ముడు శంకర్ ఇరాక్ వెళ్లి మూడు నెలలైంది. అక్కడేమో బాంబు లేసుకుంటున్నారని తెలవడంతో అప్పటి నుంచి మాకు చాలా భయంగా ఉంది. ఇటీవల ఫోన్ చేసిండు మాట్లాడిండు. అక్కడ లొల్లులైతన్నయట నువ్వు తొందరగా వచ్చేయ్ అని చెప్పిన. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మాలాంటోళ్ల బాధను జర అర్థం చేసుకోవాలె.
- గంధం రాయలింగు, దండేపల్లి
ఎలాగైనా రప్పించండి
జన్నారం : మాది జన్నారం మండలం రోటిగూడ. నేను ఇరాక్ పోయి 8 నెలలు అవుతోంది. ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతోంది. యాజమాన్యం కంపెనీ మూసుకుని వెళ్లింది. నెల జీతం ఇయ్యలేదు. భయంతో ఇంటికి వెళ్తామంటే వెళ్లనీయడం లేదు. వెయ్యి డాలర్లు ఇస్తే పంపిస్తామని అంటున్నారు. భయటకు వెళ్తే చంపివేస్తామని బెదిరిస్తున్నారు. మాకు భయంగా ఉంది. మమ్ములను ఎలాగైనా ఇంటికి వచ్చేలా చేయండి.
- నాడెం నాగరాజు