థాయ్ ‘క్షమా’ క్షోభ
అవినీతి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్య తరగతి యువత, ప్రజలు వీధులకెక్కి ఆందోళనలు చేపట్టారు. ఆ ఆందోళనలను ఆధారంగా చేసుకొని తస్కిన్ వ్యతిరేకశక్తులు, రాచరికవాదులు యింగ్‌లుక్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల పోరాటం ఎప్పుడో హైజాక్ అయింది.
‘నవ్వులు చిందించే దేశం’ థాయ్‌లాండ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని యింగ్‌లుక్ షినావత్ర ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు కోరుతున్నారు. 1947లో స్వాంతంత్య్రం సాధించుకున్న థాయ్ ప్రజాస్వామ్యం ‘పునరపి జననం పునరపి మర ణం’ అన్నట్టు పుడుతూ గిడుతూ బతుకీడుస్తోంది. పద్దెనిమిది సైనిక తిరుగుబాట్లను చూసిన ఆ దేశంలో సైనిక, పౌర ప్రభుత్వాలు రుతువుల్లా వచ్చి పోతుంటాయి. నేడు అధికారంలో ఉన్న ప్యూథాయ్ పార్టీ నేత్రి యింగ్‌లుక్ 2011 ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధాని. యింగ్‌లుక్ ప్రభుత్వం గిట్టిపోవాలని కోరుతున్న ప్రతిపక్ష నేత సుతెప్ తౌగ్సుబెన్ గత ప్రభుత్వంలో ఉప ప్రధాని. ఆయనకు అవినీతి ఆరోపణలతో పార్లమెంటు సభ్యత్వా న్ని కోల్పోయిన ఘనతే కాదు, 2006 సైనిక తిరుగుబాటుకు సూత్రధారి అన్న ఖ్యాతి కూడా ఉంది.
అ తిరుగుబాటులో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని తక్సిన్ షినావత్ర నేటి ప్రధాని యింగ్‌లుక్‌కు స్వయానా తోడబుట్టినవాడు. రెండు దఫాలు అదికారంలో ఉండి ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. ఆయన పలుకుబడి నేటికీ గ్రామీణ ప్రాంతా ల్లో చెక్కుచెదర లేదు. ఆ పలుకుబడితోనే చెల్లెల్ని అధికారంలోకి తేగలిగారు. అన్నీ ఉన్నా... అన్నట్టు ఆయన మాత్రం దుబాయ్‌లో స్వచ్ఛంద ప్రవాస జీవితం గడపా ల్సివస్తోంది. అవినీతి కేసుల్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే అందుకు కారణం. తక్సిన్ కీలుబొమ్మగా అధికారాన్ని నెరపుతున్న యింగ్‌లుక్ ఇటీవల తన సోదరుడు స్వదేశానికి రావడానికి వీలుగా ‘క్షమాభిక్ష చట్టాన్ని’ ప్రతి పాదించారు. దీంతో తక్సిన్‌పట్ల, అవినీతిపట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్యతరగతి ప్రజలు యింగ్‌లుక్‌కు వ్యతి రేకంగా వీధులకెక్కి ఆందోళన చేపట్టారు.
ఆ ఉద్యమంలో ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీకి, దాని నేత సుతెప్‌కు అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు కనిపించాయి. థాయ్ ‘ఆనవాయితీ’కి విరుద్ధంగా సైనిక కుట్ర లేకుండానే యింగ్‌లుక్ ప్రభుత్వా న్ని కడతేర్చే ఘట్టాన్ని ప్రారంభించారు. కారణం... 1950ల నుంచి రాచరికానికి, సైన్యానికి మధ్యన పెనవేసుకున్న బలీ యమైన బంధం సడలిపోవడమే. ‘నవ్వు ఎరుగని రాజు’గా పేరుమోసిన రాజు భూమిబల్ అదుల్యదేజ్ నామమాత్రపు దేశాధినేతే. అయినా కీలక రాజకీయ పాత్రధారి. ఆయన మంచం పట్టగా చక్రం తిప్పిన రాణి సిరికితే కూడా ఇటీవల మంచమెక్కారు.
దీంతో థాయ్ రాజకీయ సమీకరణాలు మారడం మొదలైంది. సైన్యానికి కీలక నేత జనరల్ ప్రయు త్ చాన్-ఓచా సుదీర్ఘకాలంగా రాజుకు విధేయులు. ఆయ న ఇప్పుడు తస్కిన్‌తో సయోధ్య కుదుర్చుకున్నారు. బదులుగా యింగ్‌లుక్ భారీ ఎత్తున సైనికాధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. మేజర్ జనరల్స్ సంఖ్య హఠాత్తుగా రెట్టిం పై 464కు చేరింది. వారిలో విధుల్లో ఉన్నవారు 230 మంది కాగా మిగతావారు ‘ఉపగ్రహ జనరల్స్.’ సైన్యం ‘తటస్థత’ లోని రహస్యం ఇదే. ‘ప్రజాస్వామిక సంస్కరణల ఉద్య మ’ నేత సుతెప్... యింగ్‌లుక్ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించాలని కోరడంలేదు. ఎన్నికలతో సంబంధంలేని రాజ్యాంగేతర ‘ప్రజామండలి’కి అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా, నిర్ణీత వ్యవధి ప్రకా రం 2014లోనైనా ఎన్నికలు జరిగితే తస్కిన్ ఎర్ర చొక్కాల గెలుపు ఖాయం. మెజారిటీ ప్రజల మద్దతున్న తస్కిన్, మద్దతులేని సుతెప్‌లు ఇద్దరి చరిత్రలు నలుపే.
అప్రజాస్వామిక, రాజ్యాంగేతర అధికారం కోరుతు న్న సుతెప్ వెంట పట్టణ మధ్యతరగతి, విద్యావంతులు ఎందుకు పోతున్నట్టు? నిజానికి వాళ్లు ఆయనకంటే ముం దే వీధుల్లోకి వచ్చారు. వారిని వీధుల్లోకి తెచ్చినది ప్రధాని యింగ్‌లుక్ క్షమాభిక్ష! తస్కిన్ చట్టానికి అందకుండా శిక్షను తప్పించుకోవడానికి యింగ్‌లుక్ దొడ్డి దోవను తెరవడానికి నిరసనగా అవినీతి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్య తరగతి యువత, ప్రజలు వీధులకెక్కి ఆందోళన చేపట్టా రు. ఆ ఆందోళనలను ఆధారంగా చేసుకొని తస్కిన్ వ్యతిరేకశక్తులు, రాచరికవాదులు సైన్యం అండలేకుండా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు.
గురువారం రాజు పుట్టిన రోజు. ఆదివారం వరకు ఆ వేడుకలు కొనసాగుతాయి. అంతవరకు ఆట విడుపు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలైన ‘ఆట.’ ఈ ఆటలో గెలుపు ఎవరిదో నిర్ణయించేది చివరికి సైన్యమే. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల పోరాటం ఎప్పుడో హైజాక్ అయింది. పసు పు చొక్కాలు, ఎర్రచొక్కాలు ధరించి తలలు పగలగొట్టుకోడానికి సిద్ధమవుతున్న పట్టణ, గ్రామీణ ప్రజలకు మిగిలేది పగిలిన తలలే. యింగ్‌లుక్‌కు పదవీ గండం తప్పినాగానీ తక్సిన్ ఆట కట్టయినట్టే. క్షమాభిక్షకు తెరపడినట్టే.
- పిళ్లా వెంకటేశ్వరరావు