మయన్మార్ మాఫియా రాజ్
చైనా నేటి ఆసియా అద్భుతమైతే రేపు ఆ ఖ్యాతి మయన్మార్‌దే. కాకపోతే అది తన అపార ఖనిజ సంపదను ‘వినియోగంలోకి’ తేవాల్సి ఉంటుంది. మయన్మార్ వనరులను కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాలు... సైనిక నియంత థాన్ ష్వేకు ప్రజాస్వామ్య అధ్యక్షుని కిరీటం తగిలించాయి. నేడు బహుళజాతి కంపెనీలు మైనారిటీ జాతుల ప్రాంతాలను ‘అభివృద్ధి’ చేసేస్తున్నాయి. విదేశీ గనుల కంపెనీలను నిరోధించే లక్ష్యంతో స్థానిక బడా వ్యాపారుల ముఠా బాంబు దాడులను చేయించింది.
ప్రపంచంలోకెల్లా అంధత్వం అతి ఎక్కువగా ఉన్న దేశాల్లో మయన్మార్ అగ్రశ్రేణిలో ఉంది. అర్థ శతాబ్దిగా అక్కడ సాగుతున్న సైనిక జుంటా నిరంకుశ, జాత్యహం కార పాలనపట్ల ప్రపంచశక్తులు ప్రదర్శిస్తున్న అంధత్వం అంతకంటే చాలా ఎక్కువ. అందుకేనో ఏమో అక్టోబర్ 11-17 మధ్య దేశవ్యాప్తంగా 13 చోట్ల సంభవించిన బాం బు పేలుళ్ల ప్రత్యేక తను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అది కరెన్ నేషనలిస్టు యూనియన్ (కేఎన్‌యూ) మిలి టెంట్ల దుశ్చర్యగా లెక్కగట్టేసారు. కానీ కరెన్ జాతీయవాదులకు ఆ పేలుళ్ళకు సంబంధంలేదని మయన్మార్ పోలీసులే చెబుతున్నారు. ప్రత్యేక భాషా సంస్కృతిగలిగిన కరెన్‌లు (జనాభాలో 7 శాతం) తూర్పు రాష్ట్రం కాయిన్‌లోనే ప్రధానంగా నివశిస్తున్నారు.
జాతుల ప్రదర్శన శాలగా చెప్పుకోదగిన మైన్మార్‌లో 135 గుర్తింపు పొందిన జాతుల ప్రజలున్నారు. ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ మయన్మార్ సైనిక జుంటా బర్మీ జాతీయతను (68 శాతం) అందరిపై రుద్దాలని ప్రయత్నిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ జాత్యహంకా రం బౌద్ధమతోన్మాదం ముసుగు తొడిగింది. దీంతో తరచుగా వార్తలకెక్కుతున్న రోహింగియా లు సహా ఇతర జాతులపై జరుగుతున్న దాడులన్నిటినీ మత సంఘర్షణలుగా లెక్కగట్టేస్తున్నారు. అక్టోబర్ పేలుళ్లు మయన్మార్ జాతుల అణచివేత సమస్యను నగ్నంగా ప్రదర్శిస్తున్నాయి. కచిన్‌లలో 65 శాతం బౌద్ధులే. ఇస్లాం వారి లో వ్యాప్తి చెందలేదు. జాతి అణచివేతకు వ్యతిరేకంగా, స్వయం నిర్ణయాధికారం కోరుతూ వారు 1949 నుంచి సాయుధంగా పోరాడుతున్నారు. పర్వతవాసులైన కరెన్‌లతోపాటూ, షాన్, కచిన్, కయన్ తదితర జాతులు కూడా ఆయుధాలు పట్టాయి. 2007 నాటికి సైనిక జుంటాతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న జాతుల సంస్థలే పది హేడు! నేటికీ కరెన్, షాన్, కచిన్ జాతుల పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.
ఇంతకూ అక్టోబర్ దాడులకు పాల్పడినది ఎవరు? బడా వ్యాపారులు! కచెన్‌ల ప్రాంతంలోని బర్మీ బడా వ్యాపార వర్గాలే ఈ పేలుళ్లకు సూత్రధారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఇటీవలి మయన్మార్ ‘ప్రజాస్వామీకరణ’ ఫలితంగా చాప కింది నీరులా వ్యాపిస్తున్న సరి కొత్త సంఘర్షణను ఇది సూచిస్తోంది. జపాన్ నిన్నటి ఆసియా అద్భుతమైతే నేడు ఆ ఖ్యాతి చైనాది. మరి రేపు ఆ ఖ్యాతి ఎవ రికి దక్కనుంది? మయన్మార్‌కేనని ‘ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్’ తాజా అంచనా. కాకపోతే అది తన అపార ఖనిజ సంపదను ‘వినియోగంలోకి’ తేవాల్సి ఉంటుంది. అందుకోసం చైనా, జపాన్, భారత్‌లతోపాటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ పోటీపడుతున్నాయి. సైనిక నియంతృత్వ మయన్మార్ వనరులను కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాలు ప్రజాస్వామ్యం ‘మడి’ అడ్డురాకుండా... సైనిక నియంత థాన్ ష్వే చేత పౌర దుస్తులు తొడిగించి, ప్రజాస్వామ్య ప్రభుత్వ అధ్యక్షుని కిరీటం తగిలించారు. ప్రతిగా బతికుండగానే పీక్కుతినే బహుళజాతి రాబందుల దం డుకు మయన్మార్ తలుపులు తెరిచారు. ఆ రాబందులన్నీ మైనారిటీ జాతుల ప్రాంతాలను ‘అభివృద్ధి’ చేసేస్తున్నా యి. బొగ్గు, చమురు, సహజవాయు నిక్షేపాలు బర్మీ ప్రాం తాల్లో ఉండగా నికెల్, రాగి, బంగారం, బాక్సైట్, మణిమాణిక్యాలువంటి ఖనిజాలలో అధికభాగం అక్కడే ఉన్నాయి. జాతుల అణచివేతలో భాగంగా సైనిక జుంటా ఉద్దేశపూర్వకంగానే వారి ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేసింది. ఇప్పుడా ప్రాంతాల్లోకి విదేశీ పెట్టుబడులు జోరుగా ప్రవేశిస్తున్నాయి. కరెన్‌ల ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న విదేశీ గనుల కంపెనీలను నిరోధించే లక్ష్యంతోనే స్థానిక బడా వ్యాపారుల ముఠా బాంబు దాడులను చేయించింది.
అలా అని సైనిక జుంటాకు వ్యాపారవర్గాలకు ఏ సం బంధాలూ లేవనీకాదు. మైన్మార్‌లోకెల్లా అత్యంత సంపన్నుడు, అతిపెద్ద వ్యాపారవేత్త తే జా, థాన్ ష్వేలు కుటుం బ మిత్రులు. బడా వ్యాపారవేత్త జయగ్బా ఖిన్ ష్వే మాజీ ప్రధాని జనరల్ ఖిన్ న్యంట్‌కు సన్నిహిత మిత్రుడు. దేశంలోని అతిపెద్ద టీవీ నెట్‌వర్క్ ‘స్కైనెట్’లో ప్రధాన వాటాదారు థేన్ ష్వేనే. జాతీయస్థాయి కుబేరులంతా జుంటాకు సన్నిహితులు, ‘సంస్కరణవాదులు.’ వెనుకబడిన ప్రాం తాలకే పరిమితమైన స్థానిక వ్యాపారవేత్తలంతా బర్మీయు లే. అయినా విదేశీ కంపెనీల, ఆశ్రీత పెట్టుబడిదారులతో పోటీలో దివాలా తప్పదని భయపడుతున్నారు. జాతీయ స్థాయి బర్మీ కుబేరులంతా ‘వెనుకబడిన ప్రాంతాల’పై పడుతున్నారు. మధ్య, ఈశాన్య మయన్మార్‌లోని కచిన్ ప్రాంతాల్లో బంగారం, రాగి, ఇనుము, జింకు, వెండి కోసం వేట త్రీవంగా సాగుతోంది. ఆధునిక వ్యవసాయ క్షేత్రాల కోసం మైనారిటీ జాతుల రిజర్వు భూములను ఆశ్రీత కుబేరులకు కట్టబెడుతున్నారు. ఫలితంగా 2011లో తీవ్రమైన కచెన్ గెరిల్లాల పోరాటంపై సైన్యం పాశవిక అణచివేత సాగించింది. 30 వేలకు పైగా కచిన్ శరణార్థులు చైనాలో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి కచిన్, కాయెన్, షాన్ రాష్ట్రాల్లో జాతి ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నా యి. వాటితోపాటే స్థానిక వ్యాపారవర్గాలకూ, జాతీయ స్థాయి కుబేరులకు, విదేశీ కంపెనీలకు మధ్య సంఘర్షణ పదునెక్కుతోంది. కరెన్ వ్యాపారుల దాడులతో మయ న్మార్ బడా కుబేరులంతా సొంత సేనలతో మైనారిటీ జాతుల ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఆశీస్సులతో మయన్మార్ ‘ప్రజాస్వామీకరణ’ మాఫియా రాజ్ అవతరణగా వికసిస్తోంది.
- పిళ్లా వెంకటేశ్వరరావు