యొవేరీ ముసెవెని
ఉగాండాకు ‘రైతు’ గండం
Published Tue, Oct 22 2013 11:22 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
‘ఆఫ్రికా ప్రధాన సమస్య నాయకులే కానీ ప్రజలు కారు’ అని నిస్సంకోచంగా చెప్పినవాడు... ఉగాండా దేశాధినేత యొవేరీ ముసెవెని. ఆ మాటలు నేటివి కావు పాతికేళ్ల క్రితం నాటివి. నేటి ఉగాండా ప్రధాన సమస్యగా మారి మరీ ఆయన తన మాటలను రుజువు చేస్తున్నారు! అలా అని ఇతర ఆఫ్రికా దేశాధినేతల్లాగా ఆయన జాతి సంపదను కొల్లగట్టి కోట్లకు పడగలెత్తినవాడు కాడు. గత 27 ఏళ్లుగా దేశాధినేతగా ఉన్న ఆయన నేటికీ ‘మంచి రైతు.’ రాజధాని కంపాలాలో కంటే తన వ్యవసాయ క్షేత్రంలో, పశువుల మందలతోనే ఎక్కువగా గడుపుతారు. అక్కడి నుంచే చాలా వరకు పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతుంటారు.
ఆ ‘మంచి రైతు’ పాలనే వ్యవసాయంపై ఆధారపడ్డ 90 శాతం ప్రజలను పెద్ద పామై కాటేస్తుండటమే విషాదం. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (89)లాంటి వారి అవినీతి, ఎన్నికల అక్రమాలను గోరంతలు కొండంతలు చేసి గగ్గోలు పెట్టే అమెరికాలాంటి దేశాలకు ముసెవెని నియంతృత్వం కనిపించదు. 2005లో రాజ్యాంగాన్ని సవరించి అధ్యక్ష పదవిని ఎన్నిసార్లయినా చేపట్టడానికి ఆయన దారిని సుగమం చేసుకున్నారు. తాజాగా అధ్యక్ష పదవికి 75 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేశారు. ఉగాండాలోని ఎన్నికల్లో రిగ్గింగు, ప్రత్యర్థుల దేశబహిష్కారం, వారిని మటుమాయం చేయ డం పరిపాటి. ఇవేవీ పాశ్చాత్య దేశాలకు కనడకపోవడానికి తగిన కారణమే ఉంది.
1979లో నరహంతక నియంత ఈదీ అమీన్‌ను కూలదోయడంలోనూ, 1985లో మిల్టన్ ఒబొటె నియంతృత్వాన్ని కూలదోయడంలోనూ ముసెవెనీ కీలక పాత్ర పోషిం చారు. ‘తూర్పు ఆఫ్రికా సింహం’గా 1986లో దేశాధ్యక్షుడైన ఆయన అంతర్గత సైనిక కుమ్ములాటలను, ప్రాంతీయ యుద్ధాలను అధిగమించి సుస్ధిర పాలన నెలకొల్పారు. ఆ పై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వంది మాగధులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉగాండా అనినీతికి, అసమర్థ పాల నకు మారుపేరయింది. అల్బర్ట్, విక్టోరియా సరస్సులేగాక, తెల్ల నైలు ప్రవహించే ఉగాం డా ఒకప్పుడు తూర్పు ఆప్రికాలోని సంపన్న దేశం. దేశమంతటా వర్షాలు కురిసేవి.
90 శాతం ప్రజలకు నేటికీ వ్యవసాయం, పశుపోషణలే ఆధారం. ప్రపంచబ్యాంకు వృద్ధి మార్గం పట్టిన ముసెవెని ప్రభుత్వం సువిశాల పచ్చిక మైదానాలను పాశ్చాత్య దేశాల హరిత ఇంధన అవసరాల కోసం కార్పొరేట్ గుత్త సంస్థల పరం చేస్తోంది. సంచార పశుపాలకులను స్థిర వ్యవసాయం చేపట్టాలని నిర్బంధిస్తోంది. తూర్పు ఆఫ్రికాపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలి తంగా ఉగాండా తరచుగా దుర్భిక్షానికి, వరదలకు గురవుతోంది. అధిక ఉష్ణోగ్రతలకు ఉపరితల జల వనరుల ఇంకిపోతున్నాయి. ‘పచ్చిక బీళ్ల వెంబడి సంచరించే పశుపాలక సంచార జీవితమే ఉగాండాలోని వాతావరణ మార్పులను తట్టుకొని, కరువును, ఆకలి చావులను నివారించడానికి హామీ’ అని ‘ఇం టర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్’ ఘోషిస్తోంది.
పైగా ఉగాండా, కెన్యా, ఇథియోపియాలలోని సంప్రదాయక పశుసంపద అత్యాధునికమైన ఆస్ట్రేలియా, అమెరికా పశు క్షేత్రాలకంటే శ్రేష్టమైన మాంసాన్ని, ఎక్కువగా అందిస్తాయని, హెక్టారుకు వచ్చే రాబడి కూడా చాలా ఎక్కువని ఆ సంస్థ రుజువు చేసింది. అయితేనేం, పాశ్చాత్య దేశాల జీవ ఇంధనాల కోసం సంప్రదాయక పశు సంతతి, పశుపాలకులు అంతరించిపోక తప్పదు. పరాధీనమైన ఆధునిక డెయిరీ ఫార్మ్‌ల విస్తరణ రైతు కుటుంబాల, పశుపాలకుల ఆహారపు అలవాట్లపై దుష్ర్పభావం చూపుతోంది. ఉగాండా, కైన్యా, ఇథియోపియాలలో ఆవుల నెత్తురును క్రమబద్ధంగా తీసి, పాలతో కలిసి ‘ఎకాసెల్’ అనే సంప్రదాయక పౌష్టికాహారా న్ని తయారుచేస్తారు. సంప్రదాయక పశుసం పదతోపాటూ ‘ఎకాసెల్’ రుచిని కూడా తూర్పు అఫ్రికా మరిచిపోక తప్పదు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతుల కోసం పరిశోధనలు సాగిస్తున్న పాశ్చా త్య దేశాలే ఇంధన అవసరాల కోసం వాతావరణ మార్పులను తట్టుకునే సంప్రదాయ పశుసంపదను, పశుపోషక జీవనవిధానాన్ని నిర్మూలిస్తున్నాయి. తూర్పు ఆఫ్రికా ప్రజలను కరువు రక్కసి నోట్లోకి నెడుతున్నాయి. అం దుకు సహకరించే ముసెవెని లాంటి నేతలంటే అందుకే వారికి అంత ముద్దు.
- పిళ్లా వెంకటేశ్వరరావు
Advertisement