‘కోలా రాజ్’ ఏక పార్టీ పాలన | PepsiCo and Coca-Cola companies Land grab makes farmers landless in Cambodia | Sakshi
Sakshi News home page

‘కోలా రాజ్’ ఏక పార్టీ పాలన

Published Sat, Oct 5 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

‘కోలా రాజ్’ ఏక పార్టీ పాలన

‘కోలా రాజ్’ ఏక పార్టీ పాలన

ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి కంబోడియా రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ప్రధాని హున్ సెన్, ప్రతిపక్ష నేత శామ్ రైన్సీల మధ్య చర్చల వల్ల రాజకీయ ప్రతిష్టంభన తొలగినా, తొలగకపోయినా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు. 
 
 కపాలాల గుట్టల ఫొటోలతో ఒకప్పుడు మొదటి పేజీ వార్తగా ‘కళకళలాడిన’ కంబోడియా ఇప్పుడు ఎవరికీ పట్టని దేశం. అయినా ఈ మధ్య దానికి ప్రపంచ వార్తల్లో కాస్త చోటు దక్కింది. ఆగ్నేయ ఆసియాలోని ఆ  నిరుపేద  దేశంలో జూలై చివర్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని హున్ సెన్ మరోమారు ఎన్నిక కావడంలో విశేషమేమీ లేదు. క మ్యూనిస్టు ఖ్మేర్ రూజ్ రక్తసిక్త పాలనస్థానే వియత్నాం సైన్యం నిలిపిన (1985) ‘సోషలిస్టు’ ప్రభుత్వానికి ఆయన ప్రధాని. నాటి నుంచి ఆయనే ఆ దేశానికి తిరుగులేని రాజు. లాంఛనప్రాయపు దేశాధినేత రాజు నరోదమ్ సిహమొని సెప్టెంబర్ 23న హున్ చేత మరోమారు ప్రమాణ స్వీకారం చేయించేసరికి... కంబోడియా హఠాత్తుగా ఏకపార్టీ ప్రజాస్వామ్యంగా మారిపోయింది. పార్లమెంటులో ఉన్నవారంతా హున్ నేతృత్వంలోని కంబోడియన్ పీపుల్స్ పార్టీ (సీపీపీ) సభ్యులే! 1993లో మొదటిసారి జరిగిన ఎన్నికల నుంచి ప్రధాన ప్రతిపక్షమైన కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ (సీఎన్‌ఆర్‌పీ) అస్తిత్వం పార్లమెంటులో నామమాత్రమే.
 
  ఈసారి ఎన్నికల్లో అది అందరి అంచనాలను మించి, 123 సీట్ల పార్లమెంటులో 55 స్థానాలను గెలుచుకొని హున్‌ను ఖంగు తినిపించింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మీడియా ఎలుగెత్తింది. ఇరాన్‌లాంటి దేశాల్లో సంతృప్తికరంగా జరిగిన ఎన్నికలను సైతం అక్రమమని నానా అల్లరి చేసే పాశ్చాత్య దేశాల కళ్లకు కంబోడియా ఎన్నికలు ‘స్వేచ్ఛగా, సక్రమంగా’ జరిగినట్టే కనిపించాయి. ఎన్నికల అక్రమాలు అక్కడ అలవాటే. కాకపోతే ఈసారి అవి శృతిమించాయి. దీంతో సీఎన్‌ఆర్‌పీయే గాక, రాజు సిహమొని సైతం నిరసనకు దిగాల్సివచ్చింది. హున్ తమ గెలువును దౌర్జన్యంగా తస్కరించాడని నమ్ముతున్న సీఎన్‌ఆర్‌పీ ససేమిరా పార్లమెంటుకు హాజరుకానని భీష్మించుకు కూచుంది. దీంతో హున్ సొంత పార్టీ సభ్యులతోనే పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే గుడ్డిలో మెల్ల అన్నట్టున్న కంబోడియా ప్రజాస్వామ్యం పూర్తి గుడ్డిది అయ్యే ప్రమాదం ఉంది. 
 
 మరో ఐదేళ్ల వరకు తమకు ఎదురులేకున్నా 2018 ఎన్నికల్లో ఓటమి తప్పదని హున్‌కు బెంగ. చేతికి అంది నోటికి కాకుండా పోయిన గెలుపు ఇక ఎన్నటికీ తమ మొఖం చూడదని సీఎన్‌ఆర్‌పీకి బెంగ. రెండు పార్టీల బెంగలకు కారణం ఒక్కటే... చెరకు! ఒకటిన్నర కోట్ల కంబోడియన్లలో అత్యధికులకు జీవనోపాధి వ్యవసాయమే. అత్యంత సారవంతమైన వరి పండించే భూములను, నీటి వనరులను గత కొన్నేళ్లుగా ‘చెరకు’ కబళించేస్తోంది. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు వారు సాగు చేస్తున్న భూములు వారివి కావని ప్లాంటేషన్ కంపెనీలు ‘కనువిప్పు’ కలిగిస్తున్నాయి. ఒకప్పుడు ఖ్మేర్ రూజ్ కమ్యూనిస్టులు పాత భూముల రికార్డులను తగులబెట్టేశారు. రైతులకు యాజమాన్య ధృవీకరణ పత్రాలు లేవు. దీంతో చెరకు ప్లాంటేషన్ల ఆక్రమణ నిరాఘాటంగా సాగుతోంది. అంతర్జాతీయ విపణిలో గత కొన్నేళ్లుగా చక్కెర ధరలు బాగా పెరిగాయి. 
 
 2020 నాటికి చెరకు డిమాండు 25 శాతానికి పైగానే పెరుగుతుందని అంచనా. బయో ఇంధనం మిథేన్‌గా కూడా చెరకు ప్రాధాన్యం పెరగుతోంది.  దీంతో పాశ్చాత్య గుత్త సంస్థలు ఆగ్నేయ ఆసియాపై కన్నేశాయి. కంబోడియా, వియత్నాం, మైన్మార్, థాయ్‌లాండ్‌లలో గుత్తసంస్థల చెరకు ప్లాంటేషన్లు విస్తరిస్తున్నాయి. కంబోడియాలోలాగే అన్ని చోట్లా తరతమ స్థాయిల్లో రైతుల భూములను ప్లాంటేషన్లు మింగేస్తున్నాయి. కంబోడియా రైతుల నోళ్లల్లో మన్నుకొట్టి పండిస్తున్న చెరకు థాయ్‌ల్యాండ్‌లో చక్కెరగా మారి, యూరప్‌కు చేరుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. 
 
 ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారమే 2010 నాటికి కంబోడియాలోని 61 పెద్ద ప్లాంటేషన్లకు లక్ష హెక్టార్ల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఫలితంగా దాదాపు 7 లక్షల కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయి. నేతల, అధికారుల అండదండలతో విస్తరిస్తున్న చిన్న ప్లాంటేషన్లకు లెక్క లేదు. ప్రసుత్తం మధ్య కంబోడియాలోని కోమ్‌పాంగ్ స్ప్యూ రాష్ట్రంలోని పది గ్రామాల్లో చెరకు ప్లాంటేషన్ల వల్ల వీధినపడ్డ వెయ్యి కుటుంబాలు తమ భూముల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు.
 
  ఈ రైతాంగ అసంతృప్తే ఎన్నికల్లో ప్రతిఫలించింది. అందుకే భవిష్యత్తుపట్ల రెండు ప్రధాన పార్టీలకు బెంగ. రైతుల వద్ద భూ యాజమాన్యాన్ని రుజువుచే సే పత్రాలు లేవని, కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఎలాంటి చర్యలు తేసుకోలేమని ప్రభుత్వం సెలవిస్తోంది. ప్లాంటేషన్లకు భూములపై 99 ఏళ్ల హక్కులను దఖలు పరుస్తున్న ప్రభుత్వం ఏక పంటగా చెరకును దశాబ్దాలపాటు సాగుచేయడానికి అంగీకరిస్తోంది. భూసారం నశించిపోవడంతోపాటూ ఇది పర్యావరణానికి తీవ్ర హానిని చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2005 నుంచి విదేశాల్లో ప్రవాసంలో ఉండి దేశానికి తిరిగి వచ్చిన సీఎన్‌ఆర్‌పీ నేత శామ్ రైన్సీ సైతం ఈ ‘అభివృద్ధి’కి అనుకూలురే. కాబట్టి సీఎన్‌ఆర్‌పీ, సీపీపీల మధ్య అధికార పంపకం చర్చలు ఫలించినా ఫలించకున్నా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement