దుబ్బాక రూరల్: చేనేత కార్మికుల రుణ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ర్ట కార్యదర్శి జి.భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రుణ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కొరుతూ దుబ్బాక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన పనికి కూలి సరిపోక పోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలీచాలని వేతనాలతో రుణాలు చెల్లించలేక పోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చేనేత కార్మికులకు డబుల్‌బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలగించిన అంత్యోదయ కార్డులను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు నర్సింలు, బాల్‌రాజ్, సత్యనారాయణ, జి.బాల్‌రాజ్, విఠల్, జనార్ధన్, రఘుపతి, శశిరేఖ, సుశీల, మంజుల, సరస్వతి, నీలవ్వ తదితరులు పాల్గొన్నారు.