తమ కులాలకు ప్రాధాన్యత లేకపోవడంపై ఆ వర్గంలో అసహనం
మంత్రి పదవి సైతం ఇవ్వకపోవడంపై రుసరుస
ఇప్పటికే మంగళగిరిలో 18 సంఘాలతో తొలి సమావేశం
వచ్చేనెల 2న గన్నవరంలో మరోసారి భేటీ
రాష్ట్రస్థాయిలో భారీ సభ నిర్వహణపై అప్పుడు నిర్ణయం
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపుతున్న చేనేత రంగం తన ఉనికిని చాటుకునేందుకు శంఖారావం పూరిస్తోంది. తమ వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో పోరుబాట పడుతోంది. రాజకీయంగా తమకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. చేనేత కులాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సాధించేందుకు ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నడుం బిగించింది. రాజకీయంగా బలపడేందుకు.. అసెంబ్లీ స్థానాల్లో తమ వాటా కోసం రాష్ట్రంలోని చేనేత కులాలను ఫెడరేషన్ ఏకం చేస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 18 చేనేత కులాలు..
దేశంలో చేనేత వృత్తి పైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీర క్షత్రియ, స్వకులశాలి, కుర్తీన సెట్టి (కుర్తి) (నెస్సీ), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాల భక్తులు, సాధనా సూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ వంటి 18 చేనేత కులాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో చాలావరకు అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి.
ఇక అధికారిక, అనధికార లెక్కల ప్రకారం ఏపీలో దాదాపు 10లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఓ అంచనా. అలాగే, ఈ వర్గం తరఫున అసెంబ్లీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు.
చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు, ముడిసరుకుల ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్సిడీలు, ఇతర సౌకర్యాలు, వంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని ‘చేనేత’ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వారు శంఖారావం పూరించనున్నారు.
ఒకే వేదికపైకి చేనేత కులాలు..
ఇక దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ తమ సమస్యల సాధన కోసం అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల 18 కులాలలోని ముఖ్యులు సమావేశమయ్యారు. ఇందులో చేనేత వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఆయా కులాల పెద్దలు పాల్గొన్నారు.
రాజకీయంగా తమకు రావాల్సిన వాటాను రాబట్టుకోవాలని.. రాష్ట్రంలోని చేనేత కులాలతోపాటు, చేనేత సంఘాలను కూడా కలుపుకుపోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలు ఉన్నందున రాష్ట్రస్థాయిలో భారీఎత్తున చేనేత శంఖారావం సభ నిర్వహించాలని సంకల్పించారు.
ఈ విషయమై ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరంలో చేనేత కులాలకు చెందిన పలువురు ముఖ్యులు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో శంఖారావంపై నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment