Weavers
-
చేనేత శంఖారావానికి సన్నాహాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపుతున్న చేనేత రంగం తన ఉనికిని చాటుకునేందుకు శంఖారావం పూరిస్తోంది. తమ వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో పోరుబాట పడుతోంది. రాజకీయంగా తమకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చేనేత కులాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సాధించేందుకు ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నడుం బిగించింది. రాజకీయంగా బలపడేందుకు.. అసెంబ్లీ స్థానాల్లో తమ వాటా కోసం రాష్ట్రంలోని చేనేత కులాలను ఫెడరేషన్ ఏకం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 18 చేనేత కులాలు..దేశంలో చేనేత వృత్తి పైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీర క్షత్రియ, స్వకులశాలి, కుర్తీన సెట్టి (కుర్తి) (నెస్సీ), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాల భక్తులు, సాధనా సూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ వంటి 18 చేనేత కులాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో చాలావరకు అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. ఇక అధికారిక, అనధికార లెక్కల ప్రకారం ఏపీలో దాదాపు 10లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఓ అంచనా. అలాగే, ఈ వర్గం తరఫున అసెంబ్లీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు, ముడిసరుకుల ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్సిడీలు, ఇతర సౌకర్యాలు, వంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని ‘చేనేత’ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వారు శంఖారావం పూరించనున్నారు.ఒకే వేదికపైకి చేనేత కులాలు..ఇక దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ తమ సమస్యల సాధన కోసం అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల 18 కులాలలోని ముఖ్యులు సమావేశమయ్యారు. ఇందులో చేనేత వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఆయా కులాల పెద్దలు పాల్గొన్నారు. రాజకీయంగా తమకు రావాల్సిన వాటాను రాబట్టుకోవాలని.. రాష్ట్రంలోని చేనేత కులాలతోపాటు, చేనేత సంఘాలను కూడా కలుపుకుపోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలు ఉన్నందున రాష్ట్రస్థాయిలో భారీఎత్తున చేనేత శంఖారావం సభ నిర్వహించాలని సంకల్పించారు. ఈ విషయమై ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరంలో చేనేత కులాలకు చెందిన పలువురు ముఖ్యులు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో శంఖారావంపై నిర్ణయం తీసుకోనున్నారు. -
సీఎం జగన్‌కు నేతన్నల సంఘీభావం.. ధర్మవరంలో భారీ ర్యాలీ
సాక్షి, సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతన్నల సంఘీభావం తెలిపారు. ఈ మేరకు చేనేత కార్మికులు ధర్మవరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రతి ఏటా నేతన్న నేస్తం పేరుతో సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతన్న నేస్తం పథకాన్ని స్వాగతిస్తూ లబ్దిదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి శివానగర్ దాకా సాగిన ర్యాలీలో.. జై జగన్ అంటూ ధర్మవరం చేనేత కార్మికులు నినాదాలు చేశారు. -
Saraswati Kavula: చేనేతకు చేరువలో..
చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు. ‘‘ప్రభుత్వాలు పవర్లూమ్నే ప్రమోట్ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్ చాలా దెబ్బతిన్నారు. సేల్స్ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి. ► దిగులును చూశాను.. మొదట్లో రూరల్ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు. ► అన్ని చేనేతలు ఒక దగ్గర ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్ వీవర్స్, కో ఆపరేటివ్ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్ వీవర్స్ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు. వరంగల్ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్కల్ వీవింగ్, సిద్ధిపేట్ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి. ► రైతుగానూ.. మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి. మద్దతు ముఖ్యం క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్ లభిస్తాయి అని. దీనికి డిజిటల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం. – నిర్మలారెడ్డి -
పరిశ్రమకు ‘ప్రోత్సాహం’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రా మికాభివృద్ధి ప్రోత్సాహకాల కు పెద్దపీట వేస్తూ పారిశ్రా మిక రంగానికి 2023–24 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత (2022–23) బడ్జెట్‌తో పోలిస్తే రూ.817 కోట్లు అదనంగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.254.77 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ అవసరాల కోసం రూ.2,235.29 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఎస్సీ అభివృద్ధి నిధి నుంచి రూ.834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ధి నిధి నుంచి రూ.717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2,937.20 కోట్లు (సుమారు 72 శాతం) కేటాయించారు. విద్యుత్ సబ్సిడీకి రూ.316.39 కోట్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ రూ.266.20 కోట్లు ప్రతిపాదించారు. నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టీఎస్ఎండీసీ వెచ్చిస్తున్న ఖర్చులను తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వాణిజ్యం, ఎగుమతులు, చెరుకు, గనులు, భూగర్భ వనరులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్ లిప్కో తదితరాలకు నామమాత్ర కేటాయింపులే దక్కాయి. ఐటీ రంగానికి రూ.366 కోట్లు ఐటీ రంగానికి నిర్వహణ, ప్రగతి పద్దులను కలుపుకుని రూ.366 కోట్లను తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ప్రగతిపద్దు కింద రూ.6 కోట్ల మేర స్వల్ప పెంపుదల కనిపించింది. టీ హబ్ ఫౌండేషన్‌కు రూ.177.61 కోట్లు, వీ హబ్‌కు రూ.7.95 కోట్లు కేటాయించింది. ఓఎఫ్సీ టెక్నాలజీతో అన్ని మండలాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో సమావేశ సదుపాయాల కోసం రూ.18.14 కోట్లు కేటాయించారు. స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌కు రూ.8.88 కోట్లు, టీ ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు కేటాయించింది. -
దుబ్బాక లినెన్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నేతన్న ప్రతిభకు గుర్తింపు లభించింది. దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీర జాతీయస్థాయిలో మెరిసింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ దేశంలోని వారసత్వ సంపదలను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర టెక్స్టైల్స్ శాఖ విరాసత్ పేరిట ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 17 వరకు చేనేత చీరల ప్రదర్శన చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసిన 75 రకాల చీరలను ఈ ప్రదర్శనకు ఎంపిక చేయగా, ఇందులో దుబ్బాక చీరకు స్థానం దక్కింది. చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్, చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు కృషిచేస్తున్న బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలో కార్మికులు ఈ లినెన్ కాటన్ చీరను నేయడం విశేషం. దేశంలోనే గుర్తింపు పొందిన దుబ్బాక చేనేత పరిశ్రమపై క్రమేణా నిర్లక్ష్యం అలుముకుంటోంది. ఈ క్రమంలో విరాసత్ చీరల ప్రదర్శనకు ఎంపిక కావడంతో మళ్లీ దేశవ్యాప్తంగా దుబ్బాకకు గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో దుబ్బాక చేనేతలకు గుర్తింపు దక్కడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాసత్ ప్రదర్శనకు దుబ్బాక లినెన్ కాటన్ చీర ఎంపిక కావడం చాలసంతోషంగా ఉంది. టై అండ్ డై విధానంతో ఇక్కత్ చీరలను తయారు చేయడం ఎక్కడ సాధ్యపడలేదని, కేవలం దుబ్బాకలోనే తయారు కావడం ఆనందంగా ఉంది’అని బోడ శ్రీనివాస్ అన్నారు. -
సిరిసిల్ల నేతన్నలు అదుర్స్: అమెరికా రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు
సాక్షి, సిరిసిల్ల: అగ్గిపెట్టలో పట్టే చీర నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అక్కడి నేతన్నలపై ప్రశంసలు కురిపించారు అమెరికా చేనేత నైపుణ్య నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జాఫ్. నేతన్నల కళానైపుణ్యాలను చూసి అబ్బురపడిపోయారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియాలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నేతన్నల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా.. శనివారం సిరిసిల్లలో పర్యటించారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని అక్కడి నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆమె నేతన్నలతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల మగ్గాలు, వారు నేస్తున్న బట్టలు, చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపైనా ఆమె వివరాలు తీసుకున్నారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలిశారు కైరా జాఫ్. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు పవర్ లూమ్ క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి వైపు సాగుతుండడంపైన ఆమె ఆసక్తి చూపారు. కైరా బృందం వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక టెక్స్టైల్ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను, పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు. చేనేత కార్మిక క్షేత్రాల్లో పర్యటన.. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి చేనేత పరిశ్రమపైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత్‌కు వచ్చారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ సహా ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు -
నేతన్నలకు కేంద్రం చావు దెబ్బ.. మంత్రి కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: నేత కార్మికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చేయూత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చావు దెబ్బ కొడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అంతేస్థాయిలో పరిపుష్టి కలిగిన చేనేత రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాపోలుతోపాటు మరికొందరు నేతలకు కేటీఆర్ పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో చేనేత రంగానికి ప్రత్యేక పాలసీ ఏదీ లేదని, పత్తి సాగు ఎక్కువగా ఉన్న భారత్‌లో చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నా ప్రోత్సాహం కరువైందని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 34 శాతం వ్రస్తోత్పత్తి చైనాలో జరుగుతుండగా, భారత్ మాత్రం పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక కంటే వెనుకంజలో ఉందన్నారు. తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు సూరత్, ముంబై, భివండి వంటి ప్రాంతాల్లో అత్యంత నైపుణ్యంతో వస్త్రోత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్నారని చెప్పారు. వారిని సొంత రాష్ట్రానికి రప్పించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కాకతీయ టెక్స్టైల్ పార్క్, సిరిసిల్ల అపారెల్ పార్క్, మెగా పవర్లూమ్ క్లస్టర్ వంటి అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సాయం కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదని పేర్కొన్నారు. పన్ను విధించిన ఘనత మోదీదే... ఎనిమిదేళ్ల కాలంలో నేత కార్మికులకు ఉద్దేశించిన 8 పథకాలను కేంద్రం రద్దు చేసిందని కేటీఆర్ విమర్శించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో చేనేత పరిశ్రమ కీలకపాత్ర పోషించగా, ఈ రంగంపై 5 శాతం పన్ను విధించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేత రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకంతోపాటు అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. చేనేత కార్మికుల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న రాపోలు ఆనంద్ భాస్కర్ సేవలు బీఆర్ఎస్ విస్తరణలో ఉపయోగించుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భూగర్భాన్ని నదీ జల గర్భంగా మార్చిన గొప్ప నేత కేసీఆర్ అని రాపోలు ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, బీజేపీ తనకు గుర్తింపు ఇవ్వకుండా హింసకు గురిచేసిందని వాపోయారు. జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆవిర్భవిస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
తిరుపతి వెంకన్నకు.. గద్వాల ఏరువాడ జోడు పంచెలు
సాక్షి, గద్వాల: గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ నిష్ఠలతో నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతుంది. నాటి నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెల నేత ఇటీవల పూర్తయింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ లేఖను తీసుకొని పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కర్ణాకర్ తిరుపతికి బయలుదేరారు. అక్కడ ఏరువాడ జోడు పంచెలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులుగా నిష్ఠతో శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను తయారు చేశారు. మూలవిరాట్‌కు ధరింపజేసే ఏరువాడ జోడు పంచెలు వారసత్వంగా సమర్పణ.. శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశులు తమ వంశపెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీవేంకటేశ్వరునికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వరునికి ఉత్సవాల మొదటిరోజు, విజయ దశమి రోజున ఈ ఏరువాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరునికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి శ్రీవారికి అందుతున్న ఏకైక కానుక ఏరువాడ జోడు పంచెలు కావడం విశేషం. ఎనిమిది కోటకొమ్ములు.. ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచు ఉంటుంది. శ్రీవారికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను లింగంబాగ్ కాలనీలో ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యేక భక్తిశ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను సిద్ధం చేశారు. ఏరువాడ పంచెల తయారీలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, కరుణాకర్, రమేష్ పాల్గొన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.. తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గత 12 ఏళ్లుగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నాం. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జోడు పంచెలను రెండు రోజుల క్రితం టీటీడీ అధికారులకు అందజేశాం. – మహంకాళి కర్ణాకర్, జోడు పంచెల తయారీదారు -
YSRCP: గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు
సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన జారీ చేసింది. చదవండి: (కట్టని రాజధాని గురించి ఉద్యమాలా?: సీఎం జగన్) -
చేనేతల కళత: ఇక్కత్ ఇక్కట్లు.. గొల్లభామ గొల్లు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి తరతరాల వృత్తిపై మమకారం.. వదులుకోలేని, కొనసాగించలేని దైన్యం. మూరెడు బట్ట నేసినా.. జానెడు పొట్ట నిండని దౌర్భాగ్యం. అరకొర సాయం మినహా ప్రఖ్యాతిగాంచిన కళలు బతికి ‘బట్ట’ కట్టేలా కొరవడిన ప్రోత్సాహం..వెరసి చేనేత మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరు తరాలుగా వస్తోన్న అరుదైన చేనేత రంగుల కళ, కళ్ల ముందే చెదిరిపోతోంది. తెలంగాణాలో రెండు దశాబ్దాల క్రితం లక్ష మగ్గాలపై పడుగూ, పేకలతో అద్భుతాలు సృష్టించి అబ్బుర పరిచిన నేతన్నల సంఖ్య ఇప్పుడు ఇరవై రెండువేలకు పడిపోయిందంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. మార్కెట్‌తో పోటీ పడే స్థితి లేక, నేసిన బట్టకు ధర గిట్టుబాటు కాక ఇతర ఉపాధి అవకాశాలను చూసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరు, ఇద్దరు తప్ప కొత్త తరం ఈ వృత్తి వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో చేనేతకు సంబంధించి ఇదే చివరి తరం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యం ఉన్నా.. చేయూత సరిపోక యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లాల్లో చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో గుప్పిట్లో పట్టే చీరలను సైతం నేసి ఔరా అనిపించారు. నూలు దారాలకు రబ్బర్ ట్యూబ్‌ను బిగించి (టై), సహజ రంగులద్ది (డై) మగ్గాలపై 3,384 పోగుల పడుగు (పొడవు), 17,000 పోగుల పేక (వెడల్పు)తో నేసిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీర ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. తలపై పాలకుండతో వయ్యారి నడకలకు తమ పోగులతో ప్రాణం పోసి గొల్లభామ బ్రాండ్‌తో మార్కెట్లో మగువలను ఆకట్టుకుంది సిద్దిపేట నేతన్న కళ. దశాబ్దాల క్రితమే అంతరించిన పీతాంబరి పట్టుకు సైతం సిద్దిపేట కళాకారులు మళ్లీ ప్రాణం పోశారు. జకాడ మగ్గంపై వెండి జరీ ఉపయోగించి నేయటం పీతాంబరం ప్రత్యేకత. చీర అంచులు, డిజైన్లకు ప్రత్యేక పోగులను వాడుతారు. ఈ చీర ధర రూ.30 నుండి రూ.40 వేల వరకు ఉంటుంది. చేనేత కళాకారులు తమ మేథోసంపత్తితో రూపొందిస్తున్న ఇలాంటి చీరల డిజైన్లకు.. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయలేని వైఫల్యంతో, కొందరు వారం వ్యవధిలో నకళ్లు తయారు చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రింట్ చేసి చేనేత బ్రాండ్‌గా తక్కువ ధరలతో మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ ప్రింటెడ్ చీరలతో పోటీ పడలేక నేత చీర చతికిల పడుతోంది. దీనికి తోడు పోటీ ప్రపంచంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించే శక్తి, సామర్థ్యాలు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లకు ఉండటం లేదు. మరోవైపు తమదైన శైలిలో రూపొందించిన వస్త్రాలను మార్కెట్ చేసుకోవటంలో వారు విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు కార్మికులకు పొదుపు, భద్రతా పథకం అమలు చేస్తూ రసాయనాలపై సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పోటీని తట్టుకునేలా పాతవారితో పాటు కొత్త తరం వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, అంతరించే పోయే పరిస్థితుల్లో ఉన్న కళలను కాపాడేలా అనేక రూపాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింకర్తవ్యం ఏమిటి? ►ఐదేళ్లుగా ఎన్నికలు లేని, ఐదు మాసాలుగా కొనుగోళ్లు చేయని చేనేత సహకార సంఘాలన్నింటిలో కార్యాచరణ ప్రారంభించి రాజకీయాలకు సంబంధం లేకుండా మగ్గం నేసే వారికి సభ్యత్వం ఇవ్వాలి. సహకార సంఘాలకు కార్పొరేట్ హంగులద్ది ప్రతి నెలా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలి ►మాస్టర్ వీవర్లకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్యాకేజీలు ప్రకటించాలి. పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ►నూలు, రంగులు, రసాయనాలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని పెంచాలి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో చేనేత షోరూమ్‌లను తప్పనిసరి చేయాలి. ►ఇళ్లల్లో మగ్గం నేసే కార్మికులకు గృహ విద్యుత్ వినియోగంలో సబ్సిడీ ఇవ్వాలి. చేనేత బీమా వయో పరిమితి పెంచాలి. ►చేనేత వస్త్ర ఉత్పత్తులన్నింటిపై నకిలీకి తావులేకుండా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రించాలి. 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ►ప్రస్తుతం చేష్టలుడిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేసి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►అన్ని రకాల చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మంచిదని, తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. ►ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకల్లో చేనేత పట్టుచీర, ధోవతిని చేర్చాలి. బతుకమ్మ చీరల్లోనూ కొంత వాటా చేనేతకు కేటాయించాలి. రిజర్వేషన్ చట్టం ఏం చెబుతోంది చేనేత రిజర్వేన్ చట్టం 1985 ప్రకారం.. 11 రకాల ఉత్పత్తులు..అంటే కాటన్.. పట్టు చీరలు, ధోతి, టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్స్, జంపఖానాలు, డ్రెస్ మెటీరియల్, బ్యారక్ బ్లాంకెట్స్, ఉన్ని శాలువలు, మఫ్లర్లు, చద్దర్లు పూర్తిగా చేనేత (కొన్ని మినహాయింపులతో) ద్వారానే ఉత్పత్తి చేయాలి. పవర్‌లూమ్స్ నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తి, విక్రయాలు చేస్తే.. క్రిమినల్ చర్యలు చేపట్టి జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించవచ్చు. సంఘం సామగ్రి, పని ఇవ్వడం లేదు నేను చేనేత సహకార సంఘంలో ఎప్పటి నుండో సభ్యుడిని. కానీ సంఘం.. సామగ్రి, పని ఇవ్వడం లేదు. నాకు నేత తప్ప మరో పని రాదు. అందుకే ఓ మాస్టర్ వీవర్ వద్ద కూలీ పని చేస్తున్న. పోచంపల్లి నేత ఖ్యాతి క్రమంగా మసకబారుతోంది. కొత్తతరం రావడం లేదు. కళ్ల ముందే అరుదైన కళ కనుమరుగవుతుంటే బాధగా ఉంది. –చిట్టి ఐలయ్య, నేత కార్మికుడు, పోచంపల్లి తక్షణ కార్యాచరణ అవసరం చేనేత ఒక వృత్తి కాదు నాగరికత. అందులో పోచంపల్లి చేనేత కళ దేశంలోనే మరీ ప్రత్యేకమైనది. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకుంటే అతి త్వరలో చేనేత కళ కనుమరుగు కావడం ఖాయం. ముందు తరాలకు అందించడం, మన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయాలంటే తక్షణ కార్యాచరణ అవసరం. కొత్త టెక్నాలజీ, డిజైన్లు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వాలి. మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. – చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త ఇదే చివరి తరం అనుకుంటున్న చేనేత మాతోనే అంతం అయ్యేలా ఉంది. కొత్త తరం రాకపోతే గొప్ప కళను సమాజం కోల్పోతుంది. పొద్దంతా చీర నేస్తే రోజుకు రూ.200 నుంచి రూ.220 కూలీయే లభిస్తోంది. ఏదైనా షాప్‌లో పనికి వెళ్తే కనీసం రోజుకు రూ 300 ఇస్తున్నారు. నేను 53 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. వేరే పనికి వెళ్లలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న. నాకు ఇప్పుడు 65 ఏళ్లు.. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత బీమా వర్తించడం లేదు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అమలు చేయాలి. – గంజి లింగం, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట పీతాంబరానికి ‘ప్రాణం’ పోశారు తుమ్మ గాలయ్య సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికుడు. అధికారులు చెప్పారని కనుమరుగైన పీతాంబరం పట్టు చీరకు పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేశాడు. ఇతర నేత కార్మికులతో కలిసి అనేక వ్యయ ప్రయాసలతో 270 వరకు పీతాంబరం పట్టు చీరలు నేశాడు. ప్రభుత్వం, టీఎస్సీఓ 60 చీరలను కొనుగోలు చేయగా మరో 60 వరకు చీరలు ప్రైవేటులో విక్రయించాడు. అయితే తగిన ప్రచారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో చీరలు అమ్మలేకపోయాడు. ఇంకా 150 చీరల వరకు స్టాక్ ఉంది. భారీ పెట్టుబడితో నేసిన వస్త్రాల నిల్వ చూస్తుంటే నిద్ర పట్టడం లేదని, ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోలు చేయకపోతే, భవిష్యత్తులో పీతాంబరం వెరైటీని తీసుకురాలేమని అంటున్నాడు. – తుమ్మ గాలయ్య, చేనేత కార్మికుడు, సిద్దిపేట పోచంపల్లికి.. కొత్త హంగులద్దాలని ఉంది ప్రపంచ ఖ్యాతి ఉన్న పోచంపల్లి చేనేతకు కొత్తహంగులు అద్దాలని ఉంది. అనేక ఉన్నత ఉద్యోగాలను వదులుకుని చేనేత పనినే ఎంచుకున్నా. సొంత ఖర్చులతో అనేక ప్రయోగాలు, కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్ చేస్తున్నా. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి చేనేతను బతికించే ప్రతిపాదన ఇచ్చా.. ఏమవుతుందో చూడాలి. –సాయిని భరత్, పీహెచ్డీ స్కాలర్, పోచంపల్లి నావంతుగా.. నా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకలతో పాటు నా వంతుగా వధూవరులకు పోచంపల్లి చేనేత పట్టుచీర, జాకెట్, పంచె, టవల్ సొంత ఖర్చులతో ఇస్తున్నా. నేతన్నను ప్రోత్సహించే దిశగా నా వంతు ప్రయత్నం ఇది. – పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
AP: ఆప్కోలో అద్భుతమైన డిజైన్లతో వస్త్రాలు
సాక్షి, అమరావతి: వస్త్ర ప్రేమికులకు అత్యాధునిక డిజైన్లతో కూడిన మరింత నాణ్యమైన వ్రస్తాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కో సంస్థ ‘కన్సైన్మెంట్’ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకోసం పేరెన్నికగన్న చేనేత వ్రస్తాలను ఉత్పత్తి చేస్తున్న 50 సొసైటీలకు ఆప్కో షోరూమ్‌లలో చోటు కేటాయించనుంది. ఈ నెల 18న ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రయోగాత్మకంగా విజయవాడ పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులోని ఆప్కో మెగా షోరూంలో అమలులోకి తీసుకురానుంది. చదవండి: పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్ చేనేతలో బ్రాండ్‌గా గుర్తింపు పొందిన చీరలు, అత్యాధునిక వస్త్రాలను తొలి దశలో అందుబాటులోకి తెస్తారు. ఉప్పాడ, చీరాల కుప్పటం పట్టు, మంగళగిరి చేనేత, వెంకటగిరి శారీ, ధర్మవరం జరీ బుటా తదితర ఫ్యాన్సీ చీరలతో పాటు పెడన కలంకారీ, పొందూరు ఖద్దరు వ్రస్తాలను కూడా ఆప్కో విక్రయించనుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను కూడా విక్రయించనుంది. నూతన డిజైన్ వ్రస్తాలకు మర్కెట్లో డిమాండ్ వచ్చేలా ప్రతి నెలా ‘వస్త్ర ప్రదర్శన(పాప్ ఆప్ షో)’ నిర్వహించనుంది. నేతన్నకు ఎంతో మేలు.. ‘కన్సైన్మెంట్’ విధానంతో నేతన్నకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు నేతన్నలు అత్యాధునిక డిజైన్లు, ఖరీదైన వ్రస్తాలను ప్రైవేటు క్లాత్ షోరూమ్‌లకే విక్రయించేవారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు వాటిని అమ్మిన తర్వాతే డబ్బులు ఇచ్చేవారు. ఆప్కో ద్వారా అమ్మితే ఏ నెల డబ్బు ఆ నెలలోనే చెల్లిస్తుంది. చేనేత సొసైటీల ప్రతినిధుల సమక్షంలోనే విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటుంది. చేనేతకు ఊతమిచ్చేలా చర్యలు రాష్ట్రంలో చేనేత రంగానికి మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారు. ఏటా ‘నేతన్న నేస్తం’ అందిస్తున్నారు. సీఎం జగన్ స్ఫూర్తితో ఆప్కో ద్వారా కన్సైన్మెంట్ విధానం అమల్లోకి తెచ్చి చేనేత రంగానికి మరింత ఊతమిచ్చే చర్యలు చేపట్టాం. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి 50 చేనేత సొసైటీల ఉత్పత్తులను విక్రయిస్తాం. ఆ సొసైటీల ప్రతినిధులనే సేల్స్‌మెన్‌గా నియమించుకునే అవకాశం కల్పిస్తాం. బిల్లులను ఏ నెలకు ఆ నెల చెల్లించేలా పటిష్ట వ్యవస్థను తెస్తాం. తద్వారా చేనేత వ్రస్తాల ఉత్పత్తి పెరిగి.. ఆ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. లాభాపేక్ష లేకుండా ఆప్కో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. – చిల్లపల్లి మోహనరావు, ఆప్కో చైర్మన్ -
టై అండ్ డైలో ఇది ‘ఆంధ్రా పోచంపల్లి’
‘పోచంపల్లి’ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే... టై అండ్ డై శారీస్, డ్రెస్ మెటీరియల్ అమ్మకానికి సంబంధించి ముప్పై లక్షలకు పైగా రిజల్ట్స్ వస్తాయి! తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయిదు వేలలోపు జనాభా గల పోచంపల్లి నేడు టై అండ్ డై (ఇక్కత్) చేనేత, పట్టు వస్త్రాలకు ప్రపంచ రాజధాని. పోచంపల్లి టై అండ్ డైకి దాదాపు నూరేళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ, 2005 నుంచి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇందుకు ముఖ్య కారణం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో పోచంపల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభించడం. ఈ గుర్తింపు ద్వారా ఈ వస్త్రాల తయారీ ప్రత్యేకతలకు మేధాపర మైన – చట్టబద్ధమైన హక్కులు లభించాయి. ఈ క్రమంలో పోచంపల్లిని యునైటెడ్ నేషన్స్ సంస్థ యూఎన్‌డబ్ల్యూటీఓ ‘పర్యాటకులు దర్శించదగిన గ్రామం’గా గుర్తించింది. కానీ ‘కొత్తూరు’ అని సెర్చ్ చేస్తే దాదాపు రిజల్ట్స్ నిల్! నిజానికి పోచంపల్లి వృక్షమైతే, కొత్తూరు అదే వృక్షపు బీజం! పల్నాడు జిల్లా, మాచర్ల రూరల్ మండలం, కొత్తూరు గ్రామం కేంద్రంగా టై అండ్ డై శారీస్, డ్రెస్ మెటీరియల్ వస్త్రాలను నేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో టై అండ్ డై వస్త్రాలు రూపొందుతున్నది కొత్తూరులోనే!! సాధారణ చేనేత వస్త్రాలు, మిల్లు వస్త్రాలు తయారైన తదుపరి... వస్త్రాలపై రంగులు అద్దుతారు. అవి పై పై రంగులు. టై అండ్ డై విధానంలో వస్త్రం తయారీ పూర్వదశలోనే నూలు దారాలు వర్ణమయమవుతాయి. ముందుగా రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా రంగులు అవసరం లేని చోట్ల రబ్బరుతో కట్టి(టై), అవసరమైన చోట్ల రంగులో ముంచుతారు (డై). రంగులలో రసాయనాల శాతం తక్కువ. నూలు దారాల దశలోనే ఈ వస్త్రానికి సహజత్వం, మృదుత్వం, మన్నిక చేకూరుతాయి. మిల్లు యంత్రాలు టై అండ్ డైతో పోటీ పడలేవు. డిజైన్లను వినియోగదారుల అభిరుచిని బట్టి రూపొందిస్తారు. కనీస ధర పదివేల రూపాయలు. లక్ష రూపాయలు పలికే హుందాగా ఉండే టై అండ్ డై చీరలు ధరించడం వీఐపీలకు ఒక స్టేటస్ సింబల్. మైక్రోసాఫ్ట్, ఎయిర్ ఇండియా తదితర సంస్థలు తమ ఉద్యోగులకు ఈ వస్త్రాలను అధికారికంగా వాడుతూ ప్రోత్సహిస్తున్నాయి. జపాన్, యూఏఈ తదితర దేశాలు డ్రెస్ మెటీరియల్, కర్టెన్లు, బెడ్షీట్లు దిగుమతి చేసుకుంటున్నాయి. నూటికి నూరు శాతం డిమాండ్ ఉన్న పోచంపల్లి టై అండ్ డై విదేశీ మారక ద్రవ్యం, జీఎస్టీ సమకూర్చడంలో అగ్రగామిగా ఉంది. పోచంపల్లి వాస్తవానికి ఒక బ్రాండ్ ఇమేజ్. పోచంపల్లి బ్రాండ్ పేరుతో ఏటా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్న టై అండ్ డై వస్త్రాలలో... పోచంపల్లి గ్రామంలో తయారయ్యే వస్త్రాలు అయిదు శాతం మాత్రమే! పుట్టపాక, గట్టుప్పల్, చండూరు, సిరిపురం, వెల్లంకి, కొయ్యలగూడెం తదితర పాత నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన గ్రామాలలో 75 శాతం తయారవుతాయి. మిగిలిన ఇరవై శాతం ‘ది నాగార్జున వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ కొత్తూరు’ ఆధ్వర్యంలో తయారవుతాయి. సాధారణ చేనేత వస్త్రకారుని నెలసరి రమారమి ఆదాయం అయిదు వేల రూపాయల కంటే తక్కువ. తెలంగాణలో పోచంపల్లి బ్రాండ్ వస్త్రకారుల ఆదాయం నెలకు రూ. 30 వేలు. అదే వస్త్రాన్ని కొత్తూరు కేంద్రంగా నేస్తున్న వస్త్రకారునికి నెలకు వచ్చే ఆదాయం పదివేల రూపాయలు మాత్రమే! దీనికి కారణం కొత్తూరు వస్త్రాలకు బ్రాండ్ ఇమేజ్ లేకపోవడమే! కొత్తూరు సొసైటీ పరిధిలోని గ్రామాల టై అండ్ డై నేతకారులు పోచంపల్లి, పుట్టపాక తదితర గ్రామాలకు వెళ్లి ముడి నూలును, సిల్క్‌ను కొనాలి. లేదా అక్కడ నుంచి ముడి నూలు తెచ్చిన వారి కోసం ఇక్కడ టై అండ్ డై చేసి, నేసి, అక్కడికి వెళ్లి ఇవ్వాలి. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న పోచంపల్లి సహకార సంస్థల వారు, విడిగా వ్యాపార సంస్థలకు చెందిన వారు బెంగళూరు నుంచి డైరెక్టుగా సిల్క్ ముడి సరుకు తెప్పించుకుంటారు. పరిసర గ్రామాలకు నూలు ఇచ్చి తయారైన వస్త్రాన్ని వారే తీసుకెళ్లి దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసుకుంటారు. పోచంపల్లి వ్యవస్థీకృతం అయింది. ఇటీవలి కాలంలో కొత్తూరు చేనేత వస్త్రకారులతో రెంటచింతల, దాచేపల్లి, మాచవరం తదితర గ్రామాల చేనేత వస్త్రకారులకు రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ విభాగం అధికారులు టై అండ్ డై శిక్షణ కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. కానీ వసతుల లేమి వల్ల ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని ఇక్కడి నేతకార్మికులు కోరుకుంటున్నారు. కొత్తూరు శ్రీ నాగార్జున చేనేత సహకార సంఘం కాలనీకి విశాలమైన స్థలం ఉంది. ఇక్కడ అన్ని వాతావరణాలను తట్టుకునే రీతిలో, శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి. ఏడాది పొడవునా, పగలూ రాత్రీ టై అండ్ డై నేర్పే రీతిలో కనీసం 20 మగ్గాలతో ట్రైనింగ్ హాల్ నిర్మించాలి. తదనుగుణంగా నివాస వసతులు, రంగులు వేసుకునే గదులు నిర్మించాలి. నూలును బెంగళూరు నుంచి ఖరీదు చేసి నిల్వ ఉంచాలి. ముడిపదార్థాలు తెచ్చేందుకు, సమీప గ్రామాల్లో వస్త్రకారులకు అందజేసేందుకు, తయారైన వస్త్రాలను గుంటూరు – విజయవాడ, గన్నవరం విమానాశ్రయం, తదితర మార్కెటింగ్‌కు అనువైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తగిన వాహన సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా సృజనాత్మకత కలిగిన ఆకట్టుకునే డిజైన్లు రూపొందించే చేనేత సామాజిక వర్గానికి చెందిన టై అండ్ డై గురించి అవగాహన కలిగిన ఆధునిక యువతకు అవకాశాలు కల్పించాలి. హ్యాండ్లూమ్ వీవర్స్ కోసం ముద్ర లోన్స్‌ను, ఆన్లైన్ పోర్టల్ ద్వారా సబ్సిడీతో ఇప్పించేందుకు అధికా రులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోచంపల్లి జీఐ సాధించింది. ప్రస్తుతం వారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘నేనున్నాను’ అనే వారి మాట కోసం కొత్తూరు ఎదురు చూస్తోంది! (క్లిక్: గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ -
Sircilla Weavers: అంచు చీరలే ఆ‘దారం’
► సాంచాలపై కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న ఇతను వేముల వెంకట్రాజం. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆయన మూడో తరగతి చదువుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే చేనేత మగ్గాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఆరు పదుల వయసులో కాటన్ జరీ అంచు చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం రెండు సాంచాలపై చీరలను నేస్తూ.. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదిస్తున్నారు. ► ఈయన సబ్బని నరేందర్. సిరిసిల్ల శివనగర్‌కు చెందిన ఇతను డిగ్రీ చదివారు. అందరిలా పవర్‌లూమ్స్(సాంచాల)పై పాలిస్టర్ బట్టను, బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయకుండా సొంతంగా కాటన్ చీరలపై దృష్టి పెట్టారు. తనకున్న ఇరవై సాంచాలపై ఇదే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి పని కల్పిస్తున్నారు. నవ్యమైన, నాణ్యమైన కాటన్ చీరల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ చీరలకు సొంతంగానే మార్కెటింగ్ చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరిసిల్ల: సిరిసిల్లలో ఇలా సొంతంగా వస్త్రం ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న వారు ఒక్కరిద్దరు కాదు.. సుమారు 300 సాంచాలపై 150 మంది కార్మికులు, 25 మంది యజమానులు ఉన్నారు. సొంతంగానే జరీ అంచులతో కూడిన కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రాలేదనే బెంగలేదు.. బతుకమ్మ చీరల బిల్లులు రాలేదనే చింత లేదు. సర్కారు ఆర్డర్ల వైపు ఎదురుచూడ కుండా సొంత సాంచాలపై జరీ అంచుతో 8 మీటర్ల (18 మూరల) గోచీ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, భీంగల్, నిర్మల్, భైంసా వంటి పట్టణాల్లోని వస్త్ర వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో చీరను రూ.650 నుంచి 800 వరకు నాణ్యతను బట్టి అందిస్తున్నారు. నేరుగా నూలు కొనుగోలు చీరలకు అవసరమైన నూలును నేరుగా భీవండి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నూలుకు అవసరమైన రంగులను అద్ది, బీములు పోయించుకుని, సాంచాలపై ఎక్కిస్తారు. జరీ పోగులతో చీరల అంచులను, కొంగులను డిజైన్ చేసి ఇంపైన రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు వారే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నూలు ధరలతో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమించి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే.. కాటన్ చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరాకు ప్రభుత్వం స్థానికంగా నూలు డిపోను ఏర్పా టు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. కరోనా లాక్డౌన్ వంటి విపత్తులు ఎదురైనా, తట్టుకుని నేతన్నలు చీరల బట్టను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు, మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
చేనేత మిత్రులం
సాక్షి, హైదరాబాద్: దేశంలో చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ అన్నా రు. నేతన్నల ఆత్మహత్యలు నిత్య కృత్యమైన స్థితి నుంచి ఆత్మస్థైర్యంతో సగౌరవంగా బతికే స్థాయికి తీసు కొచ్చామని చెప్పారు. దేశంలో చేనేత కార్మికులకు యార్న్‌పై 40 శాతం సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞా నాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు సంజయ్‌కు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా అరకొర బడ్జెట్ ఇచ్చిన గత ప్రభుత్వాలకు భిన్నంగా రూ. వందల కోట్లను ఒకేసారి బడ్జెట్లో కేటా యించామని చెప్పారు. నేతన్న రుణాలను మాఫీ చేసి అప్పుల ఊబి నుంచి కాపాడామన్నారు. నేత న్నకు చేయూత పేరుతో ప్రారంభించిన పొదుపు పథకం కోవిడ్ సంక్షోభంలో వాళ్లకు ఆపన్న హస్తం గా మారిందన్నారు. మగ్గాల అధునీకరణ నుంచి వర్కర్ ఓనర్ పథకం వరకు తాము చేపట్టిన కార్యక్రమాలతో నేతన్నల ఆదాయం రెట్టింపు అ యిందన్నారు. టెక్స్టైల్ పరి శ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కాక తీయ టెక్స్టైల్ పార్కు మెదలుకుని అనేక మౌలిక వసతులను అభివృద్ధి చేశామని చెప్పారు. కేంద్రాన్ని సంజయ్ నిలదీయాలి.. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న సంజయ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయి అవకా శవాదంగా మాట్లాడుతున్నారని కేటీ ఆర్ విమర్శించారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న పార్టీ ఎంపీగా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం, వారి భవి ష్యత్తు కోసం పార్లమెంట్లో ఏనాడైనా ఒక్క మాటైనా మాట్లాడారా అని సంజయ్‌ను నిలదీశారు. ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల శవాలపై రాజకీయాలు చేసిన పార్టీల సంస్కృతిని తిరిగి రాష్ట్రంలోకి తీసుకు రావా లని ఆయన అనుకుంటున్నట్టున్నారని ధ్వజ మెత్తారు. నేతన్నల అభివృద్ధికి అండగా నిలవాల్సిన కేం ద్రం సహాయ నిరాకరణ చేస్తోందని, దీనిపై కేంద్రాన్ని సంజయ్ నిలదీయాలని సూచించారు. ‘కాకతీయ’ ఆర్థిక సాయంపై పట్టించుకోవట్లే... టెక్స్టైల్ ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ పన్ను వçసూ లు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్మా ర్గపు ప్రభుత్వం బీజేపీదని కేటీఆర్ విమర్శించారు. దేశంలో తొలిసారి చేనేత రంగంపై పన్నులు మోపిన పాపపు ప్రభుత్వం బీజేపీదని మండిప డ్డారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా ఎత్తేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందిం చలేదని.. అలాంటి సర్కారు తరçఫున మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, మెగాపవర్ లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలంటే కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. నేతన్నకున్న అన్ని బీమా పథకాలను కేంద్రం రద్దు చేస్తే తమ ప్రభుత్వం బీమా కల్పిస్తోందని గుర్తు చేశారు. -
ధర్మవరంలో విషాదం: మరణంలోనూ వీడని స్నేహం
ధర్మవరం రూరల్: ఆ యువకులు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు.. చదువుకున్నారు. ఇప్పుడు ఒకే రకమైన వ్యాపారం చేసుకుంటూ వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అవివాహితులైన వీరిద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అంకే ధనుశ్ (25), రాంనగర్‌కు చెందిన భీమనపల్లి అనిల్‌కుమార్ (27) మిత్రులు. వీరిద్దరూ మగ్గం నేస్తూ పట్టు చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మగ్గం సామగ్రి కోసం ఆదివారం గోరంట్లకు వెళ్లారు. పని ముగించుకుని అక్కడి నుంచి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా ధర్మవరం మండలం మోటుమర్ల గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రగాయాలవడంతో ధనుశ్, అనిల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ ఎస్ఐ ప్రదీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆదోని, సీటీఎం గోపాల్‌రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి డిపో మేనేజర్లు మల్లికార్జున, ఇనయతుల్లా, ఈయూ నాయకులు నాగార్జునరెడ్డి, సుమో శీనా తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై స్థానికులను ఆరా తీశారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
నేతన్నలకు ప్రభుత్వమే నేస్తం
ప్రాచీనకాలం నుంచీ చరి త్రలో చేనేతకు సముచితమైన పాత్ర ఉంది. జాతీయోద్య మంతోనూ విడదీయరాని బంధం కలిగుంది. గ్రామీణ భారతంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పనదారు చేనేత పరిశ్రమ. రాష్ట్రంలో సుమారు ఒక లక్షా 80 వేల మగ్గాలు ఉండగా, ఉప వృత్తులు కలిపి సుమారు నాలుగు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. కాలానుగుణంగా చేనేత రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది. వైఎస్సార్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేనేతల సాధకబాధకాలు తెలుసుకున్నారు. ధర్మవరం, వెంకటగిరి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పొందూరు, చీరాల, మంగళగిరి... ఇలా పలు చేనేత కేంద్రాల్లో కార్మికుల ఆర్థిక ఇబ్బందులను స్వయంగా గమనిం చారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా జగన్ చేనేతల సంక్షేమానికి నడుం బిగించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 24,000 వంతున రూ. 196.28 కోట్ల తొలి విడత సాయాన్ని జమ చేశారు. ఆ తరువాత కరోనా విజృం భించడంతో చేనేత కార్మికులు ఉపాధికి దూర మయ్యారు. కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి, రెండో విడత నేతన్న నేస్తం పథకాన్ని ఆర్నెల్లు ముందుగానే అమల్లోకి తెచ్చారు. 81,024 మంది అర్హులైన లబ్ధి దారులకు రూ.24,000 వంతున రూ.194.46 కోట్ల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. చేనేత దినోత్సవం సందర్భంగా మూడోసారి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రాజకీయంగా కూడా చేనేత వర్గాలకు పెద్దపీట వేశారు. మునుపెన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి పాలక వర్గాలను కూడా నియమించి చరిత్ర సృష్టించారు. చేనేతకు ఏకంగా నాలుగు (పద్మశాలి, దేవాంగ, తొగటవీర క్షత్రియ, కుర్నిశాలి) కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం విశేషం. నేటి ఆధునిక యుగంలో యువత, మహిళల అభిరుచికి తగ్గట్టుగా వీవర్స్ సర్వీస్ సెంటరు సహకారంతో ఆప్కో తరపున నూతన వెరైటీల ఆవిష్కరణకు కృషి జరుగుతోంది. డిజైన్ చీరల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసి, సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధాన ముడిసరుకైన పట్టు (సిల్క్) కొరత రాష్ట్రంలో తీవ్రంగా వుంది. మలబారు సాగుకు అనుకూల పరిస్థితులున్న విశాఖ, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రసాయనాలు వినియోగించకుండా పండించిన పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరిం చిన రంగులను వినియోగించి వస్త్రాలను ప్రయోగాత్మకంగా నేయిస్తోంది. కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేట తదితర ప్రాంతాల్లో ఆర్గానిక్ చేనేత వస్త్రాలు తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండ్, మార్కెటింగ్ కల్పించేందుకు కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీ సీ)తో సంప్రదింపులు జరుపుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు దగ్గరగా ఉండే శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే మన దేశ ఖ్యాతి ఇనుమడించడంతోపాటు ఇక్కడి కార్మికుల ఉపాధి మెరుగవుతుంది. చేనేత కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా శ్రమించిన చేనేత బంధు, దివంగత రాజ్యసభ సభ్యుడు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ చేనేత విభాగం ముందుకెళ్తోంది. - చిల్లపల్లి మోహనరావు వ్యాసకర్త ఆప్కో చైర్మన్, వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
7 కోట్ల మీటర్లు.. 288 డిజైన్లు..
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలు అందిస్తోంది. సిరిసిల్లలోని నేతన్నలకు ఉపాధి కలి్పంచాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో ఉన్న వస్త్రపరిశ్రమను ఆదుకోవడంతోపాటు నేతన్నలకు ప్రభుత్వపరంగా ఉపాధి కలి్పస్తున్నారు. ఈసారి పవర్‌లూమ్స్ (మరమగ్గాల)పై డాబీ డిజైన్స్ చీరలను ఉత్పత్తి చేయాలని జౌళి శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో పవర్‌లూమ్స్‌కు అదనంగా జకార్డ్, డాబీ పరికరాలను అమర్చి చీరలపై రకరకాల డిజైన్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో చీరల కొంగులు, అంచులపై నెమలి పించం, ఆకులు, కమలం వంటి కంటికి ఇంపైన డిజైన్లతో కూడిన చీరలను సిరిసిల్ల నేతన్నలు నేస్తున్నారు. ఈ ప్రయోగంతో నేతకారి్మకులకు పని ఒత్తిడి, యజమానులకు ఆర్థిక భారం పడింది. అయినా.. నవ్యతను, నాణ్యతను పెంచేక్రమంలో జౌళి శాఖ డాబీ డిజైన్లకు మొగ్గుచూపింది. దీంతో 288 రకాల డిజైన్లలో వందకుపైగా రంగుల్లో ఈ ఏడాది బతుకమ్మ చీరలు సిద్ధమవుతున్నాయి. లక్ష్యం దిశగా అడుగులు: సిరిసిల్లలో వ్రస్తోత్పత్తిదారులకు ఈ ఏడాది జనవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. నూలు కొనుగోలు, జకార్డ్, డాబీల దిగుమతి, పవర్‌లూమ్స్‌కు బిగింపు వంటి పనులతో చీరల ఉత్పత్తి ఆలస్యంగా మొదలైంది. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌తో కారి్మకులు వెళ్లిపోవడం, నూలు, పవర్‌లూమ్స్ విడిభాగాల దిగుమతిలో కూడా జాప్యమైంది. సిరిసిల్లలోని 136 మ్యాక్స్ సం ఘాలకు, మరో 138 ఎస్ఎస్ఐ యూనిట్లకు, టెక్స్టైల్ పార్క్‌లోని 76 యూనిట్లకు బతుక మ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు. తొలుత జాప్యం జరగడంతో ప్రస్తుతం సిరిసిల్లలో రేయింబవళ్లు వేగంగా వస్త్రోత్పత్తి సాగుతోంది. ఉత్పత్తి అయిన చీరల వ్రస్తాన్ని టెస్కో అధికారులు వెంట వెంటనే సేకరిస్తూ.. ప్రాసెసింగ్‌కు పంపిస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మీటర్ల వ్రస్తాన్ని ప్రాసెసింగ్ కోసం తరలించారు. ఇదిలా ఉండ గా తొలిసారి ఆర్టీసీ కార్గో సేవలను బతుకమ్మ చీరల రవాణాకు వినియోగించుకుంటున్నారు. గత ఏడాది సాంచాలపై మిగిలిపోయిన వస్త్రాన్ని సైతం అధికారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరల వ్రస్తాన్ని సకాలంలో అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. మంచి డిజైన్లలో చీరలు ఉన్నాయి.. సిరిసిల్లలో బతుకమ్మ చీరలు మంచి డిజైన్లలో ఉత్పత్తి అవుతున్నాయి. మొదట్లో వస్త్రోత్పత్తిదారులు కొంత ఇ బ్బంది పడినా.. నాణ్యమైన చీరల ఉత్పత్తి దిశగా సాగుతున్నారు. గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం. ఇప్పటికే చీరల బట్టను ప్రాసెసింగ్‌కు పంపించాం. -
Sircilla: సాంచాల సవ్వడి షురూ..
ఇతడి పేరు రాజమౌళి. సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌లో పవర్లూమ్ కార్మికుడు. భార్య అనసూర్య బీడీ కార్మికురాలు. పది రోజులపాటు ఆసాముల సమ్మెతో రూ.3,500 వరకు వేతనం కోల్పోయాడు. మూడు రోజుల కిందట సమ్మె ముగియడంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది. ఇప్పుడు చీరల ఉత్పత్తి ద్వారా వారానికి రూ.4 వేల వరకు వేతనం పొందనున్నాడు. ఒక్క రాజమౌళే కాదు.. కార్మిక క్షేత్రంలోని సుమారు 20 వేల మంది కార్మికుల జీవన స్థితి ఇది. సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల నేతన్నలకు తయారీ ఆర్డర్లు అందించింది. గతానికి భిన్నంగా ఇప్పుడు సిరిసిల్ల వస్త్రోత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పాత మరమగ్గాలకు (పవర్‌లూమ్స్) డాబీలను, జకార్డులను అమర్చి ఆధునిక హంగులతో, నేటితరం మహిళలు కోరుకునే డిజైన్లతో బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు. ఆధునిక హంగులతో.. భూటకొంగుతో, బార్డర్ లైనింగ్‌తో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. వస్త్ర పరిశ్రమలో 29,680 మరమగ్గాలు ఉండగా.. ఇప్పటికే 14 వేల మగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల మరమగ్గాలపై చీరల ఉత్పత్తి ఐదేళ్లలో ఎంతోమార్పు.. నేతన్నల వస్త్రోత్పత్తి నైపుణ్యాన్ని ఏటేటా జౌళిశాఖ మెరుగు పరుస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిన తొలిఏడాది 2017లో 52 రంగుల్లో కోటి చీరలను రూ.280 కోట్లతో ఉత్పత్తి చేశారు. 2018, 2019లో 100 రంగుల్లో కోటి చీరలు తయారు చేశారు. 2020లో 225 రకాల బతుకమ్మ చీరలను అందించారు. ఈ ఏడాది భూటకొంగుతో ఉత్పత్తి చేస్తుండగా.. కొత్త డిజైన్లలో లైనింగ్‌తో నవ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. 136 మ్యాక్స్ సంఘాలకు, 138 చిన్న తరహా పరిశ్రమలకు, టెక్స్టైల్ పార్క్‌లోని 70 యూనిట్లకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో 20 వేల మంది సిరిసిల్ల నేతన్నలకు ఆరు నెలలపాటు చేతినిండా పని లభిస్తుంది. కార్మికులకు మెరుగైన వేతనాలు అందనున్నాయి. ఇక్కడ చదవండి: కరోనా ఎఫెక్ట్; మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం! ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! -
నేతన్నకు చేయూత: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో నేత కార్మికులను ఆదుకున్న ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే అంశాన్ని రాష్ట్ర మంత్రి వర్గం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్య క్రమాన్ని తిరిగి కొనసాగిం చాలని నేత కార్మికుల నుంచి వినతులు అందు తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చేనేత, జౌళి విభాగం కార్యకలాపా లపై సోమవారం కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నేతన్నకు చేయూత పథకం లబ్ధిదా రులు కాలపరిమితి ముగియక ముందే తాము పొదుపు చేసిన మొత్తంతో పాటు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ని ఒకేసారి వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు. దీంతో కరోనా సమయంలో 25 వేల మంది చేనేత కార్మికులకు సుమారు రూ.95 కోట్లు అందాయన్నారు. నేత కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే, రాష్ట్రంలోని పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో చేనేత, జౌళి రంగానికి కేటాయింపులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 20 వేల నేత కుటుంబాలకు ప్రయోజనం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వినతి మేరకు జనగామ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటవుతున్న ఈ పార్కు ద్వారా 20 వేల మంది నేత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కొడకండ్ల ప్రాంతంలో నైపుణ్యం కలిగిన వేలాది మంది నేత కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని, మినీ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ద్వారా వారికి స్థానికంగా ఉపాధి కల్పిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రి దయాకర్‌రావుతో పాటు చేనేత, జౌళి విభాగం డైరక్టర్ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేతన్నలకు బాసటగా శ్రీకాకుళం టెకీలు
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖద్దరు.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా రాజకీయ ప్రముఖులు దీనిని బాగా ఇష్ట పడతారు. ఇవన్ని నాణెనికి ఒక వైపు. పొందూరు ఖద్దరు ఎంత దర్జగా ఉంటుందో దాన్ని నేసే వారి బతుకులు అంత దీనంగా ఉంటాయి. ప్రాణం పెట్టి నేసిన బట్టలను అమ్ముకునే పరిజ్ఞానం కొరవడటంతో నేతన్నలు ఎంతో మోసపోతున్నారు. ఈ క్రమంలో వారికి బాసటగా నిలవడానికి కొందరు యువ టెకీలు ముందుకు వచ్చారు. పొందూరు ఖద్దరు ఉత్పత్తుల అమ్మకం కోసం ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఫైన్ కాటన్‌కు ఎంతో గుర్తింపు. కానీ సరైన మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియకపోవడంతో నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరిపై డాక్యుమెంటరీ రూపొందించాలని శ్రీకాకుళానికి చెందిన నలుగురు యువ టెకీలు పోగిరి జవాంత్ నాయుడు, సూరజ్ పోట్నురు, సైలేంద్ర, భరద్వాజ్ నేతన్నలను సంప్రదించారు. ఈ క్రమంలో నేతన్నల కుటుంబాలు రోజుకు కనీసం రెండు వందల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలుసుకుని షాక్ అయ్యారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: ‘సిరి’సిల్ల మురుస్తోంది..!) దానిలో భాగంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. వారి ఉత్పత్తులను విక్రయించడానికి గాను చేనేత కార్మికులను దీనిలో చేరేలా ప్రేరేపించారు. ప్రారంభంలో కొందరు ఎంపిక చేసిన కస్టమర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జశ్వంత్ నాయుడు మాట్లాడుతూ.. ‘పొందూరు నేతన్నలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు మమ్మల్ని కదిలించాయి. వారికి సాయం చేయాలని భావించాం. ఇందుకు గాను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపిందించాము. దానిలో భాగంగానే ‘లూమ్2హోమ్’ వెబ్ పేజ్ క్రియేట్ చేశాం. ప్రస్తుతం దీన్ని రినోవేట్ చేస్తున్నాం. సోమవారం నుంచి అదనపు పేజీలతో అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. -
‘సిరి’సిల్ల మురుస్తోంది..!
సాక్షి, సిరిసిల్ల : ఆత్మహత్యలు, వలసలు, కార్మికుల సమ్మెలు ఇదీ దశాబ్దంక్రితం సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన నేతన్న బతుకుచిత్రం. నేడు వస్త్రోత్పత్తి ఆర్డర్లతో సాంచాల(పవర్‌లూమ్స్) వేగం పెరిగి నాటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ‘సిరి’సిల్లగా వెలుగొందుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిన సిరిసిల్ల ఇప్పుడు చేతి నిండా పనితో మురిసిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 74వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34వేలు ఉన్నా యి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ బట్ట, ఏడు వేల పవర్‌లూమ్స్‌పై కాటన్(ముతక రకం) బట్ట ఉత్పత్తి అవుతోంది. ఈ రంగంలో 25 వేల మంది కార్మికులు ఉపాధి లభిస్తోంది. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా అద్దకం, సైజింగ్, వైపణి, వార్పిన్ పనులు ఉంటాయి. గతంలో సిరిసిల్లలో ఉపాధి లేక నేత కార్మికులు ముంబయి, బీవండి, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లే వారు. కానీ ఆరేళ్లలో వచ్చిన మార్పు కారణంగా సిరిసిల్ల కార్మికులు వలసలకు టాటా చెప్పారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రా ష్ట్రాల కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. చదవండి: ఆశలు అద్దుకుంటున్న మగ్గం బతుకులు మార్పునకు కారణాలు సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్లకు అందించారు. తొలిసారి 2017లో రూ.280 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా, మరో రూ.100 కోట్ల ఆర్వీఎం, సంక్షేమశాఖల ఆర్డర్లు వచ్చాయి. ఇలా నాలుగేళ్లలో రూ.1280 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా, మరో రూ.400 కోట్ల సర్వశిక్ష అభియాన్, కేసీఆర్ కిట్లు, క్రిస్మస్, రంజాన్ ఆర్డర్లు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో రూ.1680 కోట్ల ఆర్డర్లు లభించాయి. ప్రతీ కార్మికుడికి ఉపాధి మెరుగైంది. సిరిసిల్ల కార్మికులకు పొదుపు పథకం త్రిఫ్ట్ అమలు చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బట్టలో 10శాతం నూలు రాయితీ కార్మికులకు అందిస్తున్నారు. ఫలితంగా చేసే పనిలో భవిష్యత్ ఉందనే ఆశ, పొదుపు అలవాటు అయింది. నేతన్నల జీవితాల్లో సామాజిక మార్పు కనిపిస్తోంది. చదవండి: కేసీఆర్ తాతయ్యా.. న్యాయం చేయరూ..! నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన కొండ కిష్టయ్య తన తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు బిడ్డలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిష్టయ్య చిన్న కూతురు ఒక్కరే బతికిపోగా, ఐదుగురు మరణించారు. ఈ ఘటన 2001లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మూడేళ్లుగా పని చేస్తున్న నేను సిరిసిల్లలో మూడేళ్లుగా పని చేస్తున్న. నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం వస్తుంది. మాది బీహార్‌లోని మధువని జిల్లా పుర్సోలియా గ్రామం. నాకు ముగ్గురు కొడుకులు. ఏడాదికి ఒక్కసారి మా ఊరికి వెళ్లి వస్తా. నాలాగే ఉత్తరప్రదేశ్, ఒడిశావాళ్లు సిరిసిల్లలో వందల మంది పని చేస్తున్నారు. – అస్రఫ్ అలీ, బిహార్ కార్మికుడు ఉపాధిపై నమ్మకం పెరిగింది సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో పని చేసే కార్మికుల్లో చాలా మార్పు వచ్చింది. ఉపాధిపై నమ్మకం పెరిగింది. పిల్లలను చదివిస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రావడంతో మెరుగైన జీతాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతున్నారు. గతంలో ఉండే గొడవలు తగ్గాయి. కార్మికుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. – కె.పున్నంచందర్, సైకాలజిస్ట్ ఆత్మహత్యలు తగ్గాయి సిరిసిల్లలో ఒకప్పటితో పోల్చితే నేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయి. పరిశ్రమలో పని లేకపోవడం అనేది లేదు. సిరిసిల్లలో కార్మికులకు చేతినిండా పని ఉంది. మెరుగైన ఉపాధి లభిస్తుంది. కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా, కారణాలు వేరే ఉంటున్నాయి. సిరిసిల్లలో కార్మికుల్లో నైపుణ్యం పెరిగింది. పట్టుదలగా పని చేసే తత్వం వచ్చింది. – వి.అశోక్‌రావు, జౌళిశాఖ ఏడీ -
కరోనా : అమెజాన్‌లో వారికి భారీ ఊరట
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అమెజాన్ చేతివృత్తులు, చిన్న, మహిళా వ్యాపారులకు మరోసారి భారీ ఊరట కల్పించింది. ఎస్ఓఏ (సేల్ ఆన్ అమెజాన్) ఫీజును తాజాగా 100 శాతం రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మరో 10 వారాలపాటు ఈ మినహాయింపును పొడిగిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఫలితంగా లక్షలాదిమంది వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాలనుంచి చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 10 లక్షల మందికి పైగా పారిశ్రామికవేత్తలు కోలుకునేలా సాయం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధి ప్రణవ్ భాసిన్ వెల్లడించారు. అమెజాన్ అందిస్తున్న కారీగర్ ప్రోగ్రాం ద్వారా 8 లక్షలకు పైగా చేతివృత్తులవారు, నేత కార్మికులు, అమెజాన్ సహేలి ప్రోగ్రాం ద్వారా 2.8 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు 100 శాతం అమ్మకం ఫీజు మినహాయింపుతో ప్రయోజనం పొందుతారని అన్నారు. ఈ రెండు ప్రోగ్రామ్‌లలో చేరిన కొత్త అమ్మకందారులకు కూడా ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని చెప్పారు. వీరి ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం ద్వారా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడంతోపాటు, వారికి మూలధన సహాయానికి తోడ్పడుతుందని భాసిన్ తెలిపారు.(అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు) కారీగర్, సహేలి అమ్మకందారుల నుండి స్థానికంగా రూపొందించిన, చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు కస్టమర్ డిమాండ్‌ను పెంచేందుకు 'స్టాండ్ ఫర్ హ్యాండ్‌మేడ్' స్టోర్ ను కూడా ఏర్పాటు చేసినట్టు భాసిన్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వ ఎంపోరియంలు, ఐదు ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం ఉందన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశం సహా వివిధ ప్రాంతాల చేతివృత్తులవారు, మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. అలాగే మహిళలకోసం మహిళలు రూపొందించిన ఉత్పత్తులు కూడా లభిస్తాయని ఆయన ప్రకటించారు. కాగా జూన్ 2020 చివరి వరకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ ఫీజును 50 శాతం మాఫీ చేస్తున్నట్టు గత నెలలో ప్రకటించింది. అలాగే స్టోరేజ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్టు అమెజాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నేత కార్మికులకు అండగా సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత అండగా నిలబడ్డారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో నేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వలసలు లేకుండా సీఎం జగన్ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఆరు నెలల ముందే రెండో విడత ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. నేత కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు నేత కార్మికులంతా రుణపడి ఉన్నామని అంటున్నారని తెలిపారు. ('చేనేత కష్టాలు చాలా దగ్గరగా చూశా') -
ఆర్నెల్లు ముందుగానే ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం వైఎస్ జగన్ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఆర్నెల్ల ముందుగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయనున్నారు. ఆప్కో బకాయిలూ విడుదల... ► ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కన్నా చేనేత కుటుంబాల కష్టమే పెద్దదనే ఉద్దేశంతో ఆర్నెల్ల ముందుగానే వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. గత ఏడాది డిసెంబర్లో తొలిసారిగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ► రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. గత ప్రభుత్వాలు చేనేత కుటుంబాలకు ఇలా ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవు. ► గత ప్రభుత్వం ఆప్కోకు బకాయిపడ్డ రూ.103 కోట్లతో పాటు కరోనా నియంత్రణ మాస్కుల తయారీకి రూ.109 కోట్లను కూడా విడుదల చేసి చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. -
నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వ చేయూత
-
‘చేయూత’ లాక్ తీశాం..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు నగదు లభ్యత పెంచడం ద్వారా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 26,500 మంది చేనేత కార్మికులకు రూ.93 కోట్ల మేర నగదు తక్షణమే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ కార్యాలయంలో శనివారం చేనేత విభాగంపై కేటీఆర్ సమీక్షించారు. ‘చేయూత’పథకం లాక్ఇన్ పీరియడ్ నిబంధనలు సడలించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేయూత పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం జమ చేస్తే, ప్రభుత్వ వాటాగా 16 శాతం చెల్లిస్తుంది. పవర్లూమ్ కార్మికులు మాత్రం 8 శాతం వాటా జమ చేస్తే ప్రభుత్వం కూడా 8 శాతం జమ చేస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని చేనేత కార్మికులు తమ వంతు వాటాగా రూ.31 కోట్లు జమ చేయగా, ప్రభుత్వం రూ.62 కోట్లు జమ చేసింది. అయితే ఈ పథకంలో చేరిన మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత సభ్యులు తమ అవసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ లాక్ఇన్ పీరియడ్‌ను సడలించాలని నిర్ణయించాం. దీంతో ఈ పథకంలో భాగస్వాములైన నేత కార్మికులకు నిర్దేశించిన గడువు కంటే ముందే ఎప్పుడైనా రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల మేర నగదు అందుబాటులోకి వస్తుంది’అని కేటీఆర్ వివరించారు. సొసైటీల పరిధిలోని పొదుపు పథకంలో గతంలో సభ్యులుగా ఉన్న 2,337 మంది కార్మికులకు రూ.1.18 కోట్లు చెల్లిస్తామని కేటీఆర్ ప్రకటించారు. -
కలర్ఫుల్గా కరోనా మాస్కులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ మాస్కుల అవసరం తప్పనిసరైంది. రోజురోజుకూ వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో మాస్కులు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో దొరికే రకరకాల మాస్కులను వినియోగిస్తున్నారు. అయి తే ఎక్కువకాలం ఒకే రకమైన మాస్కులు ధరించడం ఇష్టం లేనివారి కోసం రంగురంగుల మాస్కులు రానున్నాయి. రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంస్థ (టెస్కో) రంగులు, డిజైన్లలో మాస్కుల ను అందుబాటులోకి తెస్తోంది. వీటిని ఒక్కసారి వాడి పారేయాల్సిన పనిలేదు. రోజూ ఉతికి మళ్లీ వినియోగించుకోవ చ్చు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా టెస్కో ఈ చర్యలు చేపట్టింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా.. చేనేత వస్త్రాలంటే గుర్తుకు వచ్చేవి పోచంపల్లి, గద్వాల చీరలే. వీటిల్లో వేల రకాల డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వస్త్ర వ్యాపారం సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితుల్లో కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో టెస్కో ట్రెండింగ్ బిజినెస్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ సిల్క్, కాటన్, సీకో చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట సిల్క్, కాటన్ చీరల డిజైన్ల ఆధారంగా మాస్కు లను తయారు చేసింది. ఇప్పటికే 3 లక్షలకు పైగా మాస్కులు తయారు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచింది. ఒక్కో మాస్కును రూ.20 నుంచి రూ.40 వరకు విక్రయించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సేల్స్ షోరూమ్‌లలో వీటిని విక్రయించేందుకు అందుబాటులో పెట్టింది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వీటిని విక్రయించాలని టెస్కో భావిస్తోంది. ఇందులో భాగంగా టెస్కో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విక్రయాలకు ఏర్పాట్లు చేసింది. విక్రయాలు, కార్మికుల కోణంలో ఆలోచించి తక్కువ ధరకే అమ్మాలని, అందులో భాగంగా తయారైన ధరనే నిర్ణయించినట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రెండు లక్షల మాస్కులను జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆమె వివరించారు. -
ఆనందోత్సాహాల కల‘నేత’
సాక్షి, విశాఖపట్నం /సాక్షి నెట్వర్క్: సన్నని దారం.. చక్కని పనితనం.. చూపరుల్ని ఆకట్టుకునే వర్ణం.. అందంతోపాటు హాయినిచ్చే మన వస్త్రం.. హుందాతనాన్ని తెచ్చిపెట్టడమే చేనేత గొప్పతనం. వస్త్రాల తయారీలో అద్భుత కళ.. చేనేత. కానీ.. ఈ వృత్తిని నమ్ముకున్న వారి జీవితాలు మాత్రం దుర్భంగానే మిగిలిపోయాయి. అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, చేనేత వర్గాలు తీసుకున్న రుణాలన్నీ వడ్డీతో సహామాఫీ చేసేస్తామంటూ ఊదరగొట్టిన టీడీపీ.. గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా వారిని పూర్తిగా విస్మరించింది. కానీ.. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే.. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తోంది. నేతన్నకు నేస్తంగా ఉంటూ.. వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించేందుకు చేయూతనిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగి, ఉపాధి కల్పించే చేనేత రంగం.. అనాదిగా వివక్షకు గురవుతూనే ఉంది. 2014 ఎన్నికల ముందు చేనేత సహకార సంఘాల పరిధిలో ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పూర్తిగా గాలికొదిలేశారు. కేవలం నేత కార్మికుల వ్యక్తిగత రుణాలకే లబ్ధిని పరిమితం చేసి.. అవి కూడా కేవలం నేత పని కోసం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ జాబితాలో చేర్చి.. వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో 20 చేనేత సహకార సంఘాలుంటే. ..వాటి పరిధిలో 3,500కు పైగా మగ్గాలున్నాయి. ఈ మగ్గాలపై 19వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. సంఘాల్లో లేనివారు జిల్లాలో మరో లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. వివిధ బ్యాంకుల్లో సంఘాల్లోని వందలాది మంది చేనేత కార్మికులకు రుణాలున్నప్పటికీ ముడి సరుకుల నిమిత్తం 48 మంది తీసుకున్న రుణాలు రూ.5.47 లక్షలుగా చేనేత జౌళీ శాఖాధికారులు లెక్క తేల్చారు. అదే విధంగా ప్రభుత్వాదేశాల మేరకు చేనేత సహకార సంఘాల పరిధిలో రూ.కోట్లల్లో ఉన్న రుణాలను పక్కన పెట్టేశారు. జీవితాలు మారనున్నాయి... గత ప్రభుత్వం చెప్పింది చెయ్యకుండా చేనేతని వంచించింది. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. అన్ని వర్గాల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఇందులో భాగంగా చేనేత కార్మికుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో చేనేత కుటుంబాలకు ఆర్థిక అభయ హస్తం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అర్హుల జాబితాను సిద్ధం చెయ్యాలంటూ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. నేతన్నల్లో హర్షం... ప్రభుత్వ నిర్ణయంతో నేతన్నల మోముల్లో నవ్వులు విరబూశాయి. ఐదేళ్లుగా హామీల పేరుతో దగా పడిన తమ జీవితాలకు ఆర్థిక దన్ను దొరికిందని చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ.. ఎన్ని బట్టలు నేసినా.. జీవితాలకు సరైన భరోసా లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తమ బతుకులకు వెలుగులు తీసుకొచ్చే నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సబ్బవరం, కొత్తపేట, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో ఎక్కువ మంది చేనేత కార్మిక కుటుంబాలున్నాయి. -
నేతన్నల కోసం సరికొత్త పథకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ. 24వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. మత్స్యకారులకు 10వేలు ఆర్థిక సాయం వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేయనుందని తెలిపారు. మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌కు తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించారు. మత్స్యకారులు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతోందని, ఆ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. తెప్పలపై చేపల వేటకు వెళ్లేవారు కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు. గతంలో మత్స్యకారులకు లీటర్‌కు డీజిల్‌పై రూ. 6.03 సబ్సిడీ ఇస్తుండగా.. ఆ సబ్సిడీని మరో 50శాతం పెంచి.. రూ. 9 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 9 జిల్లాలోని 81 బంకుల్లో మత్స్యకారులకు ఈ సబ్సిడీ అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 96.06 కోట్లు ఖర్చు చేయనుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ చేపట్టిన ఆయిల్ అన్వేషణలో ఉపాధి కోల్పోయిన 16500 మంది మత్స్యకారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను నవంబర్ 21న చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. న్యాయవాదులకు రూ. 5వేలు న్యాయవాదులకు రూ. 5వేల ప్రోత్సాహం అందించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా జూనియర్ న్యాయవాదులకు ఈమేరకు ప్రోత్సాహం అందించనుంది. పలాసలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో రెగ్యులర్, కాంట్రాక్ట్ పోస్టుల మంజూరు చేసేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి.. ప్రభుత్వమే హామీగా ఉండి రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి, అవినీతి గురికాకుండా.. వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జీఏడీ ఆధ్వర్యంలో కొనసాగే ఈ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూరునుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే జీతాలు పడనున్నాయి. అందరికీ రక్షిత తాగునీరు ఏపీలోని 13 జిల్లాల్లో అందరికీ సురక్షితమైన మంచినీరు అందించేందుకు జిల్లాల వారిగా వాటర్ గ్రీడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రతి ఇంటికీ మనిషికి 105 నుంచి 110 లీటర్లు చొప్పున మంచినీరు ప్రతి రోజూ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు నిధులు సమకూర్చుకునేందుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చిందని చెప్పారు. దాదాపు 4.90 కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. హోంగార్డుల జీతాలు పెంపు రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలను పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ. 600 నుంచి రూ. 710కి పెంచింది. దీంతో హోంగార్డుల వేతనం నెలకు రూ. 18వేల నుంచి రూ. 21,300కు పెరిగింది. కొత్త బస్సుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్ ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సుల స్థానంలో రూ. వెయ్యి కోట్లతో కొత్త బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ కొనుగోలు చేయనుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కంలను ఆదుకునేందుకు రూ. 4,471 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీ నియామకానికి ఆమోదం తెలిపింది. గన్నవంరం మండలం కొండపావులూరులో ఎస్డీఆర్ఎఫ్కు 39.23 ఎకరాల భూమిని కేటాయించింది. మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రకాశం జిల్లా నడికుడి-శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ నిర్మాణానికి 350 ఎకరాలు, రేణిగుంట విమానాశ్రయం విస్తరణ కోసం 17 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖలోని పరదేశ్పాలెంలో ‘ఆమోద పబ్లికేషన్స్’కు ఏ ఆమోదం లేకుండానే మాజీ సీఎం చంద్రబాబు 1.50 ఎకరాల భూమిని కేటాయించారని, దీనిని రద్దు చేస్తున్నామని, ఈ భూమిని బలహీన వర్గాల ఇళ్ల కోసం కేటాయించాలని నిర్ణయించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవవేతనం పెంపు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవవేతనం రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసింది. దీనివల్ల 52,296 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం రూ.211.91 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం తీర్మానం చేసిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. చిరుధాన్యాలు, ఆపరాల బోర్డులు ఏర్పాటుకు ఆమోదం తెలిపామని, రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఈ బోర్డు కృషి చేస్తుందని పేర్ని నాని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ రుణ పరిమితిని అదనంగా రూ. 2వేల కోట్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉచిత బోర్ల కోసం 200 డ్రిల్లింగ్ బోర్ మిషిన్ల కొనుగోలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దినపత్రికలకు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల టారిఫ్‌ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్కూలు ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ యాక్ట్‌పై ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదముద్ర వేసింది. ఇంటర్మీడియట్ విద్యను ఇందులో చేర్చేలా ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. యూనివర్సిటీ బోర్డుల్లో సభ్యులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సభ్యుల ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదం తెలిపింది. -
క్రికెట్ వీరాభిమాని ఏం చేశాడంటే..?
వారణాసి : ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫీవర్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. రెండవ రోజు తిరిగి ప్రారంభమైన సెమీ-ఫైనల్ మ్యాచ్ కొనసాగుతుండగా ప్రపంచకప్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వరల్డ్‌కప్‌కోసం ఒక వీరాభిమాని విలక్షణమైన జరీ పట్టు చీరలను సిద్ధం చేశారు. టీమిండియా కోసం ఉత్తరప్రదేశ్ వారణాసి చేనేత కార్మికులు దీన్ని తయారు చేశారు. భారత జట్టు సభ్యులు ధరించే జెర్సీ కలర్ ‘నీలి’ రంగులో ఈ చీరను రాత్రింబవళ్లు కష్టపడి మరీ రూపొందించారట. స్పెషల్ ఎడిషన్ చీర స్పెషల్ ఏంటి? ప్రపంచకప్ ప్రత్యేక పట్టు చీరల తయారీని నేతన్నలు దాదాపు పూర్తి చేశారు. ప్రపంచ్‌కప్ ముగిసి దేశానికి తిరిగి వచ్చే భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఈ చీరలను బహుమతిగా ఇవ్వనున్నారు. ప్రపంచకప్ లోగో తోపాటు క్రికెట్ బ్యాట్, బంతిని కూడా చీరపై ప్రత్యేకంగా చేతితో ఎంబ్రాయిడరీ చేశారట చీర మొత్తం కుంకుమ రంగుబార్డర్‌ను ఇచ్చారు. అలాగే కొంగు (పల్లూ) మీద ‘ఐసీసీ 2019’ ముద్రించడంతోపాటు, 400కి పైగా లోగోలతో ఈ స్పెషల్ ఎడిషన్ చీరను తీర్చిదిద్దారు. వీటి తయారీకి 30రోజుల కన్నా ఎక్కువ సమయమే పట్టిందట. భారత జట్టు ఆటగాళ్లు భార్యలు, లేదా తల్లులకు బహూకరించేలా మొత్తం 16 చీరలను రూపొందించారు. 500 గ్రాముల బరువు ఉన్న పట్టు చీర ధర రూ. 20 వేలు. క్రికెట్ వీరాభిమాని సురేష్ కుమార్ శ్రీవాస్తవ వీటిని స్వయంగా తయారు చేయించారు. స్వయంగా డిజైనర్ అయిన శ్రీవాస్తవ వారణాసి, కొట్వా గ్రామంలోని ముబారక్ అలీ నేతృత్వంలోని చేనేత కార్మికుల బృందం ఈ చీరలను రూపొందించారని తెలిపారు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) విభాగం ఈ ప్రాజెక్టుపై తనకు ప్రోత్సాహమిచ్చిందని శ్రీవాస్తవ వెల్లడించారు. మరోవైపు ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రఖ్యాత సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. -
జంతర్‌మంతర్ వద్ద నేతన్నల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో చేనేత కార్మికుల మరణాలను నిరసిస్తూ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి, సీపీఐ రాజ్యసభ ఎంపీ రాగేష్ నేతన్నల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇప్పటి వరకూ దాదాపు 350 మంది చేనేత కార్మికులు చనిపోయారని తెలిపారు. మరణించిన నేత కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్‌ను సన్మానించిన చేనేత కార్మికులు
-
చేనేతల అభివృద్ధే నా లక్ష్యం : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అకుంటిత దీక్షతో నిరంతరం శ్రమించే చేనేత కార్మికుల కష్టనష్టాలను తీర్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు విశేషస్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాలకు చెందిన ప్రజలు పాదయాత్రతో తమ చెంతకు వస్తున్న వైఎస్ జగన్‌ను కలసి వారి గోడును వెళ్లబోసుకుంటున్నారు. వారి బాధలను కష్టనష్టాలను జననేతతో పంచుకుంటున్నారు. Prosperity of our skilled and hard-working weaving community is my priority. #NationalHandloomDay pic.twitter.com/wKYwYiPr33 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2018 -
చేనేత మానేసి హోటళ్లలో పనిచేస్తున్నారు..
సాక్షి, మంగళగిరి: ‘‘అన్నా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఆప్కోకి ఉత్పత్తులు అమ్మితే 15 రోజుల్లో డబ్బులు వచ్చేవి. ఇప్పుడు సంవత్సరాలు గడిచినా డబ్బులు ఇవ్వట్లేదు...’ ‘మేమేమైనా ఉద్యోగాలు అడిగామా? మా వృత్తిని గౌరవంగా చేసుకుంటామనేగా అంటున్నది..’ వైఎస్సార్ ఉన్నప్పుడు మగ్గంగుంటలోకి నీళ్లొస్తే ఆ కుటుంబాలకు 20 కేజీల బియ్యం, రేషన్ సరుకులను అదనంగా ఇచ్చి ఆదుకునేవారు.. ఇవాళమాత్రం ఆ పరిస్థితి లేదు’ .. ఇవీ.. జననేతతో ముఖాముఖిలో నేతన్నలు చెప్పిన అభిప్రాయాలు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో సమావేశామైన వైఎస్ జగన్.. వారి కష్టాలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాటిచ్చారు. హోటళ్లలో పనిచేస్తున్నాం: గౌరి శంకర్, మంగళగిరి నేతన్న ‘‘చేనేత తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. 45 ఏళ్లు నిండిన ఏ ఒక్కరూ పనిచేసే పరిస్థితిలో లేరు. నేత మానేసి హోటళ్లలో పనికి వెళుతున్నాం. అన్నా.. ఈ ప్రభుత్వాన్ని మేము ఉద్యోగాలు ఇవ్వమనలేదే! మా వృత్తిని గౌరవంగా చేసుకుంటామని అడిగామంతే. వైఎస్సార్ బతికున్న రోజుల్లో చేనేత సెంటర్లు పెట్టాలనే ఆలోచన చేశారు. అన్నా.. మీరు అధికారంలోకి వస్తే.. ఆ సెంటర్ల ద్వారా వయసు మీదపడిన కార్మికులకు పని కల్పించండి. జీఎస్టీ వల్ల మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. సబ్సిడీ ఇచ్చినప్పుడే పోటీ తట్టుకుని నిలబడగలుగుతాం. మహానేత ఉన్నప్పుడు ఆప్కోకు బట్టలు అమ్మితే 15 రోజుల్లోపల డబ్బులు అందేవి. ఇవాళ సంవత్సరమైనా డబ్బులివ్వడంలేదు. అడిడితే.. చేనేత వృత్తి మానేసి వేరే పని చూసుకోండని ఎద్దేవా చేస్తున్నారు’’ ప్రత్యేక హోదాతో నేతన్నలు బాగుపడతారు: వెంకటేశ్వర రావు ‘‘ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు, విద్యావకాశాలే కాదు చేనేత కార్మికులు కూడా బాగుపడతారు. హోదా ఉంటే.. నేతకు అవసరమైన రసాయనాల ఉత్పత్తి పరిశ్రమలు ఇక్కడికే వస్తాయి. కార్మికులు నెలంతా కష్టపడినా 4 వేలకు మించి ఆదాయంలేదు. చేనతలు అందరికీ కనీసం నెలకు రూ.15వేల గిట్టుబాట ధర వచ్చేలా చేయాలి’’ వైఎస్సార ఆదుకున్నారు: లక్ష్మి ‘‘వర్షా కాలంలో మగ్గం తడిసిపోతే, అది ఆరడానికి నెల పైనే పడుతుంది. ఆ కాలమంతా మాకు ఉపాధి ఉండదు. వైఎస్సార్ హయాంలో వర్షాలు కురిసినప్పుడు చేనేత కార్మికులకు 20 కేజీల బియ్యం, నష్టపరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు ఏమీ ఇవ్వడంలేదు. డబ్బులు లేని కారణంగా చేనేత కుటుంబాల్లోని పిల్లలు చదువులకు దూరం అవున్నారు’’ -
చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి
సాక్షి, మంగళగిరి: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికులందరికీ సబ్సిడీ కింద నెలకు రెండు వేల రూపాయలు అందిస్తామని, 45 ఏళ్లు దాటగానే పెన్షన్ వర్తింపజేస్తామని, ఆయా కుటుంబాల ఉన్నతికి, పిల్లల చదువులకు తోడ్పాటు అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు. 133వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళవారం మంగళగిరిలో ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నేతన్నలకు చంద్రబాబు చేసిన మోసాలను వివరించిన ఆయన.. నవరత్నాల్లో భాగంగా రేపు రాబోయే ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏమేం చెయ్యబోతున్నదో వివరించారు. నాలుగేళ్లు మోసపోయాం: ‘‘మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం తదితర నియోజకవర్గాల్లో చేనేత కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క ధర్మవరంలోనే ఇప్పటివరకు 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చనిపోయినవారికి ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని అసలేమీ జరగలేదన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. గత ఎన్నికల్లో వృత్తి కార్మికుల మాదిరి ఫొటోలు దిగి, అందరికీ అన్నీ చేస్తానన్న ఆయన మోసం తప్ప మరేదీ చెయ్యలేదు. చేనేత కార్మికుల రుణమాఫీ అని, ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1లక్ష రుణం అని, బడ్జెట్లో చేనేతలకు ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తానని, ఇళ్లు, మగ్గం షెడ్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. గడిచిన నాలుగేళ్లలో చేనేతలకు 180 కోట్ల రూపాయలకు మించి ఖర్చుచేయని పరిస్థితి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనకేదైనా మంచి జరిగిందా, జీవితాలు నిన్నటికంటే మెరుగయ్యాయా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ దుర్మార్గ పాలనను అంతం చేయాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు. మన ప్రభుత్వం వస్తే నేతన్నను ఆదుకుంటాం: వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వంలో చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, నాటి వైఎస్సార్ చేసిన మంచి పనులకు రెండింతలు ఎక్కువేచేసి, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు ఇదివరకే నవరత్నాల్లో ప్రకటించిన అంశాలను మరోసారి ఆయన గుర్తుచేశారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు మొదలుకొని సబ్సిడీ కింద నెలకు రూ.2వలు అందజేత, 45 ఏళ్లు దాటిని వృత్తి కార్మికులందరికీ నెలకు రూ.2 వేల పెన్షన్, నేతన్నలకు ఇళ్లు కట్టించడంతోపాటు మగ్గం షెడ్ల ఏర్పాటు, వర్షాకాలంలో మగ్గం నీటమునిగితే ఆ కాలానికి గానూ భృతి చెల్లిస్తామని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. వీటితోపాటు అందరికీ వర్తించే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, అవ్వాతాతలకు పెన్షన్ లాంటి పథకాలనూ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. ముఖాముఖి సందర్భంగా పలువురు చేనేత కార్మికులు, మహిళలు జగన్‌తో తమ అభిప్రాయాలను పంచుకుని, సమస్యలను నివేదించారు. -
రిమ్జిమ్.. రిమ్జిమ్.. హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు వచ్చే దేశవిదేశాల ప్రతినిధులకు హైదరాబాద్ అందాలను, చారిత్రక, పర్యాటక స్థలాలను చూపించేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారి మనసు దోచుకొనేలా పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. నగరంతోపాటు తెలంగాణ పల్లె అందాలు, సంస్కృతిని చూపే ఏర్పాట్లు చేసింది. డెలిగేట్లకు ఆతిథ్యమివ్వడంలో, మర్యాదల్లో ఏ లోపానికి తావులేకుండా ఉండేలా హోటల్ మేనేజ్మెంట్, ఆతిథ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆధ్యాత్మిక పర్యటన నగరంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే ఈ పర్యటనలో బిర్లామందిర్, జగన్నాథస్వామి టెంపుల్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చి తదితర ప్రాంతాలు ఉంటాయి. ప్లాజా హోటల్లో భోజన వసతి ఉంటుంది. ఈ టూర్ చార్జీ రూ.6,000. అమెరికా కరెన్సీలో సుమారు 95 డాలర్లు. ఈ పర్యటన ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. విలేజ్ టూర్.. ఈ టూర్లో భాగంగా నగరానికి సమీపంలోని వికారాబాద్‌లో వ్యవసాయ క్షేత్రాలు, సాంప్రదాయ జీవన విధానాన్ని, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. గ్రామాల్లో విదేశీ టూరిస్టులను ఎడ్ల బండ్లపై తిప్పుతారు. చక్కటి పల్లె పర్యటన అనుభూతి కలిగిస్తారు. రుసుము రూ.6,000 (95 డాలర్లు). మైక్రో బ్రేవింగ్ ఎక్స్పీరియన్స్ విదేశీ పర్యాటకులను ఆకట్టుకొనే మరో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఇది. ఆలివ్ బిస్ట్రోలో మైక్రో బ్రేవింగ్ రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మైక్రోబ్రేవింగ్ సందర్శనతో పాటు ఇటాలియన్ డిన్నర్, లైవ్ మ్యూజిక్ ఉంటాయి. రుసుము రూ.6,000 (95 డాలర్లు). క్రాఫ్ట్ అండ్ కల్చరల్ టూర్ తారామతి బారాదరిలో పతంగుల ఉత్సవం, సాంస్కృతిక ప్రదర్శన, భారతీయ వంటకాల తయారీ, ఇక్కత్ చేనేత వస్త్రాలు, హస్తకళలు వంటివి ఉంటాయి. ఈ సందర్శనకు రూ.12,000 రుసుము (125 డాలర్లు). భోజనం, రవాణా తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వీటితోపాటు గోల్ఫ్ టూర్, సైక్లింగ్ టూర్, రామోజీ ఫిల్మ్‌సిటీ, గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో టూర్లు కూడా ఉన్నాయి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, గోల్కొండ ఎంపోరియం తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. బొట్టుపెట్టి ఆహ్వానం.. తోడుగా గైడ్లు పలుదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను సాదరంగా నగరానికి ఆహ్వానించేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ బృందం ఈ నెల 27నుంచే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంటుంది. విమానాశ్రయానికి చేరుకునే ప్రతినిధులందరికీ సాదర స్వాగతం పలుకుతూ నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. అనంతరం వారిని ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తీసుకెళ్తారు. విమానాశ్రయం నుంచి ఆర్టీసీ, పర్యాటక శాఖ బస్సుల్లో ప్రతినిధులు బస చేసే హోటళ్లకు తీసుకెళతారు. ప్రతి బస్సులో ఇద్దరు గైడ్స్ ఉంటారు. అలాగే నగరానికి రానున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు బస చేయనున్న 20 హోటళ్లలోనూ శిక్షణ పొందిన గైడ్స్ ఉంటారు. హోటళ్ల నుంచి హెచ్ఐసీసీకి, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వారు తమ సేవలు అందజేస్తారు. 28 నుంచి 30 వరకు సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీతో పాటు ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట, చార్మినార్, లాడ్ బజార్ తదితర ప్రాంతాల్లోనూ పర్యాటకాభివృద్ధి సంస్థ గైడ్లు ఉంటారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి శిక్షణ పొందిన వారిని కూడా నగరానికి రప్పించారు. కులీకుతుబ్‌షా టూంబ్స్ సందర్శన హైదరాబాద్ చారిత్రక, వారసత్వ కట్టడాల పర్యటనలో భాగంగా రూపొందించిన ‘హైదరాబాద్ హెరిటేజ్ టూర్’లో కులీకుతుబ్‌షా టూంబ్స్, గోల్కొండ కోట, తారామతి బారాదరి సాంస్కృతిక వేదిక ఉంటాయి. భోజన సదుపాయంతో కూడిన ఈ టూర్లో తారామతి బారాదరి వద్ద తోలుబొమ్మలాట వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, ముత్యాలు, గాజుల ప్రదర్శన, చేనేత వస్త్రాల తయారీ వంటి ప్రదర్శనలు ఉంటాయి. ఈ పర్యటన రుసుము రూ.5,000. అమెరికా కరెన్సీలో 80 డాలర్లు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ టూర్ ఉంటుంది. పోచంపల్లి చీరలతో వలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో.. సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీ వద్ద 300 మంది యువతులు పోచంపల్లి చీరలను ధరించి వలంటీర్లుగా విధులు నిర్వహించనున్నారు. ప్రతినిధులకు కావాల్సిన సదుపాయాలను.. సలహాలు, సూచనలను అందజేస్తారు. వేదిక వద్ద అందుబాటులో ఉండి అవసరమైన సహాయం చేస్తారు. -
ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్
సాక్షి, అనంతపురం : చేనేతల రుణమాఫీ డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్‌తో ధర్మవరంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం పట్టణంలో అధికారులు చేనేత సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలు సదస్సు వేదిక వద్దకు చేరుకుని రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం..ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై అధికారులను నిలదీశారు. చేనేత కార్మికుల పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. చేనేత సదస్సును అడ్డుకోవటంతో వైఎస్ఆర్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేస్వామి సహా పలువురు చేనేత కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. -
సిరిసిల్ల చీర.. పేదింటికి సారె!
- ఆడపడుచులకు బతుకమ్మ కానుక - తెల్లకార్డు కుటుంబాలకు పంపిణీ - నేతన్నకు ఉపాధి ధీమా.. రూ.113 కోట్ల విలువైన చీరలకు ఆర్డర్లు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ కానుకగా పేదింటి ఆడపడుచులకు సిరిసిల్ల చీరలను పంపిణీ చేసే కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. అటు చేనేతలకు, ఇటు పేద కుటుంబాలకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారక రామారావు సంబంధిత అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సిరిసిల్లలో మరమగ్గాలపై తయారు చేసే చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేయటం ద్వారా.. అక్కడి నేతన్నలకు ఆర్థికంగా భరోసా కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబురాల సమయంలో పేదింటి ఆడపడుచులకూ చీరలు పంపిణీ చేస్తే పేద కుటుంబాలకు చిరు కానుక అందించినట్లు ఉంటుందని సర్కారు నిర్ణయం తీసుకుంది. 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు.. రాçష్ట్రంలో దాదాపు 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డు కుటుంబాలన్నింటికీ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు అవసరమయ్యే చీరల తయారీకి ఇప్పటికే చేనేత, జౌళి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయిం చేందుకు సీఎం కూడా ఆమోదం తెలిపారు. కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులతో సంక్షోభంలో ఉండే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు దోహదపడేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నేతన్నకు చేతినిండా పని.. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికినట్లయింది. ఇప్పటికే రాజీవ్ విద్యామిషన్ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్, కేసీఆర్ కిట్లలో చీరల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకే అప్పగించింది. యూనిఫామ్‌కు అవసరమయ్యే 1.03 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేసీఆర్ కిట్ల పంపిణీలో భాగంగా 1.18 లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది బతుకమ్మ పండగకు 86 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలంటే.. దాదాపు 5.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే చీరల తయారీ మొదలైంది. చేనేత, జౌళి శాఖ బతుకమ్మ చీరలకు ఇచ్చిన ఆర్డర్ల విలువ దాదాపు రూ.113 కోట్లు. ఒక్కో బతుకమ్మ చీరకు ప్రభుత్వం రూ.230 ధర చెల్లించనుంది. ప్రస్తుతం ఎనిమిది రకాల రంగులతో ఈ చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. వృద్ధులకు 8 రంగుల చీరలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారికి 40 రకాల ప్రింటింగ్ చీరలను బతుకమ్మ పండుగకు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సెప్టెంబర్ 1 నాటికి ఆర్డర్లు పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 15 వేల మంది బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఉపాధి పొందుతున్నారని చేనేత, జౌళి శాఖ అంచనా వేసింది. -
నేతన్నలకు చేయూతనివ్వండి
- ప్రధానిని కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): చేనేత కార్మికులకు చేయూతనిచ్చి ఆత్మహత్యలు నివారించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రధాని మోదీని కోరారు. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రధానితోపాటు జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన ఇచ్చారు. ఒక్క కర్నూలు నియోజకవర్గంలోనే సుమారు 2 లక్షల మంది చేనేత కార్మికులున్నారని, పేదరికం కారణంగా వారు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోలేక, గిట్టుబాటు ధరలు పొందలేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు. చేనేత వస్త్రాలను నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ ద్వారా మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించి, ఆధునిక పరికరాలు వాడే విధంగా ప్రోత్సాహం అందించాలని కోరారు. చేనేతలకు గృహంతో కూడిన వర్క్‌షెడ్ నిర్మాణ పథకం వర్తింపజేయాలన్నారు. ఎంఎన్‌ఆర్‌జీఈఏతో పాటు ఇతర పథకాలను అమలు చేయాలని, పేదరికం నుంచి విముక్తి కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీ బుట్టా రేణుక పార్లమెంటులో ప్రధాని, మంత్రిని కోరారు. -
ఒకే దారం.. ఎందుకీ అంతరం!
- కోటీశ్వరులుగా యజమానులు.. కోటి కష్టాల్లో కార్మికులు, ఆసాములు - సిరిసిల్లలో మారని నేతన్న తలరాత సాక్షి, సిరిసిల్ల: వస్త్ర పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సిరిసిల్లలో వైరుధ్యాలకు సజీవ తార్కా ణాలెన్నో! ఒకే వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కొందరు రూ.లక్షల్లో సంపాదిస్తుంటే.. మరికొంతమంది ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని వస్త్ర పరిశ్రమ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలోనూ బలవన్మరణాలు తప్పడం లేదు. నేత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ.వందల కోట్లు, అప్పుల ఊబి నుంచి నేతన్నలను బయట పడేయలేకపోతున్నాయి. ఎందుకీ అంతరం? ఒకే వృత్తి.. ఒకే వస్త్ర పరిశ్రమ.. కొందరు కోటీశ్వరులు.. మరికొందరిది దుర్భర దారిద్య్రం.. ఆత్మహత్యలు.. ఏమిటి ఈ అంతరం..? అంటూ రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ గత నెలలో సిరిసిల్లలో యజమానులు, ఆసాములు, కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రశ్నించారు. ఓ వైపు యజమానులు నెలకు సుమారు రూ.3 నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తుంటే.. మరోవైపు కార్మికులు, ఆసాములు ఉపాధి కరువై ప్రాణాలు తీసుకొంటున్న విచిత్ర వైనం సిరిసిల్లలో ఏళ్లుగా కొనసాగుతోంది. నేత కార్మికులకు శాశ్వత ఉపాధి చూపించాలనే సంకల్పంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులకు ఎన్నో చిక్కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతులు వ్యాపారం చేస్తుంటే.. పెట్టుబడులు పెట్టలేని వాళ్లు కార్మికులుగా మారడం ఏ రంగంలోనైనా సాధారణమే. కానీ ఒకే పరిశ్రమపై ఆధారపడిన వాళ్లలో కొందరు కోటీశ్వరులవుతుంటే కొందరిౖకైనా కనీస ఉపాధి దక్కాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. కార్మికుల శ్రమ దోపిడీ ఇదీ.. వస్త్ర పరిశ్రమలో యజమానులు, ఆసాములు, కార్మికులు అనే మూడంచెల వ్యవస్థ కొనసాగుతోంది. పెట్టుబడిదారులు యజమానులైతే.. లూమ్‌లు నడిపించేది ఆసాములు. కూలీ పనిచేసేది కార్మికులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 100 మంది యజమానులు, దాదాపు 2,500 మంది ఆసాములు, అన్ని విభాగాల్లో దాదాపు 15 వేల మంది కార్మికులు ఉన్నారని అంచనా. రోజుకు 12 గంటలు పనిచేస్తున్నా కార్మికుల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. 2014లో ఒకసారి, 2015లో మరోసారి కార్మికులకు చెల్లించే కూలీ పెంచేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ చొరవతో ఒప్పందం కుదిరింది. 10 పిక్కులకుగాను అంతకుముందు రూ.0.17 పైసలు చెల్లిస్తుండగా.. రూ.0.20 పైసలకు పెంచాలని నిర్ణయించారు. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ కొద్ది రోజులపాటు రూ.0.20 పైసల కూలీని అమలు చేసి.. మళ్లీ పాత రూ.0.17 పైసలు మాత్రమే చెల్లించారు. దీంతో రోజుకు 12 గంటలు పనిచేసినా.. కార్మికుడి ఆదాయం నెలకు రూ.5 వేలు దాటడం లేదు. ఆసాములదీ అదే దుస్థితి.. యజమానుల నుంచి నూలు కొనుగోలు చేసి, కార్మికులకు పని కల్పిస్తూ లూమ్‌లపై వస్త్రాన్ని తయారు చేసే ఆసాముల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్‌కు అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయడానికి ఆసాములకు సరిపడా పెట్టుబడి ఉండడం లేదు. పాత మగ్గాలపై పాలిస్టర్ తప్ప మార్కెట్ డిమాండ్‌కు తగిన ఉత్పత్తులు రావడం లేదు. దీంతో సహజంగానే యజమానులపై ఆసాములు ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంగా మళ్లీ పెట్టుబడి పెట్టిన యజమానులే అధిక లాభం పొందుతున్నారు. పైపెచ్చు వస్త్రాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం.. బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఆసాములు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వమే ఆర్డర్లు ఇస్తున్నా.. ఆసాములు, కార్మికుల పరిస్థితి మెరుగుపడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల యూనిఫారాలకు దాదాపు కోటి 15 లక్షల మీటర్ల వస్త్రాన్ని తయారు చేసి అందించినా.. యజ మానులు తప్ప ఆసాములు, కార్మికుల బతుకులు పెద్దగా బాగుపడ్డ దాఖలాలు కనిపించ డం లేదు. పైగా కొందరు యజమానులే బోగస్ మ్యాక్స్ సొసైటీలు సృష్టించి బిల్లులు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆసామి ఆత్మహత్య సాంచాల షెడ్డులో ఉరేసుకుని బలవన్మరణం సిరిసిల్ల టౌన్: నెలరోజులుగా సాంచాలు నడవక ఉపాధి కోల్పోవడం.. చేసిన అప్పులు భారమవడంతో సిరిసిల్లలో బుధవారం సత్యనారాయణ(52) అనే ఆసామి తన సాంచాల షెడ్డులోనే ఉరేసుకుని చనిపోయాడు. వెంకంపేటకు చెందిన ఈయన పది సాంచాల ద్వారా కాటన్ వస్త్రాన్ని(కేస్మిట్) ఉత్పత్తి చేస్తాడు. మూడేళ్ల క్రితం కూతురికి వివాహం చేశాడు. ఏడాది కిందటే కొడుకు కాలు విరగడంతో అప్పు తెచ్చి వైద్యం చేయించాడు. ఇలా కుటుంబ అవసరాల కోసం ఇప్పటి వరకు రూ.6లక్షలు అప్పు చేశాడు. వీటికితోడు వస్త్రోత్పత్తిదారులకు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కడం లేదు. చేతిలో పైసల్లేక, అప్పులు తీర్చే దారిలేక సత్యనారాయణ నెల రోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో అందరితో మాట్లాడిన ఆయన.. బుధవారం తెల్లారేసరికి సాంచాల షెడ్డులో ఉరేసుకుని కనిపించాడు. కార్మికులకు రోజు రూ.600 వచ్చేలా చూడాలి కార్మికులకు రోజుకు రూ.600 కూలీ వచ్చేట్లు చట్ట సవరణ చేయాలి. ఇది జరగాలంటే ఆసాములకు పెట్టుబడి కోసం బ్యాం కుల నుంచి రుణ సౌకర్యం కల్పించాలి. బిల్లులు త్వరగా ఇప్పించాలి. లేదంటే కార్మికుల పేరిట ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు యజమానుల ఖాతాల్లోకి వెళ్లడం తప్ప ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. – సామల మల్లేశం, గౌరవ అధ్యక్షుడు, పవర్‌లూం కార్మిక సంఘం -
నేతన్న రాత మారుస్తాం
చేనేత, మరమగ్గ కార్మికులను ఆదుకునేందుకు త్రిముఖ వ్యూహం: సీఎం కేసీఆర్ - సబ్సిడీలు.. ఆర్థిక సాయం.. ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు - కార్మికులకు నెలకు రూ.15 వేలకు తగ్గకుండా వేతనం అందాలి - పవర్లూమ్ యజమానులకు చేయూతనిస్తాం - కార్మికుల కోసం పొదుపు పథకం అమలు చేస్తాం - సిరిసిల్లలో అపెరల్ పార్క్, 4 గోదాములు ఏర్పాటు చేస్తాం - నిల్వలకు సహకార బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తాం - నేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్ చేనేత మగ్గాలు, మర మగ్గాల కార్మికులందరూ మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానం రూపొందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నేత కార్మికుల జీవితాల నుంచి దుఃఖం పోవాలని, వారి తలరాతలు మారాలని ఆకాంక్షించారు. వారి సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే బడ్జెట్లోనే అందుకు నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు. ‘‘రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రతీ కుటుంబం గౌరవంతో బతికే వేతనం పొందాలన్నది సంకల్పం. ఈ వృత్తిపై జీవించే పద్మశాలీల సంక్షేమానికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తాం. చేనేత మగ్గాలపై పనిచేసే వారున్నారు.. మరమగ్గాల్లో కూలీలుగా పనిచేస్తున్న వారున్నారు.. వృత్తిని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకున్నవారున్నారు.. వీరందరి కోసం త్రిముఖ వ్యూహంతో చర్యలు చేపడతాం..’’అని తెలిపారు. నేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారమిక్కడ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్ లూమ్ పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వీరందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న సీఎం త్రిముఖ వ్యూహంతో నేత కార్మికులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. నూలు, రసాయనాలపై సబ్సిడీ ప్రతి మగ్గాన్ని లెక్కించి చేనేతపై ఆధారపడిన వారిని గుర్తించాలని అధికారులకు సీఎం సూచించారు. ‘‘నారాయణపేట, గద్వాల, పోచంపల్లిలో కళాత్మక వస్త్రాలు తయారు చేసే వారున్నారు. అంతర్జాతీయ డిమాండ్ ఉన్న ఆ వస్త్రాలను తయారీ చేసే వారిని ప్రోత్సహించే విధానం రూపొందించాలి. చేనేత మగ్గాలపై సాధారణ వస్త్రాలు నేసే వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలి. నూలు, రసాయనాలను సబ్సిడీపై అందించాలి. వారు తయారు చేసే వస్త్రాలన్నింటినీ ప్రభుత్వం తరఫునే కొనుగోలు చేయాలి. మార్కెటింగ్ సమస్యలు రాకుండా చూడాలి’’అని అన్నారు. నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి రెండుసార్లు కళ్లవెంట నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ‘‘కరీంనగర్ ఎంపీగా ఉన్పప్పుడు ఓ రోజు పేపర్లో సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికుల మృతి అనే వార్త వచ్చింది. అది చూడగానే మనసు చలించింది. ఏడ్చినంత పనైంది. తిండికి లేక కార్మికులు మరణించడం బాధనిపించింది. సిరిసిల్ల కార్మికులకు ఎంతో గొప్ప పేరుంది. వారిలా చావడమేంటి.. అని ఆలోచించాను. ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు. అప్పుడు నేనే పూనుకొని టీఆర్ఎస్ తరఫున రూ.50 లక్షలు సిరిసిల్లకు పంపా. అక్కడున్న సొసైటీ ఆ డబ్బులను అవసరమున్న వారికిచ్చి ఆదుకుంది. మరో సందర్భంలో పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు మరణించారనే వార్త చూసిన. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికుల బాధలు చూసి ఏడ్చిన. నేనే స్వయంగా భిక్షాటన చేసిన. రూ.4 లక్షలు జమచేసి వారికి అందజేసిన. ఈ బాధ తెలంగాణలో కొనసాగవద్దనేది నా ఆకాంక్ష. అందుకోసమే ఈ ప్రయత్నం’’అని ముఖ్యమంత్రి అన్నారు. పవర్ లూం కార్మికులకు రూ.15 వేల వేతనం ‘‘రాష్ట్రంలో పవర్‌లూమ్‌లు సిరిసిల్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రేపియర్ మగ్గాల స్థాయికి పవర్‌లూమ్‌లను ఆధునీకరించాలి. ఇప్పుడున్న మరమగ్గాలతో రోజుకు 40 మీటర్ల బట్ట ఉత్పత్తి అయితే, రేపియల్ మగ్గాల ద్వారా 150 మీటర్లకుపైగా తయారవుతుంది. దీంతో యజమానులకు లాభాలొస్తాయి. ఈ ఫలితం కార్మికులకు దక్కాలి. కార్మికులకు ప్రతి నెలా రూ. 15 వేలకు తగ్గకుండా వేతనం అందాలి. రూ.15 వేల నుంచి రూ. 20 వేల ఆదాయం తప్పక రావాలి’’అని సీఎం చెప్పారు. ‘‘పవర్‌లూమ్‌లు నడిపే యజమానులకు అవసరమైన చేయూతను ప్రభుత్వం అందిస్తుంది. త్రిఫ్ట్ స్కీమ్ (పొదుపు పథకం) అమలు చేయాలి. కార్మికుడు ఎంత మొత్తం పొదుపు చేస్తే అదే నిష్పత్తిలో యజమానులు, ప్రభుత్వం కూడా అతని పేరిట జమ చేయాలి. ఈ పొదుపు డబ్బు కార్మికుడి కుటుంబానికి ఉపయోగపడాలి. వేతనాలను బ్యాంకుల ద్వారానే చెల్లించాలి. పవర్లూమ్ పరిశ్రమను ప్రోత్సహించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దుస్తులు, హాస్టళ్లు, హాస్పిటళ్ల దుప్పట్లు, ఇతర యూనిఫారాలు తెలంగాణ నేత కార్మికులు ఉత్పత్తి చేసినవే వాడుతారు. నూలు, రసాయనాలపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది’’అని సీఎం అన్నారు. కుటుంబాలను పోషించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది పద్మశాలీలు వృత్తిని వదిలి ఇప్పటికే ప్రత్యామ్నాయ ఉపాధి ఎంచుకున్నారు. దీంతో ఆసక్తి ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెడీమేడ్ దుస్తుల రంగంలోకి మహిళలు సిరిసిల్లలో అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నేత కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి వారిని రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలోకి దింపుతామన్నారు. అపెరల్ పార్కు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. నూలు, వస్త్రాలను నిల్వ చేసుకునేందుకు సిరిసిల్లలో నాలుగు గోదాములు నిర్మిస్తామన్నారు. నిల్వ చేసుకునే యజమానులకు సహకార బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. పవర్లూమ్లకు రుణ సౌకర్యం కల్పించేందుకు మొదటి ఏడాది రూ.100 కోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకును సీఎం ఆదేశించారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో మూత పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నంబర్ వన్‌గా వరంగల్ టెక్స్టైల్ పార్కు వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలో నేత పరిశ్రమకు మహర్దశ వస్తుందని సీఎం చెప్పారు. ‘‘షోలాపూర్‌లో చద్దర్లు, సూరత్‌లో చీరలు, తిర్పూరులో ఇతర వస్తువుల తయారీ జరుగుతుంది. ఈ మూడింటి సమాహారంగా వరంగల్ పార్కు నెలకొల్పుతాం. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఇటీవలే తిర్పూరు సందర్శించి వచ్చింది. అదే పద్ధతిలో వరంగల్ టెక్స్ టైల్ పార్కు ఉంటుంది. దేశంలోనే నంబర్ వన్ టెక్స్టైల్ పార్కుగా దీన్ని తీర్చిదిద్దుతాం. సిరిసిల్ల పవర్ లూమ్స్‌ను వరంగల్ టెక్స్టైల్ పరిశ్రమకు అనుసంధానం చేస్తాం’’అని వివరించారు. స్వాగతించిన సిరిసిల్ల ప్రతినిధులు సమావేశానికి హాజరైన పద్మశాలి సంఘం నాయకుల, నేత పరిశ్రమ ప్రముఖులు సీఎం నిర్ణయాలను స్వాగతించారు. ప్రభుత్వం చేయూత అందితే తాము కార్మికులకు నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా వేతనం బ్యాంకులో వేస్తామని సీఎం సమక్షంలో అంగీకరించారు. ఈ సందర్భంగా నూలుతో తయారు చేసిన దండను, వస్త్రాలను, చేనేత మగ్గాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. అనంతరం సీఎం వారందరితో కలిసి భోజనం చేశారు. -
బడా వస్త్రవ్యాపారులకే వత్తాసు
అధికారుల తీరు సరికాదు ► చున్నీ వస్త్రం కొనుగోళ్లలో పక్షపాతం ► మ్యాక్స్ సంఘాలకు చెప్పకుండానే నిర్ణయం ► ఒకే వస్త్రవ్యాపారిపై జౌళిశాఖ అమిత ప్రేమ ఏమిటి? ► జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగిన నేతకార్మికులు సిరిసిల్ల : చేనేత, జౌళిశాఖ అధికారులు వస్త్రం కొనుగోళ్లలో బడా వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని నేతకార్మికులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వస్త్రం కొనుగోళ్ల గోదాం వ ద్ద ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులకు యూ నిఫామ్స్ అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా నేతకార్మికుల నుంచి 1.14 కోట్ల మీటర్ల వ స్రా్తన్ని చేనేత జౌళిశాఖ అధికారులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో బాలికలకు అవసరమైన ఓనీ(చు న్నీ) బట్ట సుమారు 51వేల మీటర్లు తక్కువ పడడంతో మళ్లీ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చిందన్నారు. కానీ, సంఘాలకు సమాచారం ఇవ్వకుండా ఓ ప్రముఖ వస్త్రవ్యాపారి ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు ప్రశ్నించారు. ఒక్కో మీటర్ ఓనీ వస్రా్తనికి రూ.31 చెల్లిస్తున్నారని, ఈ లెక్కన 51 వేల మీటర్ల వస్రా్తన్ని రూ.15.81 లక్షలతో కొనుగోలు చేస్తున్నారని అన్నా రు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అయిన ఆ వస్త్రవ్యాపారి వద్దనే ఓనీ బట్టను కొనుగోలు చేయడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆసాములు కోరారు. ఈసందర్భంగా గోదాములో వస్త్రం కొనుగోళ్లను అడ్డుకున్నారు. మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు మంచికట్ల భాస్కర్, చిమ్మని ప్రకాశ్, పోలు శంకర్, మూషం రాజయ్య, వెల్దండి శంకర్, గౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ చెప్పాం.. ఎవరూ స్పందించలేదు – వి.అశోక్‌రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ ఓనీ వస్త్రం ఉత్పత్తి చేయాలని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులదరికీ చెప్పాం. ఎవరూ స్పందించలేదు. కొన్ని సంఘాల ద్వారా కొనాలని భావించాం. కానీ 51 సంఘాలకు ఈఆర్డర్లు ఇస్తే ఒక్కో సంఘం వెయ్యి మీటర్లు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అవుతుంది. ఒక్క బీము రెండు వేల మీటర్లు ఉంటుంది. ఎవరికీ సరిగా పని సాధ్యం కాదు. ఇప్పటి వరకు 20వేల మీటర్ల ఓనీ బట్టను కొన్నాం. ఇంకా ఎవరైనా ఇస్తే కొనుగోలు చేస్తాం. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. -
నేతన్న బతికి 'బట్ట' కట్టేదెలా?
సిరిసిల్లలో పేరుకుపోయిన 8.1 కోట్ల మీటర్ల వస్త్ర నిల్వలు ► నెలరోజులుగా కొనేవారే లేరు ► నూలు ధర ఆకాశంలో.. బట్ట ధర పాతాళంలో ► దారం ధర పెరిగి గిట్టుబాటుకాని వస్త్రం తయారీ ► గోరు చుట్టుపై రోకటి పోటులా ‘పెద్దనోట్ల రద్దు’ ► కొనుగోలుకు ముందుకురాని సేట్లు ► వస్త్రోత్పత్తిదారుల ఇళ్ల నిండా బట్టల గుట్టలే.. సిరిసిల్ల: పాతిక వేల మంది నేతన్నలకు ఉపాధి కల్పించే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. దారం ధరలు అమాంతం పెరిగినా బట్ట ధర పెరగకపోవడంతో జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ వస్త్రం నిల్వలు పేరుకుపోయాయి. కొనేవారే లేకపోవడంతో ఏ ఆసామి, వస్త్రోత్పత్తిదారు ఇల్లు చూసినా పాలిస్టర్ వస్త్రంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నెలరోజులుగా సిరిసిల్లలో ఏకంగా 8.10 కోట్ల మీటర్ల వస్త్రం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో వస్త్రోత్పత్తిదారుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా తయారైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పాలిస్టర్ నూలు(దారం) ధరలు ఒక్కసారిగా చుక్కలనంటాయి. దారం ధర పెరిగినా ఉత్పత్తి అయిన బట్టకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ సంక్షోభం తలెత్తింది. కిలోపై రూ.15 పెరుగుదల తెలంగాణ, ఏపీలో మొత్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 33 వేల మరమగ్గాలు పనిచేస్తున్నాయి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. పక్షం రోజుల క్రితం రూ.93 ఉన్న కిలో నూలు ధర ఒక్కసారిగా రూ.108కి చేరింది. దీంతో వస్త్రోత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. సిరిసిల్లకు గుజరాత్‌లోని సిల్వాస, పాపి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి నూలు దిగుమతి అవుతోంది. ఒక్కో లారీలో 12 టన్నుల మేర నూలు వస్తోంది. ప్రతినెలా సిరిసిల్లకు 200 లారీల వరకు నూలు దిగుమతి అవుతోందని అంచనా. ఈ లెక్కన 2400 టన్నుల నూలు వస్తోంది. నూల ధరలు పెరగడంతో వ్యాపారులు గతంలో కంటే ప్రస్తుతం ప్రతినిత్యం రూ.12 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమకు ఇది మోయలేని భారంగా మారింది. పెరగని బట్ట ధరలు పాలిస్టర్ వస్త్రం మీటరుకు రూ.6.50 ధరతో అమ్ముడవుతోంది. నూలు ధర పెరిగినా బట్ట ధర మాత్రం అంతే ఉంది. దీనికితోడు అసలు పాలిస్టర్ వస్త్రాన్ని కొనేవారే లేకపోవడంతో నిల్వలు గుట్టల్లా పేరుకుపోయాయి. ఒక్కో మగ్గంపై వంద మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతోంది. ఈ లెక్కన నిత్యం 27 లక్షల మీటర్ల బట్ట వస్తోంది. పెరిగిన ధరలతో పోలిస్తే మీటర్ వస్త్రానికి రూ.7.10 నుంచి రూ.7.50 వరకు ధర పలికితేనే వస్త్రోత్పత్తిదారులకు గిట్టుబాటు అవుతుంది. కానీ హైదరాబాద్‌లోని సేట్లు బట్ట కొనుగోలు చేయకుండా సిండికేట్‌గా మారి ధరను పెంచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులిమీద పుట్రలా నోట్ల రద్దు.. నూలు తయారీకి ముడిసరుకు క్రూడ్ ఆయిల్. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా నూలు ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడూ అదే జరిగింది. దీనికితోడు పెద్దనోట్ల రద్దు ప్రభావం కూడా వస్త్రోత్పత్తి రంగంపై పడింది. నూలు కొనుగోలు వే బిల్లులు, ట్యాక్స్‌లు చెల్లించి జరుగుతుండగా.. వస్త్రం అమ్మకాల్లో మాత్రం జీరో దందా సాగుతోంది. హైదరాబాద్‌లోని సేట్లు ఇప్పటి వరకు నేరుగా బట్ట కొని నగదు ఇచ్చేవారు. ఇప్పుడు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరగాలన్న నిబంధనలు విధించడంతో వారంతా బట్ట కొనుగోళ్లను తగ్గించారు. దీంతో నేతన్నల పరిస్థితి అయోమయంగా మారింది. బట్టను అడిగేవాళ్లే లేరు నెల రోజులుగా బట్టను అడిగేవారే లేదు. ఇప్పుడు దారం ధరలు పెరడంతో ఇబ్బందిగా ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా దాని ప్రభావం వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా ఉంటోంది. ఇంటి నిండా గట్టాలతో నిండిపోయింది. వస్త్ర ఉత్పత్తి వ్యయానికి మార్కెట్లో ధరకు చాలా వ్యత్యాసం ఉంది. -బూట్ల నవీన్, వస్త్ర వ్యాపారి నిల్వలు పేరుకుపోయాయి పాలిస్టర్ ఉత్పత్తి చేసే ఆసాములు, యజమానుల ఇళ్లలో భారీగా వస్త్రం నిల్వలు పేరుకుపోయాయి. పాలిస్టర్ నూలు ధరలు భారీగా పెరిగాయి. దీంతో నష్టానికి అమ్ముకోలేకపోతున్నాం. బట్టకు ధర పెరిగితేనే గిట్టుబాటు అవుతుంది. -గోవిందు రవి, పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పదిహేను రోజులకు పగార్ ఇస్తుండ్రు మునుపు సేట్లు వారం వారం కూలి పైసలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు పదిహేను రోజులకు ఇస్తుండ్రు. బట్ట అమ్ముడుపోతలేదు. సాంచాలు నడిపితేనే ఇల్లు గడుస్తుంది. నా భార్యకు బీడీల పైసలు కూడా సక్కంగ అత్తలేవు. ఇటేమో బట్ట అమ్ముడు పోతలేదు. -బాస బత్తిని వెంకటేశ్, నేత కార్మికుడు -
రాయితీకి రాం రాం
ధర్మవరం టౌన్ : జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిచ్చిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యంతో సంక్షోభంలో చిక్కుకుపోయింది. మరోవైపు ముడిపట్టు రాయితీ పథకం అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు కేవలం 12 నెలలకు మాత్రమే రాయితీ నేతన్నల ఖాతాల్లో జమ అయ్యింది. మిగతా 18 నెలల బకాయి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించకుండా రాయితీని రూ.1000కి పెంచుతున్నట్లు చెప్పి, బకాయిలను ఎగ్గొట్టేందుకు సిద్ధమైంది. దీంతో నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. అందని ముడిపట్టు రాయితీ జిల్లాలో చేనేత సంక్షోభంతో 2012 మార్చి నెలలో ప్రభుత్వం ముడిపట్టుపై రాయితీ ఒక్కో చేనేత కుటుంబానికి ప్రతినెలా రూ.600 బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ముడిపట్టుపై రాయితీ పథకాన్ని అమలయ్యేలా కృషి చేశారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ధర్మవరం పట్టణంలో పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా ముడిపట్టుపై రాయితీ నెలకు రూ.600 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. సెరికల్చర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో తొలుత నేత కార్మికుడు ముడిపట్టును కొనుగోలు చేసి, ఆతర్వాత బిల్లులను కార్యాలయంలో సమర్పిస్తే పరిహారాన్ని ఖాతాలో జమ చేసేవారు. ఎన్ని కుటుంబాలకు వర్తిస్తుందంటే.. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, సోమందేపల్లి, గోరంట్ల, యాడికి, కోటంక, సిండికేట్ నగర్ తదితర ప్రాంతాల్లో 27 వేల చేనేత కుటుంబాలు ముడిపట్టుపై రాయితీని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 11,400 మంది లబ్ధిదారులు రాయితీ పొందాల్సి ఉంది. హామీలతో సరిపెట్టారు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండున్నర ఏళ్లపాటు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కేవలం 12 నెలల పాటు మాత్రమే ఈ పథకం కొనసాగింది. ఆగస్టు నెల మొదటి వారంలో జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ముడిపట్టు రాయితీ పరిహారం అందిస్తామని, పరిహారం పెంపు రూ.వెయ్యికి పెంచుతున్నామని చేనేతలకు హామీ ఇచ్చారు. అనంతరం నవంబర్ 21న చేనేత మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా పర్యటనకు వచ్చి రూ. 25 కోట్లు నిధులను విడుదల చేశారు. అయితే ఈ నిధులు అక్టోబర్ నెల నుంచి రాయితీకి వర్తిస్తుందని రూ.1000 చొప్పున పరిహారం ప్రతి కార్మికుడికీ అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే పెండింగ్‌లో ఉన్న 18 నెలల బకాయిల గురించి మాత్రం నోరు మెదపలేదు. ముడిపట్టు రాయితీ బకాయి రూ.28 కోట్లు ముడిపట్టు రాయితీ బకాయిలు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని ఎగ్గొట్టి, రాయితీ రూ.1000కి పెంచుతామని చెప్పిన చేనేత మంత్రి కొల్లు రవీంద్ర రూ.25 కోట్లు మంజూరు చేశారు. నిధులు విడుదల చేసి నెలలు గడుస్తున్నా, ఇంత వరకు పరిహారం జమకాక పోవడంతో నేత కార్మికులు ఆందోâýæన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పరిహారం పెంచుతుండటంతో అధికార పార్టీ నాయకులు సెరికల్చర్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి పాసుపుస్తకాల విచారణ పేరుతో అర్హులను తొలగించి, ఆ స్థానంలో టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు విమర్శలున్నాయి. చేనేత రంగ సంక్షోభ రీత్యా పరిహారాన్ని నెలనెలా కార్మికుల ఖాతాలో జమ చేసి, పెండింగ్ ఉన్న బకాయిలను సత్వరం అందించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. -
సిల్క్ సబ్సిడీ ఏమైంది?
– కష్టాల్లో చేనేత కార్మికులు – రుణమాఫీ జమ చేయాలి – సబ్‌కలెక్టరేట్ ఎదుట ఆందోళన మదనపల్లె రూరల్: పట్టు పాసుపుస్తకాలు కలిగిన చేనేత కార్మికులకు ప్రభుత్వం గతంలో ఇస్తున్న నాలుగు కిలోల సిల్క్ సబ్సిడీని అమలుచేయాలంటూ చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా చేనేత ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు బి.త్యాగరాజు మాట్లాడుతూ మదనపల్లెలో సుమారు 15వేల మంది చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నారన్నారు. నిమ్మనపల్లె, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు, కురబలకోట, వాల్మీకిపురం, కలకడ, కలికిరి మండలాల్లోని చేనేత కార్మికులు పట్టుపాసుపుస్తకాలు కలిగి ఉన్నారని చెప్పారు. గతంలో ప్రతినెలా వీరికి 1కేజీ సిల్కుపై రూ.150 చొప్పున నాలుగు కేజీల వరకు రూ.600 ప్రభుత్వ రాయితీ వస్తుండేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ స్కీమును అమలుచేయకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఆ స్కీం అమలుచేయాలని అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోగా రూ.1కోటి 64లక్షల రూపాయలు మంజూరుచేసినట్లు తెలిసిందన్నారు. కానీ ఇప్పటివరకు ఆ రాయితీ పైకం లబ్ధిదారులకు అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం తమకు రావాల్సిన సబ్సిడీని తమ ఖాతాలకు జమచేసి పథకాన్ని నిరంతరం కొనసాగేలా చొరవతీసుకోవాలని, రుణమాఫీ చేయాలని కోరారు. చేనేతకార్మికులకు ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సుమారు 200మందికిపైగా చేనేతకార్మికులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులకు కొత్త రుణాలు ఇవ్వాలి
దుబ్బాక రూరల్: చేనేత కార్మికుల రుణ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ర్ట కార్యదర్శి జి.భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రుణ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కొరుతూ దుబ్బాక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన పనికి కూలి సరిపోక పోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో రుణాలు చెల్లించలేక పోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చేనేత కార్మికులకు డబుల్‌బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలగించిన అంత్యోదయ కార్డులను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు నర్సింలు, బాల్‌రాజ్, సత్యనారాయణ, జి.బాల్‌రాజ్, విఠల్, జనార్ధన్, రఘుపతి, శశిరేఖ, సుశీల, మంజుల, సరస్వతి, నీలవ్వ తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుతో చేనేత కార్మికుడి మృతి
చండూరు : పాము కాటుతో ఓ చేనేత కార్మికుడు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలోని గట్టుప్పల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాపోలు శ్రీను(46) చేనేత వృత్తి పై ఆధార పడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి తన ఇంట్లో భార్య, పిల్లలతో కలిసి నిద్రపోయారు. మధ్య రాత్రి సమయంలో చేతిపై ఏదో పారినట్లుగా ఉండడంతో గమనించి ఆ పామును చంపేశారు. రాత్రి సమయంలో నాటు వైద్యం చేశారు. అనారోగ్యంగా ఉండడంతో ప్రాథమిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా పరిప్థితి విషమంగా ఉందనడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉంది. -
‘చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం’
అనంతపురం టౌన్ : జిల్లాలోని నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. డ్వామా హాల్లో శనివారం చేనేత కార్మికుల సమస్యలపై టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ఉన్న 10,115 మంది చేనేతలకు రూ.36.42 కోట్ల రుణమాఫీకి అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. చంద్రన్న బీమాపై అవగాహన కల్పించాలన్నారు. సెప్టెంబర్ నుంచి ముద్ర రుణాలు అందించనున్నట్లు చెప్పారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఆగస్టు 6న ముఖ్యమంత్రి ధర్మవరంలో పర్యటిస్తారన్నారు. పవర్‌లూమ్స్ ద్వారా తయారయ్యే వస్తువులను తయారీ కేంద్రంలోనే సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే సూరి మాట్లాడుతూ నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అనంతరం ధర్మవరం నియోజకవర్గంలో అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా కింద ప్రీమియంను తానే చెల్లిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, ఎల్డీఎం జయశంకర్, సెరికల్చర్ జేడీ అరుణకుమారి, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికురాలి బలవ్మనరణం
ధర్మవరం: అప్పుల భారం తీరే దారికానరాక ఒక చేనేత కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన నర్సింహులు, గోవిందమ్మ(37) దంపతులు చేనేత కార్మికులు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. నర్సింహులు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పాటు ఇటీవలి కాలంలో నేత పని దొరకటం కష్టమైంది. ఈ నేపథ్యంలో వారికి రూ.3 లక్షల వరకు అప్పులున్నాయి. కుటుంబం గడవటం కష్టం కావటంతో మనస్తాపం చెందిన గోవిందమ్మ శనివారం వేకువజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. -
నేత కార్మికురాలు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా వీణవంక మండలకేంద్రానికి చెందిన సబ్బని మధునమ్మ(49) అప్పులబాధతో సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మధునమ్మ- రామచంద్రం దంపతులు వీణవంక చేనేత సంఘంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆప్కో నూలు పోగులు ఇవ్వడం లేదు. దీంతో పని దొరక్క ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. కుటుంబం గడిచేందుకు అప్పులు తేవాల్సి వచ్చింది. దీనికి తోడు ఏడాది క్రితం అప్పు చేసి కూతురు వివాహం జరిపించారు. మొత్తం అప్పులు రూ.6 లక్షలకు చేరడంతో అప్పులెలా తీర్చేదని మనోవేదన చెందిన మధునమ్మ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. -
చేనేతకు ఏదీ చేయూత?
నేడు జాతీయ చేనేత దినోత్సవం * దుర్భర దారిద్య్రంలో చేనేత కార్మికులు * నేటికీ రూపుదిద్దుకోని చేనేత విధానం సాక్షి, హైదరాబాద్: చేనేతకు చేయూత కరువైంది. సహకార, సహకారేతరరంగాల్లో చేనేత వృత్తిపై ఆధార పడిన కార్మికులు ఉపాధి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన అప్పెరల్, టెక్స్టైల్ పార్కులు మౌలిక సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేటికీ చేనేత విధానం రూపు దిద్దుకోకపోవడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఉత్పత్తులకు ఆప్కో రూ.178 కోట్లు చెల్లించాల్సి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమ శాఖల నుంచి తెలంగాణకు రూ.78 కోట్లు బకాయిలు రావాల్సి వుంది. సహకార సంఘాలు తమ పరిధిలోని కార్మికులకు రూ.70 కోట్లు బకాయిలు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. ఆప్కో (విభజన పూర్తయితే టెస్కో) ద్వారా ప్రభుత్వ శాఖలు వస్త్రాలు కొనుగోలు చేస్తే రూ.200 కోట్ల మేర టర్నోవర్ జరిగి ఏటా 25 వేలకు పైగా మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1994-95 మధ్య కాలం లో చంద్రబాబు హయాంలో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయి. దివంగత సీఎం వైఎస్ హయాంలో లివరీ కొనుగోలు, చేనేత కార్మికుల రుణమాఫీతో కొంత మేర ఈ రంగం పునరుజ్జీవనం పొందిందని కార్మిక సం ఘాలు చెప్తున్నాయి. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆప్కో బకాయిలను విడుదల చేయడం అందరికీ ఉపాధి, పనికి తగిన వేతనం సహకారేతర రంగంలో వున్న వారికి గుర్తింపు కార్డులు అందరికీ ఆరోగ్య బీమా, గృహ సౌకర్యం రూ.లక్షలోపు వ్యక్తిగత రుణాల మాఫీ పావలా వడ్డీపై ప్రోత్సాహక రుణాలు తొలిసారిగా జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచి వారిలో భరోసా నింపడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఆగస్టు 7న చెన్నైలో శ్రీకారం చుడుతున్నారు. -
ఆర్డీఓ ఆఫీస్ ను ముట్టడించిన చేనేత కార్మికులు
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయాన్ని గురువారం చేనేత కార్మికులు ముట్టడించారు. టీడీపీ నేత గడ్డం సాయి వేధింపుల బారి నుంచి రక్షించాలని చేనేత కార్మికులు కోరారు. చేనేత కార్మికులను బానిసలుగా చూస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ నేత గడ్డం సాయి కార్మికులను వేధిస్తోన్న నేపథ్యంలో ఆగ్రహించిన వారు ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణతో వాగ్వివాదానికి దిగారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ కార్మికులు ఎమ్మెల్యేను గట్టిగా కోరారు. -
'అనంత'లో పరిస్థితులు హృదయ విదారకం
-
'అనంత'లో పరిస్థితులు హృదయ విదారకం: వైఎస్ జగన్
హైదరాబాద్: రైతులు, చేనేతకారులు, డ్వాక్రా మహిళ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అనంతపురం జిల్లాలో వాస్తవ పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు. రైతులు, చేనేతకారులు, డ్వాక్రా మహిళ జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వీరందరి తరపున గళమెత్తుతామని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాలో ఎనిమిది రోజుల పాటు రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్ జగన్... రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. Ground realities in ATP are heart rending. CBN's lies played havoc with lives of farmers, weavers & DWCRA. We have to be their voice & hope! — YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2015 -
చేనేత కార్మికులకు నాబార్డ్ అండ
దుబ్బాక: ఆత్మహత్యలు, ఆకలి చావులు నివారించి, చేనేత కార్మికులకు నాబార్డ అండగా ఉంటుందని నాబార్డ్ ఏజీఎం రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఆదివారం ఆయన సందర్శించి, చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగాన్ని నమ్ముకున్న వృత్తి దారులకు ఉత్పత్తిదారుల అభివృద్ధి నిధి కింద సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చేనేత కార్మికులకు శిక్షణ, ఎగుమతులు, దిగుమతుల సాధ్యసాధ్యాలపై అవగాహన కల్పించేందుకు నాబార్డ్ కృషి చేస్తుందన్నారు. చేనేత ఉత్పత్తులను నూతన ఒరవడిలో తయారు చేయడానికి నాబార్డ్ చేనేత కళాఖండాలపై అధ్యయనం చేపట్టిందన్నారు. దుబ్బాక సొసైటీలో తయారు చేస్తున్న షర్టులు, టవల్స్ చాలా బాగున్నాయన్నారు. దుబ్బాక చేనేత సహకార సంఘం ఇచ్చే ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగానే నాబార్డ్ సాయం చేస్తుందన్నారు. చేనేత రంగాన్ని బ్యాంకులతో అనుసంధానం చేయడానికి నాబార్డ్ కృషి చేస్తుందన్నారు. అంతకుముందు సొసైటీలోని రికార్డులను పరిశీలించి చైర్మన్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చైర్మన్ బోడ శ్రీనివాస్, కార్యదర్శి కాల్వ లక్ష్మీనారాయణ, సభ్యులు కూరపాటి బాల్‌రాజు, చింత శేఖరం, గవ్వల దుబ్బరాజం తదితరులు పాల్గొన్నారు. -
చేనేత రుణాలు మాఫీ చేయాలి
ఏపీ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు ఉరవకొండ: కరువు పీడిత అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తే గానీ అప్పుల ఊబి నుంచి కోలుకోలేరని ఏపీ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు తెలిపారు. గురురవారం ఉరవకొండలోని చేనేత కార్యాలయుంలో నిర్వహించిన అసోసియేషన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సహకార, సహకారేతర రంగాల్లో ఉన్న చేనేత కార్మికులు 31-03-2014 నాటి వరకు తీసుకున్న రుణాలు రద్దు చేయూలన్నారు. ఐదేళ్లుగా చేనేత ముడిసరుకుల ధరలు పెరిగి, కార్మికుడు నేసిన చీరలకు గిట్టుబాటు ధర రాక 109 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, చేనేత శాఖ వుంత్రి కొల్లి రవీంద్రలకు నివేదికలు పంపావున్నారు. జిల్లాలో మూతపడిన చేనేత పరిశ్రవులు, సంఘాలను ఆదుకుని, వాటిపై అప్పులను రద్దు చేసి తిరిగి పురుద్ధరించాలని కోరారు. జిల్లాలో ప్రాధమిక చేనేత , స్వయుం సహాయుక, వ్యక్తిగత, హార్టిజన్, వీవర్స్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకుల్లో తీసుకున్న స్వల్పకాలిక , వుధ్యకాలిక, దీర్ఘకాలిక, నగదు రుణపరపతి రుణాలు వెంటనే మాఫీ చేయూలన్నారు. చేనేత కుటీర, చిన్నతరహా పరిశ్రవులకు తీసుకున్న నగదు రుణపరపతిని, చేనేత గ్రూపులు మగ్గాలపై తీసుకున్న రుణాలను రద్దు చేయూలన్నారు. రుణాల మాఫీ కోసం డీసీసీబీ చైర్మన్ శివశంకర్‌రెడ్డి కూడా నివేదికలు పంపారన్నారు. -
అడ్డగోలుగా ఆప్కో విభజన
కాకినాడ: అసలే నాలుగేళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన చేనేత రంగానికి రాష్ర్ట విభజన శాపంలా మారింది. విభజన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆప్కో సంస్థను నిర్వీర్యం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది కార్మికుల పొట్టకొడుతోంది. సహకార సంఘాల చట్టం ప్రకారం ఏర్పడిన ఆప్కోను ప్రభుత్వ ఆస్తిలా అడ్డగోలుగా విడదీసేందుకు యత్నిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీగా ఏర్పడిన ఆప్కో ప్రభుత్వ సంస్థ కాదు కదా కనీసం ప్రభుత్వరంగ సంస్థ కూడా కాదు. అలాంటి ఆప్కోను తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకోసం ఉద్దేశించిన బిల్లులో ప్రభుత్వ సంస్థగా పరిగణిస్తూ 9వ షెడ్యూల్లో 52వ అంశంగా పేర్కొన్నారు. సహకార సంఘాల చట్టం ప్రకారం ఆప్కోను వేరుచేయాలంటే ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ సిఫార్సు మేరకు మహాజన సభ ఆమోదం పొందాలి. అప్పుడు కానీ వేరు చేయడానికి వీల్లేదు. లేదా ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆప్కో ఏర్పడినందున ఆప్కోను పూర్తిగా 13 జిల్లాలకు పరిమితం చేస్తూ మిగిలిన 10 జిల్లాలకు కొత్త సంఘాన్ని రిజిస్టరు చేయించాలి. అలాచేస్తే తెలంగాణ లో ఆప్కో పేరిట ఉన్న ఆస్తులేవీ కొత్త సంఘానికి బదిలీ కావు. తెలంగాణ పాలకుల ఒత్తిడి మేరకు సొసైటీ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన ఆప్కోను రాష్ర్ట ప్రభుత్వ సంస్థల జాబితాలో చేరుస్తూ తెలంగాణ బిల్లులో పేర్కొన్నా సీమాంధ్ర ప్రజాప్రతినిధులుగానీ, చేనేత సంఘాల ప్రతినిధులుగానీ పట్టించుకోలేదు. వీరి ఉదాసీన వైఖరి నూతన ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు మారింది. తెలంగాణకు కొత్త పాలవకర్గం ఏర్పాటుకు యోచన 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కోకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాన్నే కొనసాగించి, తెలంగాణ ప్రాంత పరిధిలో ఉన్న డెరైక్టర్లతో కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి వారికి ఆ పరిధిలో ఉన్న ఆప్కో ఆస్తులపై పెత్తనాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. జనాభా ప్రాతిపదికన 58 : 42 నిష్పత్తిలో ఆప్కో ఆస్తుల పంపకం చేయాలని నిర్ణయించారు. ఆప్కో పరిధిలో ప్రస్తుతం చేనేత సహకార సంఘాలు, ఊలు సంఘాలు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 999 సంఘాలున్నాయి. వీటిలో అత్యధికంగా 732 సంఘాలు సీమాంధ్రకు చెందినవి. తెలంగాణ లో 267 సంఘాలు మాత్రమే ఉన్నాయి. సంఘాల ప్రాతిపదికన విభజిస్తే 73:27 నిష్పత్తిలో ఆప్కో ఆస్తుల పంపకాలు జరగాలి. సీమాంధ్రలో 2.20 లక్షల మంది చేనేత కార్మికులుండగా (చేనేత మగ్గాలు) తెలంగాణలో 48 వేలమంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఆప్కోకు స్థిరాస్తులు (స్థలాలు, భవనాలు) సుమారు రూ.11 కోట్లకు పైగా ఉన్నాయి. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ ఏడెనిమిది రెట్లు అధికమని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్కెట్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా ఆప్కోకు వచ్చే నిధుల పంపకంలో కూడా భారీగా కోత పడుతుందని ఆంధ్ర ప్రాంత చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు 2011-12లో కేంద్ర ప్రభుత్వం నుంచి మార్కెట్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా ఆప్కోకు సుమారు రూ.8.35 కోట్లు వచ్చాయి. 2012 నుంచి 2014 వరకు ఈ స్కీం ద్వారా నిధులు రాలేదు. ఈ రెండేళ్లకు సుమారుగా రూ.25 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని సహకార సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఆప్కోను 58 : 42 నిష్పత్తి ప్రకారం విభజిస్తే సీమాంధ్ర వాటాగా రూ.13 కోట్లు మాత్రమే వస్తాయి. సంఘాల ప్రాతిపదికన లెక్కేస్తే సీమాంధ్ర సంఘాలకు రూ.20 కోట్ల వరకు వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే మార్కెట్ ఇన్సెంటివ్ రూపంలో కేవలం రెండేళ్లకే ఏడు కోట్లు నష్టపోతుంటే, ఇక ఆస్తుల పంపకాల్లో ఎంత నష్టపోతున్నామో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సీమాంధ్రకు తీరని అన్యాయం ఆప్కోను విభజించడమే అన్యాయం. ఒకవేళ విభజించాల్సి వచ్చినా 58 : 42 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవడంతో సీమాంధ్రలో ఆప్కోకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. అదే సందర్భంలో తెలంగాణ లో మిగులు బడ్జెట్ ఉంటుంది. 23 జిల్లాల ఆప్కోను అడ్డగోలుగా విభజించాలని కేంద్రం చూస్తుంటే ఆప్కో పాలకవర్గం మాత్రం మౌనంగా ఉండడం దురదృష్టకరం. - దొంతంశెట్టి విరూపాక్షం, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు -
జనమే ఎజెండా
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు న్యూస్‌లైన్ నెట్వర్క్ :అన్నదాతకు బాసట.. చేనేతలకు చేయూత.. ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేర్చే ప్రణాళిక.. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే ఆలోచన.. ఆంక్షల్లేని ఆరోగ్య శ్రీ.. మహిళా సంఘాలకు రుణాల నుంచి విముక్తి.. వెరసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. జనమే ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని ‘అనంత’ ప్రజానీకం స్పష్టం చేస్తున్నారు. తాను కలలు కంటున్న సువర్ణ యుగాన్ని తెచ్చేలా.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ మేనిఫెస్టో ఉందని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోతో జిల్లాలోని వివిధ వర్గాల వారికి లబ్ధి చేకూరనుంది. ‘అమ్మ ఒడి’తో ఉన్నత చదువులు నిరు పేద తల్లిదండ్రులు వారి పిల్లలను కూలి పనులకు పంపకుండా బడికి పంపాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి పిల్లలకు నెలకు రూ.500 చొప్పున.. ఇద్దరు పిల్లలుంటే నెలకు రూ.1000 చొప్పున తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఇంటర్ విద్యార్థికి రూ.700, డిగ్రీ, ఆపై చదువులకు రూ.1000 ఇస్తారు. ఈ పథకం వల్ల జిల్లాలో లక్షలాది మంది పిల్లలకు మంచి విద్య అందనుంది. కాగా, ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రైతన్నకు బాసట ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న సమయంలో.. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించని సందర్భాల్లో రైతులను ఆదుకునేదుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారు. కొత్త ్యవసాయ కళాశాలలు, వెటర్నరీ యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఫోన్ చేసిన 20 నిమిషాల్లో రావడానికి మండలానికో 102 మొబైల్ సర్వీస్.. పాడి రైతులు, గొర్రెలు, మేకల కాపరుల సమస్యల పరిష్కారం కోసం 103 మొబైల్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలోని సుమారు 7 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం రోగుల బాధలు వర్ణణాతీతం. 500 పడకల ఆస్పత్రిగా జీవో జారీ అయినా అందుకు తగ్గ సౌకర్యాలు లేవు. కార్డియాలజీ, యూరాలజీ, న్యూరోలకు ఇక్కడ వైద్యం అందని పరిస్థితి. రక్తమోడుతూ ఎవరైనా ఆస్పత్రికి వెంటనే.. కర్నూలుకో, బెంగళూరుకో రెఫర్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని జగన్ ప్రకటించడంతో జిల్లాలోని లక్షలాది మంది సామాన్యుల కష్టాలు తప్పనున్నాయి. నో గ్యాస్‘ట్రబుల్’ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వడంతో పాటు ఒక్కో సిలిండర్‌పై రూ.100 సబ్సిడీ ఇస్తామని జననేత ప్రకటించారు. జిల్లాలో 5,75,391 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 441. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ ధరపై రూ.100 తగ్గుతుంది. కడుపు నిండా భోజనం పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కిలో రూ.2 కే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. 2009లో అధికారంలోకి రాగానే కుటుంబానికి రూ.30 కిలో అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ హామీని తుంగలో తొక్కింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి మనిషికి రూ.1కే ఆరు కిలోల బియ్యం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ నిర్ణయంతో జిల్లాలో 11,53,718 మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. బకాయిల నుంచి విముక్తి డ్వాక్రా రుణాల మాఫీ నిర్ణయంతో జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ నిర్ణయంతో జిల్లాలోని 50 వేల స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ.885 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. దీనివల్ల 5.2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. అభాగ్యులకు ఆసరా ఆదరణకు నోచుకోని అభాగ్యులకు ఆసరాగా ఉండేందుకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని జననేత నిర్ణయించారు. జిల్లాలో వివిధ పింఛన్లు అందుకుంటున్న వారు 4,22,808 మంది ఉన్నారు. వీరిలో 2,30,830 మంది వృద్ధులు. వితంతువులు 1,07,298 మంది ఉన్నారు. చేనేత కార్మికులు 11,966 మంది, గీత కార్మికులు 131 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ. 200 పింఛన్ వస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ పింఛన్ రూ.700 అవుతుంది. జిల్లాలో వికలాంగులు 55,268 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.500 వస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వీరికి నెలకు రూ.1000 పింఛన్ లభిస్తుంది. 47,782 మంది వికలాంగులకు రూ.500లు చొప్పున ప్రస్తుతం పింఛన్ పంపిణీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1000 చొప్పున పింఛన్ అందనుంది. రెగ్యులరైజేషన్‌తో ఉద్యోగ భద్రత ఏళ్ల తరబడి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు భధ్రత కలగనుంది. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వీరందరూ శాశ్వత ఉద్యోగులుగా మారనున్నారు. ప్రజల ముంగిట్లో ప్రభుత్వ కార్యాలయాలు రేషన్, ఆధార్ కార్డుల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి విసిగిపోతున్నారు. ఈ జన్మలో తమకు కార్డు రాదని, ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీపై నిత్యావసర సరుకులు తీసుకోలేమని భావిస్తున్న కుటుంబాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఇలాంటి వారికి భరోసానిచ్చేలా అన్ని రకాల కార్డులను పంపిణీ చేయడానికి ప్రతి గ్రామంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంతో బాధిత ప్రజలంతా తమ కష్టాలు తీరినట్లేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆధార్‌కార్డు కోసం 42 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకా కార్డు తీసుకోని వారు దాదాపు 6 లక్షల మంది ఉంటారు. వీరందరికీ స్థానిక కార్యాలయాల్లో ఉపశమనం కలగబోతోంది. చేనేతలకు చేయూత వ్యవసాయం, చేనేత రంగం రెండు కళ్లుగా గుర్తించిన వైఎస్ జగన్మోహనరెడ్డి తన మేనిఫెస్టోలో చే నేత రంగానికి పెద్దపీట వేశారు. అధికారంలోకి రాగానే ప్రతి చేనేత కుటుంబానికి మగ్గాల ఏర్పాటుకు షెడ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. బ్యాంకుల్లో తీసుకున్న వ్యక్తిగత రుణాలను మాఫీ చేసి.. ప్రతి చేనేత కుటుంబానికి వడ్డీలేని వ్యక్తిగత రుణాలను అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు ఇస్తున్న రూ.200 పించన్‌ను రూ.1.000 చేస్తానన్నారు. ప్రస్తుతం ముడిసరుకుపై చేనేత కార్మికులకు రూ.600 సబ్సిడీ ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచడంతోపాటు, అన్ని రకాల సబ్సిడీలను పెంచుతామని హామీ ఇచ్చారు. జనతా వస్త్రాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. చేనేత వస్త్రాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు ధరించేలా ప్రోత్సాహం అందిస్తామని, మరమగ్గాలకు కరెంట్ చార్జిలు యూనిట్‌కు రూ. 1.50 మాత్రమే వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 2 లక్షల మందికి లబ్ధి కలగనుంది. -
మగ్గాలే ఉరి పగ్గాలు
*బాబుదంతా చావుల జమానా... * నేతన్నను ఆదుకున్న రాజన్న * అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను నేసిన నైపుణ్యం. ఔరా అనిపించే అద్భుత పనితనం... * ప్రపంచానికి నేత వస్త్రాన్ని పరిచయం చేసిన ఘనమైన నేపథ్యం... ఇదంతా గతం జన పథం: ఒకనాడు సిరులు కొల్చిన నేల అది...చీని చీనాంబరాలు నేసిన కౌశలం వారిది... కానీ తళతళలాడే జరీ అంచులా కళకళలాడాల్సిన బతుకులు సడీచప్పుడు లేని మగ్గాల్లా దిగాలుగా ఉన్నాయి. పరిహారమడిగితే పరిహాసమాడిన పాలకుడొకరు... చేనేత ఊసే ఎత్తని పాలకుడు మరొకరు. ఇలా సర్కారు నిర్లక్ష్యంతో నూలుపోగులు...ఆకలికేకలు వేస్తున్నాయి...ఆ ఘోష ఆగ్రహంగా మారుతోంది...ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది నేతన్నలు రానున్న ఎన్నికల్లో ఓటు ఝలిపించనున్నారు. తమ ఉసురు పట్టని పాలకుల భరతం పట్టనున్నారు. పార్టీలు, నాయకుల భవితవ్యం తేల్చడానికి రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర షోషించనున్నారు. (బొల్గం శ్రీనివాస్, కరీంనగర్): అందరికీ కట్టు బట్టలిచ్చే చేనేత కార్మికుల కడగండ్లను తీర్చడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో 3.58 లక్షల చేనేత కార్మికులు ఉన్నారు. పరోక్షంగా, అనుబంధ రంగాలపై వుూడు లక్షల కుటుంబాలు చేనేతపై ఆధారపడ్డాయి. వెరసి 6.58 లక్షల కుటుంబాల్లో సువూరు 33 లక్షల వుంది ఉంటారని అంచనా. చేనేతను వదిలి ఇతర రంగాల్లోకి వెళ్లిన వురో 30 లక్షల వుందితో కలిపితే ఆ సంఖ్య 63 లక్షల వరకు ఉంటుంది. చేనేతపై ఆధారపడిన వారిని పాలక పార్టీలు వునుషులుగా పరిగణించడంలేదనే ఆవేదన వ్యక్తం అవుతోంది. కనీసం 30 లక్షల వుంది ఓటర్లనైనా ఎన్నికలప్పుడైనా రాజకీయు పార్టీలు గుర్తించడం లేదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుుడి తొమ్మిదేళ్ల పాలనలో చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు మొదలైతే పట్టించుకున్న పాపాన పోలేదు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యూక రూ.327 కోట్ల మేరకు చేనేత రుణాల వూఫీకి వుంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు లక్షల వుంది చేనేత కార్మికులకు మేలు జరిగే సాహసోపేత నిర్ణయూన్ని అమలు చేయూల్సినదశలో ఆయన హఠాన్మరణం చెందారు. కె.రోశయ్య సీఎం అవ్వగానే ఆ పథకంలో కోత కోసేశారు. రూ.148 కోట్లతో 67 వేల వుందికి వూత్రమే అవులు చేసి వైఎస్ ఆదేశాల ఆశయూలపై నీళ్లు చల్లారు. కిరణ్‌కువూర్‌రెడ్డి సర్కారైతే చేనేత గురించి పట్టించుకోనేలేదు. వైఎస్ పాలనలో సుఖసంతోషాలు చంద్రబాబు సీఎంగా ఉండగా 2003-04లో ఆప్కో టర్నోవర్ రూ.85.85 కోట్లు వూత్రమే ఉంది. వైఎస్ సీఎంగా ఉండగా 2007-08 నాటికి ఆ మొత్తం 119.23 కోట్లకు పెరగడాన్ని బట్టే నేత కార్మికులు తయూరు చేసిన వస్త్రాలకు గిరాకీ పెరిగేలా చేశారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ శాఖలన్నీ ఆప్కో ద్వారానే వస్త్రాల్ని కొనుగోలు చేయూలన్న వైఎస్ ప్రభుత్వ ఆదేశాల పుణ్యవూ అని ఆ ఏడాది రూ.47 కోట్ల విలువైన వస్త్రాల కొనుగోళ్లు జరిగారుు. ఆ తర్వాత ఏడాది రూ.92 కోట్ల మేరకు పెరిగింది. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రారంభమైన చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ చర్యలతోబాటు పలు పథకాల్ని వైఎస్ సర్కారే అవులు చేసింది. 1997 ఏప్రిల్ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన 215 వుంది కుటుంబాలకు రూ.1.5 లక్షల చొప్పున వైఎస్ ఉండగానే నష్టపరిహారం అందింది. వీరితోబాటు 114 కుటుంబాలను ప్రత్యేక కేసులుగా పరిగణించి సీఎం సహాయు నిధి నుంచి రూ. 25 వేలు చొప్పున సాయుం అందించారు. చేనేత కార్మికులకు ప్రత్యేకంగా వృద్ధాప్య పింఛన్ వ యుసు 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకే తగ్గించిందీ.. రూ.75 ఉన్న పింఛన్ రూ.200లకు పెంచిందీ వైఎస్ సర్కారే కావడం గవునార్హం. పరిహారం కోసమే ఆత్మహత్యలన్న చంద్రబాబు చంద్రబాబు పాలనలో రుణవూఫీ గురించిగానీ, ఆత్మహత్యల నివారణకు చర్యలుగానీ తీసుకోకపోగా అధిక వడ్డీలకే రుణాలు వసూలు జరిగింది. ప్రభుత్వం నుంచి పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా వుుఖ్యవుంత్రి హోదాలోనే చంద్రబాబు చేశారు. వైఎస్ పాలనలో రెండు లక్షలకుపైగా కార్మికులకు ఉపయోగపడేలా పావలా వడ్డీకే చేనేత రుణాలు ఇచ్చేలా చేశారు. దేశంలోనే తొలిసారిగా పోచంపల్లిలో హ్యాండ్లూం పార్కును ప్రారంభించారు. హ్యాండ్ లూం పార్కుల కోసం భూవుుల్ని కూడా కేటారుుంచారు. చిలప నూలుపై 9.5 శాతవుున్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేలా చేశారు. చేనేతకు అధిక ప్రాధాన్యతను ఆచరణలో చూపించారు. చేనేత కార్మికుల సంక్షేవుం కోసం త్రిఫ్ట్ ఫండ్ స్కీంను అవులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చేనేతపై చంద్రబాబు హామీల జల్లు కురిపిస్తుంటే నేత కార్మికులు గతంలో వైఎస్ పథకాల వల్ల జరిగిన ‘మేళ్ల’ను నెవురవేసుకుంటూ.. వైఎస్ జగన్మోహనరెడ్డి హామీల వల్ల లాభాలపై చర్చించుకుంటున్నారు. నేడంతా అచేతనం... బతుకంతా దుర్భరం. రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడ్డా పట్టెడన్నం దొరకని దైన్యం. రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి రేటు గిట్టని విషాదం. అప్పులతో నూలు పోగులు చిక్కుముళ్లుపడుతున్నాయి. సాంచాల సప్పుడు వినిపించే చోట చావుడప్పు మోగుతోంది. ఆత్మహత్యలు, ఆకలి చావులతో తెల్లారుతోంది. చంద్రబాబు విస్మరించిన చేనేతల కన్నీళ్లను తుడిచేందుకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఓ యజ్ఞమే చేశారు. బడ్జెట్‌ను పెంచారు..రుణమాఫీ చేశారు. స్పెషల్ ప్యాకేజీలతో వస్త్ర పరిశ్రమకు పునర్జన్మనిచ్చారు. ఉత్పత్తులకు గిరాకీ పెంచేలా చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలకు అండగా నిలిచారు. పింఛన్ పెంచి ఆపద్భాంధవుడయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షలకుపైగా ఉన్న చేనేతన్నలు ఓటెత్తి తమ జీవితాలను బాగుచేసే నేతలను ఎన్నుకోవాల్సిన సమయమిది. ‘‘చేనేతల కోసం ఆలోచించిన వ్యక్తులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీరామారావు మాత్రమే. ఎన్టీఆర్ జనతాస్కీం ద్వారా చేనేతలను ఆదుకునే ప్రయత్నం చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ స్కీమ్‌ను ఎత్తివేశారు. వైఎస్సార్ సీఎం అయిన తరువాత చేనేతల సంక్షేమం కోసం ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు కలిగిన ప్రతి కార్మికునికి బ్యాంకుల్లో పావలావడ్డీకే రుణాలు ఇప్పించారు. ఆయన మరణం తరువాత ఈ పథకాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. ’’ -2012 ఫిబ్రవరి 12న ధర్మవరం ‘చేనేత దీక్ష’లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం కోసం చేతులు ‘సాంచాల’ ఎన్నికలచ్చినప్పుడల్లా నాయుకులు ఏదేదో చేస్తవుని చెబుతుంటరు. కానీ ప్రభుత్వమిచ్చే రాయితీలు.. రుణాలు, కరెంట్ సబ్సిడీలతో ఆసావుులు లాభపడ్తరు. అందుకే వూ బతుకులిట్లే ఉంటున్నయి. నాలాంటోళ్లు ఇక్కడ 30 వేల మందున్నరు. మా తాతలు, బాపులు నేసె మగ్గాల మీద పని చేసిండ్రు.. ఇప్పుడు మేం సాంచాలు (పవర్‌లూం) నడుపుతూ బట్టనేస్తున్నం.. బట్టకు పొట్టకు సరిపోయేంత కూలీ మాత్రం అచ్చుడ్లేదు. నా భార్య బీడీలు చేస్తది. వూకు ఇద్దరు బిడ్డలు. ధరలన్నీ ఫిరమాయే. కరెంటు పోరుునా... ఒక్క రోజు పని సాత కాకపోయినా కూలీల కోత పడుడే. ప్రభుత్వం నేరుగా కార్మికులకే ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందించాలె. కూలీ పెరగాలె. ఆరోగ్య బీవూ ఉండాలె. కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలె. సబ్సిడీపై రెండు జతల సాంచాలు, షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటారుుంచాలి. మార్కెటింగ్ సంస్థ ఏర్పాటు చేయాలె. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చేనేత రుణాలు వూఫీ చేసిండు. వురవుగ్గాల కార్మికులకు సొసైటీల్లేవు. అందుకే మా అప్పులు మాత్రం తీరలే. - వేముల సంపత్ (సాంచాల కార్మికుడు) న్యూస్‌లైన్, సిరిసిల్ల ‘నేత’ంటే ఇలా.. సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్థికసాయం అందించారు. మొత్తం 125కుటుంబాలకు రూ.లక్షన్నర చొప్పున సాయం చేశారు. 1997 నుంచి ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నలకు ఈ ప్యాకేజీ వర్తింపజేశారు. ఇందులో కార్మికుడి అప్పుల సర్దుబాటుకు రూ.యాభైవేలు, కుటుంబ జీవనోపాధికి మరో రూ.లక్ష అందించారు. మరో 120 కుటుంబాలకు రూ.25వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. * 12వేల మంది నేత కార్మికులకు అంత్యోదయ అన్న యోజన పథకం(ఏఏవై) కార్డులు అందించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి నెలనెలా 35కిలోల బియ్యం అందుతున్నాయి. * చేనేత కార్మికుల ఆర్యోగ సమస్యల దృష్ట్యా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన వైఎస్ 50వేల మందికి ప్రతినెలా రూ.200 పింఛన్ ఇచ్చారు. * 2004లో రూ.32కోట్లు ఉన్న ఆప్కో టర్నోవర్‌ను రూ.250కోట్లుగా మార్చి ఆదుకున్నది వైఎస్సే. * పెరిగిన చిలపనూలు ధరల వల్ల కార్మికులు ఇబ్బంది పడుతుంటే వైఎస్ పదిశాతం సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు. * వైఎస్ హయాంలో 2008 నాటికి వలసలు తగ్గాయి. ఆదాయం లేకపోవడంతో మహారాష్ట్రకు వెళ్లే బస్సులు రద్దయ్యాయి. * సిరిసిల్ల మహిళలను చైతన్యవంతులను చేసి 1,480 సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు రూ.50వేల రుణం అందించారు. ఒక్క సిరిసిల్లలోనే రూ.74కోట్ల పావలావడ్డీ రుణం అందించడంతో మైక్రోఫైనాన్స్ వేధింపులు తగ్గాయి. * చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ శిబిరం ఏర్పాటు చేసి 84మంది వైద్యులతో వైద్య సేవలు అందించారు. * ఇళ్లు లేని పేద చేనేత కార్మికులకు సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి, మండెపల్లి, సారంపల్లి గ్రామాల్లో 4,800 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. * సిరిసిల్ల పట్టణ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నీరందించేందుకు రూ.36.50కోట్ల పథకాన్ని గ్రాంటు రూపంలో మంజూరు చేశారు. * నేతన్నల సంక్షేమం కోసం రూ.రెండు కోట్ల కార్పస్‌ఫండ్‌ను మంజూరు చేశారు. * జనశ్రీ బీమాలో కార్మికుల ప్రీమియంను రూ.80నుంచి రూ.40కి తగ్గించి మిగతా రూ.40 ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేసి లక్షన్నరమంది కార్మికులకు ఆరోగ్య ధీమా కల్పించారు. * నేత కార్మికులు ప్రైవేటు రుణాల బారిన పడకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి పావలావడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేశారు. * రాష్ట్ర వ్యాప్తంగా 77వేలకు పైగా ఉన్న పవర్‌లూంలకు 2004-05 నుంచి 2008-09 నాటికే రూ.29.55 కోట్ల విద్యుత్ సబ్సిడీ నిధులు విడుదల చేశారు. - మారడి మల్లికార్జున్ -
మగ్గుతున్న మగ్గం బతుకులు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: తరాలు మారినా చేనేత కార్మికుల జీవనంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మగ్గం గుంతల్లోనే మగ్గుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి చేనేత కార్మికునితోపాటు ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులంతా పనిచేసినా జీవనం సాగించడం దుర్భరంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు అమలు చేసినా వీరిని మాత్రం ఆదుకోవడం లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కుటుంబాలకు ఉపాధిని కల్పించే నిమిత్తం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005-06 సంవత్సరంలో అపెరల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోపవరం పంచాయతీ పరిధిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 71.17 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతోపాటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత యూనిట్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అపెరల్ పార్కు ఏమాత్రం చేనేత కార్మికులకు ఉపయోగపడటం లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 50వేల మంది చేనేత వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. దాదా పు 20వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత కార్మికుడు నివాసం ఉండని ప్రాంతం లేదు. ప్రతి కార్మికునిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. భార్యాభర్తలతోపాటు వారి సంతానం కూడా చేనేత కార్మికులకు చేదోడు వాదోడుగా నిలవాల్సి వస్తోం ది. ఇంత చేసినా కడుపు నిండటం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరులో అపెరల్ పార్కు నిర్మాణం చేపట్టాలని నిర్ణయిం చారు. ఈ ప్రాజెక్టును ఏపీఐఐసీ అధికారులకు అప్పగించడంతో వారు భూసేకరణ చేయడంతోపాటు రోడ్ల నిర్మా ణం పూర్తి చేశారు. దీనికోసం రూ.5కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇంతటితోనే ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. నిబంధనల ప్రకారం రోడ్లు నిర్మించిన తర్వాత రంగుల అద్దకం, శిల్క్ యూనిట్లు, టెస్టింగ్ యూనిట్లు, వస్త్రాల తయారీ, పవర్ లూమ్స్ తదితర చేనేత రంగానికి సంబంధించిన అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉం ది. అయితే వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు పూర్తిగా నీరుగారిపోయింది. 2005-06లో ప్రాజెక్టు మంజూరైనా ఇంతవరకు యూనిట్ల ఏర్పాట్లు జరగలేదు. నిధుల లేమి సమస్యల కారణంగా మరింత జాప్యం జరుగుతోంది. దీంతో స్థలంలో పిచ్చిమొక్కలు మొలిచాయి. వేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అపెరల్ పార్కు నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు.. తమకు ఉపాధి లభించేదెప్పుడు అని చేనేత కార్మికులు నిట్టూరుస్తున్నారు. -
చేనేత వస్త్రాలను ఆదరించండి
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను ఆదరించి తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో ని త్యాగరాజమండపంలో ఏర్పాటు చేసిన ‘చేనేత తోరణాల వస్త్ర ప్రదర్శన’ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్ర తయారీ కేవలం భారతదేశంలోనే ఉందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మారుతున్న కాలాని కి అనుగుణంగా చేనేత వస్త్రాలను త యారు చేసి ప్రజలకు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అందిస్తున్నా వీరికి మరింత ప్రోత్సాహక పథకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజ లందరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత జౌళి శాఖ సంచాల కుడు పి.జయరామయ్య మాట్లాడు తూ కార్మికులు తయారు చేసిన వ స్త్రాలను సొసైటీల ద్వారా ప్రదర్శన లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగి స్తున్నామన్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న సమైక్యాంధ్ర ఉద్య మ నేపథ్యంలో వస్త్ర ప్రదర్శనలకు విరామం వచ్చిందన్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని 23 జిల్లాలకు చెందిన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రదర్శన లో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్ర దర్శన 11వ తేదీ వరకు రోజూ ఉ దయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందన్నారు. ఇందులో అన్ని రకాల చేనేత వస్త్రాలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. అప్కో డెరైక్టర్ మిద్దెలహరి, చేనేత కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుప్పయ్య పాల్గొన్నారు. ఏజేసీకి వినతి చేనేత తోరణాల వస్త్ర ప్రదర్శన ప్రారంభానికి విచ్చేసిన జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డికి చేనేత కార్మికుల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ చేనే త కార్మిక యూనియన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 45 వేల కుటుంబాలు చేనేత వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాయ ని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు కల్పించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశా రు. వినతి పత్రం సమర్పించిన వారి లో కేవీ.కుప్పయ్యశెట్టి, ఆకులవాసు ఉన్నారు. -
నేతన్న దైన్యం
చీరాల, న్యూస్‌లైన్: మగ్గం ఆడితేనే పూటగడిచే చేనేత కార్మికులు ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వరదలు వీడి నెల రోజులు దాటుతున్నా.. మగ్గం గుంతల్లో తడి ఆరలేదు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం అరకొరగానే అందింది. మగ్గం, నూలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన కార్మికులకు పరిహారం అందించడంలో తాత్సారం జరుగుతోంది. చేనేత కార్మికులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీ కూడా ఇప్పట్లో నెరవేరేలా లేదు. చీరాల ప్రాంతంలో పదివేల మగ్గాలపైనే ఉన్నాయి. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బుర్లవారిపాలెం పంచాయతీలోని సాయి కాలనీ, తోటవారిపాలెం పంచాయతీలోని అవ్వారు సుబ్బారావు, మహాలక్ష్మమ్మ కాలనీ, బండారు నాగేశ్వరరావు కాలనీ, మార్కండేయ కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మగ్గం గుంతల్లోకి నీరు చేరి అవి దెబ్బతిన్నాయి. వస్త్రాలు నేసేందుకు సిద్ధం చేసుకొన్న నూలు వర్షాల ధాటికి పాడైపోయింది. నిరాశ్రయులైన కుటుంబాలకు అందించే సాయం కూడా అందరికీ అందలేదు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. నెలన్నర రోజులుగా పనులు లేక, తినడానికి తిండి లేక పస్తులుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం తక్షణ సాయం కింద ఇచ్చిన బియ్యం, కిరోసిన్ కూడా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే ఇచ్చారు. సీఎం హామీ ఎప్పటికి నెరవేరేనో..? భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన సాయి కాలనీని సీఎం కిరణ్ సందర్శించి చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిచ్చారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న చేనేత మగ్గాలు, నూలుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినా.. అది నేటికీ అమలుకు నోచుకోలేదు. దెబ్బతిన్న మగ్గానికి రూ. 5 వేలు, పని దినాలు కోల్పోయినందుకు రూ. 5 వేలు, దెబ్బతిన్న నూలుకు రూ.5 వేలు చొప్పున ఒక్కో కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు నష్టపోయిన మగ్గాల అంచనాలను పూర్తి చేశారు. కానీ పరిహారం వస్తుందో... లేదో అన్న అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన నీలం తుపానుతో నష్టపోయిన చేనేత కార్మికులకు ప్రభుత్వం నేటికీ నష్టపరిహారం అందించలేదు. అప్పటి నష్టపరిహారాన్నే ఇవ్వని ప్రభుత్వం ప్రస్తుతం జరిగిన నష్టానికి పరిహారం అసలు ఇస్తుందా అనే సందేహం కార్మికులను పీడిస్తోంది. -
చేనేతల రుణ మాఫీకి ‘త్రిబుల్ఆర్’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చేనేత పని నిమిత్తం 2010వ సంవత్సరం మార్చి 31లోపు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రివైవల్, రిఫామ్స్ రీస్ట్రక్చరింగ్(త్రిబుల్ ఆర్) స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు ధనుంజయరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు, పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి పథకాల కింద తీసుకున్న చేనేత రుణాలను మాత్రమే మాఫీ చేసిందని తెలిపారు. అయితే ఇంకా వివిధ స్కీమ్‌ల కింద చేనేత పని నిమిత్తం తీసుకున్న రుణాలు మిగిలిపోయాయని పేర్కొన్నారు. చేనేత పని నిమిత్తం తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ ఆర్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. 2010 మార్చి 31లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. దీని కింద రుణ మాఫీ కోసం క్లయిమ్‌లు ఇచ్చే గడువు ఈ ఏడాది మార్చికే పూర్తయిందన్నారు. అయితే ఇంకా కొంతమంది మిగిలిపోయారనే ఉద్దేశంతో వారి రుణాలు సైతం మాఫీ చేసేందుకు క్లెయిమ్ ఇచ్చే గడువును ఈ ఏడాది డిసెంబర్ నెల చివరివరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. చేనేత నిమిత్తం తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని లబ్ధిదారులు బ్యాంకులను సంప్రదించి క్లెయిమ్‌లను ఆయా బ్యాంకుల జిల్లా కంట్రోలింగ్ అధికారులకు పంపే ఏర్పాటు చేసుకోవాలని కోరారు. బ్యాంకర్లు కూడా 2010 మార్చి 31లోపు తీసుకున్న అన్ని రకాల చేనేత బకాయిల మాఫీ కోసం క్లెయిమ్‌లు ఇచ్చేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. బ్యాంకులు కంట్రోలింగ్ ఆఫీసర్లకు క్లెయిమ్‌లు ఇస్తే వారు వాటిని నాబార్డుకు పంపాలని సూచించారు. ఈ అవకాశాన్ని అటు చేనేతకారులు, కార్మికులు, బ్యాంకర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రైతులు, నేతన్నల పరిస్థితి దారుణం: విజయమ్మ
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో తుపాను, భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులైన రైతులు, మత్స్యకారులు, నేతన్నలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చలించిపోయారు. విజయమ్మ ఈరోజు ఉదయం వరద ముంపు ప్రాంతాలౌన జగ్గంపేట నుంచి తన పర్యటన ప్రారంభించారు. కాట్రామలపల్లి, దుగ్గుదూరు, బిక్కవోలు, కాకినాడలలో పర్యటించారు. నీటమునిగిన వరి చేలను పరిశీలించారు. రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికుల బాధలు స్వయంగా విన్నారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. అనంతరం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో ప్రజలు ముంపు బారినపడినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించలేదన్నారు. ఇప్పటి వరకు ముంపు బాధితులకు ప్రభుత్వం బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయలేదని చెప్పారు. అకాల వర్షాల కారణంగా చేనేత కుటుంబాలు ఆకలిబాధతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల మగ్గాలు నీటిలో మునిగి తడిపోయినట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా ప్రభుత్వం తమ పార్టీ ఒత్తిడి తెస్తుందని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. జగన్ అధికారంలోకి రాగానే మత్స్యకార, చేనేత కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. తుపాను వచ్చిపోయి ఆరు రోజులు అవుతున్నా ఒక్క అధికారి కూడా బాధితుల దగ్గరకు వచ్చి వివరాలు అడగలేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే కాదు, మత్స్యకారులు, నేతన్నల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు వరి చేలు, 50 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు నష్టపోయాయని తెలిపారు. ఈ జిల్లాలో వెయ్యి ఇళ్లు పూర్తిగా, 2 వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయన్నారు. నీలం తుపాన్ తరువాత జిల్లాకు 167 కోట్ల రూపాయలు ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏలూరు కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు.