
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ మాస్కుల అవసరం తప్పనిసరైంది. రోజురోజుకూ వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో మాస్కులు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో దొరికే రకరకాల మాస్కులను వినియోగిస్తున్నారు. అయి తే ఎక్కువకాలం ఒకే రకమైన మాస్కులు ధరించడం ఇష్టం లేనివారి కోసం రంగురంగుల మాస్కులు రానున్నాయి. రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంస్థ (టెస్కో) రంగులు, డిజైన్లలో మాస్కుల ను అందుబాటులోకి తెస్తోంది. వీటిని ఒక్కసారి వాడి పారేయాల్సిన పనిలేదు. రోజూ ఉతికి మళ్లీ వినియోగించుకోవ చ్చు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా టెస్కో ఈ చర్యలు చేపట్టింది.
ఉపాధి కల్పనే లక్ష్యంగా..
చేనేత వస్త్రాలంటే గుర్తుకు వచ్చేవి పోచంపల్లి, గద్వాల చీరలే. వీటిల్లో వేల రకాల డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వస్త్ర వ్యాపారం సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితుల్లో కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో టెస్కో ట్రెండింగ్ బిజినెస్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ సిల్క్, కాటన్, సీకో చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట సిల్క్, కాటన్ చీరల డిజైన్ల ఆధారంగా మాస్కు లను తయారు చేసింది. ఇప్పటికే 3 లక్షలకు పైగా మాస్కులు తయారు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచింది.
ఒక్కో మాస్కును రూ.20 నుంచి రూ.40 వరకు విక్రయించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సేల్స్ షోరూమ్‌లలో వీటిని విక్రయించేందుకు అందుబాటులో పెట్టింది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వీటిని విక్రయించాలని టెస్కో భావిస్తోంది. ఇందులో భాగంగా టెస్కో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విక్రయాలకు ఏర్పాట్లు చేసింది. విక్రయాలు, కార్మికుల కోణంలో ఆలోచించి తక్కువ ధరకే అమ్మాలని, అందులో భాగంగా తయారైన ధరనే నిర్ణయించినట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద రెండు లక్షల మాస్కులను జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment