
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ. 24వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.
మత్స్యకారులకు 10వేలు ఆర్థిక సాయం
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేయనుందని తెలిపారు. మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌కు తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించారు. మత్స్యకారులు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతోందని, ఆ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. తెప్పలపై చేపల వేటకు వెళ్లేవారు కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు. గతంలో మత్స్యకారులకు లీటర్‌కు డీజిల్‌పై రూ. 6.03 సబ్సిడీ ఇస్తుండగా.. ఆ సబ్సిడీని మరో 50శాతం పెంచి.. రూ. 9 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 9 జిల్లాలోని 81 బంకుల్లో మత్స్యకారులకు ఈ సబ్సిడీ అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 96.06 కోట్లు ఖర్చు చేయనుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ చేపట్టిన ఆయిల్ అన్వేషణలో ఉపాధి కోల్పోయిన 16500 మంది మత్స్యకారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను నవంబర్ 21న చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.
న్యాయవాదులకు రూ. 5వేలు
న్యాయవాదులకు రూ. 5వేల ప్రోత్సాహం అందించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా జూనియర్ న్యాయవాదులకు ఈమేరకు ప్రోత్సాహం అందించనుంది. పలాసలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో రెగ్యులర్, కాంట్రాక్ట్ పోస్టుల మంజూరు చేసేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి.. ప్రభుత్వమే హామీగా ఉండి రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి, అవినీతి గురికాకుండా.. వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జీఏడీ ఆధ్వర్యంలో కొనసాగే ఈ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూరునుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే జీతాలు పడనున్నాయి.
అందరికీ రక్షిత తాగునీరు
ఏపీలోని 13 జిల్లాల్లో అందరికీ సురక్షితమైన మంచినీరు అందించేందుకు జిల్లాల వారిగా వాటర్ గ్రీడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రతి ఇంటికీ మనిషికి 105 నుంచి 110 లీటర్లు చొప్పున మంచినీరు ప్రతి రోజూ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు నిధులు సమకూర్చుకునేందుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చిందని చెప్పారు. దాదాపు 4.90 కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.
హోంగార్డుల జీతాలు పెంపు
రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలను పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ. 600 నుంచి రూ. 710కి పెంచింది. దీంతో హోంగార్డుల వేతనం నెలకు రూ. 18వేల నుంచి రూ. 21,300కు పెరిగింది.
కొత్త బస్సుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సుల స్థానంలో రూ. వెయ్యి కోట్లతో కొత్త బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ కొనుగోలు చేయనుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కంలను ఆదుకునేందుకు రూ. 4,471 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీ నియామకానికి ఆమోదం తెలిపింది. గన్నవంరం మండలం కొండపావులూరులో ఎస్డీఆర్‌ఎఫ్‌కు 39.23 ఎకరాల భూమిని కేటాయించింది. మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రకాశం జిల్లా నడికుడి-శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ నిర్మాణానికి 350 ఎకరాలు, రేణిగుంట విమానాశ్రయం విస్తరణ కోసం 17 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖలోని పరదేశ్‌పాలెంలో ‘ఆమోద పబ్లికేషన్స్’కు ఏ ఆమోదం లేకుండానే మాజీ సీఎం చంద్రబాబు 1.50 ఎకరాల భూమిని కేటాయించారని, దీనిని రద్దు చేస్తున్నామని, ఈ భూమిని బలహీన వర్గాల ఇళ్ల కోసం కేటాయించాలని నిర్ణయించామని మంత్రి పేర్ని నాని తెలిపారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవవేతనం పెంపు
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవవేతనం రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసింది. దీనివల్ల 52,296 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం రూ.211.91 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం తీర్మానం చేసిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. చిరుధాన్యాలు, ఆపరాల బోర్డులు ఏర్పాటుకు ఆమోదం తెలిపామని, రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఈ బోర్డు కృషి చేస్తుందని పేర్ని నాని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ రుణ పరిమితిని అదనంగా రూ. 2వేల కోట్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉచిత బోర్ల కోసం 200 డ్రిల్లింగ్ బోర్ మిషిన్ల కొనుగోలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దినపత్రికలకు ఇచ్చే అడ్వర్టైజ్‌మెంట్ల టారిఫ్‌ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్కూలు ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ యాక్ట్‌పై ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదముద్ర వేసింది. ఇంటర్మీడియట్ విద్యను ఇందులో చేర్చేలా ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. యూనివర్సిటీ బోర్డుల్లో సభ్యులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సభ్యుల ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment