సాక్షి, అమరావతి: వైఎస్సార్ వాహన మిత్ర డబ్బు జమ చేస్తున్న సందర్భంగా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ మేడా మురళి శ్రీనివాస్ మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా మూడో ఏడాది, 2.48 లక్షల మంది లబ్దిదారులకు నేరుగా రూ. 248.47 కోట్లు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో.. మేడా మురళి ఆంగ్ల పదాలు ఉపయోగిస్తూ తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ నేపథ్యంలో ఒకింత ఆశ్చర్యానికి గురైన మంత్రి పేర్ని నాని.. ‘‘మురళి గారూ.. ఇంటర్మీడియట్ డిస్‌కంటిన్యూ అన్నా ఇంగ్లిష్ ఇంత బాగా మాట్లాడుతున్నారు. మాకెందుకో అనుమానంగా ఉంది. పీహెచ్‌డీ చేశారేమో అనిపిస్తోంది’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా మరోసారి వెరిఫికేషన్ చేయించినా ఫర్వాలేదు సార్ అంటూ మురళి బదులిచ్చారు. ఇక ఇందుకు స్పందించిన మంత్రి... ‘‘నీలాంటి విజ్ఞత ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి గురించి బాగా చెప్పటం బాగుంది’’ అని ప్రశంసించారు. ఈ క్రమంలో.. తాను స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకువెళ్తానని, వారు మాట్లాడే ఇంగ్లిష్ విని, తనకూ మాట్లాడటం అలవాటైందన్న మురళి, ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని, సామాన్యుల పిల్లలకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని కృతజ్ఞతా భావం చాటుకున్నారు.
మా జగనన్న కూడా మా ఖాకీ చొక్కా తొడుకున్నారు..
మేడా మురళి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘అన్నా నేను గత 17 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నాను, ప్రతీ ఏడాది కూడా ఫిట్‌నెస్ మంత్ వస్తుందంటే తెలియని భాద, భయం ఉండేది, నెలవారీ ఖర్చులు, మెయిన్‌టెనెన్స్ ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉండేవి. గత ప్రభుత్వంలో రోజుకు రూ. 50 ఫైన్ పెట్టి మా పీక మీద కత్తి పెట్టే పరిస్ధితి ఉండేది. మీరు పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్నట్లుగా ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తున్నారు. మేం ఇంత ధైర్యంగా ఉన్నామంటే మీరే కారణం. మాకు ఫైన్‌లు వేసే ప్రభుత్వాలను చూశాం కానీ మాకంటూ ఒక పధకం పెట్టిన మొదటి సీఎం మీరే. మీరు దేశ రాజకీయ నాయకులకు ఒక రోల్‌మోడల్, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలి అనే దానికి మీరే ఉదాహరణ.
కరోనా కారణంగా కుటుంబం గడవని పరిస్ధితుల్లో మీరు ముందుగానే ఇస్తున్నారు. ఏ సంక్షేమ పధకం ఆగకూడదని మీరు మూడో విడత ఇంత కష్టకాలంలో ఇస్తున్నారు. మీకు మేమంతా రుణపడి ఉంటాం. నా కుటుంబంలో అమ్మ ఒడి వచ్చింది, మా అమ్మకు కాపునేస్తం వచ్చింది. మా నాన్నకి వృద్దాప్య ఫించన్ వచ్చింది, తెల్లవారకముందే పెన్షన్ ఇస్తున్నారు. మీ ఆలోచనకు హ్యట్సాఫ్. నేను నా కుటుంబం కోసం ఆటోడ్రైవర్ అయ్యాను, కానీ రాష్ట్రాన్ని అభివృద్ది, సంక్షేమ బాటలో నడిపే డ్రైవర్ మీరు అయ్యారు. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కానీ ఇప్పుడు చూస్తుంటే ఇద్దరూ ఆడపిల్లలు అయి ఉంటే బావుండు అనిపించింది.
మహిళా బిల్లు కోసం పార్లమెంట్‌లో గొడవలు చూశాం కానీ మీరు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం చూస్తుంటే నా పిల్లులు ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేవి, మగపిల్లాడిని ఎలా సెటిల్ చేయాలా అన్న ఆలోచన పట్టుకుంది. మహిళా అభ్యుదయం కోసం మీరు చేస్తున్న కృషి మరువలేం. రాష్ట్ర హోంమంత్రిగా ఒక మహిళ ఉండటం గర్వకారణం. మేం సామాన్యుడిగా ఒకటే కోరుకుంటున్నాం. మాకు మేడలు, మిద్దెలు వద్దు. మేం పస్తులు లేకుండా కడుపు నింపుకోవడానికి పని ఉండాలి.
మా పిల్లలకు మంచి భవిష్యత్ కోసం మంచి చదువు, ఏదైనా అనారోగ్యం వస్తే మంచి వైద్యం ఉండాలి. ఇవి మీరు చేస్తున్నారు. బ్లాక్‌ఫంగస్ లాంటి దాన్ని కూడా నాలుగు రోజులకే మీరు ఆరోగ్యశ్రీలో యాడ్ చేశారు, మేం ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే మీరే కారణం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఆటోడ్రైవర్‌తో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం మాకు గర్వంగా ఉంది. ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని మేం నమ్ముతున్నాం. మేం ధైర్యంగా చెబుతున్నాం. మా జగనన్న కూడా మా ఖాకీ చొక్కా తొడుకున్నారు. మేమంటే అంత ప్రేమ, గౌరవం మీకు ఉన్నాయి. మీ వల్లే మేం సంతోషంగా జీవించగలుగుతున్నామని’’ అంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు జరుగుతున్న మేలు గురించి వివరించారు.
చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’
Comments
Please login to add a commentAdd a comment