సాక్షి, అమరావతి: నివర్ తుపాను బాధితులను సత్వరమే అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పంట నష్టం అంచనాలను డిసెంబర్ 15నాటికి పూర్తి చేసి 31 నాటికి రైతులకు పరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించేది లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. తుపాను సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్‌లో 5 ప్రత్యేక పథకాలు/ కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదించింది. మొత్తం 22 అంశాలపై కేబినెట్ చర్చించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు వివరించారు.
శరవేగంగా సహాయ చర్యలు
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నివర్ తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. డిసెంబర్ 15నాటికి పంటనష్టం అంచనాలు పూర్తి చేసి 31నాటికి రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరా. ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగిన చోట మార్గదర్శకాల ప్రకారం త్వరగా పరిహారం చెల్లింపు.
2న ‘ఏపీ అమూల్... చేయూత, ఆసరా లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ మహిళల ఆర్థిక స్వావలంబనకు అమూల్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఏపీ అమూల్’ ప్రాజెక్టు కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం. డిసెంబరు 2న ‘ఏపీ అమూల్’ ప్రాజెక్టు ప్రారంభం. మొదట విడతగా వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేయూత, ఆసరా లబ్ధిదారుల్లో ఆప్షన్లు ఎంపిక చేసుకున్న మహిళలకు ఆవులు, గేదెల యూనిట్ల పంపిణీ. 9,899 బల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.
కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
10న గొర్రె పిల్లలు, మేక పిల్లల పంపిణీ
ఇదే కార్యక్రమం కింద 2.49 లక్షల యూనిట్ల గొర్రెలు, మేకల పంపిణీకి మంత్రివర్గం ఆమోదం. 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు, ఒక గొర్రెపోతు లేదా మేకపోతు కలిపి ఒక యూనిట్‌గా పరిగణన. చేయూత, ఆసరా పథకాల ద్వారా డిసెంబరు 10న లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
15న ఉచిత పంటల బీమా మొత్తం పంపిణీ
2019–20 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా మొత్తాన్ని డిసెంబరు 15న పంపిణీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం. 2016–19 వరకు మూడేళ్లలో రైతులు రూ.871.26 కోట్లు బీమా ప్రీమియం కింద చెల్లించాల్సి వచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించిన తరువాత రైతులకు ఇబ్బందులు తొలగాయి. 2019 ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే రైతుల తరపున రూ.1,030.74 కోట్లు బీమా ప్రీమియం చెల్లించింది. 2019–20 ఖరీఫ్ బీమా పరిహారం కింద రూ.1227.77 కోట్లను డిసెంబరు 15న రైతులకు చెల్లించాలని నిర్ణయం.
21న భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం
‘వైఎస్సార్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ’ పథకం కింద సమగ్ర భూసర్వే ప్రాజెక్టు డిసెంబరు 21న ప్రారంభం. రూ.927 కోట్లతో ల్యాండ్ సర్వే ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం. డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్ల ద్వారా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహణ. సర్వే రాళ్లను ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందచేస్తుంది.
25న పేదలకు 30.60 లక్షల ఇళ్ల పట్టాలు
‘పేదలు అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా డిసెంబరు 25న రాష్ట్రంలో 30.60 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీకి మంత్రివర్గం ఆమోదం. కోర్టు కేసులు ఉన్న చోట మినహా మిగిలిన అన్ని చోట్లా ఇళ్ల పట్టాలు పంపిణీ. లబ్ధిదారులకు డీపట్టాలు పంపిణీ చేసి కోర్టు కేసులు పరిష్కారం అయ్యాక కన్వెయిన్స్ డీడ్ ఇవ్వాలని నిర్ణయం. పేదలకు పంపిణీ చేసేందుకు రూ.23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను సేకరించారు. 11 వేల పంచాయతీల్లో 17,500 లే అవుట్లలో ఇళ్ల స్థలాలు పేదలకు పంపిణీ చేస్తారు.
వైఎస్సార్–జగనన్న’ కాలనీలు...
పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాల్లో ‘వైఎస్సార్–జగనన్న కాలనీల’ పేరిట పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదించింది. వీటి నిర్మాణ పనులను డిసెంబరు 25న ప్రారంభిస్తారు. 28.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుంది. మొదటి దశలో 8,494 లే అవుట్లలో దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి 2022 జూన్ నాటికి పూర్తి చేస్తారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున తొలి దశలో ఇళ్లను దాదాపు రూ.28,800 కోట్లతో పూర్తి చేస్తారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తారు. మిగిలిన 13 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 2021 డిసెంబరులో ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తారు. మొత్తం వైఎస్సార్–జగనన్న కాలనీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులైన లబ్ధిదారులకు ఏపీ టిడ్కో ఇల్లు రూపాయికే పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదించింది. టీడీపీ సర్కారు పెండింగ్‌లో ఉంచిన డీఏలతో సహా మూడు డీఏలు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం పెంపు 2018 జూలై నుంచి వర్తింపజేస్తూ 2021 జనవరి నుంచి చెల్లించనుంది. 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు. ఇది 2021 జూలై నుంచి చెల్లిస్తారు. 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు. ఇది 2022 జనవరి నుంచి చెల్లిస్తారు. మొత్తం మీద డీఏ పాత బకాయిల కింద రూ.11 వేల కోట్లు, ఇక నుంచి ఏటా రూ.4,400 కోట్ల అదనపు భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు నెలలపాటు జీతాలు, పింఛన్లలో విధించిన కోతల మొత్తాన్ని చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్చి పెండింగ్ జీతాలను డిసెంబరులో, ఏప్రిల్ పెండింగ్ జీతాలను 2021 జనవరిలో చెల్లిస్తారు.
‘పోలవరం’ సెంటీమీటరు కూడా తగ్గించం
పోలవరం ఎత్తును ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించేది లేదని మంత్రివర్గం స్పష్టం చేసింది. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తన అనుకూల మీడియాతో కలసి దుష్ప్రచారం చేయటాన్ని ఖండించింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును ముందు ఆమోదించిన అసలైన డిజైన్ ప్రకారమే నిర్మిస్తామని స్పష్టం చేసింది. స్పిల్ వే పనులను యుద్ధ ప్రాతిపతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం
– డ్యాం రిహాబిలిటేషన్, ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ రెండు, మూడు దశలను మంత్రివర్గం ఆమోదిస్తూ రూ.776.50 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిధులను ప్రపంచబ్యాంకు సమకూరుస్తుంది. సోమశిల – కండలేరు కాలువ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24వేల క్యూసెక్కులకు పెంచుతూ పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.918 కోట్లతో 45కి.మీ. మేర కాలువ పనులు, రెండు బ్రిడ్జీలు సహా పలు పనులు చేపడతారు. అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటి నిల్వ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం రూ.240.53 కోట్లు ఇచ్చేందుకు అనుమతించింది. నాలుగు గ్రామాల పరిధిలో 1,729 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందిస్తారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్ ఫీడర్ కాలువ విస్తరణ పనులకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.632కోట్లు వెచ్చించి దాదాపు 100కి.మీ. మేర కాలువ సామర్థ్యం పెంచుతారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఏపీ పల్నాడు ఏరియా డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు ఆమోదించింది. ఇందులో భాగంగా గుంటూరు ఛానల్ ఎక్స్‌టెన్షన్ స్కీం, వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను చేపడతారు. కృష్ణా–కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది.
ఇతర నిర్ణయాలు ఇవీ...
ఆన్‌లైన్ జూదంపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ‘ఏపీ గేమింగ్ యాక్ట్ – 1974’ చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ‘వైఎస్సార్–జగనన్న ’ మెగా ఇండస్ట్రియల్ హబ్ రాయితీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హబ్ ద్వారా వేలాదిమందికి ఉపాథి అవకాశాలు కల్పిస్తారు. నాణ్యమైన పశుదాణా ఉత్తత్తి, పంపిణీ, ధరల నియంత్రణకు ఉద్దేశించిన బిల్లు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారు. భూ వినియోగ మార్పిడి చట్ట సవరణ కోసం ఉద్దేశించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది. 2006 నాటి చట్టాన్ని ప్రభుత్వం సవరించనుంది. దీనిపై ఇదివరకే ఆర్డినెన్స్ జారీ చేసింది. అనంతపురం జిల్లా పెనుకొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం కోసం రూ.2.50కోట్లు ఖర్చు చేస్తారు. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టం 2020 ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. మత్స్య, ఆక్వా రంగాల సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ఈ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు ప్రవేశపెడతారు. నాగార్జున సాగర్ వద్ద విజయపురి సౌత్‌లో రెసిడెన్సియల్ కాలేజీ, మైదానం, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం కోసం విద్యాశాఖకు ప్రభుత్వం 21 ఎకరాలను కేటాయించింది. విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండిలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ కోసం జేఎన్‌టీయూకు 105.32 ఎకరాల కేటాయింపు.
29,752 హెక్టార్లలో పంట నష్టం...
ప్రాథమిక అంచనాల ప్రకారం నివర్ తుపానుతో 29,752 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. 16,290 హెక్టార్లలో వరి, 7,362 హెక్టార్లలో మినుము, 3,571 ఎకరాల్లో పత్తి, 2,529 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. 1,371 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నవంబరు 23–26 మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 288.80 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇది 188శాతం అధికం. తుఫానుతో ముగ్గురు చనిపోగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 673 ఇళ్లు దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment