సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని, ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వ్యాక్సిన్‌పై ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతూ, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని, ఇది సరికాదని పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలో కోవిడ్ నియంత్రణపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకేరోజు 6 లక్షల టీకాలు వేసి వ్యాక్సినేషన్‌లో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఇది వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధతకు నిదర్శనమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రెండో డోస్ తీసుకునేవారికి వలంటీర్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారమిచ్చి రద్దీని నివారించామని చెప్పారు.
ఆక్సిజన్ వృధా అరికట్టడానికి చర్యలు
రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వల సామర్థ్యాన్ని 517 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ వృధాను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రుయా ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం మరింత పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా అడ్డుకున్నామని, ఈ ఇంజక్షన్ల వినియోగంలో అక్రమాల నివారణకు టాస్‌్కఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో బెడ్ల సంఖ్య పెంచుతున్నామని, ఆ కేంద్రాల్లో కరోనా బాధితులకు పౌష్టికాహారం, అవసరమైన మందులు పంపిణీ చేయడంతోపాటు పారిశుధ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు అవసరమైన కిట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఏపీ అంబులెన్సులను ఆపడం లేదు
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏపీ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను ఆపకుండా తెలంగాణ ప్రభుత్వంతో చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ అంబులెన్స్‌లను అడ్డుకోవడం లేదన్నారు. కరోనా నివారణకు ఒళ్లంతా ఆవు పేడ పూసుకోవాలని, ముక్కులో ఉల్లిరసం వేసుకోవాలని.. సూచిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. శాస్త్రీయమైన, నిపుణులు సూచించే పరిష్కారమార్గాలనే పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యసేవలు పొందాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment