AP Cabinet Approval Kalyanamastu And Shadi Tofa Financial Assistance - Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ కల్యాణమస్తు’.. ‘షాదీ తోఫా’.. పెళ్లికి పెద్ద సాయం

Published Thu, Feb 9 2023 3:21 AM | Last Updated on Thu, Feb 9 2023 12:01 PM

AP Cabinet approval Kalyanamastu and Shadi Tofa financial assistance - Sakshi

సాక్షి, అమరావతి: నిరుపేద తల్లిదండ్రులకు ఆడ­పిల్లల పెళ్లిళ్లు భారం కారాదనే ఉద్దేశంతో ‘వైఎస్సార్‌ కల్యాణ మస్తు’, ‘షాదీ తోఫా’ పథకాల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 10వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, విభిన్న ప్రతిభావంతుల్లో దరఖాస్తు చేసుకున్న 4,536 కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ.38.18 కోట్లు పంపిణీ చేయనుంది. గతంతో పోలిస్తే సాయం మొత్తాన్ని భారీగా పెంచింది.

ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి, వసతి­దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక లాంటి పథకా­లతో పేదింటి బిడ్డల అభ్యున్నతికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వధూవరులకు 10వ తర­గతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జరిగిన వివాహాలకు సంబంధించి అందిన దరఖాస్తులను జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో ఆర్థిక సాయం చెల్లించనుంది.

ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తులను పరిశీలించి నాలుగో నెలలో లబ్ధి అందించనుంది. మరోవైపు చంద్ర­బాబు తన హయాంలో నమ్మించి నట్టేట ముంచిన పొదుపు సంఘాల్లోని 79 లక్షల మంది అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ 3వ విడత వైఎస్సార్‌ ఆసరా కింద రూ.6,500 కోట్ల పంపిణీకి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. సంక్షేమం, విద్య, పరిశ్రమలకు ప్రోత్సాహకం, ఆరోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వాటిని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ..
మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

లా నేస్తం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యాదీవెన ఈ నెలలోనే..
వైఎస్సార్‌ లా నేస్తం కింద నెలకు రూ.5 వేల చొప్పున 65,537 వేల మంది జూనియర్‌ న్యాయవాదులకు మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు అందించింది. ఫిబ్రవరి 17న మరో దఫా వైఎస్సార్‌ లా నేస్తం సాయం పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 17 వేల మందికి మేలు చేస్తూ రూ.25 కోట్లు చెల్లించింది.
► ఫిబ్రవరి 24న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌.
► అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన ద్వారా ఫిబ్రవరి 28న పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ.700 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. 
 
మార్చిలో మరిన్ని..
► ఉగాది సందర్భంగా మూడో విడత వైఎస్సార్‌ ఆసరా పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారం రోజుల పాటు పండగ వాతావరణంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సాయం అందించనుంది. 10–04–2019 నాటికి పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు రూ.25 వేల కోట్లు చెల్లిస్తానని పాదయాత్రలో సీఎం జగన్‌ ప్రకటించారు. మాట ప్రకారం ఇప్పటికే దాదాపు రూ.13 వేల కోట్లకుపైగా అందించారు. తాజాగా మరో రూ.6,500 కోట్లు ఇవ్వనున్నారు.
► అగ్రవర్ణ పేదల్లో 45 – 60 ఏళ్ల వయసు మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా రూ.600 కోట్లు అందించనున్నారు. దాదాపు 4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. 
► జగనన్న వసతి దీవెన కింద ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల వరకూ సాయం అందించనుంది. విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
► విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2వతేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకంలో రాగిజావ అందించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు అందచేసేందుకు అదనంగా రూ.86 కోట్లు ఖర్చు చేయనుంది.

320 వర్సిటీలకు జగనన్న విదేశీ విద్యాదీవెన..
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా అత్యధికంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు క్యూఎస్‌ ర్యాంకింగ్‌ టాప్‌  200 విశ్వవిద్యాలయాలను పరిగణలోకి తీసుకోగా తాజాగా 320కి పెంచారు. ఇకపై దాదాపు 21 సబ్జెక్టులకు సంబంధించి టాప్‌ 50 కాలేజీలు లేదా విద్యాసంస్థల్లో సీటు సాధించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుంది.

ఇప్పటివరకు కేవలం క్యూఎస్‌ ర్యాంకును మాత్రమే పరిగణలోకి తీసుకోగా ఇకపై టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా సీటు సాధించిన వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన అందించనుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, అర్హులైన ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనుంది. 

ప్రజారోగ్యానికి పెద్దపీట..
► ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌ గ్రేడ్‌. 52 అదనపు పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి ఆమోదం. వైద్యశాఖలో ఇప్పటికే దాదాపు 49 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
► ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతి పీహెచ్‌సీలో సిబ్బంది 12 నుంచి 14 మందికి పెంపు. కొత్తగా 1,610 పోస్టుల భర్తీ.
► డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టులో జిల్లా సమన్వయకర్తలుగా 10 అదనపు పోస్టుల భర్తీతో పాటు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను ఫారిన్‌ సర్వీసు డిప్యుటేషన్‌ (ఎఫ్‌ఎస్‌డి)పై నియామకం ప్రతిపాదనకు ఆమోదం.

విద్యారంగం..
► కర్నూలులో 50 ఎకరాల్లో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(ఎన్‌ఎల్‌యూ) ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం.
► సబ్జెక్టు టీచర్లుగా అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నెలకు రూ.2500 చొప్పున అలవెన్స్‌ చెల్లింపు ప్రతిపాదనకు ఆమోదం.
► నాడు – నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతిపైన ఉన్న అన్ని క్లాసులను డిజిటల్‌గా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం ప్రతి తరగతి గదిలో ఒక ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్లానెల్‌ (ఐఎఫ్‌పీ) చొప్పున 30,213 ఐఎఫ్‌పీలు ఏర్పాటుకు ఆమోదం.
► కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల బోధనా సిబ్బందికి గౌరవ వేతనం అదనంగా 23 శాతం పెంపుతో పాటు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్లతో (సీఆర్టీలు) సమానంగా గౌరవ వేతనం చెల్లింపు ప్రతిపాదనకు ఆమోదం.

పరిశ్రమలకు ప్రోత్సాహం..
► గ్రానైట్‌ పరిశ్రమలకు పూర్వ వైభవం కల్పించేలా ప్రోత్సాహాలు. స్మాల్‌ స్కేల్‌ గ్రానైట్‌ పరిశ్రమలకు యూనిట్‌ విద్యుత్తు రూ.2కు సరఫరా.
► పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టు సంస్థలకు అవసరమైన అనుమతుల జారీకి ఆమోదం.
► ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సంస్ధ సుమారు 1,000 మెగావాట్ల విండ్‌పవర్, 1,000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు అనుమతులు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దశలవారీగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.
► అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250, కర్నూలు జిల్లా బేతంచర్లలో 118.8 మెగావాట్లు, అనంతపురం జిల్లా కురుబరాహల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా చిన్న కొలుములపల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా మెట్టుపల్లిలో 100 మెగావాట్లు, జలదుర్గంలో 130 మెగావాట్లతో విండ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయం.
► అనంతపురం జిల్లా కమలపాడు, యాడికిలో 250 మెగావాట్లు, శ్రీ సత్యసాయి జిల్లా కొండాపురంలో 250 మెగావాట్లు, నంద్యాల జిల్లా నొస్సంలో 500 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం.

మౌలిక వసతుల కల్పన
► ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ 500 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు 406.46 ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం.అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో భూముల కేటాయింపు.
► మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణ కోసం రూ.3,940.42 కోట్ల బ్యాంకు గ్యారంటీకి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మధ్య కుదిరిన ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ కేబినెట్‌ ఆమోదం.
► పెట్టుబడులు, మౌలికసదుపాయాలు కల్పన శాఖలో ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ విభాగానికి చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) పోస్టు మంజూరు.
► రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 250 ఎకరాల భూమి లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు
ఆమోదం.
► స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. 

మరికొన్ని నిర్ణయాలకు ఆమోదం
►కర్నూలు జిల్లా డోన్‌లో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 31 మంది బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది భర్తీకి మంత్రిమండలి ఆమోదం.
►వైఎస్సార్‌ జిల్లా ఫాతిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 2015–16లో కేటగిరీ–ఏ తో పాటు తర్వాత విద్యా సంవత్సరాలకు సంబంధించి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యా­ర్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు అంశాన్ని స్పెషల్‌ కేసుగా పరిగణించాలన్న ప్రతి­పాదనకు కేబినెట్‌ ఆమోదం. ఇందులో భాగంగా రూ.9,12,07,782 చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌.

►1998 డీఎస్సీలో అర్హత సాధించిన 4,534 మంది అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టులు కల్పించాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. వీరికి మినిమమ్‌ టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) వర్తింపజేయనుంది. ప్రాథమిక విద్యాశాఖతో పాటు ఖాళీలను అనుసరించి బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ స్కూళ్లలో పోస్టులను భర్తీ చేయనుంది.

►విశాఖపట్నంలో 100 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్కు, స్కిల్‌ సెంటర్‌తో పాటు రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటు కోసం 60.29 ఎకరాలు వైజాగ్‌ టెక్‌ పార్కు లిమిటెడ్‌ (వీటీపీఎల్‌)కు కేటాయింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. వైజాగ్‌ టెక్‌ పార్కు ద్వారా 14,825 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

►రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలకు సంబంధించి 10 ప్రిన్సిపాల్, 138 బోధనా సిబ్బంది, 36 నాన్‌ టీచింగ్‌ పోస్టులు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీకి ఆమోదం.
►విజయవాడలోని ఏపీ జువైనల్‌ వెల్ఫేర్‌ డి­పార్ట్‌మెంట్‌లో డైరెక్టర్‌ పోస్టు భర్తీకి ఆమోదం.
►ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌లో 29 అదనపు పోస్టుల భర్తీ.

►గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ అండ్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ రద్దు ప్రతిపాదనకు ఆమోదం.  
►ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీల చట్టం–1965, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టం– 1955లకు సవరణలకు సంబంధించి డ్రాప్ట్‌ బిల్లుకు ఆమోదం.
►పట్టణ స్థానిక సంస్థల్లో సమగ్ర భూముల రీ సర్వేకు అవసరమైన సవరణలకు ఆమో­దం.
►ఏపీ మున్సిపల్‌ అకౌంట్స్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ కింద పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్‌ (అకౌంట్స్‌) పోస్టు ఏర్పాటుకు ఆమోదం.

► ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు భూమి 20 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు ఆమోదం. 16 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ (ఒంగోలు, నెల్లిమర్ల, పాలకొండ, శ్రీకాకుళం, వినుకొండ, అనంతపురం, ప్రొద్దుటూరు, కావలి, పిఠాపురం, రాయచోటి, గూడూరు, పెద్దాపురం, కడప, బద్వేలు, వెంకటగిరి, చిలక­లూ­రిపేట)లలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 కే అద్దె ప్రాతిపదికన కేటాయించాలన్న ప్ర­తిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

►నెల్లూరు బ్యారేజీని నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజ్‌గా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
►ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో వివిధ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో 14 ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్ల భర్తీకి నిర్ణయం. విజయనగరంలో అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. లీగల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్స్‌ సజావుగా నడిచేందుకు వీలుగా సపోర్టింగ్‌ స్టాప్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం. 

►మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ మంత్రివర్గం ఆమోదం. 
►ఆంధ్రప్రదేశ్‌ వ్యాట్‌–2023 బిల్లు సవరణ, టీటీడీ ఐటీ విభాగం(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌)లో 34 పోస్టుల భర్తీ, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ స్కల్ప్చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌వీఐ­టీఎస్‌ఏ)లో 12 పోస్టుల భర్తీకి ఆమోదం. 
►పశు సంవర్థకశాఖలో నిపుణుల కొరత తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ పారా వెటర్నరీ అండ్‌ అలైడ్‌ కౌన్సిల్‌ యాక్ట్‌  2023 ముసాయిదా బిల్లుకు ఆమోదం.
► ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్‌పీఎఫ్‌)లో 105 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement