పెద్ద చదువుల కల సాకారం | CM YS Jagan Comments At YSR Kalyanamasthu and Shadi Tohfa | Sakshi
Sakshi News home page

పెద్ద చదువుల కల సాకారం

Published Thu, Aug 10 2023 3:25 AM | Last Updated on Thu, Aug 10 2023 4:03 PM

CM YS Jagan Comments At YSR Kalyanamasthu and Shadi Tohfa - Sakshi

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు

నా చెల్లెమ్మలు కనీసం డిగ్రీ వరకైనా చదవాలన్నది నా తపన, తాపత్రయం. ఇందులో భాగంగానే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు పదవ తరగతి ఉత్తీర్ణులవ్వాలని కనీస అర్హత పెట్టాం. తద్వారా అంతవరకు తల్లిదండ్రులు తప్పక చదివిస్తారు. ఆ తర్వాత కూడా అమ్మ ఒడి వల్ల ఇంటర్‌ వరకూ కాలేజీకి పంపిస్తారు. విద్యాదీవెన, వసతి దీవెన వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు కాని పరిస్థితి తీసుకు రావడం వల్ల డిగ్రీ వరకు చదవాలనే పట్టుదల పెరిగింది. తద్వారా నా చెల్లెమ్మలందరూ మంచి మంచి డిగ్రీలు చదివి.. పేదరికం నుంచి బయట పడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మన కళ్లెదుటే కనిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నా చెల్లెమ్మలు పెద్ద చదువులు చదవాలనే లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారుల్లో 86 శాతం మంది అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అమ్మాయిలు పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహించడంతో పాటు బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా కళ్యాణ మస్తు, షాదీ తోఫా అమలు ద్వారా వారి పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

అర్హులెవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి, వారికి లబ్ధి చేకూర్చే మానవత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం ఇదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌– జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలందరూ పెద్ద చదువులు చదివి పేదరికం నుంచి బయటకు రావాలన్నదే జగనన్న ప్రభుత్వం కోరిక అని తెలిపారు.

అమ్మాయిల పెద్ద చదువుల కోసమే ప్రతీ మండలంలోని హైసూ్కలును ప్రత్యేకంగా వారి కోసం జూనియర్‌ కాలేజీగా మారుస్తున్నామని చెప్పారు. పేదరికం నుంచి బయట పడేందుకు పెద్ద చదువులే బ్రహ్మాస్త్రంగా ఉండాలని మనందరి ప్రభుత్వం ఆరాట పడుతోందన్నారు. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోనే అక్కడే వెరిఫికేషన్‌ పూర్తి చేసి సర్టిఫికెట్‌ అందిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

 ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ.. 
► వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కార్యక్రమాలు చదువులను మరింత ప్రోత్సహిస్తూ.. ఆడ పిల్లలు గొప్పగా చదివేలా ప్రోత్సహిస్తున్నాయి. ఆ కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలు కూడా. ఈ రోజు పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవ ప్రదంగా, అప్పుల పాలవ్వకుండా బాగా చేయాలని కోరుకుంటారు.  

► అలా పేదరికంలో ఉన్న నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టిలు, నా దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లల కోసమే ఈ పథకం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి రావాలని.. ఆ పిల్లలు బాగా చదివి ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు వెళ్లే పరిస్థితి రావాలన్న తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం.  

► ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌ ఈ మూడు నెలలకు సంబంధించి పెళ్లిళ్లు అయిన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలు అయిన వారిలో ఏ కారణంగానైనా లేదా సర్టిఫికెట్‌ సకాలంలో సమర్పించక పోవడం, అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ఆ సమయంలో లేకపోవడం వంటి కారణాలతో లబ్ధి పొందని వారికి కూడా కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నాం.  

ఇల్లాలి చదువు.. పిల్లలకు మేలు  
► ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే డిగ్రీ వరకు చదువుకున్న పరిస్థితి ఉంటుందో.. తర్వాత తరంలో తమ పిల్లలను ఇంకా ఉన్నత విద్య వైపు నడిపించే పరిస్థితి ఉంటుంది. తద్వారా పేద సామాజిక వర్గాల్లో పిల్లలు గొప్పగా చదివే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరికీ కనీసం డిగ్రీ సర్టిఫికెట్‌ చేతిలో ఉండే పరిస్థితి రావాలి. అవి కూడా మంచి డిగ్రీలు అయి ఉండాలి. భవిష్యత్‌లో వారు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది. 

► ఈ పథకం గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? మన ప్రభుత్వం వచ్చాక ఏ రకమైన మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో చేశామంటే చేశామన్నట్టు మొక్కుబడిగా చేశారే తప్ప.. చిత్తశుద్ధిగా చేయలేదు. పేదల బతుకులు మారాలి.. వారికి మంచి జరగాలన్న ఆలోచన వారికి ఏ రోజూ లేదు. 2018లో 17,709 మందికి దాదాపు రూ.68.68 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ రోజుల్లో కేవలం ఎన్నికలే లక్ష్యంగా పథకాలు తెచ్చారు. 
జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువులు 
► ఈ రోజు ఈ పథకానికి పదో తరగతి పాస్‌ అయి ఉండాలన్న నిబంధనను తీసుకొచ్చాం. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నాం. నా చెల్లెమ్మలకు 18, తమ్ముళ్లకు 21 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. తద్వారా చెల్లెమ్మలు పదో తరగతి వరకు కచ్చితంగా చదువుతారు. ఆ తర్వాత 18 సంవత్సరాల వరకు ఎలాగూ ఆగాలి.. అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి.. చదువు కొనసాగిస్తూ ఇంటర్‌ పూర్తి చేస్తారు. ఆ తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ – విద్యాదీవెన, వసతి దీవెన అనే రెండు పథకాలతో డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి పెద్ద చదువులు పూర్తి చేసేందుకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం భరిస్తూ తోడుగా నిలబడుతోంది. 

► డిగ్రీలో చేరితే చాలు.. వసతి దీవెన అనే పథకం ద్వారా రూ.20 వేలు బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం రెండు దఫాల్లో పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. ఇది మరో ప్రోత్సాహకరమైన కార్యక్రమం. ఫీజు కాకుండా వారు డిగ్రీ చదివేందుకు ఒక్కొక్కరికి రూ.60 వేలు ఇచ్చినట్టవుతుంది.   

► ఆ తర్వాత పెళ్లిళ్లు చేసినట్లయితే.. మైనార్టిలకు షాదీతోఫా కింద ఏకంగా రూ.లక్ష ఇచ్చి తోడుగా నిలుస్తున్నాం. గతంలో రూ.50 వేలు మాత్రమే ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించి, ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు చూశాం. వికలాంగులకు ఏకంగా రూ.1.50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. గత ప్రభుత్వంలో రూ.లక్ష ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టారు. 

► భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వంలో రూ.20 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మనం ఈరోజు రూ.40 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్సీలకు గతంలో రూ.40 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మన ప్రభుత్వంలో రూ.లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్టీలకైతే గతంలో రూ.50 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మన ప్రభుత్వంలో రూ.లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. బీసీలకు గతంలో రూ.30 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మనం ఏకంగా రూ.50 వేలు ఇచ్చి వాళ్లను కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. కులాంతర వివాహాలకు మనం అప్పటి కంటే ఇంకా ఎక్కువ ఇచ్చి మనసు పెట్టి ప్రోత్సహిస్తున్నాం.   

ప్రతి అడుగులోనూ మానవత్వం  
► దూదేకుల, నూర్‌ బాషాలకు సంబంధించి వాళ్లు కూడా మైనార్టిలే కదా అని సానుకూలంగా పరిగణలోకి తీసుకుని వాళ్లకు కూడా రూ.లక్ష పెంచే కార్యక్రమం చేశాం. గతంలో రూ.లక్ష రాని 227 జంటలకు కూడా ఇప్పుడు ఇస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వం ప్రదర్శించాం. దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి చెల్లెమ్మకు, తమ్ముడికి, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. 

► ఈ కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ఒక హైసూ్కల్‌ను ప్రత్యేకంగా బాలికల జూనియర్‌ కాలేజీగా మార్చాం. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా అడుగులు వేగంగా వేస్తున్నాం. ఇందులో ఒకటి కో ఎడ్యుకేషన్‌ కాలేజీ కాగా, మరొకటి ప్రత్యేక బాలికల జూనియర్‌ కళాశాల.  

► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఉషశ్రీచరణ్, సీఎస్‌ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. 

3 విడతల్లో రూ.267 కోట్లు 
► గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రెండు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేశాం. ఇవాళ మూడో విడతతో కలిపి మొత్తంగా రూ.267 కోట్లు సాయం చేశాం. మొత్తంగా 35,551 జంటలకు మేలు జరిగింది. ప్రతి ఏడాది మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.   

► ఇవాళ సాయం అందుకున్న 18,883 మంది పిల్లలకు సంబంధించి కొన్ని విషయాలు సంతోషం కలిగిస్తున్నాయి. ఇందులో 18–21 ఏళ్ల వయసులో 8,524 మంది చెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వీటన్నింటి వల్లా లబ్ధి పొంది.. డిగ్రీ కూడా చదివిన, చదువుతున్న వారు 7,344 మంది ఉన్నారు. అంటే 8,524 మంది చెల్లె­మ్మల్లో డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సులను 86 శాతం మంది చదువుతున్నారు.  

► పదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు అమ్మఒడి, ఆ తర్వాత డిగ్రీలో విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మేలు పొందారు. ఏం సాధించాలని మనం తాపత్రయపడ్డామో అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఈ మంచి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. ఎక్కువ మందికి మేలు జరిగే పరిస్థితి రావాలి. ప్రతి చెల్లెమ్మ డిగ్రీ వరకు కనీస చదువు ఉండాలన్నదే మన తపన. 

పేదలకు ఎంతో ఉపయోగం 
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పేరుతో మీరు (సీఎం) చేస్తున్న సాయం పేదలకు ఊరట కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో కంటే ఎక్కువగా సాయం అందిస్తుండటం పట్ల పేదలంతా సంతోషంగా ఉన్నారు. గతంలో పెళ్లి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది. మీ గొప్ప ఆలోచన వల్ల ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగకరం. దీనిపై కూడా ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు కట్టుకథలు రాస్తున్నాయి. వీరికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నా. 
– మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి 

గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నాం 
అన్నా నమస్తే.. మేం ముగ్గురం ఆడపిల్లలం. మా పేదరికం వల్ల నేను ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్స్‌లో ఉండి చదువుకున్నాను. మీరిచ్చిన విద్యా దీవెన, వసతి దీవెనతో బీఎస్సీ బీఈడీ పూర్తి చేశాను. నాకు తండ్రి లేడు. నా పెళ్లి గురించి చాలా దిగులు పడ్డాను. ఈ స్కీమ్‌ ఎంతగానో అండగా నిలిచింది. అన్నదమ్ములు లేని నాకు మీరు ఈ విధంగా కూడా సాయం చేసినందుకు చాలా థాంక్స్‌ అన్నా. మీ పథకాల వల్లే మేం సమాజంలో గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నాం. మళ్లీ మీరే సీఎంగా రావాలి. 
– ఎం.సుమతి, ఐరాల మండలం, పూతలపట్టు నియోజకవర్గం 

మా రాతను తిరగరాస్తున్నారు.. 
అన్నా.. నేను ఎస్టీ, మా వారు ఎస్సీ. మా గ్రామంలో మా పెద్దలు కులాంతర వివాహం చేశారు. ఆ తర్వాత మా సచివాలయం వలంటీర్‌ వచ్చి మీరు దరఖాస్తు చేస్తే జగనన్న మీకు రూ.1,20,000 సాయం అందిస్తారని చెప్పారు. ఈ రోజు అది నిజమైంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాం. చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, ఆర్బీకేలు, సచివాలయాలు, క్లినిక్‌ల వల్ల ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతోంది. విధిరాత బ్రహ్మ రాస్తుంటాడని పెద్దలు చెప్పారు. కానీ మా భవిష్యత్‌ను మీరు తిరిగి రాస్తున్నారు. అన్నా.. మీకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. 
– కిల్లక అనూష, దిగువమండ, పార్వతీపురం మన్యం జిల్లా 

మీరే లేకుంటే మేం అనాథలమే 
అన్నా.. నాలాంటి పేద అమ్మాయిలకు ఈ పథకం వరం. నేను శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన మహిళను. అనుకోకుండా నాన్న చనిపోవడంతో అమ్మ కూలి పనులు చేసి ఇల్లు నెట్టుకొచ్చింది. తమ్ముడు ఐటీఐ చదువుకున్నాడు. నా వివాహం వల్ల అమ్మకు ఆర్ధిక ఇబ్బంది కలుగకుండా ఈ పథకం ఆదుకుంది.  అమ్మకు ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్‌ జరిగింది. వితంతు పింఛన్‌ కూడా వస్తోంది. మీరే లేకుంటే మేం అనాథలయ్యేవాళ్లం. మీ మేలు ఎప్పటికీ మరచిపోం.    
– ధనలక్ష్మి, పుల్లేటికుర్రు, అంబాజీపేట మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement