ఓట్లు కోసం కాదు.. సంకల్పంతో అడుగులు | CM Jagan Releases YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa Funds | Sakshi
Sakshi News home page

ఓట్లు కోసం కాదు.. సంకల్పంతో అడుగులు

Published Fri, Nov 24 2023 4:10 AM | Last Updated on Fri, Nov 24 2023 4:10 AM

CM Jagan Releases YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa Funds - Sakshi

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం జగన్‌

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలను ప్రకటించినప్పుడు వధూవరులకు పదో తరగతి సర్టిఫికెట్, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండటం తప్పనిసరి అనే నిబంధన ఎందుకు విధించారు? అని నాతో చాలా మంది అన్నారు. అలాంటి షరతులు లేకుండా ఆ పథకాలను అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పారు. అప్పుడు నేను ఒకటే చెప్పా.. ఓట్లు, ఎన్నికలు అనేవి సెకండరీ అని స్పష్టం చేశా. మేం ఓట్ల కోసం కాకుండా విజన్‌తో అడుగులు వేస్తున్నాం.  
 – సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: నాయకత్వం వహించే స్థానంలో ఉన్నప్పుడు మంచి సంకల్పంతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మన ఉద్దేశం, సంకల్పం మంచిదైతే ఆ దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని, సత్సంకల్పానికి పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి వస్తాయని చెప్పారు. ఉన్నత చదువులకు మరింత ఊతమిస్తూ ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలకు సంబంధించి 2023 జూలై – సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

బాల్య వివాహాలకు తెర.. ఉన్నత చదువులకు ఊతం 
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి గౌరవప్రదంగా వారి పెళ్లిళ్లు చేసి వైవాహిక జీవితాలను ప్రారంభించడంలో సహాయంగా నిలిచే మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. మనం లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం మంచిదై ఉండాలి. విజన్‌ మోస్ట్‌ ఇంపార్టెంట్‌. ఈరోజు మనం వేసే ప్రతి అడుగులోనూ విత్తనం వేస్తున్నాం. ఇదొక ప్రేరణ అంశం కావాలి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 10వ తరగతి సర్టిఫికెట్‌తోపాటు వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు కనీస వయసు ఉండాలని నిర్ణయించడం వల్ల బాల్య వివాహాలను అరికట్టవచ్చు.

ఇదొక పరిష్కారం. రెండోది 10వ తరగతి సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడం ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా మరింత ఊతం ఇస్తుంది. అమ్మఒడి పథకం ఇప్పుడు ప్రతి తల్లిని మోటివేట్‌ చేస్తూ తమ పిల్లలను చక్కగా చదివించేలా అడుగులు వేయిస్తోంది. పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మీకులు అందరినీ ప్రతి సందర్భంలో అక్కున చేర్చుకుని నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ వారి సంక్షేమ బాధ్యతలను స్వీక­రించాం. వారంతా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వా­రని భరోసా ఇస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.  

మంచి సంకల్పంతో ముందడుగు.. 
గత ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉండేదని ఒక్క­సారి బేరీజు వేసుకుంటే కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. గత ప్రభుత్వం ఒక మంచి పథ­కాన్ని తీసుకురావాలని, దానివల్ల పేదలకు మంచి జరగాలని ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో అడుగులు వేయలేదు. ఏదైనా ఒక పథకం తీసుకొస్తే సదుద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మంచి చేసే మనసుని ఆశీర్వదిస్తాడు. పరిస్థితు­లు దాన్ని చేసేందుకు అన్ని రకాలుగా కలిసి వ­స్తాయి. అలాంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ కళ్యాణమస్తు, షాదీ తోఫా. 

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు.. 
ఇవాళ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. వాటిలో ఇంగ్లిష్‌ మీడియం చదువులు వచ్చాయి. నాడు – నేడుతో కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా సిద్ధమయ్యాయి. 6వ తరగతి నుంచి క్లాస్‌­రూమ్‌లో డిజిటల్‌ బోధనతోపాటు ఐఎఫ్‌పీల ద్వారా బోధన కూడా అందుబాటులోకి వచ్చింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చా­ం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు సమకూర్చడంతోపాటు బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌తో పిల్లలు గొప్పగా ఎదగాలని తాపత్రయపడుతూ అడుగులు వేస్తున్నాం.  

తల్లులను ప్రోత్సహిస్తూ.. తలరాతలు మారుస్తూ 
వీటన్నింటికీ తోడు తమ పిల్లలను బడులకు పంపే విధంగా తల్లులను మోటివేట్‌ చేస్తూ ‘అమ్మ ఒడి’ తెచ్చాం. అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి పిల్లలను తప్పకుండా ఇంటర్‌ కూడా చదివిస్తారు. ఒక్కసారి ఇంటర్‌ వరకు పిల్లలను చదివించాక ఆ తర్వాత  జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తోడుగా అందుబాటులో ఉన్నాయనే విషయం మెదడుకు తడుతుంది. విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు అందుతుందని, తమకు రూపాయి కూడా ఖర్చు లేకుండా పిల్లలను చదివించగలమని గ్రహిస్తారు. కాలేజీలలో పిల్లలను చేరిస్తే వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేల వరకు అందుతుందని మనసుకు తడుతుంది. అప్పుడు పిల్లల్ని కనీసం గ్రాడ్యుయేషన్‌ వరకు చదివించేలా తల్లిదండ్రులు మోటివేట్‌ అవుతారు. ఒక్కసారి పిల్లలను గ్రాడ్యుయేట్‌ స్థాయి వరకు చదివించడం వల్ల జనరేషన్‌ చేంజ్‌ వస్తుంది.  

గొప్ప మార్పులకు చిహ్నం.. 
సంతోషకరమైన విషయం ఏమిటంటే కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇవాళ లబ్ధి పొందుతున్న 10,511 జంటలలో 8,042 మందికి అమ్మ ఒడి / జగనన్న విద్యా దీవెన / జగనన్న వసతి దీవెన ద్వారా కూడా ప్రయోజనం చేకూరిందనే విషయం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఇది గొప్ప మార్పులకు చిహ్నం. రాబోయే రోజుల్లో వంద శాతం నమోదు కావాలని కోరుకుంటున్నా. 

పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు 
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాం­ఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, కార్మీక, ఉపాధి, శిక్షణ శాఖల మంత్రి గుమ్మ­నూరు జయరామ్, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.అనంతరాము, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్, గ్రామ, వార్డు సచివాల­యాల శాఖ డైరెక్టర్‌ లక్ష్మీశ పాల్గొన్నారు.

నాడు మూలబడ్డ పథకం 
చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మారే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు పేదరికం నుంచి బయటపడే గొప్ప పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నింటినీ మనసులో పెట్టుకునే ఈ పథకాన్ని తెచ్చాం. మనం అధికారంలోకి రాకముందు గతంలో ఇలాంటి పథకానికి పదో తరగతి వరకు చదివి ఉండాలనే నిబంధన లేదు. అది కూడా నాడు అరకొరగా ఇచ్చారు. ఇక 2018 నాటికి పథకాన్నే పక్కన పడేశారు. ఇంత మందికి ఇచ్చిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. నాడు అసలు ఎప్పుడిస్తారో తెలియదు.

ఇచ్చే దాంట్లో పారదర్శకత, మోటివేషన్, చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. కానీ ఈరోజు మనం చిత్తశుద్ధితో, అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తపనతో ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే వెరిఫికేషన్‌ చేసి కల్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తెచ్చాం. 10వ తరగతి సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా టెన్త్‌ వరకు చదువుతారు. 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. దీనివల్ల గొప్ప మార్పు సాకారమవుతుంది. 

నేడు నిండు మనసుతో 
గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే అదీ కొంత మందికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. ఇవాళ మనం మైనార్టీలకు నిండు మనసుతో ఏకంగా లక్ష రూపాయలు ఇస్తున్నాం. అది కూడా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెబుతున్నాం. తద్వారా పిల్లలను చదివించేందుకు రూ.లక్ష మైనార్టీలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. దివ్యాంగులకు ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షలు ఇస్తున్నాం. ఎస్సీలకు గత ప్రభుత్వం రూ.40 వేలు మాత్రమే ఇస్తే ఇవాళ మనం రూ.లక్ష ఇస్తున్నాం. ఎస్టీలకు గత సర్కారు రూ.50 వేలు ఇస్తే ఇప్పుడు మనం రూ.లక్ష అందచేస్తున్నాం.

ఇక బీసీలకు గతంలో రూ.35 వేలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి నెలకొనగా ఇప్పుడు రూ.50 వేలు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకైతే కులాంతర వివాహాలకు ఏకంగా రూ.1.20 లక్షలు ఇస్తున్నాం. ఇలా చదువులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులంతా తమ పిల్లల్ని గొప్పగా చదివించే దిశగా అడుగులు వేసేలా తోడుగా నిలుస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లే కొద్దీ చాలా మందికి ప్రోత్సాహంగా నిలవాలని తాపత్రయ పడుతున్నాం. 

46,062 జంటలకు 349 కోట్ల లబ్ధి 
ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు జరిగిన వివాహాలకు సంబంధించి 10,511 జంటలను ఆశీర్వదిస్తూ రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవాళ బటన్‌ నొక్కి పథకం ద్వారా నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా ఇప్పటికే మూడు త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఆర్థిక సాయాన్ని అందించాం. 2022 అక్టోబర్‌ నుంచి మొదలు పెడితే ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్ల మేర తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లైంది.

పెళ్లి సమయంలో ఆదుకుంది 
నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీ పూర్తి చేశా. మూడు నెలల క్రితం వివాహమైంది. వితంతువైన మా అమ్మ నా పెళ్లి సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. వలంటీర్‌ వచ్చి వైఎస్సార్‌ కళ్యాణమస్తు పథకం గురించి చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నా. నాలాంటి ఎంతోమందికి ఇది ప్రయో­జనం చేకూరుస్తోంది. అమ్మకు వితంతు ఫింఛన్‌ వస్తోంది. పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న మా అమ్మ రుణం తీసుకుని చిన్న కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషి­స్తోంది. నాన్న బతికున్న సమయంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైతే ఫింఛన్‌ అందించారు. మీ ప్రభుత్వం ద్వారా రూ.3 లక్షలకుపైగా లబ్ధి పొందాం. మీ పథకాలతో ప్రభు­త్వం పేదలకు పెద్ద సంఖ్యలో ప్రయోజనం చేకూరుస్తోంది. 
– విశాఖ కలెక్టరేట్‌ నుంచి పితాని ప్రశాంతి, లబ్ధిదారురాలు 

పేదింటి బిడ్డల చిరునవ్వుకు మీరే కారణం 
సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చిన్న ఉద్యోగం చేస్తున్నా. మేం ముగ్గురం ఆడపిల్లలం. నా పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. కళ్యాణమస్తు ద్వారా రూ.75 వేలు సాయం అందింది. నాకు చదువుకోవడం అంటే ఇష్టం. స్ధోమత లేకపోవడంతో దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశా. చదుకునేందుకు ఇప్పటి మాదిరిగా ఆర్థిక తోడ్పాటు ఉంటే ఇంకా బాగా చదువుకునేదానిని. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. నాలాంటి పేదింటి బిడ్డల చిరునవ్వుకు మీరే కారణం. మా నమ్మకం, భవిష్యత్‌ మీరే జగనన్నా! నా తల్లిదండ్రులకు కుమారుడు లేని లోటును మీరు తీర్చారు.  
– కాకినాడ కలెక్టరేట్‌ నుంచి దేవి, లబ్ధిదారు

పెద్దన్నలా పెళ్లి బాధ్యత తీసుకున్నారు.. 
నేను డిగ్రీ బయో టెక్నాలజీ చదివా. మేం ఇద్దరం ఆడపిల్లలం. మా ఇంటి పెద్ద కుమారుడిలా మీరు నా పెళ్లి బాధ్యత తీసుకున్నారు. ఎంతోమంది పేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. మాకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. మా కుటుంబానికి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరింది. ఎన్నెన్నో పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్నారు. పదో తరగతి పాస్‌ కావాలనే నిబంధన ఎంతో మంచిది. ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండాలన్న షరతు కూడా మంచిదే. దీనివల్ల బాల్య వివాహాలు ఆగిపోతాయి. మా కడప నగరంలో అభివృద్ధి చక్కగా కనిపిస్తోంది. మీకోసం నేను అల్లాకి దువా చేస్తా.  
– సయ్యద్‌ సదఖూన్, లబ్ధిదారు, కడప కలెక్టరేట్‌ నుంచి

చదువులకు ప్రోత్సాహం
గత ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు ఎగ్గొట్టింది. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా ఇప్పుడు సీఎం జగన్‌ ఉదారంగా మరింత సాయం చేస్తున్నారు. ఇది గొప్ప ఆలోచన. అక్షరాస్యత పెరిగేలా, చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 11.6 శాతం ఉన్న పేదరికం ఈరోజు 6 శాతానికి దిగి రావటానికి సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణం. పేదలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే మేం సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా వాస్తవాలు వివరిస్తున్నాం. యాత్రకు మంచి ప్రజాదరణ లభిస్తోంది. 
– మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement