CM YS Jagan Comments On YSR Kalyanamasthu YSR Shaadi Tohfa Schemes - Sakshi
Sakshi News home page

దివ్యాస్త్రం అందుకోండి..

Published Sat, May 6 2023 3:50 AM | Last Updated on Sat, May 6 2023 9:15 AM

CM YS Jagan Comments On YSR Kalyanamasthu YSR Shaadi Tohfa - Sakshi

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాలకు సంబంధించిన చెక్కుతో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పేదరికం నుంచి బయట పడా­లంటే చదువు ఒక్కటే మార్గమని, ఈ దివ్యాస్త్రం ద్వారా పేద కుటుంబాలన్నీ పేదరికాన్ని అధిగమించాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముం­దుకు వేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రంలో చదువుల విప్లవానికి జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతోపాటు వైఎస్సార్‌ కళ్యాణ­మస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా సైతం బెంచ్‌ మార్క్‌గా దోహదం చేస్తాయని స్పష్టం చేశారు.

జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకం కింద శుక్రవారం రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. తన క్యాంపు కార్యాలయంలో కంప్యూ­టర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లా­డుతూ.. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకంలో లబ్ధి పొందుతున్న 12,132 జంటల్లో 5,929 జంటలు జగనన్న విద్యా దీవెన.. వసతి దీవెన పొందాయన్నారు.

దాదాపు ఆరు వేల జంటలు డిగ్రీ పూర్తి చేయడమో, డిగ్రీ చదవుతుండటమో జరుగుతోందని చెప్పారు. వీటన్నింటి వల్ల ప్రతి పేద కుటుంబం నుంచి చదువుల విప్లవం రావాలని, తద్వారా వారు పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఇందులో భాగంగానే లబ్ధిదారులైన పిల్లలు కనీసం 10వ తరగతి కచ్చితంగా చదివి ఉండాలనే నిబంధన తీసుకొచ్చామన్నారు.

అప్పుడే షాదీ తోఫా, కళ్యాణమస్తులు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఇది ఎప్పుడైతే ఎఫెక్టివ్‌గా మైండ్‌లో రిజిస్టర్‌ అవుతుందో అప్పుడు కచ్చితంగా పదో తరగతి వరకు చదివించాలన్న తపన ప్రతి ఒక్క పేద కుటుంబంలో మొదలవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

చదువు కోసమే ఈ తపన
► ఈ పథకాలకు 10వ తరగతి అర్హతతో పాటు అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వయస్సు కచ్చితంగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఏ కుటుంబం అయినా పదో తరగతి వరకు తమ పిల్లలను చదివించే సరికి 15 ఏళ్లు వస్తాయి. తర్వాత పెళ్లి కోసం 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి.. ఎలాగూ మనం ‘అమ్మఒడి’ కింద (ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు) సాయం అందిస్తున్నందున ఇంటర్‌ వరకు చదివిస్తారు. 

► ఇంటర్‌ తర్వాత జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుబాటులోకి వస్తుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు భారం ఉండదు. దీంతోపాటు జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ చదువుతున్న పిల్లలకు రూ.20 వేల వరకు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కాబట్టి డిగ్రీ కూడా పూర్తి చేస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదివే ఒక గొప్ప కార్యక్రమం దిశగా అడుగులు పడతాయి.

► దీనికి ప్రోత్సాహకంగా నిలబడేందుకు జగనన్న అమ్మఒడి ఒక బెంచ్‌ మార్క్‌ కాగా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రెండో బెంచ్‌ మార్క్‌ అవుతుంది. వైఎస్సార్‌ షాదీతోఫా, కళ్యాణమస్తు మూడో బెంచ్‌ మార్క్‌ అవుతుంది. వీటన్నింటితో ప్రతి తల్లి తన పిల్లలను డిగ్రీ వరకు చదివిస్తారు. అప్పుడే పేదరికం అన్నది పోతుంది. ఇందుకు ఒకే మార్గం చదువులు. డిగ్రీ పాసైతేనే మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. అలా వస్తేనే వాళ్ల తల్లిదండ్రుల కన్నా మెరుగ్గా సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఈ కుటుంబాలన్నీ పేదరికం నుంచి బయటకు రాగలుగుతాయి. ఈ దిశగానే ప్రతి అడుగు వేస్తున్నాం. 
 
చిత్తశుద్ధితో ఈ పథకానికి రూపకల్పన 

► ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎన్నికల కోసం ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితులను మార్పు చేస్తూ.. మనసుపెట్టి చిత్తశుద్ధితో ఈ పథకానికి రూపకల్పన చేశాం. గత ప్రభుత్వం 17,709 మంది జంటలకు దాదాపు రూ.70 కోట్ల డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితులు చూశాం.

► గతంలో ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారు. మన ప్రభుత్వం మాత్రం మనసుపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు మంచి జరగాలని మనసా, వాచా, కర్మణా అడుగులు వేస్తోంది. 

► గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40 వేలు ఇస్తే.. దాన్ని రూ.లక్ష చేశాం. ఎస్టీలకు గతంలో రూ.50 వేలు ఇస్తే.. ఇప్పుడు దాన్ని కూడా రూ.లక్ష చేశాం. బీసీలకు రూ.35 వేలు గతంలో ఇస్తే.. ఇప్పుడు రూ.50 వేలు చేశాం. మైనార్టీలకు గతంలో రూ.50 వేలు ఇస్తే ఇప్పుడు రూ.లక్ష చేశాం. విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.లక్ష ఇస్తే.. వారికి కూడా మంచి జరగాలని దానిని రూ.1.50 లక్షలకు పెంచాం.

► పేదరికం నుంచి బయట పడాలంటే చదువే దివ్యాస్త్రంగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నాం. తద్వారా మీ కుటుంబాలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రోత్సాహకాన్ని అందుకుంటున్న ప్రతి జంటకు హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌. వారి తల్లిదండ్రులకు బెస్ట్‌ విషెస్‌. 

డిగ్రీ పూర్తి చేయించండమ్మా..
కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమం సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ఓ యువతిని ఏం చదువుతున్నావని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నట్టు ఆ యువతి బదులిచ్చింది. డిగ్రీ కొనసాగించి, తప్పకుండా పూర్తి చేసేలా చూడాలని ఆ యువతి తల్లికి సీఎం సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement