రైతు శ్రేయస్సే లక్ష్యం: సీఎం జగన్‌ | AP CM YS Jagan distributing funds to farmers under Rythu Bharosa | Sakshi
Sakshi News home page

రైతు శ్రేయస్సే లక్ష్యం: సీఎం జగన్‌

Published Wed, Dec 30 2020 5:15 AM | Last Updated on Wed, Dec 30 2020 11:38 AM

AP CM YS Jagan distributing funds to farmers under Rythu Bharosa - Sakshi

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. అందుకే తొలి రోజు నుంచీ రైతుల పక్షపాతంగా, రైతు శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా అన్నదాతల కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.61,400 కోట్లు చిరునవ్వుతో వెచ్చించాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం మూడో విడత నిధులు, అక్టోబర్‌లో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బ తిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) సొమ్మును మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా జిల్లాల్లో రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. అర కోటి మందికి పైగా రైతులకు మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను పరిహారం కింద 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మొత్తంగా రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ఒక సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం (నెలలోగానే ఇచ్చారు) అందించే మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, ఐదేళ్లలో విడతల వారీగా కనీసం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ అధికారులే తెలిపారని చెప్పారు. ధాన్యం, విత్తనాలు, ఇన్సూరెన్సు, కరెంటు బకాయిలతో పాటు, చివరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ బకాయిలు కూడా ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు రైతులకు చేసిన మోసం అంతా ఇంతా కాదని, ఇది అందరికీ తెలుసని చెప్పారు. ఆ కష్టాలు పడలేక ఆత్మహత్య చేసుకున్న 434 మంది రైతుల కుటుంబాలకు మన ప్రభుత్వం వచ్చాక పరిహారం ఇచ్చామని వివరించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఆ డ్రామాలు మనమంతా చూస్తున్నాం
► రైతు భరోసా, నివర్‌ తుపాను బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇవాళ ఇస్తామని గతంలోనే చెప్పాం. నవంబర్‌ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో, 25న సీఎంవో మీటింగులో, 27న కేబినెట్‌ మీటింగులో, 28న నివర్‌ తుపానుపై తిరుపతిలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో, నవంబర్‌ 30న అసెంబ్లీలో చెప్పాం. ఆ తర్వాత డిసెంబర్‌ 18న కేబినెట్‌ సమావేశంలో కూడా చెప్పాం. అయినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.

► ఇన్ని చేస్తున్నా ‘పండ్లు ఇచ్చే చెట్టు మీదే రాళ్లు పడతాయి’ అన్నట్లుగా, బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఎలా డ్రామాలు ఆడిస్తున్నాడో మనమంతా చూస్తున్నాం. ఇది బాధనిపిస్తోంది.

గ్రామాల్లో వికాసం
► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనం నుంచి పంటల అమ్మకం వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం.

► గ్రామాల్లోనే గోదాములు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, గ్రామాల్లో జనతా బజార్లు ఏడాదిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటన్నింటికీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

► ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, సీఎస్‌ నీలం సాహ్ని, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు.


ఇది రైతు పక్షపాత ప్రభుత్వం
► వైఎస్సార్‌ రైతు భరోసా కింద 51.59 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.13,131 కోట్లు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున ఇవ్వడమే కాకుండా, కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.

► గత ప్రభుత్వం రూ.904 కోట్లు సున్నా వడ్డీ బకాయిలు పెట్టిపోతే, ఆ బకాయిలు తీర్చడమే కాకుండా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఖరీఫ్‌లో రూ.510 కోట్ల పంట రుణాలు చెల్లించాం.

► వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల కోసం రూ.1,968 కోట్లు ఇచ్చాం. రైతుల నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాం.

 

► ఈ ఏడాది జూన్‌ నుంచి నవంబర్‌ వరకు భారీ వర్షాలు, వరదలు, తుపానుల వల్ల 17.25 లక్షల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి 13.56 లక్షల మంది రైతులకు సుమారు రూ.1,038.46 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాం.

► ధాన్యం కొనుగోలుకు రూ.18,343 కోట్లు వెచ్చిస్తే, ఇతర పంటల కోసం మరో రూ.4,761 కోట్లు వ్యయం చేశాం. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ కోసం, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన రూ.8,655 కోట్ల బకాయిలు చెల్లించాం.

► ఫీడర్ల కెపాసిటీ పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించాం. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుకు టెండర్లను కూడా పిలిచాం.

► గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు చెల్లించాం. విత్తనాల సబ్సిడీ కింద గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.384 కోట్లు చిరునవ్వుతో ఇచ్చాం. శనగ రైతులకు బోనస్‌గా రూ.300 కోట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం.


సీఎం చరిత్ర సృష్టించారు
గతంలో పంట నష్టం జరిగితే ఎప్పుడు అంచనా వేసేవారో తెలియదు. పరిహారం ఎప్పుడిస్తారో అంతకన్నా తెలియదు. సీఎం జగన్‌ మాత్రం పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే సహాయం చేస్తున్నారు. చెప్పిన తేదీ కంటే ముందే ఇస్తున్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నారు. రైతులందరి తరఫున కృతజ్ఞతలు.  
– కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

గత ప్రభుత్వంలో పైసా సాయం అందలేదు
నాకు రెండున్నర ఎకరాల పొలం వుంది. నవంబర్‌లో తుపానుకు వరి పంట మొత్తం నీట మునిగి కుళ్లిపోయింది. ఆర్బీకే నుంచి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వచ్చి సర్వే చేసుకుని వెళ్లాడు. పరిహారం కింద ఇప్పుడు రూ.13,360 వచ్చినట్లు ఆర్బీకేలో పెట్టిన జాబితాలో చూసుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో అనేక తుపాన్లు వచ్చినా ఇలా పరిహారం ఎప్పుడూ అందలేదు. ఇప్పుడు రైతులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది. అన్ని హామీలూ నెరవేరుస్తున్న మీకు ధన్యవాదాలు.
కునుకు నాగరాజు, పాసర్లపూడి, తూర్పు గోదావరి.

అడగకుండానే వరాలు ఇస్తున్నారు
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. శనగ, పత్తి పండిస్తున్నాను. నివర్‌ తుపాను వల్ల పంట నష్టం జరిగింది.  ఎకరాకు రూ.నాలుగు వేలు చొప్పున రూ.16 వేలు పరిహారంగా అందింది. రైతు భరోసా కింద ఇప్పుడు రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఈ డబ్బుతో నూగు పంట పెట్టుకుంటాను. రైతు కష్టాలను మీ కష్టంగా.. మా సంతోషంలో మీ సంతోషం వెతుక్కుంటున్నారు. దేవుడు అడిగితేనే వరాలు ఇస్తాడు.. మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నారు.     
– ఎం.అర్చన, వీఎన్‌ పల్లి మండలం, వైఎస్సార్‌ కడప జిల్లా

ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
రెండున్నర ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేశాను. తుపాను వల్ల పంట నష్టం కింద ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున పరిహారం అందింది. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు రూ.11,500 వచ్చాయి. ఇప్పుడు మరో రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఆర్బీకేల వల్ల ఎంతో మేలు జరుగుతోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల నా కుమారుడు, కుమార్తెకు ఉద్యోగాలు వచ్చాయి. మీ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు.      
– కె.నాగమణి, తుమ్మపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా

మీరు మనసున్న మహారాజు
నాకు రెండున్నర ఎకరాల పొలం వుంది. మిర్చి సాగు చేస్తున్నాను. ఈ ఏడాది నివర్‌ తుపాను వల్ల పంట నష్టం జరిగితే రూ.15 వేలు పరిహారం అందింది. 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడూ ఇలా పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే నష్ట పరిహారం రాలేదు. ఉచిత పంటల బీమా వల్ల ఎంతో మంది రైతులకు ఊరట కలుగుతోంది. మనసున్న మహారాజుగా మీరు చిరకాలం సీఎంగా ఉండాలి.
– వి.సాంబశివరావు, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, ప్రకాశం జిల్లా

గతంలో పంటనష్టం సర్వేకు 40–50 రోజులు పట్టేది
నాకున్న 2.86 ఎకరాల పొలంలో నివర్‌ తుపాను వల్ల వరి పంట దెబ్బతిన్నది. ఇప్పుడు నష్ట పరిహారం కింద రూ.15 వేలు వచ్చింది. గతంలో పంట నష్టం జరిగితే సర్వే చేయడానికే కనీసం 40–50 రోజులు పట్టేది. కానీ మీరు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా వెంటనే సర్వే చేసి, నెల రోజుల్లోపే పరిహారం అందించడం చాలా గొప్ప విషయం.      
– పి.ప్రభాకర్‌ రావు, గుడ్లవల్లేరు మండలం, కౌతవరం గ్రామం, కృష్ణా జిల్లా  

చంద్రబాబు జూమ్‌కి దగ్గరగా ఉంటారు.. భూమికి దూరంగా ఉంటారు. రైతుల్ని రెచ్చగొడదామని చంద్రబాబు తన పుత్రుడ్ని, దత్తపుత్రుడ్ని.. ఇద్దరిలో ఏ ఒక్కరి మీదా నమ్మకం లేదు కాబట్టి ఇద్దర్నీ రంగంలోకి దించాడు. వీరిద్దరికీ రైతుల కష్టాల గురించి ఏనాడూ పట్టదు. ఆయన చెప్పాడు కాబట్టి హైదరాబాద్‌ నుంచి వచ్చి హడావుడి చేసి వెళ్లారు. జగన్‌ ఒక తేదీ చెబితే.. ఆ రోజు చేస్తాడని మీకు తెలుసు. ఇన్‌పుట్‌ సబ్సిడీని ఫలానా తేదీన ఇస్తామని చెప్పినప్పటికీ చంద్రబాబు వక్రబుద్ధి చూస్తుంటే బాధనిపిస్తోంది.
– సీఎం వైఎస్‌ జగన్‌


పెట్టుబడి రాయితీ చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement