సాక్షి, అమరావతి: రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేయనుంది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) కింద ఈ నిధుల్ని జమచేస్తోంది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు రూ.646 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయిస్తారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దీన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరులో నివర్ తుపాను వల్ల కురిసిన భారీవర్షాలు, వచ్చిన వరదలకు వ్యవసాయ, ఉద్యానపంటలు దెబ్బతిన్న రైతులకు అతి స్వల్ప సమయంలో పెట్టుబడి రాయితీ జమ చేస్తున్నారు.
‘నివర్’ బాధితులకు నెలరోజుల్లోనే పెట్టుబడి రాయితీ
పంట నష్టపోయిన సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ అందించిన ఘనత దేశ చరిత్రలో వైఎస్ జగన్ సర్కారుకే దక్కింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అక్టోబర్ 27న రైతుల ఖాతాల్లో సర్కారు జమ చేసింది. అక్టోబరులో సంభవించిన భారీ వర్షాలు, వరదలవల్ల నష్టపోయిన రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా నెల రోజుల్లోనే రూ.132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించింది. నవంబర్ నెలాఖరులో సంభవించిన నివర్ తుపాను వల్ల 12.01 లక్షల ఎకరాలకుపైగా (4,86,339.36 హెక్టార్ల) విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 8.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. వీరి ఖాతాల్లో రూ.645.99 కోట్ల పెట్టుబడి రాయితీని మంగళవారం సీఎం జగన్ జమ చేయనున్నారు.
చెప్పినదానికంటే అధికంగా..
ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన మేరకు ప్రభుత్వ పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా మరో అడుగు ముందుకు వేసింది. వ్యవసాయ రంగంలో సువర్ణ అధ్యాయంగా నిల్చేలా రైతులకు వరసగా రెండో ఏడాది కూడా చెప్పినదానికంటే ముందే వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ సాయం అందిస్తోంది. అధికారం చేపట్టిన తర్వాత రెండో ఏడాది నుంచి వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన ఈ పథకం కింద పెట్టుబడి సహాయం నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఏటా రూ.12,500కు బదులు రూ.13,500 చొప్పున ఇవ్వాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.67,500 ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినదానికంటే 17,500 ఎక్కువ కావడం గమనార్హం.
51.59 లక్షల మంది రైతులకు
వైఎస్సార్ రైతుభరోసా కింద తొలివిడత ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మే 15న రూ.7,500, రెండోవిడత అక్టోబరు 27న రూ.4 వేలు రైతుల ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రూ.2 వేలను మూడోవిడతగా ఇప్పుడు ఇస్తున్నారు. 51.59 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.1,120 కోట్లు మొత్తాన్ని జమ చేస్తున్నారు. కౌలు రైతులు, అటవీ హక్కు పత్రాలు (ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, అసైన్డ్ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తిస్తోంది. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు అక్టోబరు 27న ఒకేసారి రూ.11,500 ఇచ్చారు. మిగిలిన రూ.2 వేలు ఇప్పుడు ఇస్తున్నారు. ఈ సొమ్మును బ్యాంకులు బాకీల కింద తీసుకోవడానికి వీల్లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా సంప్రదించేందుకు 155251హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment