మాట్లాడుతున్న మంత్రి నాని, ద్వారకా తిరుమలరావు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో 1,852 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయని చెప్పారు. 2015కు ముందు సర్వీసులో ఉంటూ మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలలో 385 మందికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. వీరితోపాటు 2016 నుంచి మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో మరో 896 మందికి, 2020 నుంచి మరణించిన వారిలో 956 మందికి మొత్తం 1,852 మందిని కారుణ్య నియామకాల కింద ఆర్టీసీతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో, జిల్లా కలెక్టరేట్ పరిధిలోని 40 శాఖల్లో భర్తీ చేయనున్నామని, ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
బయట డీజిల్ కొనుగోలుతో రూ.65 కోట్లు ఆదా
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల ద్వారా బల్క్ విధానంలో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధరలకు, బయట రేట్లలో చాలా వ్యత్యాసం ఉందని మంత్రి నాని తెలిపారు. బల్క్‌లో కొనుగోలు కంటే బయటే డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. దీంతో సంస్థపై ఆర్థిక భారం పడకుండా ఆర్టీసీకి అవసరమైన డీజిల్‌ను బయట బంకుల్లో కొనుగోలు చేస్తున్నామన్నారు. బయట కొనడంతో ప్రస్తుతం పెరిగిన ధరలతో నెలకు సరాసరి రూ.33.83 కోట్లు ఆదా అవుతోందన్నారు. ఇప్పటిదాకా రూ.65 కోట్లు వరకు ఆదా అయిందన్నారు. బల్క్‌లో డీజిల్ ధర తగ్గినపుడు తిరిగి అక్కడే కొనుగోలు చేస్తామన్నారు. సంస్థ అవసరాలకు నెలకు సుమారు 8 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోందన్నారు.
1 నుంచి సీనియర్ సిటిజన్లకు రాయితీ
కోవిడ్ కారణంగా నిలిపివేసిన సీనియర్ సిటిజన్ల రాయితీ టికెట్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నామని మంత్రి నాని వెల్లడించారు. 60 ఏళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డులు చూపి టికెట్‌పై 25 శాతం రాయితీ పొందవచ్చని సూచించారు. దీనివల్ల సుమారు రెండు లక్షల మంది ప్రయోజనం పొందుతారన్నారు. ఆర్టీసీలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. ఏప్రిల్ 30న మొదటి బస్సును తిరుపతిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, కర్నూలు తదితర మార్గాల్లో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఇంద్ర ఏసీ బస్సులను నడపనున్నట్లు చెప్పారు.
విలీనంతో రూ.3,600 కోట్ల భారం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాల కింద ప్రభుత్వంపై ఏటా రూ.3,600 కోట్ల భారం పడుతున్నా అప్పుల్లో ఉన్న సంస్థను బతికించాలనే లక్ష్యంతో సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి నాని చెప్పారు. 2020–21లో ఆర్టీసీకి రూ.2,691 కోట్ల రాబడి రాగా ఖర్చు రూ.2,049 కోట్లుగా ఉందన్నారు. కోవిడ్ లేకుంటే సంస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల పీఎఫ్, ఎస్బీటీ, సీసీఎస్ తదితరాల నుంచి వినియోగించుకున్న రూ.705 కోట్లను ప్రభుత్వం తిరిగి ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment