సాక్షి, సిరిసిల్ల : ఆత్మహత్యలు, వలసలు, కార్మికుల సమ్మెలు ఇదీ దశాబ్దంక్రితం సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన నేతన్న బతుకుచిత్రం. నేడు వస్త్రోత్పత్తి ఆర్డర్లతో సాంచాల(పవర్‌లూమ్స్) వేగం పెరిగి నాటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ‘సిరి’సిల్లగా వెలుగొందుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిన సిరిసిల్ల ఇప్పుడు చేతి నిండా పనితో మురిసిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 74వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34వేలు ఉన్నా యి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ బట్ట, ఏడు వేల పవర్‌లూమ్స్‌పై కాటన్(ముతక రకం) బట్ట ఉత్పత్తి అవుతోంది. ఈ రంగంలో 25 వేల మంది కార్మికులు ఉపాధి లభిస్తోంది. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా అద్దకం, సైజింగ్, వైపణి, వార్పిన్ పనులు ఉంటాయి. గతంలో సిరిసిల్లలో ఉపాధి లేక నేత కార్మికులు ముంబయి, బీవండి, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లే వారు. కానీ ఆరేళ్లలో వచ్చిన మార్పు కారణంగా సిరిసిల్ల కార్మికులు వలసలకు టాటా చెప్పారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రా ష్ట్రాల కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. చదవండి: ఆశలు అద్దుకుంటున్న మగ్గం బతుకులు
మార్పునకు కారణాలు
సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్లకు అందించారు. తొలిసారి 2017లో రూ.280 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా, మరో రూ.100 కోట్ల ఆర్వీఎం, సంక్షేమశాఖల ఆర్డర్లు వచ్చాయి. ఇలా నాలుగేళ్లలో రూ.1280 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా, మరో రూ.400 కోట్ల సర్వశిక్ష అభియాన్, కేసీఆర్ కిట్లు, క్రిస్మస్, రంజాన్ ఆర్డర్లు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో రూ.1680 కోట్ల ఆర్డర్లు లభించాయి. ప్రతీ కార్మికుడికి ఉపాధి మెరుగైంది. సిరిసిల్ల కార్మికులకు పొదుపు పథకం త్రిఫ్ట్ అమలు చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బట్టలో 10శాతం నూలు రాయితీ కార్మికులకు అందిస్తున్నారు. ఫలితంగా చేసే పనిలో భవిష్యత్ ఉందనే ఆశ, పొదుపు అలవాటు అయింది. నేతన్నల జీవితాల్లో సామాజిక మార్పు కనిపిస్తోంది.
చదవండి: కేసీఆర్ తాతయ్యా.. న్యాయం చేయరూ..!
నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర
సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన కొండ కిష్టయ్య తన తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు బిడ్డలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిష్టయ్య చిన్న కూతురు ఒక్కరే బతికిపోగా, ఐదుగురు మరణించారు. ఈ ఘటన 2001లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
మూడేళ్లుగా పని చేస్తున్న
నేను సిరిసిల్లలో మూడేళ్లుగా పని చేస్తున్న. నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం వస్తుంది. మాది బీహార్‌లోని మధువని జిల్లా పుర్సోలియా గ్రామం. నాకు ముగ్గురు కొడుకులు. ఏడాదికి ఒక్కసారి మా ఊరికి వెళ్లి వస్తా. నాలాగే ఉత్తరప్రదేశ్, ఒడిశావాళ్లు సిరిసిల్లలో వందల మంది పని చేస్తున్నారు.
– అస్రఫ్ అలీ, బిహార్ కార్మికుడు
ఉపాధిపై నమ్మకం పెరిగింది
సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో పని చేసే కార్మికుల్లో చాలా మార్పు వచ్చింది. ఉపాధిపై నమ్మకం పెరిగింది. పిల్లలను చదివిస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రావడంతో మెరుగైన జీతాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతున్నారు. గతంలో ఉండే గొడవలు తగ్గాయి. కార్మికుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది.
– కె.పున్నంచందర్, సైకాలజిస్ట్
ఆత్మహత్యలు తగ్గాయి
సిరిసిల్లలో ఒకప్పటితో పోల్చితే నేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయి. పరిశ్రమలో పని లేకపోవడం అనేది లేదు. సిరిసిల్లలో కార్మికులకు చేతినిండా పని ఉంది. మెరుగైన ఉపాధి లభిస్తుంది. కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా, కారణాలు వేరే ఉంటున్నాయి. సిరిసిల్లలో కార్మికుల్లో నైపుణ్యం పెరిగింది. పట్టుదలగా పని చేసే తత్వం వచ్చింది.
– వి.అశోక్‌రావు, జౌళిశాఖ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment