సాక్షి, కరీంనగర్: మృతువు ఆమెను లారీ రూపంలో వెంటాడింది. భర్త ఇక లేడన్న ఆలోచనల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. అయితే, మరో 30 మీటర్లు దాటితే ఆమె తన గమ్యస్థానం చేరుతుందనగా అనుకోని విధంగా మృత్యువు కాటేసింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన రజిత.. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లందకుంట మండలం రహీమ్‌ఖాన్‌పేట మోడల్ స్కూల్‌లో గణితం టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, రజిత రోజు మాదిరిగానే శుక్రవారం కూడా విధులకు బయలుదేరింది. కాగా, స్కూటీపై ఓ ప్రైవేటు స్కూల్ వరకు వెళ్లి.. అక్కడే వాహనం పార్క్ చేసి ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్కూటీపై స్కూల్‌కు వెళ్తుండగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ రజిత స్కూటీకి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జు అయిపోయింది. లారీ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే టీచర్ రజిత మృతిచెందారు. అయితే, రజిత హెల్మెట్ ధరించినప్పటికీ ఆమె చనిపోయారు. ఇక, రజిత.. మరో 30 మీటర్ల దూరంలో స్కూటీ పార్క్ చేసే స్థలం ఉండటం గమనార్హం. ఇక, రజితకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆమె భర్త వినోద్ కుమార్ ఐదేళ్ల క్రితమే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో రజిత కూడా చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు.. రజిత డెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment