రాయితీకి రాం రాం | subsidy out | Sakshi
Sakshi News home page

రాయితీకి రాం రాం

Published Sun, Dec 18 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

రాయితీకి రాం రాం

రాయితీకి రాం రాం

ధర్మవరం టౌన్‌ : జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిచ్చిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యంతో సంక్షోభంలో చిక్కుకుపోయింది. మరోవైపు ముడిపట్టు రాయితీ పథకం   అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు కేవలం 12 నెలలకు మాత్రమే రాయితీ నేతన్నల ఖాతాల్లో జమ అయ్యింది. మిగతా 18 నెలల బకాయి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించకుండా రాయితీని రూ.1000కి పెంచుతున్నట్లు చెప్పి, బకాయిలను ఎగ్గొట్టేందుకు సిద్ధమైంది. దీంతో నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది.  
అందని ముడిపట్టు రాయితీ 
జిల్లాలో చేనేత సంక్షోభంతో 2012 మార్చి నెలలో ప్రభుత్వం ముడిపట్టుపై రాయితీ ఒక్కో చేనేత కుటుంబానికి ప్రతినెలా రూ.600 బ్యాంక్‌ ఖాతాలో జమ చేసే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ముడిపట్టుపై రాయితీ పథకాన్ని అమలయ్యేలా కృషి చేశారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చేతుల మీదుగా ధర్మవరం పట్టణంలో పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా ముడిపట్టుపై రాయితీ నెలకు రూ.600 బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యేది. సెరికల్చర్‌ శాఖ అధికారుల పర్యవేక్షణలో తొలుత నేత కార్మికుడు ముడిపట్టును కొనుగోలు చేసి, ఆతర్వాత బిల్లులను కార్యాలయంలో సమర్పిస్తే పరిహారాన్ని ఖాతాలో జమ చేసేవారు. 
ఎన్ని కుటుంబాలకు వర్తిస్తుందంటే.. 
జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, సోమందేపల్లి, గోరంట్ల, యాడికి, కోటంక, సిండికేట్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో 27 వేల చేనేత కుటుంబాలు ముడిపట్టుపై రాయితీని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 11,400 మంది లబ్ధిదారులు రాయితీ పొందాల్సి ఉంది.  
హామీలతో సరిపెట్టారు 
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండున్నర ఏళ్లపాటు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కేవలం 12 నెలల పాటు మాత్రమే ఈ పథకం కొనసాగింది. ఆగస్టు నెల మొదటి వారంలో జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ముడిపట్టు రాయితీ పరిహారం అందిస్తామని,  పరిహారం పెంపు రూ.వెయ్యికి పెంచుతున్నామని చేనేతలకు హామీ ఇచ్చారు. అనంతరం నవంబర్‌ 21న చేనేత మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా పర్యటనకు వచ్చి రూ. 25 కోట్లు నిధులను విడుదల చేశారు. అయితే ఈ నిధులు అక్టోబర్‌ నెల నుంచి రాయితీకి వర్తిస్తుందని రూ.1000 చొప్పున పరిహారం ప్రతి కార్మికుడికీ అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే పెండింగ్‌లో ఉన్న 18 నెలల బకాయిల గురించి మాత్రం నోరు మెదపలేదు. 
ముడిపట్టు రాయితీ బకాయి రూ.28 కోట్లు 
ముడిపట్టు రాయితీ బకాయిలు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని ఎగ్గొట్టి, రాయితీ రూ.1000కి పెంచుతామని చెప్పిన చేనేత మంత్రి కొల్లు రవీంద్ర రూ.25 కోట్లు మంజూరు చేశారు. నిధులు విడుదల చేసి నెలలు గడుస్తున్నా, ఇంత వరకు పరిహారం జమకాక పోవడంతో నేత కార్మికులు ఆందోâýæన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పరిహారం పెంచుతుండటంతో అధికార పార్టీ నాయకులు సెరికల్చర్‌ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి పాసుపుస్తకాల విచారణ పేరుతో అర్హులను తొలగించి, ఆ స్థానంలో టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు విమర్శలున్నాయి. చేనేత రంగ సంక్షోభ రీత్యా పరిహారాన్ని నెలనెలా కార్మికుల ఖాతాలో జమ చేసి, పెండింగ్‌ ఉన్న బకాయిలను సత్వరం అందించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement