సిరిసిల్ల చీర.. పేదింటికి సారె! | about rs113cr valuebule sircilla sarees ordered for bathukamma gifts | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల చీర.. పేదింటికి సారె!

Published Mon, Jul 10 2017 3:20 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

సిరిసిల్ల చీర.. పేదింటికి సారె! - Sakshi

సిరిసిల్ల చీర.. పేదింటికి సారె!

- ఆడపడుచులకు బతుకమ్మ కానుక
- తెల్లకార్డు కుటుంబాలకు పంపిణీ
- నేతన్నకు ఉపాధి ధీమా.. రూ.113 కోట్ల విలువైన చీరలకు ఆర్డర్లు


సాక్షి, హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ కానుకగా పేదింటి ఆడపడుచులకు సిరిసిల్ల చీరలను పంపిణీ చేసే కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. అటు చేనేతలకు, ఇటు పేద కుటుంబాలకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారక రామారావు సంబంధిత అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.

సిరిసిల్లలో మరమగ్గాలపై తయారు చేసే చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేయటం ద్వారా.. అక్కడి నేతన్నలకు ఆర్థికంగా భరోసా కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రంజాన్‌ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు, క్రిస్‌మస్‌ సందర్భంగా క్రిస్టియన్‌ కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబురాల సమయంలో పేదింటి ఆడపడుచులకూ చీరలు పంపిణీ చేస్తే పేద కుటుంబాలకు చిరు కానుక అందించినట్లు ఉంటుందని సర్కారు నిర్ణయం తీసుకుంది.

86 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు..
రాçష్ట్రంలో దాదాపు 86 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డు కుటుంబాలన్నింటికీ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు అవసరమయ్యే చీరల తయారీకి ఇప్పటికే చేనేత, జౌళి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన మేరకు బడ్జెట్‌ కేటాయిం చేందుకు సీఎం కూడా ఆమోదం తెలిపారు. కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులతో సంక్షోభంలో ఉండే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు దోహదపడేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

నేతన్నకు చేతినిండా పని..
ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికినట్లయింది. ఇప్పటికే రాజీవ్‌ విద్యామిషన్‌ స్కూల్‌ విద్యార్థులకు యూనిఫామ్స్, కేసీఆర్‌ కిట్లలో చీరల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకే అప్పగించింది. యూనిఫామ్‌కు అవసరమయ్యే 1.03 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేసీఆర్‌ కిట్ల పంపిణీలో భాగంగా 1.18 లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది బతుకమ్మ పండగకు 86 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలంటే.. దాదాపు 5.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే చీరల తయారీ మొదలైంది. చేనేత, జౌళి శాఖ బతుకమ్మ చీరలకు ఇచ్చిన ఆర్డర్ల విలువ దాదాపు రూ.113 కోట్లు. ఒక్కో బతుకమ్మ చీరకు ప్రభుత్వం రూ.230 ధర చెల్లించనుంది. ప్రస్తుతం ఎనిమిది రకాల రంగులతో ఈ చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. వృద్ధులకు 8 రంగుల చీరలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారికి 40 రకాల ప్రింటింగ్‌ చీరలను బతుకమ్మ పండుగకు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సెప్టెంబర్‌ 1 నాటికి ఆర్డర్లు పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 15 వేల మంది బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఉపాధి పొందుతున్నారని చేనేత, జౌళి శాఖ అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement