► సాంచాలపై కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న ఇతను వేముల వెంకట్రాజం. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆయన మూడో తరగతి చదువుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే చేనేత మగ్గాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఆరు పదుల వయసులో కాటన్ జరీ అంచు చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం రెండు సాంచాలపై చీరలను నేస్తూ.. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదిస్తున్నారు.
► ఈయన సబ్బని నరేందర్. సిరిసిల్ల శివనగర్‌కు చెందిన ఇతను డిగ్రీ చదివారు. అందరిలా పవర్‌లూమ్స్(సాంచాల)పై పాలిస్టర్ బట్టను, బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయకుండా సొంతంగా కాటన్ చీరలపై దృష్టి పెట్టారు. తనకున్న ఇరవై సాంచాలపై ఇదే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి పని కల్పిస్తున్నారు. నవ్యమైన, నాణ్యమైన కాటన్ చీరల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ చీరలకు సొంతంగానే మార్కెటింగ్ చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సిరిసిల్ల: సిరిసిల్లలో ఇలా సొంతంగా వస్త్రం ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న వారు ఒక్కరిద్దరు కాదు.. సుమారు 300 సాంచాలపై 150 మంది కార్మికులు, 25 మంది యజమానులు ఉన్నారు. సొంతంగానే జరీ అంచులతో కూడిన కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రాలేదనే బెంగలేదు.. బతుకమ్మ చీరల బిల్లులు రాలేదనే చింత లేదు. సర్కారు ఆర్డర్ల వైపు ఎదురుచూడ కుండా సొంత సాంచాలపై జరీ అంచుతో 8 మీటర్ల (18 మూరల) గోచీ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, భీంగల్, నిర్మల్, భైంసా వంటి పట్టణాల్లోని వస్త్ర వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో చీరను రూ.650 నుంచి 800 వరకు నాణ్యతను బట్టి అందిస్తున్నారు.
నేరుగా నూలు కొనుగోలు
చీరలకు అవసరమైన నూలును నేరుగా భీవండి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నూలుకు అవసరమైన రంగులను అద్ది, బీములు పోయించుకుని, సాంచాలపై ఎక్కిస్తారు. జరీ పోగులతో చీరల అంచులను, కొంగులను డిజైన్ చేసి ఇంపైన రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు వారే మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నూలు ధరలతో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమించి వ్యాపారం చేస్తున్నారు.
ప్రభుత్వం చేయూతనిస్తే..
కాటన్ చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరాకు ప్రభుత్వం స్థానికంగా నూలు డిపోను ఏర్పా టు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. కరోనా లాక్‌డౌన్ వంటి విపత్తులు ఎదురైనా, తట్టుకుని నేతన్నలు చీరల బట్టను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు, మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment