దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నేతన్న ప్రతిభకు గుర్తింపు లభించింది. దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీర జాతీయస్థాయిలో మెరిసింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ దేశంలోని వారసత్వ సంపదలను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ విరాసత్ పేరిట ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 17 వరకు చేనేత చీరల ప్రదర్శన చేపట్టింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసిన 75 రకాల చీరలను ఈ ప్రదర్శనకు ఎంపిక చేయగా, ఇందులో దుబ్బాక చీరకు స్థానం దక్కింది. చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్, చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు కృషిచేస్తున్న బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలో కార్మికులు ఈ లినెన్ కాటన్ చీరను నేయడం విశేషం.
దేశంలోనే గుర్తింపు పొందిన దుబ్బాక చేనేత పరిశ్రమపై క్రమేణా నిర్లక్ష్యం అలుముకుంటోంది. ఈ క్రమంలో విరాసత్ చీరల ప్రదర్శనకు ఎంపిక కావడంతో మళ్లీ దేశవ్యాప్తంగా దుబ్బాకకు గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో దుబ్బాక చేనేతలకు గుర్తింపు దక్కడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాసత్ ప్రదర్శనకు దుబ్బాక లినెన్ కాటన్ చీర ఎంపిక కావడం చాలసంతోషంగా ఉంది. టై అండ్ డై విధానంతో ఇక్కత్ చీరలను తయారు చేయడం ఎక్కడ సాధ్యపడలేదని, కేవలం దుబ్బాకలోనే తయారు కావడం ఆనందంగా ఉంది’అని బోడ శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment