Saraswati Kavula: చేనేతకు చేరువలో.. | Saraswati Kavula: Involved in natural farming, documnetary film making and handloom promotion | Sakshi
Sakshi News home page

Saraswati Kavula: చేనేతకు చేరువలో..

Published Wed, Apr 19 2023 12:38 AM | Last Updated on Wed, Apr 19 2023 8:09 AM

Saraswati Kavula: Involved in natural farming, documnetary film making and handloom promotion - Sakshi

చేనేత సంతలో వీవర్స్‌ స్టాల్స్‌; సరస్వతి కవుల

చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్‌ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్‌ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్‌ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్‌ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు.

‘‘ప్రభుత్వాలు పవర్‌లూమ్‌నే ప్రమోట్‌ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి.

పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్‌ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్‌ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద  టెక్స్‌టైల్‌ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్‌ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్‌ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్‌ చాలా దెబ్బతిన్నారు. సేల్స్‌ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి.

► దిగులును చూశాను..
మొదట్లో రూరల్‌ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్‌ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్‌ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్‌ మార్కెటింగ్‌ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్‌ మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు.

అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్‌ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్‌ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్‌ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్‌ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్‌ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్‌ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్‌ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్‌ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు.

► అన్ని చేనేతలు ఒక దగ్గర
ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్‌ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్‌ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్‌ వీవర్స్, కో ఆపరేటివ్‌ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్‌ వీవర్స్‌ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు.

వరంగల్‌ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్‌కల్‌ వీవింగ్,  సిద్ధిపేట్‌ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్‌ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్‌ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్‌ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి.

► రైతుగానూ..
మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్‌. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్‌ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి.

మద్దతు ముఖ్యం
క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్‌ లభిస్తాయి అని. దీనికి డిజిటల్‌ మీడియా వేదికగా ప్రమోట్‌ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్‌ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం.

– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement