Handicrafts exhibition
-
జీ20లో లేపాక్షి స్టాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హస్తకళలు జీ20 విశ్వవేదికపై ఆహూతులను అలరిస్తున్నాయి. జీ20 సదస్సులో భాగంగా భారత మండపం ఇండియన్ క్రాఫ్ట్ బజార్లో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో భాగంగా హస్తకళలు, చేనేత వ్రస్తాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీకాళహస్తి కలంకారి చీరలు, ఉప్పాడ జమ్దానీ చీరలు, బొబ్బిలి వీణ, తిరుపతి చెక్క»ొమ్మలు సహా పలు ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. విదేశాల నుంచి ఆహూతులకు లేపాక్షి ఈడీ విశ్వ ఆయా ఉత్పత్తుల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. ఉత్పత్తుల నేపథ్యాన్ని, వాటికున్న వారసత్వం, సంస్కృతిని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన హస్తకళలు, చేనేత వ్రస్తాలకు విదేశీ ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మరోవైపు, గిరిజన ఉత్పత్తుల స్టాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీని ప్రదర్శనకు ఉంచారు. -
Saraswati Kavula: చేనేతకు చేరువలో..
చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు. ‘‘ప్రభుత్వాలు పవర్లూమ్నే ప్రమోట్ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్ చాలా దెబ్బతిన్నారు. సేల్స్ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి. ► దిగులును చూశాను.. మొదట్లో రూరల్ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు. ► అన్ని చేనేతలు ఒక దగ్గర ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్ వీవర్స్, కో ఆపరేటివ్ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్ వీవర్స్ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు. వరంగల్ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్కల్ వీవింగ్, సిద్ధిపేట్ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి. ► రైతుగానూ.. మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి. మద్దతు ముఖ్యం క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్ లభిస్తాయి అని. దీనికి డిజిటల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం. – నిర్మలారెడ్డి -
ఏపీ హస్త కళలకు అంతర్జాతీయ మార్కెట్? ఐహెచ్జీఎఫ్లో ప్రదర్శన
ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ గిఫ్ట్ ఫెయిర్ (ఐహెచ్‌జీఎఫ్) ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏటికొప్పాక చెక్కబొమ్మలు, నర్సాపూర్ క్రోచెట్లెస్ డ్రెస్‌లు ప్రదర్శిస్తున్నారు. దేశీయ హస్తకళా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోన్న కళరా సంస్థ రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ ఉత్పత్తులకు ఈ ప్రదర్శనలో చోటు కల్పించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని నోయిడాలో ప్రారంభమైన ఈ 52వ ఐహెచ్‌జీఎఫ్ ఎగ్జిబిషన్ అక్టోబరు 31 వరకు కొనసాగుతుంది. హస్తకళాకారులకి, డీలర్లను అనుసంధానం చేయడంలో కళారా కీలక పాత్ర పోషిస్తోంది, కళారా ఆధ్వర్యంలో ఇప్పటికే ఇండియాకు చెందిన అనేక ఉత్పత్తులకు అంతర్జతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. ఇందులో చిన్నామలైకి చెందిన కిచెన్ చేనేత టవల్స్, ఒడిషా, బెంగాల్‌లకు చెందిన గ్రాస్ప్లేస్మెంట్స్, మణిపూర్‌కి చెందిన లంగ్పీ కుండలు ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న హస్తకళలకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు మార్కెట్ లభించింది. అదే పద్దతిలో ఏటికొప్పాక కొయ్యబొమ్మలు, నర్సాపూర్ క్రోచెట్లెస్ దుస్తులకు మార్కెట్ వస్తుందనే ఆశాభావాన్ని కళరా వ్యక్తం చేసింది -
మహిళా హస్త కళా సదస్సు ప్రారంభం
సాక్షి, పశ్చిమగోదావరి: పోడూరు మండలం జిన్నూరులో వైఎస్సార్సీపీ, ఎల్ఆర్డిఏ సంస్థ ఆధ్వర్యంలో మహిళా హస్త కళా సదస్సు శనివారం ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో జాబ్‌మేళాను ఎంపీ రఘు రామకృష్ణంరాజు ప్రారంభించగా... లెస్ పార్కు, మహిళా శిక్షణా తరగతులను పాలకొల్లు ఇంచార్జి కవురు శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుంటూరి వాణి పెద్దిరాజు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లెం ఆనంద్ ప్రకాష్, చిలువూరి కుమార దత్త్ర్యాయ వర్మ, యడ్ల తాతాజీ, సొసైటీ అధ్యక్షుడు డీటీడీసీ బాబు పాల్గొన్నారు. -
ప్రజాధనం నీళ్ల పాలు
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ స్టేడియంలో ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హస్తకళా ప్రదర్శన ఆదివారం రాత్రితో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు నిర్వహిం చిన హస్తకళాప్రదర్శనకు దాదాపు రూ.3కోట్లు విని యోగించింది. కార్యక్రమం ముందు రోజు నుంచి వర్షం కురవడంతో ప్రజల ఆదరణ లేకుండా పోయింది. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన పర్యటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియతోపాటు ఇతర మంత్రులెవ్వరూ హాజరుకాలేదు. శనివారం ∙సీఎం చంద్రబాబు సందర్శన కార్యక్రమం ఉన్నా, రద్దు చేసుకున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఈ ప్రద ర్శనను సరైన సమయంలో నిర్వహించకపోవడం, వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ప్రజాధనం నీళ్లపాలైందని విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాపారం సైతం జరగలేదని స్టాళ్ల నిర్వాహకులు వాపోవడం కనిపించింది. హస్తకళలకు ప్రోత్సాహం: మంత్రి సునీత హస్తకళ, చేనేత కళాకారులను ప్రోత్సహిస్తామని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. హస్తకళల ప్రదర్శనను ఆదివారం రాత్రి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుం బం రూ.10 వేల ఆదా యం సంపాదించేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. స్టాల్స్‌ను సందర్శించారు. చీరను కొనుగోలు చేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయని సునీ త విభావరి ఓలలాడించింది. వర్షం వల్ల ఆటంకం ఏర్పడినా సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. మృదుల, కౌశిక్ యాంకరింగ్ చేశారు. ఆనంద్ బృందం కామెడీ స్కిట్ చేశారు. కోల్‌కతా చెందిన శ్రావణ్ ఆధ్వర్యంలో మోడల్స్ చేనేత వస్త్రాలు ధరిం చి క్యాట్‌వాక్ చేశారు. సినీతారలు మనారాచోప్రా, శుబ్ర అయ్యప్ప హాజరయ్యారు. కలెక్టర్ ప్రద్యుమ్న, సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజు, తిరుపతి కమిషనర్ హరికిరణ్, జిల్లా జడ్జి రాంగోపాల్ తిలకించారు. -
ఆకట్టుకునేలా..!
ఖమ్మం కమాన్‌బజార్: స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్యాణ మండపంలో కొనసాగుతున్న హస్తకళా ప్రదర్శన మహిళలకు సంబంధించిన చీరలు, యువతుల డ్రెస్ మెటీరియల్స్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల కళాకారులు రూపిందించిన కలంకారి, మంగళగిరి, చీరాల, పోచంపల్లి, ధర్మవరం, చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతులకు నచ్చేలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన టస్సర్ సిల్క్ చీరలు, హైదరాబాద్ బ్లాక్ ప్రింటింగ్ శారీస్, గుజరాత్ , హర్యానా, జైపూర్ ఖాధీ మెటీరియల్స్‌ను విక్రయిస్తున్నారు. దిద్దులు, వన్‌గ్రామ్ గోల్డ్ చైన్లు, ఆభరణాలు, మహిళా అలంకరణ సామగ్రి ఉన్నాయి. వీటితో పాటు కొండపల్లి, ఏటికొప్పాక చెక్క బొమ్మలు, ఆయుర్వేదిక్ స్టాళ్లను ఉంచారు. ప్రదర్శన 30వ తేదీ వరకు కొనసాగుతుందని హస్తకళ ప్రదర్శన మేనేజర్ వెంకయ్య తెలిపారు. -
భళా.. హస్తకళ