powerlooms
-
Saraswati Kavula: చేనేతకు చేరువలో..
చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు. ‘‘ప్రభుత్వాలు పవర్లూమ్నే ప్రమోట్ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్ చాలా దెబ్బతిన్నారు. సేల్స్ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి. ► దిగులును చూశాను.. మొదట్లో రూరల్ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు. ► అన్ని చేనేతలు ఒక దగ్గర ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్ వీవర్స్, కో ఆపరేటివ్ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్ వీవర్స్ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు. వరంగల్ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్కల్ వీవింగ్, సిద్ధిపేట్ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి. ► రైతుగానూ.. మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి. మద్దతు ముఖ్యం క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్ లభిస్తాయి అని. దీనికి డిజిటల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం. – నిర్మలారెడ్డి -
Sircilla Weavers: అంచు చీరలే ఆ‘దారం’
► సాంచాలపై కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న ఇతను వేముల వెంకట్రాజం. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆయన మూడో తరగతి చదువుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే చేనేత మగ్గాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఆరు పదుల వయసులో కాటన్ జరీ అంచు చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం రెండు సాంచాలపై చీరలను నేస్తూ.. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదిస్తున్నారు. ► ఈయన సబ్బని నరేందర్. సిరిసిల్ల శివనగర్‌కు చెందిన ఇతను డిగ్రీ చదివారు. అందరిలా పవర్‌లూమ్స్(సాంచాల)పై పాలిస్టర్ బట్టను, బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయకుండా సొంతంగా కాటన్ చీరలపై దృష్టి పెట్టారు. తనకున్న ఇరవై సాంచాలపై ఇదే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి పని కల్పిస్తున్నారు. నవ్యమైన, నాణ్యమైన కాటన్ చీరల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ చీరలకు సొంతంగానే మార్కెటింగ్ చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరిసిల్ల: సిరిసిల్లలో ఇలా సొంతంగా వస్త్రం ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న వారు ఒక్కరిద్దరు కాదు.. సుమారు 300 సాంచాలపై 150 మంది కార్మికులు, 25 మంది యజమానులు ఉన్నారు. సొంతంగానే జరీ అంచులతో కూడిన కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రాలేదనే బెంగలేదు.. బతుకమ్మ చీరల బిల్లులు రాలేదనే చింత లేదు. సర్కారు ఆర్డర్ల వైపు ఎదురుచూడ కుండా సొంత సాంచాలపై జరీ అంచుతో 8 మీటర్ల (18 మూరల) గోచీ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, భీంగల్, నిర్మల్, భైంసా వంటి పట్టణాల్లోని వస్త్ర వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో చీరను రూ.650 నుంచి 800 వరకు నాణ్యతను బట్టి అందిస్తున్నారు. నేరుగా నూలు కొనుగోలు చీరలకు అవసరమైన నూలును నేరుగా భీవండి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నూలుకు అవసరమైన రంగులను అద్ది, బీములు పోయించుకుని, సాంచాలపై ఎక్కిస్తారు. జరీ పోగులతో చీరల అంచులను, కొంగులను డిజైన్ చేసి ఇంపైన రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు వారే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నూలు ధరలతో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమించి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే.. కాటన్ చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరాకు ప్రభుత్వం స్థానికంగా నూలు డిపోను ఏర్పా టు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. కరోనా లాక్డౌన్ వంటి విపత్తులు ఎదురైనా, తట్టుకుని నేతన్నలు చీరల బట్టను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు, మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
నేతన్నకు అండగా నిలవండి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదని, నేత కార్మికులకు అండగా నిలిస్తేనే టెక్స్టైల్ రంగం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సరైన మద్దతు ఇవ్వకపోవడంతోనే ప్రపంచంలోని చిన్న దేశాలతో కూడా భారత్ టెక్స్టైల్ రంగంలో పోటీ పడలేకపోతోందని చెప్పారు. సిరిసిల్లలో ‘మెగా పవర్లూమ్ క్లస్టర్’ను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పరిశ్రమలు, టెక్స్టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. కేంద్రం నుంచి సరైన ప్రోత్సాహం లేకున్నా తెలంగాణ వస్త్రోత్పత్తి రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో టెక్స్టైల్ రంగానికి అనువైన పరిస్థితులు లేకున్నా వాటిని ప్రోత్సహిస్తూ, అన్ని వసతులు కలిగిన తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని వెల్లడించారు. మెగా క్లస్టర్‌తో ఉపాధి అవకాశాలు కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీంలో భాగంగా సిరిసిల్లలో ‘మెగా పవర్లూమ్ క్లస్టర్’ఏర్పాటు చేస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఢిల్లీకి స్వయంగా వచ్చి విన్నవించినా కేంద్రం స్పందించడం లేదని చెప్పారు. మరమగ్గాల కార్మికుల కోసం రాష్ట్రంలో 40శాతం సబ్సిడీతో వేజ్ కంపెన్సెషన్ స్కీం, నేతన్నకు చేయూత వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. -
చేనేత, మరనేతకు తేడా తెలియదు
సిరిసిల్ల: చేనేత, మరనేతకు తేడా తెలియకుండానే గత పాలకులు పాలన సాగించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెగా టెక్స్టైల్ మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వస్త్రోత్పత్తి రంగంలో సాంకేతికతను పెంచుకోవాలని, మార్పులతోనే మనుగడ సాధ్యమవుతుందన్నారు. సెల్‌ఫోన్‌తో పవర్‌లూమ్స్‌ను ఆపరేట్ చేసుకునే స్థితికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేతకార్మికుల సంక్షేమం కోసం రూ.1,280 కోట్ల బడ్జెట్ కేటాయించామని ఆ మేరకు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో 15 వేల మగ్గాలను ఆధునీకరిస్తామని, ఇందుకోసం రూ.30 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆసాములపై ఆర్థిక భారం పడకుండా వందశాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించి ఆధునీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆధునీకరించుకుంటేనే ప్రభుత్వ ఆర్డర్లు మరమగ్గాలను ఆధునీకరించుకుంటేనే నాణ్యమైన వస్త్రోత్పత్తి సాధ్యమవుతుందని, కార్మికులకు పనిభారం తగ్గుతుందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో మగ్గాలను ఆధునీకరించుకున్నవారికే వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని కేటీఆర్ వెల్లడించారు. అప్పుల ఊబిలో ఉన్న 4,500 మంది నేతకార్మికుల రుణాలను మాఫీ చేశామని, ఇందు కోసం రూ.15.65 కోట్లు వెచ్చించామని వివరించారు. కార్మికులను ఆసాములుగా మార్చుతాం సిరిసిల్ల నేతకార్మికులను ఆసాములుగా మార్చేందుకు గ్రూప్ వర్క్షెడ్లను నిర్మిస్తామన్నారు. తొలిదశలో 1,100 మందికి రూ.203 కోట్లతో ఒక్కొక్కరికి 4 సాంచాలు ఇస్తామన్నారు. ఆసాములను యజమానుల స్థాయికి, యజమానులను ఇంకా కొత్త రంగాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. సిరిసిల్లలో పది నూలు డిపోలు ఏర్పాటు చేస్తామని, రెండు కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో మహిళల ఉపా«ధికి అపెరల్ పార్క్‌లో అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఏడాదిలోగా పెద్దూరు వద్ద అపెరల్ పార్క్ నిర్మిస్తామన్నారు. నేతకార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు త్రెఫ్ట్ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. వస్త్రోత్పత్తిలో నాణ్యత పెంచి, మార్కెటింగ్ వసతి కల్పించి సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగాన్ని ఆధునీకరిస్తామన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గురుకులాల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు.. రాష్ట్రంలోని 800 గురుకులాల్లోనూ కంప్యూటర్ శిక్షణ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామ కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల మండలం చిన్నబోనాల బాలికల గురుకుల విద్యాలయంలో శుక్రవారం కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. డిగ్రీ కాలేజీల్లోనూ రెసిడెన్షియల్ విద్య అమలు విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ గురుకుల విద్యాలయాలపై ఎంతో సంతృప్తిగా ఉన్నారని గతేడాది 84 మందికి ఎంబీబీఎస్‌లో సీట్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు. 5 వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించామన్నారు. హాస్టల్లో ఇబ్బందులు తనకు తెలుసునని, తాను కూడా తొమ్మిదేళ్లు హాస్టల్లో ఉండి చదువుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
భివాండీలో మర మగ్గాల శబ్దమేది?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోవున్న భివాండి పేరు వినగానే మర మగ్గాల శబ్దం వినిపిస్తుంది. ఆసియాలోనే జౌళి పరిశ్రమకు పుట్టినిల్లనే విషయం గుర్తొస్తుంది. దేశ జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం తర్వాత మర మగ్గాల మీద ఆధారపడి బతుకుతున్నారనే విషయం మదిలో మెదలవుతుంది. ఇదంతా గతం. ఇప్పుడు 80 శాతం మర మగ్గాలు మూగబోయాయి. యంత్రాలకు బూజులు పట్టాయి. తెగిన దారపు ముక్కలతో, దుమ్మూ దూళితో ఫ్యాక్టరీలు అదోరకమైన కంపు కొడుతున్నాయి. వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి పోటీ పెరిగిపోయి ఉత్పత్తులు, ఎగుమతులు పడిపోతున్న నేపథ్యంలో మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు దేశంలో పెద్ద నోట్ల రద్దు మర మగ్గాలకు శాపంగా మారింది. లక్షలాది మంది కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేసింది. దేశవ్యాప్తంగా 65లక్షల మరమగ్గాలుండగా, ఒక్క మహారాష్ట్రలోని భివాండి, మాలేగావ్, ధూలే, సాంగ్లీ, సోలాపూర్లలోనే 11లక్షల మరమగ్గాలున్నాయి. వీటిలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేసేవారు. గత మూడేళ్లలోనే దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు ఈ రంగంలోకి వచ్చారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతం ఆదాయం ఈ రంగం నుంచే సమకూరేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు వాటిలో 20శాతం మరమగ్గాలు మాత్రమే పనిచేస్తున్నాయని భివాండి టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నన్ సిద్దిఖీ తెలిపారు. పొలం నుంచి దారం ఫ్యాక్టరీకి, అక్కడి నుంచి మర మగ్గాల ఫ్యాక్టరీకి, అక్కడి నుంచి హోల్‌సేల్‌కు, అక్కడి నుంచి రిటేలర్కు, అక్కడి నుంచి వినియోగదారుడికి సాగే జౌళి నెట్‌వర్క్‌లో ప్రతి చోట నగదు లావాదేవీలే కొనసాగుతాయి. హోల్‌సేల్ నుంచి రిటేలర్, అక్కడి నుంచి వినియోగదారుడికి కొంత మేరకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చుగానీ రైతు పొలం నుంచి దూదిని సేకరించడం, రంగుల అద్దకం, జిప్‌లు, బటన్లు కుట్టడం, బేళ్లు ఎత్తడం లాంటి పనులకు కచ్చితంగా నగదునే చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే ఈ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా పడింది. ‘నోట్ బందీనే హమ్కో పాంచ్ సాల్ పీచె ఫేక్ దియా’ అని 65 ఏళ్ల లేబర్ కాంట్రాక్టర్ అసద్ ఫరూకి వ్యాఖ్యానించారు. ఆయన 30 ఏళ్లుగా వంద మర మగ్గాలను నడుపుతున్నారు. ‘అన్ని మరమగ్గాలపై కలిపి గత నెలలో మాకు 17 వేల రూపాయలు లాభం వచ్చింది. 1990వ దశకంలో మాకు నెలకు 20 వేల రూపాయల లాభం వచ్చేది. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే నెలకు 70 వేల రూపాయలు వచ్చేవి’ అని ఇదే వ్యాపారంలో కొనసాగుతున్న అసద్ కుమారుడు అఫ్తాబ్ మీడియాకు తెలిపారు. ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలోవున్న మాలేగావ్‌లో కూడా మర మగ్గాల పరిస్థితి ఇలాగే ఉంది. ఎప్పుడు జరిగేకన్నా వ్యాపారం 20 శాతం తక్కువగా జరుగుతోందని ముంబైలోని ఎన్. చంద్రకాంత్ అనే వస్త్ర వ్యాపారి తెలిపారు. గార్మెంట్స్ డిమాండ్ 30 శాతం, హోల్‌సేల్ డిమాండ్ 50 శాతం తగ్గిందని అదే మార్కెట్లో వస్త్ర దుకాణం నడుపుతున్న రిటేలర్ కపేష్ భయాని తెలిపారు.