
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదని, నేత కార్మికులకు అండగా నిలిస్తేనే టెక్స్‌టైల్ రంగం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సరైన మద్దతు ఇవ్వకపోవడంతోనే ప్రపంచంలోని చిన్న దేశాలతో కూడా భారత్ టెక్స్‌టైల్ రంగంలో పోటీ పడలేకపోతోందని చెప్పారు. సిరిసిల్లలో ‘మెగా పవర్‌లూమ్ క్లస్టర్’ను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పరిశ్రమలు, టెక్స్‌టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. కేంద్రం నుంచి సరైన ప్రోత్సాహం లేకున్నా తెలంగాణ వస్త్రోత్పత్తి రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో టెక్స్‌టైల్ రంగానికి అనువైన పరిస్థితులు లేకున్నా వాటిని ప్రోత్సహిస్తూ, అన్ని వసతులు కలిగిన తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని వెల్లడించారు.
మెగా క్లస్టర్‌తో ఉపాధి అవకాశాలు
కాంప్రహెన్సివ్ పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీంలో భాగంగా సిరిసిల్లలో ‘మెగా పవర్‌లూమ్ క్లస్టర్’ఏర్పాటు చేస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఢిల్లీకి స్వయంగా వచ్చి విన్నవించినా కేంద్రం స్పందించడం లేదని చెప్పారు. మరమగ్గాల కార్మికుల కోసం రాష్ట్రంలో 40శాతం సబ్సిడీతో వేజ్ కంపెన్సెషన్ స్కీం, నేతన్నకు చేయూత వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment