Exhibitions
-
మరో అద్భుతం ‘యశోభూమి’
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్రూమ్, మీటింగ్ రూమ్‌లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు. విశేషాలివీ.. 1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్‌ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. 2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్రూమ్, 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. 3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు. 4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది. 5. అందమైన సీలింగ్‌తో ఆకట్టుకుంటున్న బాల్రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది. 6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. 7. మీడియా రూమ్‌లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి. 9. సౌర విద్యుత్ కోసం రూప్‌టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. 10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Saraswati Kavula: చేనేతకు చేరువలో..
చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు. ‘‘ప్రభుత్వాలు పవర్లూమ్నే ప్రమోట్ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్ చాలా దెబ్బతిన్నారు. సేల్స్ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి. ► దిగులును చూశాను.. మొదట్లో రూరల్ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు. ► అన్ని చేనేతలు ఒక దగ్గర ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్ వీవర్స్, కో ఆపరేటివ్ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్ వీవర్స్ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు. వరంగల్ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్కల్ వీవింగ్, సిద్ధిపేట్ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి. ► రైతుగానూ.. మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి. మద్దతు ముఖ్యం క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్ లభిస్తాయి అని. దీనికి డిజిటల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం. – నిర్మలారెడ్డి -
డైనోసార్లకే.. సారు!
విమానమంత పొడవు.. కొంచెం అటూఇటుగా 4 అంతస్తుల ఎత్తు.. 57 టన్నుల బరువు.. ఇది టిటనోసార్..ఈ భూప్రపంచం ఇప్పటివరకూ చూసిన అతి పెద్ద డైనోసార్.. దీని ముందు అంతటి టీ రెక్స్ కూడా జూజూబీనే..ఎప్పుడో పది కోట్ల ఏళ్ల కింద భూమ్మీద తిరుగాడిన ఈ టిటనోసార్ అస్థి పంజరాన్ని లండన్‌లోని నేచురల్ హిస్టరీమ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఆరు డైనోసార్ల ఎముకలతో... 2010లో అర్జెంటీనాలోని ఓ రైతు తన పొలంలో పెద్ద ఎముకను గుర్తించాడు. శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడంతో.. క్రెటాషియస్ కాలానికి చెందిన 6 టిటనోసార్లకు చెందిన 280 ఎముకలు బయటపడ్డాయి. వాటిలో బాగున్న వాటిని కలిపి ఒక పూర్తిస్థాయి టిటనోసార్ అస్థిపంజరాన్ని సిద్ధం చేశారు. దీనికి ‘పటగోటిటన్ మయోరమ్’గా పేరుపెట్టారు. ఈ డైనోసార్ అస్థి పంజరంలోని తొడ ఎముక ఒక్కటే 8 అడుగుల పొడవు, 500 కిలోలకుపైగా బరువు ఉండటం గమనా ర్హం. మొత్తం టిటనోసార్ ఎముకలను లండన్‌కు తరలించేందుకు రెండు విమానాలు కావాల్సి వచ్చాయి. దీన్ని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో మార్చి 31 నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ప్రదర్శించనున్నారు. రోజుకు 130 కిలోల ఆకులు, కొమ్మలు.. ♦ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల మేరకు.. ఈ టిటనోసార్ పొడవు 121 అడుగులు, ఎత్తు 40 అడుగులు, బరువు 57 టన్నులకుపైగా ఉంటుందని అంచనా. భూమ్మీద తిరుగాడిన అత్యంత బరువైన, పెద్దదైన జంతువు ఇదే. ♦ ఇది శాఖాహారి. రోజుకు 130 కిలోలకుపైగా చెట్ల ఆకులు, కొమ్మలను తినేస్తుంది. ♦ ఒకసారికి 40 వరకు గుడ్లను పెడుతుంది. అయితే మాంసాహార డైనోసార్లు, ఇతర జంతువులు, ప్రమాదాల కారణంగా ప్రతి వంద టిటనోసార్ పిల్లల్లో ఒక్కటే పూర్తిస్థాయి వరకు ఎదుగుతుందని అంచనా. ♦ అంతపెద్ద డైనోసార్ అయినా.. గుడ్డులోంచి బయటికి వచ్చేప్పుడు బరువు నాలుగైదు కిలోలు మాత్రమే. కానీ ఎదిగే వేగం చాలా ఎక్కువ. పుట్టాక రెండు నెలల్లోనే ఏకంగా 40–50 కిలోల వరకు పెరుగుతాయట. ఇదే మనుషులకు అయితే పది పదిహేనేళ్లు పడుతుంది మరి. ♦ ఆరున్నర కోట్ల ఏళ్ల కింద భూమిని గ్రహశక లం ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టిన అతిభారీ డైనోసార్.. అంతకు మరో మూడున్నర కోట్ల ఏళ్ల ముందు బతికినది కావడం విశేషం. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అంతరంగచిత్రం
హంస ముఖంలో ముఖం పెట్టి మురిపెంగా చూస్తున్న అమ్మాయి.నెమలి పింఛాన్ని ఆసక్తిగా చూస్తున్న బుట్టగౌను పాపాయి.ఏనుగు తొండాన్ని ఆత్మీయంగా నిమురుతున్న యువతి.ప్రకృతి... పక్షులు... సరస్సులు... పువ్వులు కళ్ల ముందే.థీమ్ ఏదయినా సరే... ఓ అమ్మాయి రూపం తప్పనిసరి.ఆర్టిస్ట్ ఆషా రాధిక బొమ్మల్లో కనిపించే ఆర్ద్రత ఇది. ఆషా రాధిక పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం అంతా హైదరాబాద్‌లోనే. ఆమె బొమ్మల్లో హైదరాబాద్ సంస్కృతితోపాటు హైదరాబాద్‌లో కనిపించని జీవనశైలి కూడా ద్యోతకమవుతుంటుంది. ఆమె 24 సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’ చిత్రలేఖన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిత్రకళా ప్రస్థానాన్ని ‘సాక్షిఫ్యామిలీ’తో పంచుకున్నారు. కుంచె నేర్పింది! ‘‘నాకు పెయింటింగ్ హాబీగా మారడానికి కారణం మా అమ్మనాన్న. అమ్మ ఎంబ్రాయిడరీ చేసేది. దారంతో వస్త్రం మీద ఒక రూపం తీసుకురావాలంటే గంటల సేపు పని చేయాలి. బ్రష్‌తో అయితే నిమిషంలో వచ్చేస్తుంది. అలా సరదాగా మొదలుపెట్టాను. స్కూల్లో కాంపిటీషన్లలో ప్రైజులు వస్తుంటే ఆ ఉత్సాహంతో మరికొన్ని బొమ్మలు వేసేదాన్ని. ఇక నాన్నగారు మహాసంప్రదాయవాది. ఆడపిల్లలు స్కూలుకి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఇక దేనికీ బయటకు వెళ్లరాదన్నంత నియమం ఆయనది. ఖాళీ సమయం అంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో పెయింటింగ్స్‌లో ప్రయోగాలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయింది. అలా కుంచే నాకు గురువైంది. సెవెన్త్ క్లాస్‌లో సమ్మర్ కోచింగ్ తప్ప పెయింటింగ్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ ఏదీ లేకనే చాలా బొమ్మలు వేశాను. పెద్దయిన తర్వాత టెంపూరా ఆన్ పేపర్ కళను తెలుగు యూనివర్సిటీ, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీనివాసాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. కాన్వాస్లాగానే మైండ్ కూడా నా కుంచె గర్ల్ చైల్డ్ ప్రధానంగా జాలువారుతుంది. నేచర్, పక్షులు, పూలు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలను చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభావితమవుతాం. అయితే అది అనుకరణ కోసం కాదు. ఒక గమనింపు మనలో ఉంటుంది. ఆ చిత్రకారుల గీతను నిశితంగా గమనిస్తుంది మన మేధ. జగదీశ్ మిట్టల్ గారి కలెక్షన్స్‌లో 14వ శతాబ్దం నాటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ మీనియేచర్ ఆర్ట్ నా మెదడు మీద అలా ముద్రించుకుపోయింది. రామ్‌కుమార్, ప్రభాకర్ కోల్టే వేసే ఆబ్స్ట్రాక్ట్లు చాలా ఇష్టం. ఎన్ని చిత్రాలను చూసి, ఎన్నింటి నుంచి స్ఫూర్తి పొందినా మన మెదడు కాన్వాస్ మీద తనకు తానుగా ఓ కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తుంది. నేను బొమ్మ వేయడానికి కాన్వాస్ ముందు కూర్చునేటప్పుడు ఫలానా రూపం రావాలనే ఆలోచన ఉండదు. కాన్వాస్లాగానే మెదడు కూడా క్లియర్‌గా ఉంటుంది. రంగులు ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉంటే కొంత సేపటికి రూపం వస్తుంది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి తప్పనిసరిగా ఉంటుంది. ఇక థీమ్ అంటే ‘హర్ అబ్జర్వేషన్’ అని చెప్పవచ్చు. ఒక అమ్మాయి ప్రకృతిని, తన పరిసరాలను గమనించడంతోపాటు మమేకం కావడం నా బొమ్మల్లో ఉంటుంది. ఒక అమ్మాయిగా బాల్యంలో నేను చూసినవి, ఊహించినవి, పెద్దయిన తర్వాత నా గమనింపుకు వచ్చినవి, ఒక అమ్మాయికి తల్లిగా ప్రేమానుబంధం నా బొమ్మల్లో ఆవిష్కారమవుతుంటుంది. ఇంట్లోనే ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. నాలుగు వేల బొమ్మలు వేసి ఉంటాను. సోలో ప్రదర్శనలను గుర్తు పెట్టుకుంటాను, కానీ గ్రూప్ ప్రదర్శనల లెక్క ప్రత్యేకంగా గణనలోకి తీసుకోలేదు. అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లోనూ నావి సోలో ప్రదర్శనలే. చిత్రలేఖనం పట్ల ఎంత ఇష్టం ఉన్నప్పటికీ చదువు ప్రాధాన్యం తగ్గనివ్వలేదు. ఎస్బీఐలో 1992లో ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు శంకరపల్లి బ్రాంచ్ మేనేజర్ని. ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’లో పాల్గొన్నాను. సోలో ఎగ్జిబిషన్లు 2001 నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 25వ ఎగ్జిబిషన్ నా చిత్రలేఖనం కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలనే ఆకాంక్షతో సిద్ధం చేస్తున్నాను’’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు ఆర్టిస్ట్ ఆషా రాధిక. – వాకా మంజులారెడ్డి -
నుమాయిష్‌తో అపూర్వ అనుభూతి
సాక్షి, హైదరాబాద్: ‘‘పెరిగిన సాంకేతికతతో మొబైల్ ఫోన్లో ఆర్డర్స్ క్లిక్ చేస్తే వస్తువులు ఇంటి వద్దకు చేరవచ్చు. కానీ, నుమాయిష్‌లో వివిధ సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, నచ్చిన, మెచ్చిన వస్తువులను చూసి కొనుగోలు చేయడం ద్వారా పొందే అనుభూతిని మాత్రం కోల్పోతామని రాష్ట్రమంత్రి,, ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)–82ను ఆయన మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాళ్లను సందర్శించి వివిధ రాష్ట్రాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం వారు నుమాయిష్‌లోని టాయ్‌ట్రైన్‌లో ప్రయాణించారు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన శైలిలో ప్రతి కొత్త సంవత్సరం హైదరాబాద్ నుమాయిష్ భాగమైపోయిందన్నారు. సామాజిక అనుబంధాన్ని కోల్పోకుండా నుమాయిష్‌ను సందిర్శంచి లభించే గొప్ప అనుభూతిని ఆస్వాదించాలని కోరారు. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఎగ్జిబిషన్‌కు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేస్తారని, వివిధ రకాల సంప్రదాయ ఉత్పత్తుల స్టాళ్లతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ మినీభారత్‌ను తలపిస్తోందని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్ నుమాయిష్ ప్రపంచంలో జరిగే వ్యాపార సమ్మేళనాల్లో ఒకటిని పేర్కొన్నారు. మహిళాసాధికారతకు తోడ్పాటు ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ ద్వారా లభించే ఆదాయంతో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలకు నిధులు సమకూర్చి దాదాపు 30 వేలమందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా మహిళా విద్యను ప్రోత్సహించేందుకు విద్యాసంస్థలు నడిపిస్తూ మహిళా సాధికారతకు తోడ్పాటునందిస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా మారుమూల నిర్మల్ వంటి దూర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభించి, ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు గుర్తు చేశారు. సుమారు రెండు వేల టీచింగ్– నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రతి ఏడాది దాదాపు పదివేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశవిదేశాల్లో ఉన్నతమైన స్ధానాల్లో ఉన్నారని , వారు సొసైటీని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎగ్జిబిషన్ ద్వారా లభించే ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాలో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు విస్తరించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మట్లాడుతూ లాభాపేక్ష లేకుండా సొసైటీ సేవలు అభినందనీయమని, మళ్లీ పాత నుమాయిష్ రోజులు రావాలని ఆకాంక్షించారు. మంత్రి తలుసాని మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు నుంచి నుమాయిష్ నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో పలు విద్యసంస్థలు నడపడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో చొరవ చూపినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ సలీం, ఎగ్జిబిషన్ సోసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భళా.. చాంగుభళా..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): గిరిజనుల సంప్రదాయ నృత్యప్రదర్శనతో వేదిక మురిసింది. 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒక చోట చేరి ఇస్తున్న ప్రదర్శనలు సందర్శకుల మది దోస్తున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ నృత్య ప్రదర్శనలో రెండో రోజు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన బృందాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బృందం కొమ్మ కోయ డ్యాన్స్ ప్రదర్శించింది. చండీఘర్ బృందం మిసన్ హర్న డ్యాన్స్, కేరళ నుంచి మళపుళయ అత్తమ్ నృత్యం, మణిపూర్ నుంచి జౌ లేయ్ కోన్ నృత్యం, మధ్యప్రదేశ్ నుంచి గుడుం బాజా డ్యాన్స్, ఒడిశా నుంచి బిర్లి డ్యాన్స్, తెలంగాణ నుంచి గోండు జాతి డ్యాన్స్, గుజరాత్ బృందం భిల్ డ్యాన్స్, గోవా బృందం కుంభి డ్యాన్సులు ప్రదర్శించాయి. ప్రత్యేక ఆకర్షణగా గోండు నృత్యం తెలంగాణకు చెందిన గోండు జాతి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి వస్త్రధారణతో పాటు జీవనవిధానాన్ని ప్రతిబింబించిన నృత్యం ఆహూతులను అలరించింది. నేటితో ముగియనున్న ఫెస్టివల్ మూడో రోజుల పాటు సాగిన నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు సాగే వేడుకల్లో 9 రాష్ట్రాలకు చెందన బృందాలు నృత్యాలను ప్రదర్శించనున్నాయి. పోర్టు ట్రస్ట్ ప్రత్యేక బహుమతులు ఈ ఫెస్టివల్ ద్వారా మొదటి, రెండు, మూడు స్థానాలకు మాత్రమే బహుమతులను అందజేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ రామ్మోహన్ రావు పోర్టు ట్రస్ట్ తరపున నాలుగు కన్సొలేషన్ బహుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.25 వేలు చొప్పున నాలుగు రాష్ట్రాలకు అందిస్తామని ఆయన ప్రకటించారు. వారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ కానుక అందిస్తున్నామన్నారు. -
జెనీవా ఆటో షో రద్దు
జెనీవా: కోవిడ్–19 వైరస్(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్ ప్రభుత్వం శుక్రవారం నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయ్యింది. ఇప్పటికే 15 కేసులను గుర్తించిన స్విస్ ప్రభుత్వం.. ఈ మహమ్మారి వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలోనే ఆటో షో రద్దు అయ్యిందని స్విట్జర్లాండ్ మంత్రి అలైన్ బెర్సెట్ ప్రకటించారు. -
పట్టణాలకు పల్లె కళ...
మహిళా స్వావలంబన ‘అక్కా! మేం చేసిన ఈ వస్తువులను పట్టణంలోని వారు వాడతారా?!’ ఓ చెల్లెలి సందేహం. ‘అక్కా, మిగతా వాటిలాగానే వీటినీ కొన్ని రోజులు వాడి, పడేస్తారా?’ ఇంకొకరి అనుమానం... ‘అసలు ఈ వస్తువులు కొంటారంటావా అక్కా!’ మరొకరి సంశయం.. ముప్ఫై ఐదేళ్ల వీణా ప్రకాష్ సింగ్ వారడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానమిస్తారు. అంతే ఓపికగా వారి చేత పట్టణాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయించి, వారు చేసిన కళాకృతుల విలువను నలుగురికి తెలియజేస్తారు. వారి చేతుల్లో రూపుదిద్దుకుంటున్న కళాకృతులు ఏ నమూనాలో ఉండాలో వివరిస్తారు. వారి కళను పట్టణ ప్రజల ఇళ్లలో పరిమళాలు వెదజల్లేలా చేయడమే కాదు, వారికి ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు వీణా ప్రకాష్ సింగ్. వీణా ప్రకాష్ సింగ్‌కి ప్రయాణాలంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే డిగ్రీ చేసిన ఆమె జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. వీణ పూర్వీకులది పశ్చిమ బెంగాల్ అయినా ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! తండ్రి సూర్యప్రకాష్, తల్లి సూర్యకాంతం. ఇద్దరూ స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తూ, పేదలకు సాయపడుతుంటారు. తల్లితండ్రుల నుంచి స్ఫూర్తి పొందిన వీణ తనూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగా దేశమంతా తిరిగారు. ముఖ్యంగా తన పూర్వీకుల స్వస్థలమైన పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లోని గ్రామాలన్నీ తిరిగారు. అక్కడి మహిళల అమాయకత్వాన్ని, వారు పడుతున్న ఇబ్బందులనూ దగ్గరగా గమనించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్, రాజస్థాన్‌లోని సిరోహీ గ్రామాల స్త్రీలను కలిసినప్పుడు మాత్రం వారికి ఉన్న కళా నైపుణ్యం పేదరికం మాటున ఎలా మరుగున పడుతోందో గమనించారు. ఇప్పటికీ అక్కడి ఆడపిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్ళు జరిపించడం, చిన్న వయసులోనే వారు పిల్లలతో కుటుంబం నడపలేక పడుతున్న స్థితిని కళ్లారా చూశారు. అప్పుడే వారికి సహాయ పడాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించుకున్నారు వీణ. తన ఆలోచనలకు భర్త కార్తీక్ సింగ్ ఊతమిచ్చారు. వి.కె.శరణ్య పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేసి, పాతికమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు కదిలారు. ఆ విధంగా మట్టి కళాకృతులు, నారతో చేసిన బొమ్మలు, సంచులు, పేపర్‌తో చేసిన బొమ్మలు.. స్త్రీల చేతుల్లో కొత్తగా ప్రాణం పోసుకోవడం మొదలుపెట్టాయి. ఆలోచనే పెట్టుబడి... వీణలాగే ఆమె భర్త కార్తీక్ సింగ్ కూడా కళాప్రియుడే! అంతేకాదు నలుగురికీ చేయూతనివ్వాలని తపించే వ్యక్తి. తనకు వచ్చిన చిత్రకళను పేద పిల్లలకు పరిచయం చేయాలని మురికివాడలను సందర్శించి, అక్కడి పిల్లలకు పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తుంటారు. ‘ఈ పెయింటింగ్ మోడల్స్‌ని నేను గ్రామీణ మహిళల దగ్గరకు తీసుకెళతాను. రకరకాల చేతివృత్తులలో వాటిని మేళవించేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఆ విధంగా మహిళల చేతుల్లో తయారయ్యే బొమ్మల్లో వైవిధ్యం కనిపిస్తుంది. అంతే కాదు, వారి ఆత్మ ఆ కళాకృతుల్లో కనిపిస్తుంది. అందుకే ఇవి ఆధునికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీరి కళాకృతులతోనే కలకత్తా, ముంబయ్‌లలో ఎగ్జిబిషన్లు నిర్వహించాను.హైదరాబాద్‌లో ‘ఆల్పోనా’ పేరుతో హస్తకళాకృతుల విక్రయదుకాణాన్ని ఏర్పాటు చేశాను. దీంట్లో వచ్చిన ఆదాయాన్ని కళాకృతుల తయారీ మహిళలకు అందజేస్తున్నాను’ అంటూ రెండున్నరేళ్లుగా తాను చేస్తున్న కృషి గురించి వివరించారు వీణ. స్వచ్ఛంద సంస్థలతో కలిసి...: ఉపాధి అవకాశాలు పెంచేందుకుగాను క్రాఫ్ట్స్‌తో పాటు హ్యాండ్లూమ్ ప్రింట్స్ కూడా నేర్పిస్తున్నారు వీణ. ఉన్న కళలతో పాటు, కొత్త కళలను నేర్పుతూ అవకాశాలు పెరిగేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి రాజస్థాన్ బాంద్రా మురికివాడల్లో హెల్త్ క్యాంపులు, హైదరాబాద్‌లో స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్, బ్యాగులు, ముంబయ్‌లోని మురికివాడల పిల్లల కోసం రంగస్థల తరగతుల నిర్వహణ, పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో వృద్ధాశ్రమం, హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలో పాలు పంచుకుంటున్నారు. గ్రామీణ ప్రజలకు ఆదాయ వనరుల మార్గాలు, పొదుపు పథకాల గురించి వివరిస్తూ సామాజిక బాధ్యతగా తన వంతు కృషి చేస్తున్నారు. గ్రామీణ మహిళకు ఉపాధి... ‘గ్రామీణ కళాకృతులకు పట్టం కట్టాలనేది నా ఉద్దేశ్యం. అందుకే ఇదే తరహా కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలలోనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇందుకు కొన్ని గ్రామాలను ఇప్పటికే ఎంచుకున్నాను. ఆ గ్రామాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులను, చేతివృత్తుల ప్రత్యేకత.. వివరాలు తెలుసుకొని వందలాది మంది నిరుపేద గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాను’ అని చెబుతున్న వీణకు గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించేలా చేయడమే లక్ష్యం. ఆమె ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివ మల్లాల