![PM Narendra Modi To Inaugurate Yashobhoomi Centre At Dwarka on 17sept 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/16/yashobhoomi.jpg.webp?itok=LMirJi6Z)
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది.
ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్‌రూమ్, మీటింగ్ రూమ్‌లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు.
విశేషాలివీ..
1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్‌ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు.
2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్‌రూమ్, 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి.
3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు.
4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది.
5. అందమైన సీలింగ్‌తో ఆకట్టుకుంటున్న బాల్‌రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది.
6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి.
7. మీడియా రూమ్‌లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి.
9. సౌర విద్యుత్ కోసం రూప్‌టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు.
10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment