స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు | PM Narendra Modi hoists the National Flag at Red Fort on the occasion of 76th Independence Day | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు

Published Mon, Aug 14 2023 5:18 AM | Last Updated on Mon, Aug 14 2023 10:46 AM

PM Narendra Modi hoists the National Flag at Red Fort on the occasion of 76th Independence Day - Sakshi

న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దిన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టున ఢిల్లీలోని ఎర్రకోటలో అంబరాన్నంటే సంబరాల్లో సామాన్యుడికి పెద్దపీట వేసింది. దేశానికి వెన్నుముకలాంటి రైతులు, చెమటోడ్చి పని చేసే కార్మికులు, జీవనోపాధి కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాలర్లు, సేవాగుణం కలిగిన నర్సులు, గ్రామాల సర్పంచ్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఢిల్లీలో ఎర్రకోటపై మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

2047 స్వాతంత్య్ర దిన శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగానే స్వాతంత్య్ర దిన వేడుకల్ని జరుపుతున్నారు. ఇక ఇంటింటిలోనూ  త్రివర్ణ పతాకం ఎగరాలన్న ప్రచారం ఆదివారం నుంచే మొదలైంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను డిస్‌ప్లే పిక్చర్‌ (డీపీ) గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

చైతన్యవంత గ్రామాల నుంచీ..
స్వాతంత్ర దిన వేడుకలకు ప్రత్యేకంగా 1,800 మంది అతిథుల్ని ఆహ్వానించారు. దేశంలోని అత్యంత చైతన్యవంతమైన గ్రామాలుగా గుర్తింపు పొందిన 660కి పైగా గ్రామాల నుంచి 400 మందికి పైగా సర్పంచ్‌లు, 250 మంది రైతులు, పార్లమెంటు కొత్త భవనం, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులైన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ పనివారుతో పాటు జాలర్లు, టీచర్లు, నర్సులు ఇలా సమాజంలో కీలకమైన వర్గాల వారందరికీ ఆహ్వానం పలికినట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సతీ సమేతంగా హాజరయ్యే ఈ అతిథులకి బస ఏర్పాట్లు చేస్తోంది.  

సెల్ఫీ పాయింట్లు
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా యువతీయువకులకు సెల్ఫీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందు కోసం 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను వివిధ థీమ్‌లతో తీర్చి దిద్దింది. నేషనల్‌ వార్‌ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్‌ చౌక్, రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్, జమా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్‌ మెట్రో స్టేషన్,,  ఇలా 12 ప్రాంతాల్లో పెట్టిన సెల్ఫీ పాయింట్లలో సెల్ఫీలు తీసుకొని ఆగస్టు 15–20 మధ్య మైగవ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఒక్కో సెల్ఫీ పాయింట్‌ నుంచి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసి 12 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమానం అందిస్తారు.

డీపీలుగా జాతీయ జెండా
హర్‌ఘర్‌ తిరంగా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియా వినియోగదారులందరూ తమ అకౌంట్లలో డీపీని జాతీయ జెండాతో మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ తన అకౌంట్లలో త్రివర్ణ పతాకాన్నే డీపీగా పెట్టుకున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇదో ఉద్యమంగా చేయాలన్నారు. దేశానికి, ప్రజలకి మధ్య ఉండే ఉద్వేగభరితమైన సంబంధానికి ప్రతీకగా జాతీయ జెండాను డీపీగా ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ జెండాలతో ఫోటోలు దిగి హర్‌ ఘర్‌ తిరంగా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement