National flag hoisting
-
ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయం, ఏపీ సచివాలయం, మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఆర్టీసీ హౌస్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన: మోషేన్‌రాజు, తమ్మినేని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగడం చాలా సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో వారిద్దరూ జాతీయ జెండాలను ఎగురవేశారు. మోషేన్‌రాజు, తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నేడు పరిపాలన ఇంత సాఫీగా సాగుతోందంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, ఉప కార్యదర్శులు సుబ్బరాజు, విజయరాజు, చీఫ్ మార్షల్ డి.ఏడుకొండలరెడ్డి, లీగల్ అడ్వైజర్ ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం: సీఎస్ సమాజంలోని అందరం కలిసి బాధ్యతతో మెలుగుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె.కృష్ణమూర్తి, జీఏడీ ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో... తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ భవన్లో... విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 24 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బహ్మానందరెడ్డి, కోటేశ్వరరావుతోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధలో... విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ ట్రాన్స్‌కో మాజీ (థర్మల్) జి.విజయకుమార్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విద్యుత్ సౌధ వద్ద నిర్మించిన 100 కిలోవాట్ల సోలార్ పార్కింగ్‌ను విజయానంద్ ప్రారంభించారు. ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, చీఫ్ ఆఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ టి.పనాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏపీ భవన్లో గణతంత్ర వేడుక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ పాల్గొన్నారు. హెచ్ఆర్సీ కార్యాలయంలో... కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో హెచ్ఆర్సీ చైర్మన్ సీతారామమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. లోకాయుక్తలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ నరసింహారెడ్డి, డిప్యూటీ రిజి్రస్టార్ పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకం రిపబ్లిక్‌డే వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ సాక్షి, అమరావతి: రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. హైకోర్టులో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవానికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల కారణంగా ప్రజలకు న్యాయ సేవలను, సత్వర న్యాయాన్ని అందించడం సవాళ్లతో కూడుకున్న పని అని అన్నారు. సవాళ్లను అధిగమించి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పేదరికం, అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని వర్గాలకు న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాన్ని పేదల ముంగిటకు తీసుకువెళ్లేందుకు న్యాయసేవాధికార సంస్థ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. మన న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 8,960 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రజలకు అవగాహన కలిగించిందని వివరించారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం న్యాయమూర్తులు హైకోర్టు వద్ద మొక్కలు నాటారు. -
స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దిన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టున ఢిల్లీలోని ఎర్రకోటలో అంబరాన్నంటే సంబరాల్లో సామాన్యుడికి పెద్దపీట వేసింది. దేశానికి వెన్నుముకలాంటి రైతులు, చెమటోడ్చి పని చేసే కార్మికులు, జీవనోపాధి కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాలర్లు, సేవాగుణం కలిగిన నర్సులు, గ్రామాల సర్పంచ్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఢిల్లీలో ఎర్రకోటపై మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 2047 స్వాతంత్య్ర దిన శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగానే స్వాతంత్య్ర దిన వేడుకల్ని జరుపుతున్నారు. ఇక ఇంటింటిలోనూ త్రివర్ణ పతాకం ఎగరాలన్న ప్రచారం ఆదివారం నుంచే మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను డిస్ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. చైతన్యవంత గ్రామాల నుంచీ.. స్వాతంత్ర దిన వేడుకలకు ప్రత్యేకంగా 1,800 మంది అతిథుల్ని ఆహ్వానించారు. దేశంలోని అత్యంత చైతన్యవంతమైన గ్రామాలుగా గుర్తింపు పొందిన 660కి పైగా గ్రామాల నుంచి 400 మందికి పైగా సర్పంచ్‌లు, 250 మంది రైతులు, పార్లమెంటు కొత్త భవనం, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులైన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ పనివారుతో పాటు జాలర్లు, టీచర్లు, నర్సులు ఇలా సమాజంలో కీలకమైన వర్గాల వారందరికీ ఆహ్వానం పలికినట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సతీ సమేతంగా హాజరయ్యే ఈ అతిథులకి బస ఏర్పాట్లు చేస్తోంది. సెల్ఫీ పాయింట్లు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా యువతీయువకులకు సెల్ఫీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందు కోసం 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను వివిధ థీమ్‌లతో తీర్చి దిద్దింది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్, జమా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్,, ఇలా 12 ప్రాంతాల్లో పెట్టిన సెల్ఫీ పాయింట్లలో సెల్ఫీలు తీసుకొని ఆగస్టు 15–20 మధ్య మైగవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో సెల్ఫీ పాయింట్ నుంచి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసి 12 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమానం అందిస్తారు. డీపీలుగా జాతీయ జెండా హర్‌ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులందరూ తమ అకౌంట్లలో డీపీని జాతీయ జెండాతో మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ తన అకౌంట్లలో త్రివర్ణ పతాకాన్నే డీపీగా పెట్టుకున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇదో ఉద్యమంగా చేయాలన్నారు. దేశానికి, ప్రజలకి మధ్య ఉండే ఉద్వేగభరితమైన సంబంధానికి ప్రతీకగా జాతీయ జెండాను డీపీగా ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ జెండాలతో ఫోటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. -
Azadi Ka Amrit Mahotsav: అమృత్ సెల్యూట్
మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్ ఘర్ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది. రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్‌ప్లాన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్ వంటివాటిని ఆయన ప్రకటించారు. 2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. రక్షణ వలయంలో ఢిల్లీ పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. 2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్‌ఫ్ మరింత అప్రమత్తమయ్యాయి. – న్యూఢిల్లీ -
Azadi Ka Amrit Mahotsav: హర్ ఘర్ తిరంగా..మన ఇంటిపై మూడు రంగుల జెండా
గొప్ప సందర్భం దగ్గర పడింది. దేశమంతా పండగ కళ రానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఊరూ వాడా వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ‘ఇంటిని’ కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఉత్సవ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుంది? పిల్లల చేత ఏం చేయిస్తే బాగుంటుంది. కొన్ని ఆలోచనలు. ఒక మహా దృశ్యాన్ని ఊహించండి. డ్రోన్ షాట్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు డ్రోన్ కెమెరా ఎగురుతూ వుంటే ప్రతి ఇంటి మీదా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం. భారత ప్రజల సగర్వ స్ఫూర్తి. ఉప్పొంగే గుండెల దీప్తి. ఎలా ఉంటుంది? అద్భుతం కదూ. ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు దేశంలోని 20 కోట్ల ఇళ్ల మీద త్రివర్ణ పతాకం ఎగరాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రచారం కోసం, ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు హోం శాఖ సూచనలు చేసింది. మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయమై ప్రచారం చేయాలని తెలిపింది. పిల్లలు, యువత, వయోజనులు అందరూ కలిసి ఈ తేదీలకు ముందు బృందాలుగా ఏర్పడి త్రివర్ణ పతాకాలు చేబూని పల్లెల్లో తిరుగుతూ ‘ప్రభాత్ ఫేరి’ చేస్తే ప్రజలు స్పందిస్తారని చెప్పింది. గాంధీజీ 1930లలో దేశభక్తి ప్రేరేపించడానికి తెల్లవారుజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘ప్రభాత్ ఫేరి’ (ప్రభాత భ్రమణం) నిర్వహించేవారు. ఇప్పుడు ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగరాలంటే ఇలాంటి ప్రభాత భ్రమణాలు అవసరమని కేంద్రం తెలిపింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలతో సెల్ఫీలు పెట్టమని చెప్పింది. మొత్తంగా ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడాలని కోరింది. మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జెండాలు ఎగరడానికి మూడు సైజులలో తయారీకి, అందుబాటుకు ఏర్పాట్లు చేసింది. ఇవి ఆన్లైన్లో, పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఇంటి పండగ అవును. ఇది ప్రతి ఇంటి పండగ. ఒక అపూర్వఘట్టంలో మన ఇంటి మీద జెండా ఎగరనున్న పండగ. పెద్దలకి, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు ఇంతకు మించిన జ్ఞాపకం ఏమైనా ఉంటుందా? ఒక త్రివర్ణ పతాకంతో మించిన ఫ్యామిలీ ఫొటో ఉంటుందా? అయితే ఈ ఘట్టంలో మనం ఏ మాత్రం యోగ్యతతో ఉన్నామో చెక్ చేసుకోవాలి. కొన్ని తప్పక చేయాలి. కొన్ని చేయమని ఇతరులకు చెప్పాలి. మన ఇంట్లో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చెక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో గాంధీజీ ఆత్మ కథ ‘సత్యశోధన’ కనీసం ఉండాలి. నెహ్రూ రచనలు, భగత్ సింగ్ జీవిత కథ తెలుగు యోధులు అల్లూరి, ప్రకాశం పంతులు వంటి వారి పరిచయ పుస్తకాలు ఉండాలి. నలుగురిలో కలిసి ‘జనగణమన’ పాడటం కాదు. ఒక్కళ్లమే తప్పుల్లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా జాతీయ గీతం పాడటం ప్రాక్టీసు చేయాలి. ‘వందేమాతరం’ కంఠతా పట్టాలి. ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘సారే జహాసే అచ్ఛా’ వంటి గీతాలు పిల్లల చేత కంఠతా పట్టించాలి. ఉంటున్న వీధుల్లో, అపార్ట్మెంట్లలో ఆగస్టు పదిహేను లోపు వీలున్న సమయాల్లో, శని, ఆదివారాల్లో పిల్లల చేత ఇవన్నీ ప్రాక్టీసు చేయించాలి. వారికి క్విజ్లు పెట్టాలి. ఈ మూడు రోజులు దేశ నాయకుల పోస్టర్లు ఇంట్లో అలంకరించాలి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అబుల్ కలామ్ ఆజాద్... వంటి నేతల్లో ఎవరో ఒకరన్నా మన డ్రాయింగ్ రూమ్‌లో కొలువుదీరాలి. కమ్యూనిటీ ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో ఆ మూడు రోజులు దేశభక్తి సినిమాలు ప్రదర్శించవచ్చు. నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్‌లు, ఏకపాత్రాభినయాలు... ఇవన్నీ పెద్దలు, పిల్లలు కలిసి చేయవచ్చు. ఫోన్ పలకరింపుల్లో ‘హలో’ బదులు ‘వందేమాతరం’, ‘బై’ బదులు ‘జైహింద్’ వాడితే ఆ అనుభూతే వేరు. ఈ స్వాతంత్య్రం ఎందరో తెలిసిన తెలియని దేశభక్తుల త్యాగఫలం. వేలాది మంది తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వల్లే మనం ఇవాళ మన ఇంటిలో హాయిగా ఉన్నాం. కనుక వారందరి స్మృతిలో అన్నదానం, అనాథలకు సహాయం, అవసరంలో ఉన్నవారికి చేదోడు పనులు చేయడం కనీస కృతజ్ఞత. ఇంటింటా త్రివర్ణపతాకం కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుదాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. మూడు రోజుల పాటు దేశపటాన్ని కాషాయ, ధవళ, ఆకుపచ్చ వర్ణాలతో మిలమిలమెరిపిద్దాం. -
మత సామరస్యానికి ప్రతీక జిన్నా టవర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మత సామరస్యానికి ప్రతీక గుంటూరులోని జిన్నాటవర్ అని, ఎందరో మహానుభావుల త్యాగం వల్లే నేడు అందరం స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరంలో జిన్నా టవర్ పేరుతో కొన్ని మతతత్వ శక్తులు కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జిన్నాటవర్ పేరు మార్చాలని, లేకుంటే కూల్చేస్తామంటూ కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాలకు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. గురువారం సర్వమత పెద్దల ప్రార్థనల అనంతరం అక్కడ జాతీయ జెండాను హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ జిన్నా టవర్‌కు త్రివర్ణ పతాక రంగులు వేయడం చరిత్రాత్మకమన్నారు. దేశ పాలకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం బాధాకరమన్నారు. జిన్నా దేశభక్తుడంటూ అద్వానీ కీర్తించలేదా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీని హత్య చేసిన గాడ్సేను పూజించే బీజేపీ నేతలకు దేశభక్తి గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నా దేశ భక్తుడంటూ కొనియాడిన సంగతి బీజేపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌లు మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తుంటే.. ఓర్వలేక వారి మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని స్వార్థపూరిత శక్తులు విఫలయత్నాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు జియాఉద్దీ¯న్, వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, షేక్ సజీల, కమిషనర్ నిశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భారతీయ సైనిక పాటవాన్ని చాటిచెప్పేలా యుద్ధవిమానాలతో భారీ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పలు సైనిక వాహనాలను ప్రదర్శించారు. కరోనా కారణంగా వేడుకలకు విదేశీ అతిధిని ఆహ్వానించలేదు. వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించడంతో రిపబ్లిక్ డే పెరేడ్ ఆరంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా, మేజర్ జనరల్ అలోక్ కకేర్ నేతృత్వంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతాలాపన, 21 తుపాకుల గన్‌సెల్యూట్ జరిగాయి. భారత ఆర్మీ 61వ కేవలరీ రెజిమెంట్ సైనికులు మార్చింగ్‌లో ముందు నిలిచారు. ఉత్తరాఖండ్ టోపీతో ప్రధాని గణతంత్ర ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ద మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాధ్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు రిపబ్లిక్ డే పెరేడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు. పెరేడ్లో ఎన్సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సైతం తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్లో అడుగుపెట్టింది. విదేశాల్లో గణతంత్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. పలు దేశాల్లో భారతీయ కమిషన్ కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. బీజింగ్‌లో భారత రాయబారి విమల్ జాతీయజెండాను ఎగురవేసి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో హైకమిషనర్ సిద్ధార్ధ్ నాథ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భారత్‌లో మరింత బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ హిందీలో భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆకాంక్షించారు. భారత్‌తో కలిసి అనేక అంశాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లా ప్రధాని షేక్ హసీనా చెప్పారు. భూటాన్, ఇండియాల స్నేహం కాలానికి నిలిచిందని ఆ దేశ ప్రధాని లోటే ష్రింగ్ తెలిపారు. భారత ప్రజలకు శ్రీలంక ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్లో ఇండియా రాయబారి సురేశ్ కుమార్ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఇండో– యూఎస్ బంధం కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రూనై, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే సంబరాలు భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు పాటుపడతామని ప్రతిన పూనారు. కరోనా కారణంగా ప్రేక్షకుల సంఖ్యపై పలు రాష్ట్రాల్లో పరిమితులు విధించారు. కాశ్మీర్లో ప్రఖ్యాత లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. లోయలో పుకార్లు వ్యాపింపజేసేవారిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన రిపబ్లిక్‌డే ప్రసంగంలో నిప్పులు చెరిగారు. రాజాంగ్య మౌలికతను కాపాడేందుకు ప్రతినపూనాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగితను తొలగిస్తామని హర్యానా సీఎం ఖటర్ ప్రతిజ్ఞ చేశారు. పెట్రోల్‌పై సబ్సిడీని జార్ఖండ్ సీఎం సోరెన్ ప్రకటించారు. మహిళా శిశువుల కోసం ప్రత్యేక పథకం తెస్తామని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ చెప్పారు. కేరళలో మంత్రి అహ్మద్ తలకిందులుగా జాతీయజెండాను ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రాభివృద్ధికి తీసుకునే చర్యలను మేఘాలయ ముఖ్యమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్‌లో మద్యనిషేధం ఆవశ్యకతను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ నొక్కిచెప్పారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నోవిజయాలు సాధించిందని మహారాష్ట్ర గవర్నర్ చెప్పారు. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో ప్రదర్శించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం అరవింద్, లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ స్వతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీమా భవానీ బృందం విన్యాసాలు పెరేడ్లో బీఎస్ఎఫ్కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ప్రముఖులంతా ఈ బృందానికి నిల్చొని చప్పట్లతో గౌరవం ప్రకటించారు. భారతీయ ఐక్యతను ప్రతిబింబించేలా 485 మంది డాన్సర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు గుర్తుగా 75 యుద్ధ విమానాలు ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి. విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా, కాక్‌పిట్ నుంచి చిత్రీకరించిన వీడియోలను వాయుసేన ప్రదర్శించింది. ఆకాశంలో విమాన విన్యాసాల ప్రత్యక్ష ప్రసారం ఇదే తొలిసారి. వేడుకలకు దాదాపు 5వేల మంది హాజరయ్యారు. కరోనా పూర్వం ఈ వేడుకలకు దాదాపు లక్షమంది వచ్చేవారు. వీక్షకులంతా కరోనా నిబంధనలు పాటించారు. అలాగే వీక్షకులు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నగరం మొత్తాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు. -
అందరి కృషితో లక్ష్యాలు అందుకోగలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రదిన శతాబ్ది వేడుకల సమయానికి భారత్‌ను ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజలు చేసే కృషి అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తవిస్తూ. ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు మార్గదర్శకాలను సూచిస్తూ, కొత్త అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ మధ్య మధ్యలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సగర్వంగా చాటుతూ ప్రధాని ప్రసంగం సాగింది. 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వేదికగా వరసగా ఎనిమిదోసారి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన కోసం రూ.100 లక్షల కోట్లతో గతి శక్తి అనే భారీ పథకాన్ని ప్రకటించారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ దేశ భద్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనుకాడమని చెప్పారు. సంప్రదాయ కుర్తా, నీలం రంగు జాకెట్, కాషాయ రంగు తలపాగా చుట్టుకున్న ప్రధాని దాదాపుగా 90 నిముషాల సేపు ప్రసంగించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదానికి కొత్తగా సబ్కా ప్రయాస్ (సమష్టి కృషి) అన్న దానిని చేర్చారు. భారత్ నిర్దేశించుకున్న 100శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రజలందరి కృషి అత్యంత అవసరమని గట్టిగా చెప్పారు. అందుకే రాబోయే 25 ఏళ్లు అమృత కాలంగా ప్రధాని అభివరి్ణంచారు. దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహాత్మా గాం«దీ, సుభాష్ చంద్రబోసు, భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బి.ఆర్. అంబేద్కర్ వంటి నేతలందరినీ ప్రధాని పేరు పేరునా స్మరించారు. యువత ఏదైనా చేయగలదు నేటి యువతరంపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. నేటి తరం ఏదైనా చేయగలదు, ప్రతీ లక్ష్యాన్ని సాధించగలదు అన్నారు. ‘‘నాకు ఈ దేశ యువతపై విశ్వాసం ఉంది. దేశ సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తి నిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మనలో ఉన్న ఉత్సాహం, మనలో ఉన్న సోదరభావమే మన బలం’’ అని మోదీ అన్నారు. ‘‘ఇదే సరైన సమయం. దేశానికి అత్యంత కీలకమైన సమయం. అసంఖ్యాకమైన ఆయుధాలు మనదగ్గరున్నాయి. దేశభక్తి ప్రతీ చోటా పొంగిపొరలుతోంది. అందరూ కదిలి రండి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి. దేశ భవితను సమున్నతంగా రెపరెపలాడించండి’’ అని మోదీ ఒక కవితతో తన ప్రసంగాన్ని ముగించారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు ► దేశం నలుమూలలకి రైలు కనెక్టివిటీ పెరిగేలా ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో 75 కొత్త వందేభారత్ రైళ్లు ప్రవేశ పెడతాం. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ కలిపేలా రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం. ► వ్యవసాయం రంగంలో 80శాతానికిపైగా ఉన్న చిన్న రైతులే దేశానికి గర్వకారణం. వారికి అండగా ఉండడానికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 10 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు రూ.1.5 లక్షల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ► 2024 నాటికి గ్రామీణ ప్రజలందరి ఇళ్లకి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రారంభించి జాతీయ జల జీవన్ మిషన్‌లో భాగంగా గత రెండేళ్లలో 4.5 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చాం ► దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని ఆగస్టు 14న విభజన గాయాల స్మృతి దినంగా పాటిద్దామని పిలుపునిచ్చారు. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాక రెపరెపలాడింది. నేటి యువత మన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ► ఏడేళ్ల క్రితం భారత్ 800 కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేది. అదే ఇప్పుడు 300 కోట్ల డాలర్ల విలువైన మొబైల్స్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దిగుమతుల్ని గణనీయంగా తగ్గించింది. ► కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తల కృషి అత్యంత గర్వకారణ. రెండు మేకిన్ ఇండియా వ్యాక్సిన్లు అభివృద్ధి చేయగలిగాం. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ► జమ్మూ కశీ్మర్లో నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి ► కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలన కోసమేనని, విద్యాబోధన వారి మాతృభాషలో చేయడానికే ప్రోత్సాహం ► అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ అనవసర జోక్యాలు తగ్గించాం. పన్నుల్లో సంస్కరణలు తీసుకువచ్చి వాణిజ్యాన్ని సులభతరం చేశాము. రూ.100 లక్షల కోట్లతో గతిశక్తి భారత్ ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 100 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రాజెక్టును ప్రకటించారు. ‘‘అత్యంత ఆధునిక సదుపాయాల కల్పనలో సంపూర్ణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం త్వరలోనే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. రూ.100 లక్షల కోట్లతో ప్రారంభించే ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని ప్రధాని వివరించారు. సైనిక స్కూళ్లలో అమ్మాయిలకూ ప్రవేశం దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. అయితే అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా అన్ని సైనిక స్కూళ్లలో ప్రవేశానికి అనుమతిలిస్తున్నాం.. అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మిజోరంలోని సైనిక స్కూలులో ప్రయోగాత్మకంగా అమ్మాయిలకి ప్రవేశం కలి్పంచారు. కాషాయ రంగు తలపాగాతో ప్రధాని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో రంగురంగుల ఆకర్షణీయమైన తలపాగాలు ధరించే సంప్రదాయా న్ని ప్రధాని మోదీ కొనసాగించారు. ఆదివారం ఆయన ఎర్రటి చారలు కలిగిన కాషాయరంగు తలపాగాతో ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రసంగించారు. సంపద్రాయ కుర్తా, చుడిదార్‌తో పాటు బ్లూ జాకెట్, ఉత్తరీయం వేసుకున్నారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌కు మార్చడానికి ప్రధానమంత్రి జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించారు. స్వతంత్ర భారతావని శతాబ్ది ఉత్సవాల సమయానికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తామని చెప్పారు. ఇది సాధించడానికి కృషి చేస్తామని త్రివర్ణ పతాకం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని ప్రధాని చెప్పారు. -
'పీఓకేలో అంగుళమైన పాక్‌కు ఇచ్చేదిలేదు'
హైదరాబాద్: పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో అంగుళం కూడా పాకిస్తాన్‌కు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. దేశానికి కమ్యూనిజం, క్యాపిటలిజం పనికిరావని జాతీయవాదం మనకు వేదం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడే దేశం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని.. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చాలంటే ప్రతి ఒక్కరు తమతమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. అందరికి అభివృద్ది ఫలాలు అందాలి. స్వతంత్ర భారతంలో మనము భాగస్వామ్యులము అనే భావం అందరికీ కలగాలన్నారు. పరిపాలనలో పారదర్శకత ఉండాలని ..వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని ఆయన అన్నారు. అట్టడుగున ఉన్నవారికి అభివృద్ధి ఫలాలు అందేవరకు స్వతంత్రానికి, అభివృద్ధికి అర్ధంలేదన్నారు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం అంత్యోదయ విధానాన్ని అమలు చేస్తున్నదని వెంకయ్య పేర్కొన్నారు. గోవుల పేరుతో దాడులు చేసేవారు హిందువులు కాలేరన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వెంకయ్య హితవు పలికారు. దళితులపై కొన్నిచోట్ల 68ఏళ్ల తర్వాత కూడా దాడులు జరగటం సభ్య సమాజానికి సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు. ఇది మనందరికీ సవాలు అని... దీన్ని సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మైనారిటీలు, స్త్రీలు, పురుషులు, కులం, మతం, భేదభావం వీడి మనమంతా భారతీయులం అనే భావం కలిగించాలన్నారు. దళితులపై దాడులను రాజకీయం చేయడం, ఓటుబ్యాంకు రాజకీయ దృష్టితో చూడడంవలెనే ఈ పరిస్థితి దాపురించిందని ఈ వైఖిరి మారాలని వెంకయ్య అన్నారు. కాగా పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్‌డే రిహార్సల్స్
టీనగర్, న్యూస్‌లైన్: రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులతో రిహార్సల్స్ నిర్వహించారు. రిపబ్లిక్‌డేకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 18 వేల మంది పోలీసులను నియమించారు. కొన్నేళ్ల క్రితం సమద్ర మార్గంలో దేశంలోకి చొరబడిన పాకిస్థాన్ తీవ్రవాదులు ముంబరుు తాజ్ హోటల్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో వంద మందికిపైగా బలయ్యారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత దేశానికి తీవ్రవాదుల నుంచి బెది రింపులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఉండగా ఆదివారం దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను భగ్నం చేసేందుకు తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదివరకే హెచ్చరికలు చేశాయి. సముద్ర మార్గం ద్వారానే కాకుండా విమానాన్ని హైజాక్ చేసి విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి తీవ్రవాదుల నుంచి ప్రత్యక్ష బెదిరింపులు లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ రామానుజం ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమవుతున్నారు. చెన్నై మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జరుగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రోశయ్య జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు, ముఖ్య ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో త్రివిధ దళాధిపతుల పరేడ్లు, విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అలంకార శకటాల ప్రదర్శనలు జరుగుతాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎగ్మూర్, సెంట్రల్ వంటి ముఖ్య రైల్వే స్టేషన్లకు, కోయంబేడు, ప్యారిస్, తాంబరం వంటి బస్టాండు ప్రదేశాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు. -
మంత్రులకు సమైక్య సెగ
సాక్షి, నెట్వర్క్: స్వాతంత్య్రదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రులకు చుక్కెదురైంది. గురువారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలకు హాజరైన మంత్రులను సమైక్యాంధ్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. అనంతపురంలో పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డిని న్యాయవాదులు అడ్డుకున్నారు. గోబ్యాక్ రఘువీరా.. అంటూ నినదించిన వారు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని అడ్డుతగిలారు. దీం తో న్యాయవాదులును పోలీసులు అరెస్టు చేశారు. అ యితే పోలీసు రక్షణలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న రఘువీరా.. జెండా ఎగురవేసి, ప్రసంగించే సమయం లో ఎమ్మెల్యే గురునాథరెడ్డి అడ్డుతగిలారు. పరేడ్ గ్రౌండ్లోకి ప్రజలను రానివ్వకుండా నియంత్రించి, స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారని మంత్రిని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఎంపీ అనంత వెంకటరామిరెడ్డినీ ఆయన నిలదీశారు. మంత్రి రఘువీరా, ఎంపీ అనంతల తీరుకు నిరసనగా నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్లో మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండగా ఎన్ఎంయూ నేతలు ఆయనకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. గంటా..గో బ్యాక్, బొత్స, సోని యా చేతగాని నేతలు అంటూ ఆందోళన చేశారు. విగ్రహానికి పూలమాల వేసే సమయంలోనూ ఆందోళనకు దిగారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న ఉద్యో గ సంఘాలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీ జి.వి.హర్షకుమార్‌ను సమైక్యవాదులు నిలదీ శారు. విభజన గురించి ముందే తెలిసినా ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నించారు. కనీసం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్దయినా నిరసన తెలపలేదని నిలదీశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని జంతర్‌మంతర్‌కు బదులు పార్లమెంట్ వద్ద నిరసన తెలిపామని హర్షకుమార్ తెలిపారు. -
పతాకావిష్కరణకు మంత్రులు ఓకే
స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు మంత్రులు అంగీకరించారు. రాజీనామాలను ఆమోదించనందున పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనాలన్న సీఎం కిరణ్ సూచనకు మంత్రులు అంగీకరించారు. జిల్లాల వారీగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్- గీతారెడ్డి, నిజామాబాద్- పి.సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్- డి. శ్రీధర్‌బాబు, రంగారెడ్డి- జి.ప్రసాద్‌కుమార్, మహబూబ్‌నగర్- డి.కె.అరుణ, నల్లగొండ- కె.జానారెడ్డి, వరంగల్- పొన్నాల లక్ష్మయ్య, ఖమ్మం-రామిరెడ్డి వెంకటరెడ్డి, విజయనగరం-శత్రుచర్ల విజయరామరాజు, శ్రీకాకుళం -కొండ్రు మురళి, విశాఖపట్టణం-పి.బాలరాజు, తూర్పుగోదావరి -పి.విశ్వరూప్, పశ్చిమగోదావరి-వట్టి వసంతకుమార్, కృష్ణా -కె. పార్థసారథి, గుంటూరు -కన్నా లక్ష్మీనారాయణ, ప్రకాశం-ఎం.మహీధర్‌రెడ్డి, నెల్లూరు- ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్ఆర్- అహ్మదుల్లా, కర్నూలు-టి.జి.వెంకటేశ్, అనంతపురం- ఎన్.రఘువీరారెడ్డి, చిత్తూరు-గల్లా అరుణకుమారి, ఆదిలాబాద్-బసవరాజు సారయ్య. మంత్రి పదవికి రామచంద్రయ్య రాజీనామా దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎంకు మంగళవారం రాజీనామా లేఖను పంపించారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.