రిపబ్లిక్‌డే రిహార్సల్స్
టీనగర్, న్యూస్‌లైన్:
రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులతో రిహార్సల్స్ నిర్వహించారు. రిపబ్లిక్‌డేకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 18 వేల మంది పోలీసులను నియమించారు. కొన్నేళ్ల క్రితం సమద్ర మార్గంలో దేశంలోకి చొరబడిన పాకిస్థాన్ తీవ్రవాదులు ముంబరుు తాజ్ హోటల్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో వంద మందికిపైగా బలయ్యారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత దేశానికి తీవ్రవాదుల నుంచి బెది రింపులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఉండగా ఆదివారం దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను భగ్నం చేసేందుకు తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదివరకే హెచ్చరికలు చేశాయి. సముద్ర మార్గం ద్వారానే కాకుండా విమానాన్ని హైజాక్ చేసి విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి తీవ్రవాదుల నుంచి ప్రత్యక్ష బెదిరింపులు లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ రామానుజం ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమవుతున్నారు.
చెన్నై మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జరుగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రోశయ్య జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు, ముఖ్య ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో త్రివిధ దళాధిపతుల పరేడ్లు, విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అలంకార శకటాల ప్రదర్శనలు జరుగుతాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎగ్మూర్, సెంట్రల్ వంటి ముఖ్య రైల్వే స్టేషన్లకు, కోయంబేడు, ప్యారిస్, తాంబరం వంటి బస్టాండు ప్రదేశాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు.