జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తున్న హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మత సామరస్యానికి ప్రతీక గుంటూరులోని జిన్నాటవర్ అని, ఎందరో మహానుభావుల త్యాగం వల్లే నేడు అందరం స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరంలో జిన్నా టవర్ పేరుతో కొన్ని మతతత్వ శక్తులు కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జిన్నాటవర్ పేరు మార్చాలని, లేకుంటే కూల్చేస్తామంటూ కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాలకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. గురువారం సర్వమత పెద్దల ప్రార్థనల అనంతరం అక్కడ జాతీయ జెండాను హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ జిన్నా టవర్‌కు త్రివర్ణ పతాక రంగులు వేయడం చరిత్రాత్మకమన్నారు. దేశ పాలకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం బాధాకరమన్నారు.
జిన్నా దేశభక్తుడంటూ అద్వానీ కీర్తించలేదా?
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీని హత్య చేసిన గాడ్సేను పూజించే బీజేపీ నేతలకు దేశభక్తి గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నా దేశ భక్తుడంటూ కొనియాడిన సంగతి బీజేపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌లు మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తుంటే.. ఓర్వలేక వారి మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని స్వార్థపూరిత శక్తులు విఫలయత్నాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు జియాఉద్దీ¯న్, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, షేక్ సజీల, కమిషనర్ నిశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment