మంత్రులకు సమైక్య సెగ
సాక్షి, నెట్‌వర్క్: స్వాతంత్య్రదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రులకు చుక్కెదురైంది. గురువారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలకు హాజరైన మంత్రులను సమైక్యాంధ్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. అనంతపురంలో పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డిని న్యాయవాదులు అడ్డుకున్నారు. గోబ్యాక్ రఘువీరా.. అంటూ నినదించిన వారు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని అడ్డుతగిలారు. దీం తో న్యాయవాదులును పోలీసులు అరెస్టు చేశారు. అ యితే పోలీసు రక్షణలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న రఘువీరా.. జెండా ఎగురవేసి, ప్రసంగించే సమయం లో ఎమ్మెల్యే గురునాథరెడ్డి అడ్డుతగిలారు. పరేడ్ గ్రౌండ్‌లోకి ప్రజలను రానివ్వకుండా నియంత్రించి, స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారని మంత్రిని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఎంపీ అనంత వెంకటరామిరెడ్డినీ ఆయన నిలదీశారు. మంత్రి రఘువీరా, ఎంపీ అనంతల తీరుకు నిరసనగా నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండగా ఎన్‌ఎంయూ నేతలు ఆయనకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. గంటా..గో బ్యాక్, బొత్స, సోని యా చేతగాని నేతలు అంటూ ఆందోళన చేశారు. విగ్రహానికి పూలమాల వేసే సమయంలోనూ ఆందోళనకు దిగారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న ఉద్యో గ సంఘాలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీ జి.వి.హర్షకుమార్‌ను సమైక్యవాదులు నిలదీ శారు. విభజన గురించి ముందే తెలిసినా ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నించారు. కనీసం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్దయినా నిరసన తెలపలేదని నిలదీశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని జంతర్‌మంతర్‌కు బదులు పార్లమెంట్ వద్ద నిరసన తెలిపామని హర్షకుమార్ తెలిపారు.