బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): గిరిజనుల సంప్రదాయ నృత్యప్రదర్శనతో వేదిక మురిసింది. 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒక చోట చేరి ఇస్తున్న ప్రదర్శనలు సందర్శకుల మది దోస్తున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ నృత్య ప్రదర్శనలో రెండో రోజు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన బృందాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.
ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బృందం కొమ్మ కోయ డ్యాన్స్ ప్రదర్శించింది. చండీఘర్ బృందం మిసన్ హర్న డ్యాన్స్, కేరళ నుంచి మళపుళయ అత్తమ్ నృత్యం, మణిపూర్ నుంచి జౌ లేయ్ కోన్ నృత్యం, మధ్యప్రదేశ్ నుంచి గుడుం బాజా డ్యాన్స్, ఒడిశా నుంచి బిర్లి డ్యాన్స్, తెలంగాణ నుంచి గోండు జాతి డ్యాన్స్, గుజరాత్ బృందం భిల్ డ్యాన్స్, గోవా బృందం కుంభి డ్యాన్సులు ప్రదర్శించాయి.
ప్రత్యేక ఆకర్షణగా గోండు నృత్యం
తెలంగాణకు చెందిన గోండు జాతి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి వస్త్రధారణతో పాటు జీవనవిధానాన్ని ప్రతిబింబించిన నృత్యం ఆహూతులను అలరించింది.
నేటితో ముగియనున్న ఫెస్టివల్
మూడో రోజుల పాటు సాగిన నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు సాగే వేడుకల్లో 9 రాష్ట్రాలకు చెందన బృందాలు నృత్యాలను ప్రదర్శించనున్నాయి.
పోర్టు ట్రస్ట్ ప్రత్యేక బహుమతులు
ఈ ఫెస్టివల్ ద్వారా మొదటి, రెండు, మూడు స్థానాలకు మాత్రమే బహుమతులను అందజేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ రామ్మోహన్ రావు పోర్టు ట్రస్ట్ తరపున నాలుగు కన్సొలేషన్ బహుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.25 వేలు చొప్పున నాలుగు రాష్ట్రాలకు అందిస్తామని ఆయన ప్రకటించారు. వారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ కానుక అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment