tribal dances
-
భళా.. చాంగుభళా..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): గిరిజనుల సంప్రదాయ నృత్యప్రదర్శనతో వేదిక మురిసింది. 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒక చోట చేరి ఇస్తున్న ప్రదర్శనలు సందర్శకుల మది దోస్తున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ నృత్య ప్రదర్శనలో రెండో రోజు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన బృందాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బృందం కొమ్మ కోయ డ్యాన్స్ ప్రదర్శించింది. చండీఘర్ బృందం మిసన్ హర్న డ్యాన్స్, కేరళ నుంచి మళపుళయ అత్తమ్ నృత్యం, మణిపూర్ నుంచి జౌ లేయ్ కోన్ నృత్యం, మధ్యప్రదేశ్ నుంచి గుడుం బాజా డ్యాన్స్, ఒడిశా నుంచి బిర్లి డ్యాన్స్, తెలంగాణ నుంచి గోండు జాతి డ్యాన్స్, గుజరాత్ బృందం భిల్ డ్యాన్స్, గోవా బృందం కుంభి డ్యాన్సులు ప్రదర్శించాయి. ప్రత్యేక ఆకర్షణగా గోండు నృత్యం తెలంగాణకు చెందిన గోండు జాతి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి వస్త్రధారణతో పాటు జీవనవిధానాన్ని ప్రతిబింబించిన నృత్యం ఆహూతులను అలరించింది. నేటితో ముగియనున్న ఫెస్టివల్ మూడో రోజుల పాటు సాగిన నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు సాగే వేడుకల్లో 9 రాష్ట్రాలకు చెందన బృందాలు నృత్యాలను ప్రదర్శించనున్నాయి. పోర్టు ట్రస్ట్ ప్రత్యేక బహుమతులు ఈ ఫెస్టివల్ ద్వారా మొదటి, రెండు, మూడు స్థానాలకు మాత్రమే బహుమతులను అందజేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ రామ్మోహన్ రావు పోర్టు ట్రస్ట్ తరపున నాలుగు కన్సొలేషన్ బహుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.25 వేలు చొప్పున నాలుగు రాష్ట్రాలకు అందిస్తామని ఆయన ప్రకటించారు. వారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ కానుక అందిస్తున్నామన్నారు. -
సామూహిక వివాహ వేడుకలో ముఖ్యమంత్రి డ్యాన్స్
-
వివాహ వేడుకలో సీఎం డ్యాన్స్...!!
రాంచి : నగరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. కేంద్రీయ సరానా సమితి(కేఎస్ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో 351 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రఘుబర్ దాస్ గిరిజనుల స్థితి గతుల గురించి మాట్లాడారు. సమాజంలో మార్పు రావాలంటే ముందు మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లుగా గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు, సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. గిరిజన వర్గం నుంచి అత్యధిక మంది ఇంజనీర్లు, పోలీసు ఉన్నతాధికారులుగా ఎదిగితే చూడాలని ఉందన్నారు. ఫెలోషిప్ యోజన ద్వారా గిరిజన బాలలకు ఉన్నత విద్యావకాశాలు పెంపొందిస్తున్నామని.. అందుకోసం 10 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. -
సంక్రాంతికి శ్రీకారం
సింగపూర్ మంత్రితో కలిసి {పారంభించిన చంద్రబాబు కళాకారులతో కలిసి సంప్రదాయ, గిరిజన నృత్యాలు విదేశీయులకు ఆంధ్ర పిండి వంటలు, స్థానిక పంటలు పరిచయం పారిశ్రామిక వేత్తలతో సమావేశం విశాఖపట్నం: సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖలోని కైలాసగిరిలో ఈ వేడుకలను ప్రారంభించారు. సింగపూర్ ప్రతినిధులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. జానపద కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. పిండి వంటలను ఆరగించారు. అనంతరం సింగపూర్ ప్రతినిధులతో పాటు స్థానిక పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఉదయం 11.55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో సింగపూర్ బృందంతో కలిసి చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరికి వెళ్లే మార్గమధ్యలోని మాధవధారలో ఎమ్మె ల్యే విష్ణుకుమార్ రాజు,టీడీపీ నేత సనపల పాండు రంగారావులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి కైలాసగిరి చేరుకున్నారు. సింగపూర్ మంత్రితో పాటు గాలిపటాలు ఎగురవేసి సంబరాలను ప్రారంభించారు. గిరిజన కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. కోలాటం ఆడారు. గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. తప్పెటగూళ్లు, పులివేషాలు, హరిదాసుల కీర్తనలు వంటి వాటిని విదేశీయులకు పరిచయం చేశారు. మన ప్రాంతంలో పండిన చెరకు, అరటి, గుమ్మడికాయలు, కంద,క్యారెట్ వంటి పంటల వివరాలను వారికి వివరించారు. సింగపూర్ మంత్రి ఎస్. ఈశ్వరన్‌కు భారీ గుమ్మడికాయను సీఎం చంద్రబాబు బహూకరించారు. సీఎం వెంట వచ్చిన సింగపూర్ మంత్రితో పాటు పారిశ్రామిక బృందం సంక్రాంతి సంబరాలను ఆసక్తిగా తిలకించారు. ప్రతి ప్రదర్శనను తమ కెమెరాల్లో బంధించడంతో పాటు ‘సెల్ఫీ’లు తీసుకున్నారు. విశాఖ వాసులు ఏర్పాటు చేసిన ఆంధ్ర పిండి వంటలను సీఎం చంద్రబాబు వారికి రుచి చూపించారు. ఈశ్వరన్‌కు స్వయంగా తినిపించారు. బీచ్ రోడ్డులో విశాఖ అందాలను, సముద్ర సోయగాలను విదేశీ బృందానికి చూపించారు. నొవాటెల్ హోటల్లో పారిశ్రామిక వేత్తలు,సింగపూర్ బృందంతో సమావేశమయ్యారు. విశాఖకు భారీ పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెడతానన్నారు. తాము కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సింగపూర్ మంత్రి, అతని బృందం హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం సీఎం కృష్ణా జిల్లా విజయవాడ పర్యటనకు విదేశీ బృందంతో కలిసి వెళ్లారు. సీఎం వెంట ఎంపీలు కంబంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నారాయణ, అచ్చెం నాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఎన్.యువరాజ్, జాయింట్ కలెక్టర్ నివాస్, ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజు, ఇన్చార్జ్ సీపీ అతుల్‌సింగ్, డిఐజీ పి.ఉమాపతి, వుడా వీసీ టి.బాబూరావునాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్‌కుమార్,ఎస్పీ కోయ ప్రవీణ్, డీసీపీలు త్రివిక్రమ్‌వర్మ, రవికుమార్‌మూర్తి ఉన్నారు. -
భక్తిపారవశ్యంతో పూజలు చేసిన గిరిపుత్రులు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం అనగానే భక్తులకు ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. ఈ ఉత్సవాలను తలపించేరీతిలో శుక్రవారం ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో‘శబరి సృతి యాత్ర’ ఉత్సవం కమనీయంగా జరిగింది. అపర రామ భక్తురాలు, గిరిజన మహిళ శబరి పేరు మీద జరిగిన ఈ ఉత్సవం అడుగడుగునా గిరిజన సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలతో సాగింది. రామాయణ ఘట్టాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతి శుక్రవారం కావడంతో ఆలయ అధికారులు తొలుత చిత్రకూట మండపం దగ్గర వున్న వాల్మీకి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి వాల్మీకికి హారతిని సమర్పించారు. అనంతరం ఏజెన్సీలోని చర్ల, వెంకటాపురం, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, అశ్వారావుపేట, కుక్కునూరు తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు వెయ్యి మంది గిరిజనులు గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలతో మాడవీధులు సందడిగా మారాయి. మూడు ప్రదక్షిణల అనంతరం రామాలయానికి చేరుకున్నారు. శబరినదీ జలంతో ధ్వజస్తంభం అభిషేకం..... మేళతాళాలు, ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శబరినది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జలంతో గిరిజనులు ఆలయ ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. పసుపు, కుంకుమలను చల్లి ధ్వజస్తంభంపై ముగ్గులు వేసి బలిపీఠం ఆసాదన జరిపారు. అనంతరం ఉత్సవానికి గిరిజనులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన అడవిదుంపలను, పుష్పాలను ఆలయ ఈవోకు అందచేశారు. వీటితో పాటు ఆలయ అధికారులు తెప్పించిన వివిధ రకాల పుష్పాలు, పండ్లను గిరిజనులు తీసుకొని ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా బేడా మండపంలో గిరిజనులు ప్రదర్శించిన నృత్యాలకు ఆలయ సిబ్బంది సైతం ముగ్ధులై వారితో నృత్యం చేశారు. ఆలయ ఈవో కోలాటం ఆడి సందడి చేశారు. చిత్రకూట మండపంలో స్వామి వారికి పుష్పార్చన.... స్వామి వారికి తీసుకొచ్చిన పుష్పాలను, పండ్లను గిరిజన భక్తులు మేళతాళాల మధ్య కోలాహలంగా చిత్రకూటమండపానికి తీసుకొని వచ్చారు. వీటన్నింటిని స్వామి వారి ఎదుట ఉంచారు. ఐటీడీఏ పీఓ జి వీరపాండియన్, సబ్‌కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్గు ప్తా జ్యోతి ప్రజ్వలన గావించి పుష్పార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఆలయ అర్చకులు, వేద పండితులు ‘శ్రీరామ సంపుటి’ని నిర్వహిస్తూ స్వామి వారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీరామ సంపుటిని నిర్వహించేటప్పుడు భక్తులు ఉచ్చరించిన ‘శ్రీరామాయనమః’ నామస్మరణతో చిత్రకూట మండపం మార్మోగింది. ప్రత్యేకంగా తీసుకొని వచ్చిన పుష్పాలు, పండ్లతో సీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య స్వామికి అర్చనను వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమం జరిగినంతసేపు ఆలయంలో ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన ఊరి పెద్దలకు ఆలయం తరపున వస్త్రాలను ఆలయ ప్రధాన అర్చకులు సమర్పించారు. గిరిజను భక్తులకు ఆలయం తరపున స్వామి వారి లడ్డూ ప్రసాదం, భక్త శబరితో ఉన్న రాములవారి ఫోటో లామినేషన్ను ఆలయ సిబ్బంది జ్ఞాపికగా అందచేశారు. పుష్పార్చనలో ఎమ్యెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆకట్టుకున్న గిరిజన సాంప్రదాయ నృత్యాలు... శబరి సృతి యాత్ర ఉత్సవం సందర్భంగా చింతూరు మండలం తుమ్మల గ్రామం నుంచి వచ్చిన గిరిజనులు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలు ఆద్యంతం భక్తులను, పట్టణ వాసులను ఆకట్టుకున్నాయి. వీరితో పాటుగా వీఆర్‌పురం, కూనవరం మండలాల నుంచి వచ్చిన గిరిజనులు ప్రాచీన వాయిద్యాలు డప్పు, డోలు, జీడిలతో చేసిన గిలాటాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. దమ్మపేట, రావులపల్లి, చర్ల, వెంకటాపురం గ్రామాల నుంచి తరలివచ్చిన గిరిజలను వెండి గొడుగలతో కొర్రాజుల స్వామి, పెద్దమ్మతల్లి, పోతురాజు నృత్యాలు చేసి భక్తులను సంభ్రమాశ్చార్యాలకు గురి చేశారు. గుంటూరు జిల్లా లాల్పురం నుంచి వచ్చిన మహిళలు కోలాటం ప్రదర్శించారు. అందరూ కలిసి ఇచ్చిన ప్రదర్శనతో మాడవీధులు కోలాహలంగా మారాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం రఘునాద్, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, సన్యాసిశర్మ, ప్రసాద అవధాని, స్థానాచార్యులు స్థలశాయి, ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్ భవానీ, ఏఈ రవీందర్, నర్సింహరాజు, పీఆర్వో సాయిబాబు, ఆలయ సిబ్బంది నిరంజన్, దుర్గ, భాస్కర్,స్వర్ణకుమారీ, శ్రీరామదీక్షా సమితీ జిల్లా అధ్యక్షులు రేగలగడ్డ ముత్తయ్య, కొడాలి శ్రీనివాస్, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.