భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం అనగానే భక్తులకు ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. ఈ ఉత్సవాలను తలపించేరీతిలో శుక్రవారం ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో‘శబరి సృతి యాత్ర’ ఉత్సవం కమనీయంగా జరిగింది. అపర రామ భక్తురాలు, గిరిజన మహిళ శబరి పేరు మీద జరిగిన ఈ ఉత్సవం అడుగడుగునా గిరిజన సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలతో సాగింది. రామాయణ ఘట్టాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతి శుక్రవారం కావడంతో ఆలయ అధికారులు తొలుత చిత్రకూట మండపం దగ్గర వున్న వాల్మీకి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి వాల్మీకికి హారతిని సమర్పించారు. అనంతరం ఏజెన్సీలోని చర్ల, వెంకటాపురం, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, అశ్వారావుపేట, కుక్కునూరు తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు వెయ్యి మంది గిరిజనులు గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలతో మాడవీధులు సందడిగా మారాయి. మూడు ప్రదక్షిణల అనంతరం రామాలయానికి చేరుకున్నారు.
శబరినదీ జలంతో ధ్వజస్తంభం అభిషేకం.....
మేళతాళాలు, ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శబరినది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జలంతో గిరిజనులు ఆలయ ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. పసుపు, కుంకుమలను చల్లి ధ్వజస్తంభంపై ముగ్గులు వేసి బలిపీఠం ఆసాదన జరిపారు. అనంతరం ఉత్సవానికి గిరిజనులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన అడవిదుంపలను, పుష్పాలను ఆలయ ఈవోకు అందచేశారు. వీటితో పాటు ఆలయ అధికారులు తెప్పించిన వివిధ రకాల పుష్పాలు, పండ్లను గిరిజనులు తీసుకొని ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా బేడా మండపంలో గిరిజనులు ప్రదర్శించిన నృత్యాలకు ఆలయ సిబ్బంది సైతం ముగ్ధులై వారితో నృత్యం చేశారు. ఆలయ ఈవో కోలాటం ఆడి సందడి చేశారు.
చిత్రకూట మండపంలో స్వామి వారికి పుష్పార్చన....
స్వామి వారికి తీసుకొచ్చిన పుష్పాలను, పండ్లను గిరిజన భక్తులు మేళతాళాల మధ్య కోలాహలంగా చిత్రకూటమండపానికి తీసుకొని వచ్చారు. వీటన్నింటిని స్వామి వారి ఎదుట ఉంచారు. ఐటీడీఏ పీఓ జి వీరపాండియన్, సబ్‌కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గు ప్తా జ్యోతి ప్రజ్వలన గావించి పుష్పార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఆలయ అర్చకులు, వేద పండితులు ‘శ్రీరామ సంపుటి’ని నిర్వహిస్తూ స్వామి వారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీరామ సంపుటిని నిర్వహించేటప్పుడు భక్తులు ఉచ్చరించిన ‘శ్రీరామాయనమః’ నామస్మరణతో చిత్రకూట మండపం మార్మోగింది. ప్రత్యేకంగా తీసుకొని వచ్చిన పుష్పాలు, పండ్లతో సీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య స్వామికి అర్చనను వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమం జరిగినంతసేపు ఆలయంలో ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన ఊరి పెద్దలకు ఆలయం తరపున వస్త్రాలను ఆలయ ప్రధాన అర్చకులు సమర్పించారు. గిరిజను భక్తులకు ఆలయం తరపున స్వామి వారి లడ్డూ ప్రసాదం, భక్త శబరితో ఉన్న రాములవారి ఫోటో లామినేషన్‌ను ఆలయ సిబ్బంది జ్ఞాపికగా అందచేశారు. పుష్పార్చనలో ఎమ్యెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న గిరిజన సాంప్రదాయ నృత్యాలు...
శబరి సృతి యాత్ర ఉత్సవం సందర్భంగా చింతూరు మండలం తుమ్మల గ్రామం నుంచి వచ్చిన గిరిజనులు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలు ఆద్యంతం భక్తులను, పట్టణ వాసులను ఆకట్టుకున్నాయి. వీరితో పాటుగా వీఆర్‌పురం, కూనవరం మండలాల నుంచి వచ్చిన గిరిజనులు ప్రాచీన వాయిద్యాలు డప్పు, డోలు, జీడిలతో చేసిన గిలాటాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. దమ్మపేట, రావులపల్లి, చర్ల, వెంకటాపురం గ్రామాల నుంచి తరలివచ్చిన గిరిజలను వెండి గొడుగలతో కొర్రాజుల స్వామి, పెద్దమ్మతల్లి, పోతురాజు నృత్యాలు చేసి భక్తులను సంభ్రమాశ్చార్యాలకు గురి చేశారు. గుంటూరు జిల్లా లాల్‌పురం నుంచి వచ్చిన మహిళలు కోలాటం ప్రదర్శించారు. అందరూ కలిసి ఇచ్చిన ప్రదర్శనతో మాడవీధులు కోలాహలంగా మారాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం రఘునాద్, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, సన్యాసిశర్మ, ప్రసాద అవధాని, స్థానాచార్యులు స్థలశాయి, ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్ భవానీ, ఏఈ రవీందర్, నర్సింహరాజు, పీఆర్‌వో సాయిబాబు, ఆలయ సిబ్బంది నిరంజన్, దుర్గ, భాస్కర్,స్వర్ణకుమారీ, శ్రీరామదీక్షా సమితీ జిల్లా అధ్యక్షులు రేగలగడ్డ ముత్తయ్య, కొడాలి శ్రీనివాస్, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భక్తిపారవశ్యంతో పూజలు చేసిన గిరిపుత్రులు
Published Sat, Oct 19 2013 7:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement
Advertisement