భద్రాచలం: సీతమ్మవారి మెడలో జగదభిరాముడు మంగళసూత్రాలు కట్టే క్షణం కోసం భక్తులు ఎదురు చూస్తారు. ఈ సందర్భంగా ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా..’ అంటూ శ్రీ సీతారాముల కల్యాణాన్ని వర్ణించే క్రమంలో తలంబ్రాలకు గల ప్రత్యేకతను వివరిస్తారు. అలాంటి తలంబ్రాలను భక్తితో, అకుంఠిత దీక్షతో, వడ్లను గోటితో ఒలిచి రామయ్య కల్యాణానికి తీసుకొస్తున్న కోరుకొండ భక్త సైన్యంపై ప్రత్యేక కథనం..
2012లో శ్రీకారం..
శ్రీ సీతారాముల కల్యాణానికి నాడు శచీదేవి, అహల్యతో పాటు శబరి కూడా శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని ప్రతీతి. అప్పట్లో రామయ్యకు ముత్యాల తలంబ్రాలతో పాటు గోటి తలంబ్రాలు కూడా అందేవని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వాసులు తరతరాలుగా గోటి తలంబ్రాలు అందించేవారని, కొంత కాలం తర్వాత అది నిలిచిపోయిం దని తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన కల్యాణం అప్పారావు ఓ బృహత్కార్యానికి 2012లో శ్రీకారం చుట్టారు. తానొక్కడే కాకుండా రామ భక్తులందరినీ ఏకం చేసి ‘శ్రీకృష్ణ చైతన్య సంఘం’ ఏర్పాటు చేసి గోటి తలంబ్రాల యజ్ఞాన్ని ప్రారంభించారు.
‘శ్రీరామ క్షేత్రం’లో గోటి తలంబ్రాల పంట..
తలంబ్రాలకు వినియోగించే వరి నారు వేసేటప్పటి నుంచి పంట కోత కోసే వరకు ఆధ్యాత్మిక కార్యక్రమంగానే భక్తులు భావిస్తుంటారు. నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి గోకవరం మండలం అచ్యుతాపురంలోని ఎకరం పొలంలో.. భక్తులు ఆంజనేయస్వామి, వానరుల వేషధారణలో పొలం దున్ని, నాటు వేస్తారు. పొట్ట దశకు వచ్చాక భక్తిశ్రద్ధలతో సీమంతం చేస్తారు. వరి కోసేటప్పుడు కూడా రాముడి వేషధారణలో ఉన్న భక్తుడికి మొదట అందజేస్తారు.
శ్రీరామనవమికి 2 నెలల ముందు నుంచే గోటితో వడ్లను ఒలుస్తారు. పరిసర గ్రామాల మహిళలు, భక్తులు శ్రీరామ చిత్ర పటం ముందు రామ నామస్మరణ చేస్తూ ‘వడ్లు వలుపు–శ్రీరాముని పిలుపు’ పేరిట గోటితో ఒలుస్తారు. ఆ బియ్యాన్ని కలశాలలో పెట్టి రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ‘రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు’ కార్యక్రమం నిర్వహించి భద్రాచ లం తీసుకొస్తారు. తలంబ్రాలతో భద్రగిరి ప్రదక్షిణ చేసి రామాలయంలో అందజేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు విస్తరణ..
గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలోని పలు జిల్లాల భక్తులు కూడా గోటి తలంబ్రాలు ఒలుస్తున్నారు. కర్ణాటకకు చెం దిన భక్తులు సైతం ఈ ఏడాది ఈ యజ్ఞంలో పాల్గొంటుండడం విశేషం. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో మహిళా ఖైదీల్లో మార్పు రావడం కోసం గోటి తలంబ్రాలను ఒలిపించారు.
ఒంటిమిట్ట రామాలయానికి..
భద్రాచలం కల్యాణానికి అందిస్తున్న ఈ గోటి తలంబ్రాలను రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రామాలయంలో జరిగే కల్యాణానికి సైతం పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment