ఈ నెల 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం
24 గంటల్లోపే బుక్కయిన ఏసీ రూములు
సామాన్య భక్తులకు తప్పని వసతి కష్టాలు
డార్మిటరీ నిర్మాణాలపై దృష్టి పెట్టని దేవస్థానం
‘హోం స్టే’ విధానంపై కనీస ప్రచారం కరువు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భద్రాచలంలో వసతి, సౌకర్యాలకు నోచుకోవడంలేదు. అధికారులు దశాబ్దాలుగా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు తప్ప సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదు.
ఒక్కరోజులోనే ఏసీ గదులు బుకింగ్..
రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు దేవస్థానానికి చెందిన సత్రాలు, కాటేజీలతోపాటు ప్రైవేటు లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గదులను బుక్ చేసుకునేందుకు దేవస్థానం ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. ఈ నెల 17,18 తేదీల్లో కల్యాణం, పట్టాభిషేకం ఉండగా, 11 నుంచి ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇలా బుకింగ్స్ మొదలయ్యాయో లేదో ఇటు దేవస్థానం, అటు ప్రైవేటు లాడ్జీల్లో ఉన్న ఏసీ గదులన్నీ బుక్ అయిపోయాయి. సింగిల్ రూమ్ మొదలు సూట్ వరకు ఏ ఒక్కటీ అందుబాటులో లేవు. వేసవిలో భద్రాచలంలో నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. దీంతో ఏసీ రూమ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది.
నాన్ ఏసీలదీ అదే బాట
నాన్ ఏసీ గదులకు సంబంధించి దేవస్థానం ఆధ్వర్యంలోని కుటీరాలు, సత్రాల్లోని గదులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. కేవలం ప్రైవేటు లాడ్జీల్లో నాన్ ఏసీ గదులే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఈ నెల 16 సాయంత్రం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల ప్యాకేజీతో లభిస్తున్నాయి. ఇవి సింగిల్ రూమ్‌కి రూ.1,732 మొదలు ట్రిపుల్ రూమ్‌కు రూ. 3,464 వరకు చార్జీలుగా ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇంత ధర చెల్లించేందుకు కూడా భక్తులు పోటీ పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ గదులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భద్రాచలంలో ఉన్న గదులన్నీ ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ అయిపోతే నవమి రోజు ఇక్కడికి చేరుకునే సామాన్య భక్తులు, అడ్వాన్స్ రిజర్వ్ చేసుకోని వారికి ఇక్కట్లు తప్పేలా లేవు.
డార్మిటరీలు కరువే
నవమి వేడుకలు చూసేందుకు యాభై వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఇలా వచ్చే భక్తుల్లో సగం మంది ఉదయమే (ఏప్రిల్ 17) భద్రాచలం చేరుకుని కల్యాణం చూసుకుని, దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఇలాంటి వారికి వసతితో పెద్దగా అవసరం పడదు. కానీ స్నానాలు చేసేందుకు, సామన్లు దాచుకునేందుకు అనువుగా నామామాత్రపు సౌకర్యాలను ఈ భక్తులు ఆశిస్తారు. ప్రస్తుతం భద్రాచలంలో ఈ సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు గోదావరి నదినే స్నానాలకు దిక్కవుతోంది. తమతో పాటు తెచ్చుకున్న లగేజీని దాచుకోవడం కష్టంగా మారుతోంది. బొమ్మలు, కొబ్బరికాయల దుకాణాలే క్లోక్‌రూమ్ సేవలు అందిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భద్రాచలంలో ఎప్పుడో దశాబ్దాల కిందట కట్టిన సత్రాలు, ప్రైవేటు లాడ్జీలే ఆశ్రయం కల్పిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలో 32 గదులు, జానకీ సదనంలో 32 గదులు తప్ప మరో నిర్మాణం జరగలేదు. మరోవైపు ప్రైవేటు సెక్టారులో ఒకటి రెండు హోటళ్లు, కుల సంఘాల ఆధ్వర్యంలో సత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
హోం స్టే పద్ధతి అమల్లోకి తెస్తే..
మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా భద్రాచలంలో మౌలిక సదుపాయలు మెరుగుపరచడంపై దేవస్థానం, ప్రభుత్వం, భద్రాచలం పంచాయతీలు ప్రయత్నించడం లేదు. ఫలితంగా శ్రీరామనవమి, ముక్కోటి, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దాతల ద్వారా నిధులు సమీకరించి కొత్తగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. ఇతర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్టుగా ‘హోం స్టే’ పద్ధతిని భద్రాచలంలో అమల్లోకి తీసుకురావడంపై కనీస స్థాయిలో కూడా ప్రయత్నాలు జరగడం లేదు. భద్రాచలంలో ఉన్న స్థానికులకు హోం స్టే విధానంపై అవగాహన కలిగిస్తే పైసా ఖర్చు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం సాధ్యం అవుతుంది. కానీ ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఎంత సేపు అరకొర సౌకర్యాల నడుమ ఉన్న మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేయడం, సెక్టార్లుగా విభజించి టిక్కెట్ల అమ్మకాలు సాగించడంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చివరికి భద్రాద్రిలో తమ ఇబ్బందులు తీర్చాలంటూ ఆ రామయ్యకే మొర పెట్టుకుని వెళ్లిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment