గోదావరి తీరంలోని మోతెగడ్డ శివాలయం
భద్రాచలానికి అతి సమీపంలోనే ద్వీపం
గోదావరి నది మధ్యలో వీరభద్ర స్వామి ఆలయం
అక్కడికి వెళ్లాలంటే మరబోట్లే మార్గం
బోటింగ్ సౌకర్యం కల్పించాలంటున్న భక్తులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
గోదావరి అందాలంటే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలే. కానీ ఆ జిల్లాలకు దీటైన ప్రకృతి అందాలు అనేకం భద్రాద్రి జిల్లాలో ఉన్నా.. సరైన ప్రచారం, ప్రణాళిక లేక ఆదరణకు నోచుకోవడం లేదు. అందులో ఒకటి బూర్గంపాడు మండలంలోని మోతెగడ్డ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం.
గోదావరి నది ఎంత ఉధృతంగా ప్రవహించినా మోతెగడ్డ, అక్కడున్న శివాలయం మునిగిపోవు. అయితే వరద ఉధృతి కారణంగా జూన్ నుంచి నవంబర్ వరకు ఆలయానికి రాకపోకలు నిలిచిపోతాయి. మిగిలిన రోజుల్లో మరబోట్ల ద్వారా ఆలయానికి చేరుకునే వీలుంది. శివరాత్రి జాతర సందర్భంగా భక్తులు మరబోట్ల ద్వారానే ఇక్కడికి వస్తుంటారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి మోతెగడ్డ వరకు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే భక్తులతో పాటు పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు.
బోటింగ్ సౌకర్యం కల్పిస్తే..
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక ఏపీలో ఉన్న పాపికొండలు, మారేడుమిల్లి, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారూ భద్రాచలం మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. భద్రాచలం వచ్చే భక్తులు మాత్రం కేవలం రామచంద్రస్వామి దర్శనం చేసుకుని తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఇలా వచ్చే భక్తులు మరింత ఎక్కువ సమయం భద్రాచలంలో గడిపేందుకు వీలుగా విరివిగా టూరిజం ప్యాకేజీలు, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు తగిన ఏర్పాట్లు లేవు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో భద్రాచలంలోని పుష్కర ఘాట్ నుంచి మోతెగడ్డ వరకు బోటింగ్ సౌకర్యం కల్పిస్తే ఇటు భక్తులు, అటు పర్యాటకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. తగినంత ఆదరణ లభిస్తే డిసెంబర్ నుంచి మే వరకు పాపికొండలు టూర్ ప్యాకేజీ తరహాలో మోతెగడ్డ దగ్గర బ్యాంబూ హట్స్, టెంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
జిల్లాలో కిన్నెరసాని ఒక్కటే..
జిల్లాలో కేవలం కిన్నెరసాని డ్యామ్ దగ్గరే బోటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో వందల మంది బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటిది వేలాదిగా భక్తులు వచ్చే భద్రాచలంలో ఇప్పటి వరకు బోటింగ్ సౌకర్యం లేదు. ప్రస్తుతం బోటింగ్‌కు పర్యాటకుల నుంచి లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో ఇక్కడ పడవ ప్రయాణం అందుబాటులోకి తెస్తే ‘శ్రీశైలం’ తరహాలో ఆదరణ దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికై నా భద్రాచలం నుంచి మోతెగడ్డ వరకు ఆధునిక బోట్లను ప్రయోగాత్మకంగా నడిపించేందుకు పర్యాటక శాఖ చొరవ చూపించాలని భక్తులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే..
భద్రాచలంలో గోదావరి తీరంలోని స్నానఘట్టాల నుంచి మోతెగడ్డ వరకు కనీసం చిన్న సైజు బోట్లు నడిపేందుకు నీటిలో అనువైన మార్గం, రేవు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పర్యాటకులు, భక్తులు సూచిస్తున్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే భద్రాచలానికి వచ్చే భక్తులు, పర్యాటకులు మరింతగా పెరుగుతారు.
అచ్చం పట్టిసీమలా..
పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రకృతి అందాలకు నెలవు. గోదావరి నది మధ్యలో చిన్న గుట్టపై ఉన్న శివాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు రావడమే కాదు.. అనేక సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు. 80వ దశకంలోని జానకిరాముడు, స్వాతిముత్యం తదితర సూపర్‌హిట్ సినిమాల్లో ఈ ఆలయం కనిపిస్తుంది. అయితే అచ్చంగా పట్టిసీమ తరహాలోనే బూర్గంపాడు మండలం సారపాక నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతె గ్రామం వద్ద గోదావరి నది మధ్యలో మోతెగడ్డ ద్వీపం ఉంది. చుట్టూ నీళ్లు, ఇసుక మేటలు, రాళ్ల దిబ్బలు కనిపించే ఈ గుట్టపై భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్టుగా చెబుతారు. శివరాత్రి రోజున ఇక్కడ జరిగే జాతరకు వేలాదిగా భక్తులు వస్తారు. ఆ తర్వాత ఇక ఎవరూ పట్టించుకోరు. భద్రాచలం సమీపంలోనే ఈ ఆలయం ఉన్నప్పటికీ తగినంత ప్రాచుర్యం మోతెగడ్డ వీరభద్రుడికి దక్కడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment