● జిల్లాలో 121టీచర్లు, 603 హెల్పర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు ● మార్చి మొదటివారంలో పూర్తిచేసేలా కార్యాచరణ
ఖమ్మంవన్‌టౌన్: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించగా, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14,236 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేసి, పోస్టులను కలెక్టర్ నేతృత్వాన పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. ఈమేరకు శనివారం రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క సంబంధిత దస్త్రాన్ని ఆమోదించారు.
జిల్లాలో 724 పోస్టులు
జిల్లాలో కొన్నేళ్లుగా ఒక సూపర్‌వైజర్‌తోపాటు 123 అంగన్‌వాడీ టీచర్, 603 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల కొరత కారణంగా ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు సెంటర్ల బాధ్యతలు అప్పగించారు. దీంతో కేంద్రాల్లో చిన్నారుల ఆలనాపాలన, లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుండడంతో కేంద్రాల ద్వారా మరింత సేవలు అందుతాయని భావిస్తున్నారు.
పలు అంశాల్లో వెయిటేజీ
సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మార్చి మొదటివారంలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. కలెక్టర్ల నేతృత్వాన కమిటీ ద్వారా అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇంటర్ మార్కుల ఆధారంగా నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేయనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి కీసర రాంగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి శనివారం తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోనుండగా, ఇంటర్ మార్కుల ఆధారంగా 80 పాయింట్లు, అనాథ మహిళలకు 10, దివ్యాంగులకు 10, వితంతు మహిళలకు 10 పాయింట్లను వెయిటేజీగా ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక సర్టిఫికెట్లు పరిశీలించి కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియామక ప్రక్రియ పూర్తిచేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment